Episode 306

‘తెరిచున్న కిటికీ’: మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’

‘తెరిచున్న కిటికీ’:  మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki)  రాసిన ‘The Open window’

(https://americanliterature.com/author/hh-munro-saki/short-story/the-open-window)


“అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తుందండీ, ఈలోపల నా కంపనీ భరించాలి మీరు” అంది ఆ పదిహేనేళ్ల యువతి నవ్వుతూ, కొత్త మనిషిని కలుస్తున్నాను అన్న బెరుకేవీ లేకుండా. 


వాళ్ళ అత్త రాక ప్రాముఖ్యతని   తక్కువ చేయకుండా, ఈ అమ్మాయిని పొగుడుదామని కొంత ఉత్సాహపడ్డాడు, ఫ్రాంటన్ నట్టెల్. 


నిజానికి, ఇలా ఒకరి తర్వాత ఒకర్ని, కొత్తవాళ్ళని కలవడం  అతనికంత గొప్ప ఐడియాలా అనిపించడంలేదు. తన నరాల వ్యాధి   తగ్గడానికి  ఇది  ఏ రకంగా ఉపయోగపడుతుందో అర్థం కావడం లేదు. 

 

పల్లె ప్రాంతంనికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని  ఏర్పాట్లు చేసుకుంటూంటే, వాళ్ళ అక్కయ్య అంది,    “నాకు బాగా తెల్సు.  నువ్వు అక్కడికెళితే, ముసుగేసుకుని ఎవ్వరినీ కలవకుండా మూలుగుతూ కూర్చుంటావు. ఆ ఒంటరి బతుక్కి, నరాలు ఇంకా బలహీనపడతాయి. నాకు తెల్సిన వాళ్లందరికీ  ఉత్తరాలు రాసిస్తాను. నా మాట విని, వాళ్ళని కలుస్తూ వుండు. నాకు తెల్సినంతమటుకు  వాళ్ళందరూ మంచి మనుషులు. నిన్ను ఇబ్బంది పెట్టరు .”


ఫ్రాంటన్ కి అనుమానం వచ్చింది, ‘తను కలవబోయే మిసెస్ సాపిల్టన్, ఈ ‘మంచి’ అనబడే  కాటగిరీలో ఉందా?’ అని. 


అతను కొంత  కుదురుకున్నాడు అని నిర్ధారించుకుని , “మీకీ  చుట్టుపక్కల చాలా మంది  తెల్సా?” అని అడిగింది ఆ అమ్మాయి.  


“ఒక్కరు తెలిస్తే ఒట్టు. ఓ నాలుగేళ్ళ క్రితం అనుకుంటా, మా అక్కయ్య ఇదే  ఊళ్ళో,  పాస్టర్ గారింట్లో కొన్నాళ్ళుండింది. తనకు పరిచయం ఉన్నవాళ్ళని కలవమని కొన్ని ఉత్తరాలు రాసిచ్చింది.” అని బదులిచ్చాడు, చివరి వాక్యం మటుకు పట్టి పట్టి ఉచ్ఛరిస్తూ. 


“అయితే మా అత్తయ్య గురించి కూడా మీకేవీ పెద్ద తెలిసుండదే?” నింపాదిగా అడిగింది ఆ అమ్మాయి. 


“ఆమె పేరు, అడ్రస్ మాత్రం తెల్సు” అంటూ అనుకున్నాడు,  ‘అసలు ఈ మిసెస్ సాపిల్టన్ గారికి పెళ్లయిందా? భర్త వున్నాడా? లేడా?,  ఈ రూమ్ చూస్తూంటే మటుకు కొన్ని మగవాసనలు కనపడుతున్నాయి,  అని. 


“ఆమె జీవితంలో మూడేళ్ళ క్రితం ఒక పెను ప్రమాదం జరిగింది, మీ అక్కయ్య గారు అప్పుడు ఇక్కడుండరు.” అంది ఆ పిల్ల. 


“ఏవిటీ” ఉలిక్కిపడి అడిగాడు ఫ్రాంటన్, ఇలాటి ప్రశాంతమైన పల్లెటూళ్లలో ప్రమాదాలా ? అని లోపల ఆశ్చర్యపోతూ .  


“ మీకు విచిత్రంగా  లేదూ! ఈ చలికాలంలో,  అలా ఆ కిటికీ తెరిచిపెట్టటం” అందా అమ్మాయి, అక్కడ తెరిచున్న  ఒక పెద్ద ఫ్రెంచి కిటికీ ని చూపిస్తూ. దాదాపు తలుపంత సైజులో ఉండే ఆ కిటికీలోంచి,  ఇంటి ముందరున్న లాన్ కనపడుతోంది. 


“గదిలో వెచ్చగానే వుంది. అది  సరే! ఆ కిటికీకి, ప్రమాదానికీ  సంబంధం ఏదన్నా  ఉందా ఏవిటి కొంపదీసి?”


“మూడేళ్ళక్రితం ఇదే  రోజు, ఆవిడ భర్త, ఇద్దరు తమ్ముళ్లూ, అదే  కిటికీలోంచే బయటకు దిగి,  ఉల్లంకి పిట్టని వేటాడ్డానికెళ్లారు. వెళ్ళినవాళ్ళు అంతే!  ఇంక తిరిగిరాలేదు.  ఓ చిత్తడి నేల దాటుతూ పొరపాట్న ఒక  భయంకరమైన ఊబిలో కూరుకుపోయారు.  ఆ వేసవంతా,  ఆగకుండా వర్షాలు పడ్డం వల్ల  మామూలుగా గట్టిగా వుండే నేల కూడా, ఒక్కోచోట  మెత్తబడి పోయింది. 

అన్నిటికంటే భయంకరవైన విషయం, పాపం!  ఆఖరికి వాళ్ళ శవాలు కూడా దొరకలేదు” ఆ అమ్మాయి గొంతులో అప్పటిదాకా ధ్వనించిన స్థైర్యం బదులు తడబాటు తెలుస్తోంది. “పిచ్చి  అత్తయ్య, ఇప్పటికీ  అలవాటు ప్రకారం వాళ్ళు ఆ కిటికీలోంచే  వెనక్కొస్తారనీ, వాళ్ళతో పాటూ కనిపించకుండా పోయిన  బూడిద రంగు కుక్కపిల్ల కూడా తిరిగొస్తుందనీ, ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి రోజూ,  రాత్రి బాగా చీకటి పడే దాక , ఆ కిటికీ అలానే తెరిచి ఉంచుతుంది. పాపం! నాకు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పింది, ఎలా వేటకి బయలుదేరారో? మావయ్య తెల్లటి వాటర్ ప్రూఫ్ కోటు వేసుకుని, వాళ్ళ తమ్ముడు రోనీ ఏమో , ఈమెని ఎపుడూ ఏడిపించడానికి  పాడే పాట ఒకటి ‘బెర్టీ బెర్టీ’ అని పాడుకుంటూ.  నిజం చెప్పొద్దూ! ఒక్కోసారి, ఇలాంటి సాయంకాలం పూట, వాళ్ళు ఆ కిటికీలోంచి ఇంటి లోపలికి వచ్చేసినట్టు అనిపించి,  నాకు ముచ్చెమటలు పోస్తాయి.”  


ఆ అమ్మాయి కంఠంలో చిన్న వణుకు కనిపిస్తోంది.  మాట్లాడ్డం ఉన్నట్టుండి ఆపేసింది ఆ అమ్మాయి. 

గబగబా రూంలోకి వచ్చిన వాళ్ళ అత్తయ్యని చూసి ఊపిరి పీల్చుకున్నాడు ఫ్రాంటన్. తను లేటుగా వచ్చినందుకు  ఓ వందసార్లు క్షమాపణ కోరింది మిసెస్ సాపిల్టన్. 

“మా వేరా కబుర్లు బానే చెప్పిందా? ” అడిగింది ఆవిడ. 

“వూ. టైమే తెలియలేదు” అన్నాడు ఫ్రాంటన్. 


“ ఆ తెరిచున్న కిటికీ వల్ల మీకేవీ  ఇబ్బంది కలగలేదుగా? వేటకెళ్లిన ప్రతిసారీ, మా ఆయన, తమ్ముళ్లు, నేరుగా ఆ కిటికీలోంచే ఇంట్లోకి  వస్తారు.  చిత్తడి నేలల్లోకిఉల్లంకి పిట్టని వేటాడ్డానికి వెళ్లారు,. ఆ బురద  కాళ్లతో లోపలికొచ్చి, నా కార్పెట్ అంతా పాడు చేస్తారు. మీ మగాళ్లంతా ఇంతే. అవునా?” అంటూ ఉత్సాహంగా, వేటాడ్డం గురించి, పక్షులు ఎక్కువ కనపడకపోవడం గురించి, చలికాలంలో బాతుల వేట గురించి చెబుతూ పోయింది. 


ఫ్రాంటన్కు  మటుకు ఇదంతా వింటూంటే వొంట్లో వణుకు మొదలైంది. ఇలాటి భయంకరమైన విషయాలు కాకుండా వేరే  మామూలు విషయాలవైపు సంభాషణ మళ్లిద్దాం, అని కొంత ప్రయత్నం మొదలెట్టాడు. తనతో అన్యమనస్కంగా ఏదో మాట్లాడుతోంది కానీ, ఆవిడ ధ్యాసంతా ఆ కిటికీ మీద , కిటికీ అవతలున్న లాన్ మీదే ఉందని, అతనికి అర్థమౌతోంది. 


“నిజంగా ఎంత దురదృష్టం కాకపోతే, సరిగ్గా వాళ్ళు పోయిన ఈ దౌర్భాగ్యపు  రోజునే, ఈ ఇంటికి  రావాల్సొచ్చింది” అనుకున్నాడు మనసులో . 


“పూర్తిగా విశ్రాంతి తీసుకోమని, అలిసిపోయేట్టు శరీరాన్ని శ్రమ పెట్టొద్దనీ, ఉద్రేకానికి లోనయ్యే విషయాలకి దూరంగా ఉండమనీ డాక్టర్లు అందరూ ఒకే సలహా  ఇచ్చారు. ఆహారం విషయంలో మటుకు ఒక్కో డాక్టరు ఒక్కో విధంగా చెప్తున్నారు” అన్నాడు అతను.   


‘చాలామంది రోగుల్లా,  ఎదురుపడ్డ  ప్రతివాడూ తన రోగం గురించి  అతి చిన్న వివరంతో సహా , తెలుసుకోడానికి ఆత్రుత పడుతూ ఉంటాడు’,  అనే భ్రమలో, మునిగిపోయున్నాడు,  ఫ్రాంటన్ . 


“అవునా” అంది ఆవిడ తన  వాక్యం పూర్తికాకుండానే,  ఆవులింతలోకెళ్ళి. అకస్మాత్తుగా మిసెస్ సాపిల్టన్ మొహం విప్పారింది, a అటు ఏటో చూస్తూ.  

“అమ్మయ్య! చివరికి  టీ తాగే టైముకి వచ్చేసారు. బురదలో స్నానం చేసొచ్చినట్టు  లేరూ వాళ్ళు “ 

ఆ మాటకి కొంచెం సన్నగా వణుకు పుట్టి , జాలి చూపుల్తో,  తల పంకిస్తూ, వేరా వైపు చూసాడు ఫ్రాంటన్. 


ఆ అమ్మాయి నిశ్చేష్టురాలై, ఏదో కనపడ కూడనిది కనపడినట్టుగా, కళ్లంతా భయం నింపుకొని, కిటికీలోంచి బయటికి చూస్తోంది.  ఫ్రాంటన్  ఒళ్ళంతా ఏదో తెలీని భయం  ఆవరించింది.    రక్తమంతా గడ్డకట్టుకొనిపోయినట్టై,  కూర్చున్న చోటునించీ, తలతిప్పి వేరా చూస్తున్న వైపే చూసాడు ఫ్రాంటన్.  


మసకబారుతున్న ఆ సాయం వెలుగులో మూడు ఆకారాలు లాన్లో నించీ, కిటికీ వైపే నడిచొస్తున్నాయి. అందరూ చేతుల్లో తుపాకులు పట్టుకోనున్నారు. ఒకరి భుజాల  మీంచి  తెల్ల కోటు వేలాడుతోంది. అలిసిపోయిన బూడిద రంగు కుక్క పిల్ల ఒకటి వాళ్ళ వెంబడే నడిచొస్తోంది. ఏ మాత్రం శబ్దం చేయకుండా కిటికీ దగ్గరకొచ్చేస్తున్నారు. 

కనుమరుగౌతున్న వెలుగులోంచి, కరుకైన గొంతుతో పాట వినపడ్డం మొదలైంది “ బెర్టీ ఓ బెర్టీ” అని . 


వెంటనే ఫ్రాంటన్ ఒక్క ఉదుటున లేచి చేతి కర్ర, టోపీ తీసుకున్నాడు. ఆ తరువాత ముసురుకుంటున్న చీకట్లో, అతను డోర్ తీయడం, బయట వసారాలో అడుగు పెట్టడం,  ఇంటి ముందరి గేటు తెరిచి రోడ్డుమీదకు దూకడం  మటుకే మిగతా వాళ్లకి కనపడింది. 

సైకిల్ తొక్కుతూ ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి అతన్ని ఢీకొట్టబోయి, ఎలాగోలా పక్కనున్న పొదల్లోకి తన  సైకిల్ను మళ్ళించి  ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. 


వైటు కోటు తగిలించుకున్న మనిషి, కిటికీ లోంచి లోపలికొస్తూ  “  వచ్చేసాం డియర్” అని ప్రకటించాడు. “ అంతా బురద బురద. కానీ ఎండిపోయిందిలే. అయినా ఎవడు వాడు? మేం వస్తూంటే, కట్లు తెంచుకుని పారిపోతున్నట్టు పరుగులు పెడుతున్నాడు?”


“ఓహ్ అతనో వింత వ్యక్తి . పేరేదో నట్టెల్. ఎంతసేపు అతనికున్న రోగం గురించే వాగడం. చివరికి మిమ్మల్ని చూసినప్పుడు, హలో అనడం కానీ, వెళ్ళొస్తానని చెప్పడం కానీ ఏవీ లేదు. ఏదో  వింతగా దయ్యాన్ని చూసినట్టు, ప్రవర్తించాడు” అంది మిసెస్ సాపిల్టన్. 


“నాకైతే మన కుక్కని చూసి భయపడ్డాడనిపించింది. నాతో చెప్పాడు, కుక్కలంటే చచ్చే భయమని. ఒకసారి రాత్రి పూట, గంగా నది ఒడ్డున, ఊరకుక్కల గుంపు అతన్ని తరుముకుంటే, స్మశానంలోకి పరిగెత్తి,  దాక్కోవలసి వచ్చిందట.  తవ్విపెట్టున్న ఓ  గోతిలో కూచుని,  అక్కడే తిరిగే ప్రేతాత్మలన  ఊళలు, నవ్వులు, చితిమంటల పటపటలూ వింటూ  రాత్రంతా గడిపాట్ట. అలాంటి అనుభవాలు ఎదురైతే, ఎవరు మటుకు అలా అయిపోరు” అంది ప్రశాంతమైన కంఠస్వరంతో  ఆ పిల్ల. 


చిటికేస్తే మనల్ని, తన ఊహాలోకంలోకి తీసుకెళ్లగలగటం  వేరాకు మాత్రమే వుండే ఓ ప్రత్యేకత. 


రచయిత గురించి: 19 వ శతాబ్దం తొలిరోజుల్లో  సాకి అనే కలం పేరుతో కథారచయితగా ప్రసిద్ధుడైన హెక్టర్ హ్యూగో మన్రో, బ్రిటన్ లోని డెవాన్షైర్ లో అతని బాల్యం గడిచింది. ఆయన పెరిగిన వాళ్ళ అత్తయ్య గారింట్లో ఒక పెద్ద ఫ్రెంచ్ కిటికీ ఉండేదట. చలిగాలి లోపలికొచ్చి ఆరోగ్యం పాడౌతుందని ఆవిడ ఆ కిటికీకి మేకులు కొట్టించి మూసివేయిందించిందట. కథలో మాదిరిగానే లాన్ లోకి తెరుచుకునే ఆ కిటికీని సైన్యంలో పని చేసే మావయ్య, రిటైర్ అయ్యి వెనక్కి వచ్చినప్పుడు మేకులు తీయించి ఆ కిటికీని తెరిపించాడట. మన్రో ఆ తరువాత అనేక ప్రసిద్ధమైన కథలు రాసి పేరు తెచ్చుకుని, సైన్యంలోనే పనిచేస్తూ చిన్న వయస్సులోనే మరణించాడు. 





This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations