Episode 142

'నైట్ డ్యూటీ' - డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథ

“ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్”

 ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంలు, మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి 'మృత్యువు నోట్లో పాలపీకలం' అన్నట్లుగా చూస్తున్న స్క్రిప్టో పెన్సి లిన్లూ, నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకలా ఫంగస్ పట్టిన సెలైన్ బాటిల్సు- ఇది సార్ హాస్పటల్ అంటే. తుప్పు పట్టిన మంచాలూ, అన్ని రకాల బాక్టీరియాలకూ, వైరస్లకూ ఆహ్వానం పిలికే ముసలి వేశ్యల్లాంటి బెడ్లు, వాటి పై భగవంతుని కర్మాగారంలో పనికిరాక పారవేసిన యంత్రాల్లాంటి పేషెంట్లు. 

“పేషెంట్ ఈజ్ ది రియల్ టీచర్! అతన్ని గౌరవించు. ప్రేమించు.” సార్ చెప్పిన ఆణిముత్యాలే యివి. 

“కొంగర్లు తిరుగుతూ ఏమిటా సిగ్గు, ఇప్పుడే సమర్త ఆడిన దాన్లా! జాకెట్టు పైకి లాక్కో. డాక్టరుగారు గుండె పరీక్ష చేస్తారు.”

“మగాయన కదమ్మా! సిగ్గేస్తుంది". -


“ఏమి నీలుగుతున్నావే! అంత సిగ్గయిన దానివి వెయ్యి రూపాయిలు పట్టుకుని ఏ ప్రైవేటు నర్సింగ్ హోమ్ కో వెళ్ళక పోయావా? ఊరికే మందిస్తామంటే నకరాలు పోతున్నావే!” స్టాఫ్ నర్సు అరుపులు.


కాండ్రించి ముఖం పై ఊసినట్లుగా ఒక అసహ్యకరమైన అవమానంలా ఆవేల్టి నా నైట్ డ్యూటీ మొదలైంది.


రాత్రి తొమ్మిదింటికి రొటీన్ రౌండ్స్ - చేస్తున్నాను.


 “సార్! ఈ పేషెంటుకు మందులివ్వద్దన్నారు పెద్ద డాక్టరుగారు. మన చేస్తే ఎనాల్డినో, ఐరన్ టాబ్లెట్ ఇవ్వమన్నారు. అబ్జర్వేషనట. డయాగ్నోసిస్ ఇంకా కాలేదట.” డ్యూటీ నర్సు వినయంగా చెప్పింది. 


అబ్జర్వేషనా వల్లకాడా. రేటు వుండదు. డబ్బు చేతిలో పడితేనే ట్రీట్మెంటు. ఈ లోపల పేషెంటు కాస్తా టపా కట్టేస్తాడు. ఈ హాస్పటల్లో, డాక్టరే ఒక నయం కాని వ్యాధి. ఇక్కడ పేషెంటు సిలువ పైన జీసస్. హౌస్ సర్జన్లు ద్రోహం చేసిన జూడాస్.


 ఏం చెయ్యగలను మందులివ్వకుండానే ముందుకు కదిలాను.


మరో పేషెంటు. “ఏమిటి తల్లీ నీ బాధ!' “ఇదో స్పెషల్ కేసు సార్. గైనిక్ వార్డు కేసు. కార్డియాక్ ట్రబుల్ అని మనకు రిఫర్ చేశారు. ఇదో 'విడో' సార్! మొగుడు చచిది నాలుగేళ్ళవుతోంది. డబ్బిస్తారని ఆశతో స్టెరిలైజేషన్ క్యాంప్ కొచ్చి ట్యూబెక్టమీ చేయించు కొంది. పి.జి. స్టూడెంటు ఎవరో చేశాడట ఆపరేషను. కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయట. అక్కడుంటే గొడవవుతుందని మన ముఖాన పడేశారు,” 


నర్సు చెప్పింది. కళ్లనిండా సిగు. దైన్యం నింపుకొని, “బిడ్డలకు రెండు పూటలైనా కడుపునిండా తిండి పెడదామని ఈ కక్కుర్తి పని చేశానయ్యా! నాకేమన్నా అయితే బిడ్డలు అనాథలవుతారు. దయ చూపండి బాబు,” అంటూ చేతులు జోడించింది పేషెంటు. -


నీ బాధలూ, గాథలూ ఎవరికి అర్థం అవుతాయి తల్లీ! నువ్వో 'ఒళ్ళు బలిసిన లం...'గానే మా నర్సుకు కనిపిస్తావు. నువ్వో 'చిరాకు కలిగించే న్యూసెన్సు లాగే డాక్టర్లకు తోస్తావు. నీ ఆకలి, నీ అమ్మ ప్రేమ ఎవరికర్థం అవుతాయి.


రౌండ్స్ ముగిసేసరికి పదకొండు దాటింది.


 “స్పెషల్ వార్డులో ఖైదీ ఒకడున్నాడు. అటెండుకండి సార్. నక్సలైట్ లీడరట. బాగా పోలీసు బందోబస్తు వుంది. జైల్లో సూసైడ్ ఎటెంప్ట్ చేశాడట. పొద్దునొచ్చింది కేసు. స్పెషల్ కేసు అని మరీ చెప్పాడు పెద్ద డాక్టరు.” 

నర్సు , నేనూ స్పెషల్ వార్డువైపు కదిలాం. ఈదేశంలో కెల్లా ప్రతిభావంతులైన రచయితలు పోలీసులే. జైల్లో ఆత్మహత్య' ఈ థీమ్ పై రోజుకో రసవత్తరమైన కథానిక. కథల పోటీల్లో బహుమతులన్నీ వీళ్లకే ఇవ్వాలి.


కాలి పొడవునా బాండేజ్. ఎముకల పోగులా వున్నాడాయన. నెరిసిన తల. దీర్ఘ కాలపు ఆలోచన. అలుపుతో అర్ధనిమీలితాలైన కళ్లు. చిరునవ్వుతో 'హలో' అని పలక రించాడు. బాండేజ్ మార్చి, సి.పి. ఇంజక్షన్ ఒకటి ఇచ్చాను.


 “నొప్పి ఎక్కువగా వుంటే చెప్పండి. ఎనాల్జిన్ ఇస్తాను,” అని అడిగాను.


“శరీరపు బాధలకు మనస్సు రెస్పాండ్ కావడం ఎప్పుడో మానేసింది నేస్తం! ఉద్యమ విజయాలే మాకు నిజమైన మెడికేషన్,” అంటూ నవ్వాడాయన. ఆయన నవ్వులో చిత్రమైన ఆకర్షణ వుంది. 


గుడ్ నైట్ చెప్పి బయటకు వచ్చాను. 


మెరుస్తున్న కళ్ళతో వీడ్కోలు  చెప్పాడాయన.



రాత్రి పన్నెండు దాటింది. అలసటతో డ్యూటీ రూమ్ వైపు కదిలాను. లోపలికి అలెట్ వేసి, అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నాను. బెడ్ పై నల్లటి తుమ్మమొద్దులాంటి మగ పశువు. వాడి చుట్టూ నగ్నసర్పంలా అల్లుకుపోయిన స్త్రీ, గాడ్! ఈమె ఝాన్సీ, నర్సింగ్ స్టూడెంటు. 


ఆ అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడలేదు. భయపడలేదు.


"ప్లీజ్ డాక్టర్! లైటు తీసివేయండి! ఈ రాత్రికి మీరు క్యాజువాలిటీ డ్యూటీ రూమ్ లో ఆస్ తీసుకోండి,” అంటూ పక్కన సిగ్గుపడుతున్న మగ పశువుపై తన నగ్నత్వాన్ని నిస్సిగ్గుగా పుతూ చెప్పింది. 


"డర్టీ బిచ్!" కోపం, బాధ, అసహ్యంతో బయటకు వచ్చాను. సెక్స్ ఒక ఎమోషనల్ ఇన్వాల్మంటు. వెగటు కలిగించే శావలాన్ వాసన, భీతావహమైన మృత్యువు చీకట్లో పాములాగ మన పక్కనుంచే వెళుతున్న భావన. 

భరింపలేని నొప్పితో నిశ్శబ్దాన్ని పాడుచేసే ఒక ఆర్తనాదమో, ఒక తెరిపిలేని దగో, ఒక విరామం లేని మూలుగో, అభాగ్య మృతుని బంధువుల విలాపమో, హాస్పటల్ ఏదో మూల నుండి వినిపిస్తూనే ఉంటాయి. 


ఇలాంటి వాతావరణంలో లైంగికేచ్ఛ  పొందగలిగేవాళ్ళు మనుషులమని చెప్పుకోడానికి సిగ్గుపడాల్సిన వాళ్ళు.


రెండు మూడు గంటలు క్యాజువాలిటీలో అసహనంగా కోపంగా గడిపి, ముఖ్య మైన కేసుల్ని మరోసారి చూద్దామని వార్డు వైపు నడిచాను. పిడియాట్రిక్స్ వార్డు మత్తుగా జోగుతూంది.


కార్డియాలజీ వార్డు చప్పుడు చెయ్యని గుండెలా స్తబ్దుగా వుంది. మెడికల్ వార్డులో ఆస్మా 

రోగి ఆయాసం మినహా ఏ శబ్దమూ లేదు. -

లేబరు వార్డు నుండి హఠాత్తుగా “ఓరి నాయనో! దేవుడో,” అంటూ అరుపులు వినిపించాయి. కంగారుగా అటు పరు గెత్తాను. 

“బిడ్డ బాబు! బిడ్డ! రోజుల బిడ్డయ్యా! కుక్క ఎత్తుకుపోతోందయ్యా పట్టుకోండి! నాయనా దండం పెడతా! కదల్లేని బాలెంత నయ్యా,” ముప్పయేళ్ళ తల్లి పెద్దగా అరుస్తోంది. 


వరండా మలుపు తిరుగుతూ రాజసంగా నడిచి వెళ్తున్న కుక్క కనిపించింది. పెద్దగా అరుస్తూ అటు పరిగెత్తాను. అరుపులకు బెదిరి నోట్లో వున్న బిడ్డను వదిలి 'యూ స్టుపిడ్' అన్నట్లు నా వైపు చూసి బయటకు పరిగెత్తింది కుక్క. 


బిడ్డ ఛాతీ పై పదునైన గోళ్ళరక్కులు, పళ్ళగాట్లు- గుక్క పెట్టి ఏడుస్తోంది. ఇంత హడావుడిలోనూ ఒక్క వార్డు బాయ్ కి మెలుకువ రాలేదు.


ఈ ఆసుపత్రి అతి పెద్దదైన రాక్షసమృగం. 


దీనికి అనుభూతులూ, స్పందనలూ ఉండవు. 


తల్లినీ, బిడ్డనూ వార్డుకు పంపి, ఆ సంఘటన పై కంప్లైంటు చేద్దామని ఆర్.ఎం.ఓ. రూమ్ వైపు నడిచాను. 


అక్కడ పోర్టికో నిండా పోలీసు జీపులు. హడావుడిగా అటూ ఇటూ పరిగెడుతున్నారు పోలీసులు. ప్రెస్ రిపోర్టర్లు కూడా వచ్చినట్లున్నారు. స్పెషల్ వార్డులోని తీవ్రవాద ఖైదీ తప్పించుకుపోయాడట. కాపలా వున్న కానిస్టేబుల్స్ స్పృహ తప్పి పడిపోయారట. హెడ్ కానిస్టేబుల్ తలపగిలి, ప్రమాద స్థితిలో ఉన్నాడట.


పోలీసు బూట్ల చప్పుడు, పేషేంట్ల దీనారావాలు కలగలుపుగా  ఆ వేకువజాము ఆస్పతి యుద్ధభూమిలా వుంది.. 


జిల్లా అధికారులంతా తరలివచ్చారు. ఆ రోజు డ్యూటీ  డాక్టర్లను, నర్పులను పిలిపించి ఇంటరాగేషన్ చేస్తున్నారు ఆర్.ఎం.ఓ. రూములో. 


నా అంతరంగంలో ఒక కత్తిగాటులా మిగిలిపోయింది ఆ వార్డుసంఘటన. 


తల  వంచుకొని నడిచి వెళ్ళే నన్ను ఆపి ఫెడేల్మని కొట్టిన దెబ్బ ఆ రాత్రి! 




ఇంటరాగేషన్ ఎస్.ఐ. నా చొక్కా పట్టుకుని, “మీకందరకు తెలియకుండా ఎలా పారిపోయాడా పిపీకలపు  వెధవా!" అంటూ నేలమీద పడేలా త్రోసి బూటుకాలితో తన్నాడు. 


మా ప్రొఫెసర్ వున్నాడు. ఆర్.ఎం.ఓ., సూపర్నెంటూ  మిగిలిన డాక్టర్లూ అక్కడే వున్నారు. వాళ్ళెవరూ  రాక్షసకాండను ఆపలేదు. 


నేను పైకి లేచి సూపర్నెంటు దగ్గరకెళ్ళి  "సార్! వీడు నన్ను తన్నిన తన్ను మనందర్నీ తన్నినట్లే! మొత్తం మెడికల్ ప్రొఫెషన్ను వాడు ఫెడేల్మని తన్నాడు. ఈ శాస్తి మనకు జరగాల్సిందే సార్. లంచం ఇవ్వలేదని మందులివ్వకుండా పేషెంటను చంపే మనకు, లేబరు వార్డులో వీథి కుక్కలు యథేచ్చగా తిరుగుతున్నా, డ్యూటీ రూముల్లో బహిరంగ వ్యభిచారం జరుగుతున్నా ఏమీ పట్టని మనకు ఈ అవమానం జరగాల్సిందే సార్. సిగ్గుమాలిన పరమ దుర్మార్గమైన, మానవ జాతికే అవమానకరంగా ప్రవర్తిస్తున్న మనకీ అవమానం సరైందే సార్.” 


గబగబా బయటికి నడిచి వచ్చాను వాళ్ళ ప్రతిస్పందనల్ని పట్టించుకోకుండా.


నల్లని నాగులాంటి, మంటలాంటి, ఎంతకీ శమించని దు:ఖం లాంటి రాత్రి ముగిసింది. నా నైట్ డ్యూటీ ముగిసింది. అన్ని రాత్రుల్లా కాక ఆ రాత్రి ఒక ఎలిజీలా నన్ను వెంటాడుతూనే వుంటుంది. ఆ రాత్రి ఎప్పటికీ నా జ్ఞాపకంలో మిగిలిపోతుంది. ఆ రాత్రితో పాటే మరో వ్యక్తి కూడా నా జ్ఞాపకాల్లో హమేషా నిలిచి వుంటుంది. ఆ వ్యక్తి నర్సింగ్ స్టూడెంటు ఝాన్సీ. 


డ్యూటీ రూములో నేను చూసిన ఆ మగ పశువు,  తల పగిలి అంకాన్షస్  గా వున్న హెడ్ కానిస్టేబులే. 


నాకు ఆమె నమ్మే సిద్ధాంతాల గురించీ, ఉద్యమాల గురించీ అంతగా తెలియదు. కానీ ఆమె త్యాగం మాత్రం నన్ను విస్మయపరుస్తూనే వుంటుంది.


                                                                                ఆంధ్రజ్యోతి వారపత్రిక 20 ఏప్రిల్, 1990





'నైట్ డ్యూటీ' డాక్టర్ చంద్రశేఖర్ రావు గారి, 'చిట్టచివరి రేడియో నాటకం - డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు కథలు అనే కథాసంపుటం లోనిది.



రచయిత:

1959 లో ప్రకాశం జిల్లాలో జన్మించిన డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారు , ఒక విలక్షణమైన కథకులు. ఆయన కథలన్నిటిలో తీవ్రమైన సామాజిక స్పృహ, చుట్టూ మారుతూ వున్న పరిస్థితులూ, వాటి వల్ల వ్యక్తులలో తలెత్తే సంఘర్షణా, ముఖ్యాంశాలుగా ఉంటాయి.

సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే , సాహిత్యం కంటే ఉపయోగపడే వస్తువు లేదు అని గట్టిగా నమ్మిన మనిషి.

మెడిసిన్ చదివిన చంద్రశేఖర్ రావు గారు , రైల్వేస్ లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 2017 లో పదవీ విరమణ చేశారు.

1990లో రచనా రంగంలో అడుగుపెట్టిన ఆయన 2017 సంవత్సరం దాకా కథలూ , నవలలూ రచించారు.

అనేకానేక పురస్కారాలను అందుకున్న ఆయన నాలుగు కథా సంపుటాలు, 3 నవలలు తెలుగు పాఠకులకు అందించారు. ' రచయితల రచయిత' గా పేరు పొందారు. తెలుగు కథ ని వున్నత స్థాయి లో నిలబెట్టిన కథకుల్లో చంద్రశేఖర్ రావు గారు ముందు వరసలో వుంటారు.


చంద్రశేఖర్ రావు గారి పుస్తకాలు కొనడానికి :

ఆయన కథా సంపుటాలు రెండు మాత్రమే ఇప్పుడు మనకు లభ్యం అవుతున్నాయి.

  1. 'ముగింపుకు ముందు'- ఆయన ప్రచురించని కథలతో - (http://bit.ly/3c7DBNZ). ఇదే పుస్తకంలో శ్రీ బి.తిరుపతిరావు గారు చంద్రశేఖర్ గారి రచనా శైలిపై రాసిన చక్కని ముందుమాటను మనం చదవొచ్చు.
  2. 'చిట్టచివరి రేడియో నాటకం - డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు కథలు' - ఈ పుస్తకం కోసం 'విశాలాంధ్ర విజయవాడ' - రాజు గారిని 9840034033 లో సంప్రదించండి.

చంద్రశేఖర్ రావు గారు తెలుగు కథన రీతులపై 2015 లో చేసిన ప్రసంగాన్ని ఈ లింక్ ద్వారా వినవచ్చు. (https://bit.ly/2M2IsFB)



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations