Episode 200
Part 2 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు
కేంపు సైటుకి మైలు దూరంలో వుంది “వర్క్ స్పాట్”, కారడవిలో కొత్తగా రైల్వే లైను వేస్తున్నారు. వేలాది పనివాళ్ళు శ్రమించి పని చేస్తున్నారు. సూర్యోదయం నుంచి తిరిగి సూర్యాస్తమయందాకా బుల్ డోజర్లు, డంపర్లు, కేసులు ధడ్ ధడ్ మని శబం చేస్తుంటాయి. అక్కడే ఒక పెద్ద బ్రిడ్జి కూడా కడుతున్నారు. రోజంతా గుబిలు గుభిలుమని కొండ రాళ్ళు పేలుతుంటాయి. హిందుస్తానీలు, బ్రిడ్జి పనులు చేసే మళయాళీ మోపలాలు, సర్దార్జీలు, బంగాళీ బాబులు, ఒకరేవిటీ అన్ని రకాల జాతుల వారినీ అక్కడ చూడొచ్చు. ఉత్తరాదినుండి వచ్చిన కంట్రాక్టర్లు, కేంపుని వర్కు స్పాటుకి దగ్గర్లోనే వేసుకున్నారు. రైల్వే కేంపు మాత్రం మైలు దూరాన ఉంది. అటు, ఇటు కాంట్రాక్టర్ల జీపులు, రైల్వే జీపులు చాకుల్లా తిరుగుతుంటాయి.
అసిస్టెంట్ ఇంజనీరుగారి జీపు ఆగగానే కంట్రాక్టర్లు సవినయంగా నమస్కారం చేస్తూ “ఆయీయే సాబ్ !” అంటూ ఎదురుగా వెళ్ళారు. ముందు సీట్లో నుంచి అసిస్టెంట్ ఇంజనీరు రామారావుగారు, వెనుక సీటునుంచి అకౌంటెంటు దశరథరామయ్యగారు దిగారు. దశరథరామయ్యగారి చేతిలో రెండు లావుపాటి ఫైల్సున్నాయి.
“దశరథరామయ్యగారూ! నేను బ్రిడ్జి ఇన్ స్పెక్షనుకి వెళ్ళేస్తాను. వచ్చేటప్పటికి అన్ని కాగితాలు సిద్ధంగా ఉంచండి కాంట్రాక్టర్ల సంతకాలు తీసుకుని నా సంతకాలు కూడా చేసేస్తాను, చిన్నయ్యా! ఆ మర్రిచెట్టు కింద జీపు పెట్టి పోయి ఎక్కడేనా పడుకో, నేను తిరిగొచ్చేదాకా! పాపం, రాత్రంతా నిద్ర లేనట్టుంది!” అంటూ కంట్రాక్టర్లు అందించిన కాఫీ తాగేసి వర్కు స్పాటుకి బయల్దేరాడు. .
చిన్నయ్యా, దశరథరామయ్యలు కూడా వాళ్ళిచ్చిన కాఫీలు తాగేశారు. దశరథరామయ్య మాత్రం ఎందుకో బితుకు బితుగ్గా కనపడుతున్నాడు. ఇంజనీరుగారు వెళ్ళిపోగానే పక్కనే వున్న కంట్రాక్టరు ఆఫీసు టెంటు లోనికి వెళ్ళి ఫైళ్ళు విప్పి లెక్కలు మొదలు పెట్టాడు.
“పంతులుగారూ! నిద్ర ఊపేస్తోంది, నేను జీపులోకి పోయి పడుకుంటాను”. అంటూ జీపుని ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కిందకి లాగించేసి, వెనక సీట్లో ముడుచుకు పడుకున్నాడు చిన్నయ్య.
రాత్రంతా నిద్రలేదేమో దశరథరామయ్యకి కూడా కునుకు ముంచుకొచ్చేస్తోంది. తమాయించుకుంటూ కాగితాలమీద లెక్కలు కడుతున్నాడు, దగ్గర్లోనే పనిచేస్తున్న బుల్డోజరు శబ్దం బుర్రని దొలిచేస్తోంది.
ఇంజనీరుగారు ఇన్స్పెక్షన్ నుంచి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. ఎండ మండిపోతోంది. ఎప్పుడు పట్టేసిందో నిద్ర పాపం, దశరథరామయ్య టేబుల్ మీద వాలిపోయి అలాగే నిద్రపోయాడు. – “దశరథరామయ్యగారూ! ఆ కాగితాలవీ తియ్యండి. సంతకాలు పెట్టేస్తాను. మళ్ళా భోజనానికి టైమై పోతుంది. త్వరగా పోవాలి”. అంటూ నిద్రపోతున్న దశరథరామయ్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని మొగంమీద, మోచేతుల మీద కారుతున్న చెమటని “ఉస్సు”రంటూ తుడుచుకున్నాడు. దశరథరామయ్య నిద్రలోంచి ఉలికిపడి లేచి కళ్ళు నులుముకుంటూ కాగితాల ఫైలు ముందు పెట్టాడు. – ఫైల్లో కొన్ని కాగితాలు తిరగేసి ఆశ్చర్యంగా దశరథరామయ్య నిద్రమొహంలోకి
చూస్తూ “పెద్ద బిల్లేదయ్యా?…….. అదే బ్రిడ్జి వర్కుది”.
“చెయ్యలేదు సార్” – మనిషి గొంతుకలో తడారిపోతూ దీనంగా చెప్పాడు.
“వాట్ ? చెయ్యలేదా? ఓ! మైగాడ్ “……… రామారావు కోపంతో ఊగిపోతూ క్షణం సేపు మాటాడలేకపోయాడు. ఎర్ర ధూళి, చెమట పట్టిన రామారావు మొహం కోపంతో మరింత ఎర్రబారింది. కళ్ళు చింతనిప్పుల్లాగా కణకణ లాడుతున్నాయి. “నిన్ననగా చెప్పానే ఎవడి చంక నాకుతున్నావ్ ?” అరిచాడు.
“ఎక్స్క్యూజ్ మీ సార్ ! నిన్న రాత్రంతా అమ్మాయికి గడబిడ చేసింది కద సార్ …… రాత్రే బిల్లు చేసేదామనుకుంటే……”
“షటప్! నీ ఇంట్లో గొడవ ఎవడిక్కావాలయ్యా? నీకు డబ్బిస్తున్నది ఆఫీసు పని చెయ్యడానికి గాని, నీ కూతురుకి పురుడొచ్చింది, అదయింది, ఇదయిందని పని ఎగగొట్టడానికి కాదు, వర్త్ లెస్ ఫెలోస్!” అని పిడుగు పడినట్టు గర్తించాడు.
ఇంతలో తిరుగు ప్రయాణానికి చిన్నయ్య జీపు తెచ్చి పెంటుముందు ఆపి లోపలికొచ్చాడు.
ఎదురుగా దశరథరామయ్య వెలవెలబోతూ గజగజ లాడిపోతున్నాడు. “రేపట్నుంచే నిన్ను పనిలోనుండి డిశ్చార్జి చేసేస్తున్నాను. గెటౌట్ ……. డోంట్ షో యువర్ ఫేస్; పెద్ద దొరగారు ఆ బిల్లు సంతకం చేసి అర్జంటుగా పంపమన్నారని మరీ మరీ చెప్పానే? ఇప్పుడతను నామీద దెయ్యంలాగ పడిపోతాడు. మీరంతా ఎందుకయ్యా ఉండి, నో! ముసలాడివని కనికరించి అపాయింట్ మెంటు ఇప్పిస్తే పని ఎడతావ్ ! కీప్ ఆఫ్ఫ్రమ్ మీ డర్టీ ఫెలో!” అంటూ ఇంకా కోపం పట్టలేక టేబుల్ మీదనున్న ఫైలు తీసి దశరథరామయ్య మొహం కేసి కొట్టాడు.
అసలే భయంతో సగం చచ్చిపోయిన దశరథరామయ్య ఉద్యోగం పోతుందనేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. దాంతో ఫైలు మొహానికి తగలగానే కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు. పక్కనున్న కంట్రాక్టరు మనిషెవడో పట్టుకుని కింద పడుకోబెట్టి మొహం మీద వీళ్ళు చల్లాడు.
ఇది చూస్తున్న మిలిట్రీ చిన్నయ్యకి నెత్తురు మరిగిపోయింది.
“నువ్వు మనిషివా, రాక్షసుడివా?” అని పిడికిలి బిగబట్టి గట్టిగా అరుస్తూ ఇంజనీరు మీదికి పళ్ళు కొరికి వెళ్ళబోతూ, తమాయించుకుని ఆగిపోయాడు.
రామారావు అమాంతంగా నిర్ఘాంతబోయాడు. “ఏవిటి, డ్రైవర్ చిన్నయ్యేనా, ఇలా అంటున్నాడు” అని తన కళ్ళని తనే నమ్మ లేక, కోపంతో వణికిపోతున్న చిన్నయ్యని చూస్తూ క్షణం పాటు అలా వుండిపోయాడు.
“ముసిలోడ్ని కొడతావా? నువ్వు మనిషివేనా?” అని మరోసారి గర్జించాడు.
కేకలు విని అంతా చుట్టూ చేరారు. ఇది చూసిన రామారావు అహం దెబ్బతింది. తన దగ్గర పనిచేసే ఒక జీపు డ్రయివరు అంతమంది ఎదుట అలా తనపై కేకలేస్తూంటే సహించలేకపోయాడు. “ఏవిటిది చిన్నయ్యా నువ్వేమన్నా తాగావా? నువ్వెవరివి ఇందులో జోక్యం కలుగ జేసుకోవడానికి!”
“నేనెవడినా! నీలాంటి జంతువును కాను, మనిషిని. ముసలోడు రాత్రంతా పని చేస్తాడు. నిన్న రాత్రయితే అసలు కంటికి కునుకేలేదు. ఏదో పని మిగిలిపోయిందని కొడతావా? ముసిలోడు సొమ్మసిల్లిపోయాడు. చచ్చిపోతేనో?……. మీకిష్టం లేకపోతే ఉద్యోగంలోంచి తీసేయండి. కొట్టడానికి మీకేం పవర్సున్నాయి?” అని మిలిట్రీ ఊపుతో విరుచుకు పడిపోతూంటే అందరూ నివ్వెరపోయి చూస్తున్నారు. –
“నాకేం పవర్సున్నాయా? అమ్మ రాస్కెల్! ఇంత పొగరు పట్టిందిరా నీకు?” అంటూ విసురుగా మీదికి వెళ్ళాడు.
చిన్నయ్య తర్జని చూపించాడు. “మంచిదికాదు సార్ ! తొందరపడకండి చెప్తున్నాను! నేను పంతుల్ని కాదు ఊరుకోవడానికి ఒంటిమీద చెయ్యి పడిందో ఖైమా చేసేస్తాను….. నేను మిలిట్రీవోడ్నీ!”
అప్పుడప్పుడే తెలివిలో కొస్తున్న దశరథరామయ్య అమాంతంగా లేని శక్తిని తెచ్చుకుని లేచి ఆఫీసరుకీ చిన్నయ్యకీ మధ్యలో కెళ్ళి “ఊరుకో చిన్నయ్యా, నీకెందుకు? దొరగారూ మీరూరుకోండి! దండం పెడతాను” అంటూ రామారావు చేతులు రెండూ పట్టుకుని ఆపుచేశాడు.
“వాట్! నన్ను ఖైమా చేస్తావా?….. నిన్ను…. నిన్ను…… ఏం చేస్తానో చూడు, స్కొండ్రల్!” అంటూ ఉగ్ర నరసింహుడిలా శివాలెత్తిపోతూ నేలని కసిదీరా ఒక తన్ను తన్ని టెంటు తెర తోసుకుంటూ వెళ్ళి జీపులో కూర్చుని స్టార్టు చేశాడు.
వెనకాలే దశరథరమయ్య నెమ్మదిగా సర్దేసుకున్నాడు. “తక్కువ వెధవలకి అలుసిస్తే నెత్తికెక్కరూ?….. మధ్య వీడెవడు బోడిగాడు?……. ఆల్ రైట్ ! డిస్మిస్ చేయించేస్తాను వెధవని” అనుకుంటూ ఏక్సిలేటరు దమాయించాడు రామారావు. ఎర్ర దుమ్ము లేపుకుంటూ కేంపువైపు పరుగెత్తింది
కేంపు చేరుతూనే రామారావు స్టెనో టైపిస్టుని దశరథరామయ్యచేత కబురు పెట్టించి డిక్టేషనిచ్చాడు. ఈ సాయంకాలానికల్లా డిస్ట్రిక్ట్ ఇంజనీరుగారికి చేరేటట్టు స్పెషల్ మెసెంజరుచేత ఉత్తరాన్ని పంపమన్నాడు. ఆ
“సాక్డ్ ఆఫ్!…… వెధవ తిరగబడతాడూ” అంటూ ఇంకా ఉప్పెనలా విజృంభిస్తోన్న కోపాన్ని తమాయించుకుని భోజనం చెయ్యకుండా పడుకున్నాడు.
మెలకువ వచ్చేసరికి బాగా రాత్రి దాటిపోయింది. వంట మనిషి టేబుల్ మీద పెట్టి చల్లారిపోయిన భోజనాన్ని కాస్త ఎంగిలిపడి సిగరెట్టు వెలిగించి ఆలోచనలో పడ్డాడు. నిద్రలో చాలావరకు కోపం చల్లారిపోయింది. మధ్యాహ్నం జరిగిన సంఘటనల్ని తలచుకుంటూ దమ్ము మీద దమ్ము లాగుతూ పచార్లు చెయ్యడం ప్రారంభించాడు. చిన్నయ్య అలా తిరగబడడం తప్పయినా, దూరంగా ఆలోచిస్తే కాస్త న్యాయ సమ్మతమేమో ననిపించింది….. ఔను తను అలా దశరథరామయ్య మీదకి ఫైలెందుకు విసరాలి? కోపం పట్టలేక ఆ పని చేశాడు. అది తప్పు కాదా? తప్పే! ఇంతకీ చిన్న య్యెవ్వడు? ఎందుకు జోక్యం కలుగ చేసుకోవాలి? పాపం ‘ముసలివాడు సొమ్మసిల్లిపోగానే చిన్నయ్య చూళ్ళేక పోయాడు. రక్తం మరిగిపోయింది. సకాలంలో బిల్లు చెయ్యకపోతేనే తనకి అంత కోపం వచ్చింది కదా, సాటి మనిషి మొహం తిరిగి పడిపోతుంటే, అందుకు బాధ్యులైన వాళ్ళమీద చిన్నయ్యకి ఎంతకోపమైనా రావచ్చు. తిరగబడ్డాడు, తనూ రెచ్చిపోయాడు. ఛా …….! చిన్నయ్య చేసిన పని చట్టరీత్యా తప్పయినా, న్యాయదృష్టితో చూస్తే ఆ పరిస్థితిలో మానవత్వం గల ఏ మనిషైనా అలాగే ప్రవర్తించాలని నిర్ధారించుకున్నాడు..
ఆ రాత్రి చిన్నయ్యని కబురు పెట్టి పిలిపించాడు. చిన్నయ్య మామూలుగానే నిబ్బరంగా వున్నాడు. అక్కడ రామారావు చిన్నయ్యా తప్ప మరెవరూ లేరు.
“కూర్చో! ఫరవాలేదు. ఆ కుర్చీలో కూర్చో. స్పాట్ నుండి నడుచుకొచ్చావా పాపం….. –
“ఫరవాలేదు సార్ , నాకు నడక అలవాటే, మిలట్రీ వాడిని, అయినా ఎంత మైలే గదా?”
“ఔను మిలట్రీ వాడివి, అందుకే నన్ను ఖైమా చేస్తానన్నావు?”
“నిన్ను ఎంతో గౌరవంగా చూసుకుంటానే, ఎందుకలాగన్నావు”. –
“సార్! నన్ను దెప్పి పొడవడానికి పిలిపించారా! మీరే మరొక్కసారి ఆలోచించుకోండి సార్, అప్పుడు మీకే తెలుస్తుంది. మీరు చేసిన పని తప్పో కాదో పంతుల్ని అలా ఫైలుతో కొట్టడం న్యాయమేనా? ఒక్క ప్రాణం సొమ్మసిల్లి పోయాడు గదా! మీ తండ్రిగారే ఆ పరిస్థితిలో ఉంటేనో…….”
చిన్నయ్యా! నీకు తెలుసు గదా, నేను కోపిష్టివాడ్నని, అరుస్తాను. గాని కరవను . అరిచే కుక్కని మాత్రమే! నేను చేసిన పని తప్పే ఐనా నా కోపం తగ్గిం తరువాత చేస్తే నేనొప్పుకోనా, నేను మనిషిని కానా?….. సరే, అయిందేదో అయిపోయింది. నువ్వు కోపంలో ఏదో అన్నావు. నేనూ ఏదో అన్నాను……. సరే, అన్నీ మరిచిపో, మనసులో పెట్టుకోక. ఈచూట చెబుదామనే పిలిపించాను. పోయి పడుకో చాలా రాత్రయింది. “
“గుడ్ నైట్ సార్!” అని సెల్యూట్ చేసి బైటికొచ్చాడు. “భేష్! ఏం మనిషి? తన తప్పని తెలుసుకున్న తరువాత తరతమ బేధం చూడకుండా, జీపు డ్రయివరునైన నన్ను పిలిపించి తప్పొప్పుకున్నాడు. కుర్రోడైనా దేవుడు. సివిలోళ్ళలో తప్ప పుట్టాడు. అని లోలోన అభినందించుకుంటూ తన టెంటువైపు నడిచాడు మిలట్రీ మాన్ చిన్నయ్య..
ఆరోజు ఉదయం అనుకోకుండా డిస్ట్రిక్ట్ ఇంజనీరుగారు. కేంపు కొచ్చారు. అంతా ఎదురు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు. పెద్ద ఇంజనీరు గారికి, అతని సిబ్బందికి – ప్రత్యేకమైన వసతి, భోజనం ఏర్పాట్లు వెంటవెంటనే చేయించారు.
భోజనాలైన తరువాత పదకొండు గంటలవేళ, ఇంజనీరిద్దరూ మేపులు ముందు పడేసుకుని ఏవేవో చర్చలు జరిపారు. అన్ని కేంపులలోకంటే ఈ కేంపులో పని చురుగ్గా పకడ్బందీగా సాగుతోందని మెచ్చుకున్నారు పెద్ద ఇంజనీరుగారు.
“రామారావుగారూ! మీ అకౌంటెంటు దశరథరామయ్యనీ, అదెవరు చెప్మా – ఆ జీపు డ్రయివరు – అదే చిన్నయ్యగదూ అతన్ని కబురు పెట్టండి”.
దశరథరామయ్య ఎప్పుడూ లేంది, గెడ్డం శుభ్రంగా గీసుకొని పంచలో చొక్కా టక్ .. చేసి, ఎప్పటిదో పాత కోటు వేసుకొని, అతి వినయంగా చేతులు కట్టుకొని దొరగారముందు నిలబడ్డాడు. చిన్నయ్య మిలట్రీ ఎటెన్షన్ ఫోజులో సెల్యూట్ చేసి నిలుచున్నాడు. అతనివైపు రెండు మూడుసార్లు ఎగాదిగా చూసారు పెద్ద దొరగారు.
“ఇతను మిలట్రీ……..” అని అడగబోతుండగా.. “అవును సార్, ఇతను ఎక్స్ మిలటరీ మాన్!” అని రామారావు చెప్పాడు.
ఆమాట వినీ విననట్టుగా ఎదురుగా వున్న దశరథరామయ్య నుద్దేశించి “చూడండి ఎకౌంటెంటుగారు మీ పనిని మెచ్చుకుని మీ కేసు అసిస్టెంటు ఇంజనీరు రికమెండ్ చేసారు. మీకు మరో సంవత్సరం ఎక్సటెన్షన్ ఇస్తున్నాను. Prove yourself to be a worthy son to the country అంటూ లేచి దశరథరామయ్యని షేక్ హేండ్ చేసారు.
“అంతా తమ దయ సార్. చిన్నదొరగారు, నా పరిస్థితిని చూసి రికమెండు చేస్తుంటారు” అని ఉక్కిరి బిక్కిరైపోతూ ఆనందంతో మరి మాట్లాడలేక కళ్ళంట జలజల నీళ్లు కార్చాడు.
No No you deserve it I say అని అన్నారు. రామారావు ఓబులు మీద వేపరు వెయిటు తిప్పుతూ. – “మీరు చాలా మంచివారు సార్, పాపం ముసలాయనకి ఇంత తిండి పెట్టారు. ఆయన రాత్రింపగళ్ళు పని చేస్తారు సార్” అని మధ్యలో చిన్నయ్య చెబుతూంటే డిస్ట్రిక్ట్ ఇంజనీరుగారికి మంటెక్కింది.
“చూడూ, ఒకరితో మాట్లాడుతున్నపుడు మధ్యకి రాకూడదు అది డీసెన్సీకి వ్యతిరేకం. మళ్ళీ మిలట్రీ వాడ్నంటావు? ……” అంటూ చిరాగ్గా చిన్నయ్యవైపు కస్సుమని లేచాడు. వెంటనే మళ్ళా మాట మార్చేసి దశరథరామయ్య నుద్దేశించి —
“ఇంకా నాలుగయిదు కంట్రాక్టర్ల బిల్లులుండిపోయాయి. ఈ నెలాఖరులోగా కంప్లీట్ చేసేయండి. చాలా డిలే అయిపోయాయి. అన్నట్టు చెప్పడం మరచిపోయాను. రామారావుగారూ, మీ కేంపుకు జనరేటరు కోసం మాట్లాడాను. చీఫ్ ఇంజనీరుగారు ఒప్పుకున్నారు. మరో నెల రోజులలో మీ కేంపుకి కరెంటు వస్తుంది”..
“థేంక్యూ సార్!” అన్నారు రామారావుగారు.
“ఇదిగో; నీ పేరేంటన్నావు …… అదే; చిన్నయ్య, ఇప్పుడు నువ్వు మాట్లాడుదువు గావి….. అసలు ముఖ్యంగా నీ పనికోసమే నేనొచ్చారు. ఇంతకుముందే రావలసింది. కలకత్తా వెళ్ళడం వల్ల రాలేకపోయాను….. ఊఁ; నువ్వేం పని చేస్తుంటావు!”
“జీపు డ్రయివర్ని సార్;”.
“వారం రోజుల క్రితం చిన్నదొర గారు బ్రిడ్జి ఇన్ స్పెక్షనుకి వెళ్ళినప్పుడు అతన్ని ఖైమా చేస్తానని అన్నావట కదూ?”
“యస్సార్”
ప్రక్కనున్న రామారావు చటుక్కున నాలిక్కరుచుకుని కంగారు పడిపోతూ, ‘నో సార్; అది నేను……”
“వెయిట్ ప్లీజ్ …. అతన్ని మాట్లాడనివ్వండి. నువ్వు కైమా చేస్తానని అనడాన్ని ఒప్పుకుంటున్నావు కదూ;”
“యస్సార్;”
“అది తప్పేనా?”
“ముమ్మాటికీ కాదు. చిన్న దొరగారు దశరథరామయ్యగారిని ఫైలుతో మొగం మీద కొట్టారు. అతను సొమ్మసిల్లి పడిపోయారు……. అలా చేయడం తప్పుకాదా …… తప్పో కాదో చిన్న దొరగార్నే అడగండి, నేను మధ్యలో కలగ జేసుకున్నాని నా మీదికి పిడికిలి బిగిస్తూ ఒచ్చారు. నా ఒంటిమీద చెయ్యిబడితే కైమా చేసేస్తానన్నాను, నేనే కాదు నా పరిస్థితిలో నున్న ఏ మగాడైనా అంటాడు”..
“అంటే దొరలు గాజులు తొడిగించుకున్నారనేగా నీ వుద్దేశం. అకౌంటెంటుగారికి చిన్న దొరగారికీ మధ్య ఘర్షణ నీకే విధంగాను సంబంధించింది. కాదుగదా? అనవసర విషయాల్లో జోక్యం కలుగజేసుకోవడమే కాక, నీ పై అధికారిని ఖైమా చేస్తానని బెదిరించడం మోస్ట్ ఇన్ సబార్డినేషన్…… తప్పు……. నువ్వు కాదంటావా?”
“రూలు ప్రకారం తప్పే కావచ్చు గానీ మనిషిగా ఆలోచిస్తే అది తప్పు కాదు సార్; సాటి మనిషికి సంబంధించిన విషయం “.
“మీరు దగ్గరే ఉన్నారు కదూ? మీరేమంటారు దశరథరామయ్యగారూ! మీరు తప్పు కాదంటారా!” అని దశరథరామయ్యని ప్రశ్నించారు.
నిల్చున్నవాడల్లా రెండడుగులు ముందుకు వేసి. పెద్ద అపచారాన్ని వివరించి చెప్తున్నట్టు కళ్ళు పెద్దవి చేసి. “తప్పా, తప్పున్నరా సార్! అది నాకు, చిన్న దొరగారికి సంబంధించిన విషయం. నేను తప్పు చేస్తే కోపం పట్టలేక దొరగారు ఏదో ఫైల్తో కొట్టారే అనుకోండి. అది తప్పా? నా మొహం! ఐనా మధ్య ఈ ఆసామికెందుకు! పిల్లలు తప్పు చేస్తే తండ్రులు మందలించరా సార్ ? అది తప్పా? ఆఫీసు పనుల్లో గుమస్తాలకీ, ఆఫీసరుగార్లకి మధ్య ఇటువంటి చిన్న చిన్న తగాదాలు జరగటం పరిపాటే, ఐనా చిన్న బాబుగారు నా మీద ఫైలు విసిరారంటే, అతనికి నామీద వ్యక్తిగత ద్వేషమా? కందకు లేని దురద బచ్చలి కన్నట్టు. ఇతగానికి ఎక్కర్లేని రోషం వచ్చి కారుకూతలు కూస్తూ దొరగారి మీదికి వెళ్ళబోతాడా? నేను మధ్యలో దూరి ఆపాను బాబూ? మిలట్రీ బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. ఎంత ఇన్ సబార్డినేషను. చిన్న దొరగారు ధర్మరాజులై పోయారు. కాబట్టి సరిపోయింది. అదే మా కాలంలో లాటి ఇంగ్లీషు దొరలయుంటేనా అక్కడే గుండేసి కొట్టిస్తారు” అంటూ ఏకబిగిని చెప్పాడు. .
ఇది వింటున్న మిలట్రీ చిన్నయ్య నీరుకారిపోయాడు. తన కాళ్ళ క్రింద నేల కూలిపోతున్నట్టు అనిపించింది. అతను చెప్తున్నదంతా మతిపోయిన వాడిలా వింటూ నిల్చున్నాడు. “ఐతే నేను చేసింది తప్పా పంతులు బాబూ!” అనగలిగాడు.
“తప్పా…… తప్పున్నరా, ఇంకా మెల్లిగా అంటావ్!” అన్నాడు, ఆ ప్రయత్నంలో ముఖం పక్కకి తిప్పుకుంటూ, ఇంత సేపూ ఇదంతా వింటున్న రామారావుగారు రెస్ట్ లెస్ గా మధ్యలో అందుకొని,
“Excuse me Sir : నేను తొందర్లో కోపంలో చిన్నయ్యమీద రిపోర్టు పంపేశాను గానీ, he is a nice man : దూరంగా ఆలోచిస్తే నాదే తప్పండి. తరువాత గొడవలన్ని సర్దుకున్నాయి. రిపోర్టు విషయమే నేను మర్చిపోయాను. I want to withdraw the report…….
“No you cannot, I view this most seriously…… చిన్నయ్యా . ఈవేళ సాయంకాలంనుంచీ నీ ఉద్యోగం మాకు అవసరం లేదు. ఈ క్షణమే నీ సెటల్ మెంట్ పెకం తీసుకోవచ్చును. Yes you can go now దశరథరామయ్య గారూ మీరుకూడ వెళ్ళవచ్చును” పెద్ద దొరగారు త్వరత్వరగా తేల్చేశారు.
“యస్ సార్” అని బూట్లు ఠకాయించి సెల్యూట్ చేసి బైటకు వెళ్ళిపోయాడు చిన్నయ్య.
రామారావు పెద్ద దొరగారిని చాలా బ్రతిమాలాడు. తన సర్వీసులో ఎప్పుడు ఎవర్నీ బ్రతిమాలనంతగా చిన్నయ్య కోసం బ్రతిమాలాడుగానీ దొరగారు వినలేదు. ఇన్ సబార్డినేషన్ ఇవాళ మీకు, రేపు నాకు అవుతుంది. మిస్టర్ రావ్! నువ్వింకా కుర్రాడివి; ఇలాంటి ఆర్గుమెంటేటివ్ స్టాఫ్ ని ఎక్కడికక్కడ నొక్కెయ్యకపోతే నెగ్గలేం…. టేకిట్ ఈజీ……. అంటూ అప్పటికే స్టెనో సిద్ధం చేసిన చిన్నయ్య డిస్మిసల్ ఆర్డర్స్ మీద పరపర సంతకాలు పెట్టేసి జీపెక్కి వెళ్ళిపోయాడు.
సూర్యుడు పడమట కొండల్లోకి దిగిపోయాడు. చిన్నయ్య డబ్బా డవాలా అన్నీ కిట్ బేగ్ లో వేసి కట్టేసి వీపుకి తగిలించుకున్నాడు హరికెన్ లాంతర్ని. వాటర్ బాటిల్ కూడ వీపుని వేలాడేసుకున్నాడు. చూడ్డానికి ఉద్యోగం పోయినవాడిలా లేడు. యుద్ధంలో కేంపు మారుతున్న మిలట్రీ సోల్జర్ లాగున్నాడు. విచారంగాని, దిగులుగాని మచ్చుకైనా ముఖంలో కనిపించటం లేదు. జీపు తాళాలు ఇచ్చేస్తూ, ఇంజనీరుగారికి ఆఖరిసారిగా సెల్యూట్ చేశాడు. రామారావు చిన్నయ్య ముఖంలోకి చూడలేక తలదించుకున్నాడు.
“ఎందుకు బాబూ బాధపడతావు……. నువ్వు కుర్రోడివిగానీ, దేవుడివి బాబు; ఒకసారన్నావు గాపకముందా, అరిచే కుక్కనని చస్ సువ్వెందుకు కుక్కవయ్యావు బాబూ? పులి లాంటోడివి. రాజా జాతి. నీ గుండె మైదానంలాంటిది నిన్ను అంటిపెట్టి బ్రతుకుతున్న మేము కుక్కలమే, నక్కలమే; నువ్వు సివిలోళ్ళలో తప్ప పుట్టావు. నేవొస్తాను బాబూ” అంటూ అక్కడినుండి వచ్చేశాడు.
చిన్నయ్య వెళ్ళిపోతున్నాడని తెలిసి ఆ కేంపులోని జనమంతా గుమిగూడిపోయారు. అందరితోనూ నవ్వుతూ షేక్ హేండ్ ఇస్తున్నాడు. కొందరు కంటతడి పెడుతూండటం గమనించి, “ఏమి సివిలోళ్ళయ్యా, నేను చచ్చిపోతున్నానా ఎందుకలాగై పోతారు…… వారెవ్వా…… అంటూ వీపులు చరుస్తున్నాడు..
“మంచోడిని ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ ఆఫీసర్లకు పెద్ద రోగం రాదా?” అని ఆఫీసర్లని రామారావుకి రాని ఆరవం భాషలో తిడుతూ చిన్నయ్యకి గ్లాసుడు మజ్జిగ అందించింది కళ్యాణ రామన్ గారి ద్వితీయ కళత్రం.
ఇంతలో కారం అటుకులు పొట్లం కట్టి పట్టుకొచ్చిన సింగు గారి భార్య ఆ పొట్లం అతని సంచిలో పెడుతూ – “హే! మిలట్రీ మాన్ హమ్ సబ్ లోగ్ కో చోడ్ కార్ కహా జాతే హో!” అని చిన్నపిల్లలా బావురుమంది.
ఇంతలో ఎదురు గుమ్మం దగ్గర పంతులమ్మ, అమ్మాయి నిల్చున్నారు. “చిన్నయ్యా? చీకటి పడిపోయింది, ఇప్పుడెక్కడికెళతావు. ఈ రాత్రికి మా ఇంట్లోనే భోంచేసి పడుకో; రేప్పొద్దున్నే వెళ్ళొచ్చును” అంది పంతులమ్మ చిన్నయ్యకి ఎదురుగా వెళ్ళి.
“ఒద్దమ్మా! మరిక్కడ ఎందుకు? పోతాను……. అని లోపలికి మంచం మీద పడుకునున్న పసిగుడ్డు వైపు తొంగి చూసి, “ఒరేయ్ బుల్లోడా! పెద్దాడివైతే ఈ సివిలోళ్ళలో చేరిపోకురోయ్ నాలాగ మిలట్రీలో చేరు” అంటూ చిన్న విజిలేశాడు.
“నిన్ను ఉద్యోగంలోంచి తీయించేసిన వాళ్ళకి తప్పక నీ ఉసురు తగుల్తుంది” అంటూ దుఃఖాన్ని దిగమింగుకుంటోంది పంతులమ్మ గారు. చిన్నయ్యని చూడలేక. మంచం మీద నిద్రపోతున్న బిడ్డని చూస్తూ జలజల కన్నీరు కారుస్తోంది పంతులుగారమ్మాయి.
దశరథరామయ్య జాడ ఎక్కడా లేదు, ఎక్కడో నక్కలా జారుకున్నాడు.
చిన్నయ్య కేంపు విడిచి రోడ్డెక్కి పోయాడు. జీపుమీద హరికెన్ లాంతరూ, వాటరు బాటిలూ ఒకదాన్నొకటి కొట్టుకుంటూ టకటకలాడటం కర్ణాకర్ణిగా వినిపిస్తోంది. వెన్నెల పొడిచి పిండారబోసినట్టుంది.
టెంటు ముందు నిల్చున్న అసిస్టెంట్ ఇంజనీరు రామారావుగారికి రోడ్డుమీద నడుస్తున్న చిన్నయ్య వెన్నెట్లో స్పష్టంగా కనిపించాడు.
ఇంతలో హఠాత్తుగా “గాండ్రి – గాండ్రి”మని పులి గర్జించింది. “అమ్మో……. పులి….. చిన్నయ్య”, అంటూ టెంటు లోంచి పంతులమ్మ పరిగెత్తుకొచ్చి చూసింది.
నిమ్మళంగా అసలు పులి అరుపు వినపడనట్టే చిన్నయ్య నడుచుకుపోతున్నాడు.
అతని ధైర్యానికి నిర్ఘాంతపోయి చూస్తూండగా ఇంతలో మరో వికృతమైన అరుపు వినిపించింది.
“బ్లోవ్…… బ్లోవ్……. వ్ …… ……” వఱడు అరుస్తోంది.
నడుస్తున్న చిన్నయ్య అమాంతంగా ఆగిపోయాడు. ఉలికిపడి, అలా ఒక క్షణం సేపు నిలబడిపోయి, తిరిగి గబగబా నడక సాగించాడు. ..
పంతులమ్మగారు చిన్నయ్యనే చూస్తూండిపోయారు. పులికి జడవని చిన్నయ్య వఱడుకి జడిసిపోయాడు. డౌను దిగిపోయిన తరువాత మరి చిన్నయ్య కనిపించలేదు. పడుకున్నాడే గాని రామారావుకి నిద్ర పట్టలేదు.
అర్థరాత్రి గడిచాక దశరథరామయ్య యిల్లు చేరుకున్నారు. ఆ రాత్రి తెల్లవార్లు “బ్లోవ్ ! బ్లోవ్ ! బ్లోవ్ ! “మని వఱడు అడవిలో అరుస్తూనే ఉంది.
• ఆంధ్రజ్యోతి 3 సెప్టెంబర్ 1971
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp