Episode 307

రామేశ్వరం కాకులు: కథ - ప్రతిస్పందన.

ఈ కథ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘ రామేశ్వరం కాకులు’ పుస్తకం లోనిది.

పుస్తకం కొనాలంటే – https://amzn.to/3rDN1YM

రామేశ్వరం కాకులు :

వెనకవైపు రెండు వేపచెట్లు పెరడంతా నీడ పెడతాయి. ఆ రెండు చెట్లనీడలో వానల్లో, ఎండల్లో, చలిలో క్షేమంగా ఉంటుంది పోలీసు స్టేషను. పెరటిగోడ పక్కభాగంలో లోపలికి రావడానికి చిన్న గేటుంది. సామాన్యంగా తెరవరు. వేపనీడలో ఒకవైపు రెండు స్నానాల గదులూ, ఒక పాయఖానా, వీటికి దూరంగా నాలుగు నీలం ప్లాస్టిక్ కుర్చీలు పడుంటాయి. స్టేషనుకి వెనక వరండా ఉంది. వరండాలో అనేకమంది నేరస్థులు, అమాయకులు, అనుమానితులు కూర్చుని కూర్చుని నున్న బరిచిన రెండు పొడవాటి బెంచీలుంటాయి. రెండుకాళ్లూ ఎదుట కుర్చీలో పడేసి, టీ తాగిన కప్పు పక్కకుర్చీలో పెట్టి, తీరిగ్గా సిగరెట్టు వెలిగించి, పొగ వదులుతూ, కానిస్టేబులు వేపు చూశాడు రెడ్డి. 

దరిదాపు ఒంటిగంటవుతోంది – వేప కింద మంచం వేసుకుని హాయిగా పడుకోవాలనుంది అతనికి.

“ఊ. ముండలకి అన్నం పెట్టారా?” కానిస్టేబులు నవ్వాడు. 

“తిన్నారు సార్. బేబీ వచ్చి డబ్బులిచ్చింది.”

“ఎలాగైనా వాళ్లని బానే చూసుకుంటారా మీరు.” 

ఎస్సైగారి మాటలకి మళ్లీ నవ్వాడు పీసీ.

“ఎంతమందీళ్లు.” 

“నలుగురు సార్. ముగ్గురు పాతోళ్లే. నాలుగోది ఈడది కాదు సార్.” 

“అవునే, ఈళ్లకి మన్లాగే ట్రాన్స్ ఫర్లుంటాయి గదా!” 

మళ్లీ నవ్వేడు పీసీ.

“దాని గుంటూరు యాసండి. అదేదో పల్లెటూరు సార్. మాణ్నెల్లయిందంట దీనికాడికొచ్చి. ఇంటర్ చదివిందంట సార్.”

“ఆ. ఉష్ణోగాలు జేసే వోళ్లీ సెల్ ఫోన్లు అడ్డుపెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. నే వైజాగులో మెడిసిన్ చదివే అమ్మాయిల్ని పట్టుకున్నాను. అంటే డబ్బు కోసం కాదనుకో. ఈ డ్రగ్స్ ఉంటయి గదా, వాటికి అలవాటుపడి.”

కాసేపాగి పీసీ వెళ్లిపోయాడు. రెడ్డి భోజనం చేసి వచ్చాడేమో చల్లటి వేపగాలికి కునుకు తీయాలనుంది. తల వెనక్కి వాల్చి కళ్లు మూసుకున్నాడుగానీ ఎందుకో నిద్ర రాలేదు. మరో పది నిమిషాల్లో పీసీ వచ్చి దగ్గ నుంచున్నాడు. కళ్లు తెరిచి చూశాడు రెడ్డి.

“తినేత్తందండి. కాళ్లట్టేసుకుంది. మీతో మాటాడాలట సార్. కాళ్లిదలట్లేదు సార్.”

 ఒక క్షణంపాటు రెడ్డి కేవీ అర్థం కాలేదు.

“గుంటూరుదండి సార్. మీతో మాట్లాడాలంట సార్.” 

ప్లాస్టిక కుర్చీ ఎత్తి విసిరేస్తాడనుకున్నాడు పీసీ. 

“ఎవత్తిరా అది? రాజకీయాలుగానీ మాటాడుతుందా?”

“పద్మ సార్ దాని పేరు.”

 “సరే, రమ్మను.” తల ఊపి వెళిపోయాడు పీసీ.

రెండు నిమిషాల్లో ఆమె వచ్చింది. వరండాలోంచి మెట్లుదిగి రావడం అతను చూస్తూనే ఉన్నాడు. ఆమె అతన్ని అక్కణ్ణించే చూస్తూ నడిచి వచ్చింది.

“నీ పేరేంటి?”

 “పద్మ సార్.”

“అసలు పేరు.” 

“పద్మావతి సార్.” 

“ఏ ఊరు నీది?” 

“సత్తెనపల్లి దగ్గర సార్.”

“ఇక్కడి కొచ్చి ఎన్నాళ్లయింది!”

“మూడు నెలలైంది సార్.”

“ఊం పర్సనల్ గా మాటాడాలన్నావంట?” 

తల ఊపిందామె. 

రెడ్డి సిగరెట్టు వెలిగించాడు. పద్మ అతనివైపే చూస్తోంది. జుట్టు బిగువుగా వెనక్కిలాగి జడ వేసుకుందామె. రెండు కనుబొమల మధ్య కొంచెం పైన దోసగింజ తిలకం. సన్నటి కాటుక గీత. నీలంరంగు చీర, అదే రంగు జాకెట్టు భుజాల మీంచి కొంగు కప్పుకుని చేతులు కట్టుకు నిల్చుంది. 

“నన్ను చూడ్డానిగ్గాని వచ్చేవా, మాటాడతావా?” 

ఆమెవేపుచూస్తూ అన్నాడు రెడ్డి. పద్మ పెదాలు ఒంపు తిరిగాయి. అంతవరకూ ఎస్సైని  కన్నార్పకుండా చూస్తున్న ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. 

దణ్ణం పెడుతూ అందామె.“సార్. నన్ను కోర్టుకి తీసికెళ్లవాకండి సార్. ప్లీజ్.” ,

“కోర్టుకి రావా? బావుంది. ఏం కొత్తా? ఆళ్ల మొహాన ఫైను పారేస్తే మళ్లీ మామూలే. ఏం, కోర్టుకి పోలా ఎప్పుడూ?” 

అడ్డంగా తల ఊపిందామె.

 “కోర్టుకి పోలేదా, నిజవే?”

“నిజవే సార్,” ఆమె కళ్లు తుడుచుకుని చటుక్కున అతని కాళ్లు పట్టుకుంది.

“సార్. నాకు బయెం సార్. మీ ఇష్టం ఏదేనా చెయ్యండి. కోర్టుకి పంపమాకండి సార్,” కాళ్ల మీద పడ్డ నీలంకుప్పలా ఉందామె. ఏడుపుతో ఆమె భుజాలు ఎగిరిపడు తున్నాయి.

రెడ్డికి కాసేపు నోటమాట రాలేదు.

 “హ్. లెగెహె. ముందు లెగు. లే!” ఓ చేత్తో బలంగా ఆమె భుజం పట్టుకుని లేపేడతను. “ముందు ఆ ఏడుపాపు.” మరో దమ్ములాగి అన్నాడు రెడ్డి. 

 “అంతేనా ఇంకా ఉందా?” 

ఆమె కళ్లు తుడుచుకుని చేతులు జోడించి నుంచుంది. ఎస్సై రెడ్డి అనేకమంది పద్మల్ని, సావిత్రుల్ని, సుజాతల్నీ చూసాడు. వాళ్ల ముఖాల్లో, పోలికల్లో అతనికి తేడా కనిపించదు. రుమాలో ముఖం తుడుచుకుని పద్మవైపు నిశితంగా చూశాడతను.

తెల్లగానే ఉంది. సన్నగా, ఒత్తు జుట్టు, పొడుగూ పొట్టీ లేకుండా మరోసారి చూడాలనిపించే ఆకర్షణ ఉందామెలో. కనుబొమలు ముడిచి ఆమెవైపే చూస్తున్నాడతను. ఏడవడం వల్ల ఆమె కళ్లు శుభ్రం అయినాయి. మళ్లీ అతనివైపే చూస్తోందామె. రెడ్డి కళ్లు తిప్పుకోలేకపోయాడు. ఆమె కళ్లు అతన్ని ఆక్రమించాయి. అతని ఎస్సె జీవితం కరుకైనది. అతని ప్రపంచం నిండా సరిగా వెలుతురు పడని చీకటి. తన ఎదురుగా నుంచున్న పాతికేళ్లు కూడా లేని ఈ అమ్మాయి జీవితం అయిదో నంబరు జాతీయ రహదారిలాంటిదని అతనికి తెలుసు. అది కొత్తాకాదు, ఆశ్చర్యం, విషాదం అసలు  లేవు అతనికి. కానీ చూస్తున్న కొద్దీ ఆమె కళ్లకీ ఆమె శరీరానికీ ఏవీ సంబంధం లేదనిపించిం దతనికి. ఒక రకమైన ఏకాంతంలో, నిశ్శబ్దంలో ఆమె కళ్లు చిత్రమైన నమ్మకంతో విషాదంతో నిశ్చలమై అతన్ని అశక్తుణ్ని చేశాయి. కాసేపాగి అసంకల్పితంగా అడిగాడతను.

“కోర్టుకి రాకుండా ఏం చేస్తావు?”

అతన్ని చూస్తూనే అన్నదామె, “నే కోర్టుకి బోను సార్. ఈణ్ణుంచి పోయి డబ్బు తీసుకుని వెంబడే వెళ్లిపోతాను. రెయిడ్ లేకుంటే ఈ పాటికి చానా దూరం పోయేదాన్ని సార్.”

ఒకసారి కళ్లు మూసుకుని ఆఖరి దమ్ములాగి సిగరెట్టు అవతల పారేసి రెడ్డి

ఆమెవైపు చూశాడు. ఆమె కళ్లు తిప్పుకోవడం లేదు. మనుషులు లేని చోట ఒంటరిగా చెరువులోకి దూకినట్టనిపించింది. బయటపడేసరికి సునాయాసంగా ఆమె చూపులు అతని ఖాకీ బట్టల్ని ఉల్లిపొరలా విడదీశాయి. ఆమె మాటల్ని ఎందుకు వింటున్నాడో అతనికి తెలియలేదు. అతని నోరు పెగిలేసరికి అతని కంఠంలోని తీవ్రత వేపగాలిలో కలిసిపోయింది.

“బేబీ కంపెనీ ఒదిలి పారిపోదావనుకున్నావా!” 

“అవును సార్.” 

“ఏం?”

 “నే వెళ్లిపోవాల సార్… ఈ పని చెయ్యను.”

 “సత్తెనపల్లి వెల్గావనా?” 

“అవును సార్. అక్కడ నాలుగు దినాలుండి ఎళిపోతా.” 

హైదరాబాదు వెళ్తావా?” తల అడ్డంగా ఊపిందామె. .. 

“నీకు అమ్మా నాన్నా ఉన్నారా?” 

“అమ్మ ఉంది సార్. నాన్న ఈ నడుంగల పోయాడు సార్.” అంది 

“ఏం జేసేవోడు?”

 “చిన్న స్కూల్లో టీచరు సార్.” 

“టీచరా?” – 

“పంచాయితీ స్కూలు. నేనంటే ప్రేణంగా ఉండేవాడు. బియిడి చేసి నేను టీచరవాలనేవాడు.”

“… అతనికి తెలవదా?” తెలవదని తల అడ్డంగా ఊపిందామె. 

“అమ్మకి అనుమానం. వైజాగులో ఉజ్జోగం అని చెప్పేదాన్ని. డబ్బులు పంపిస్తానే ఉన్నా. ఇంటికి పోయేదాన్ని కాదు.”

“మరిప్పుడెందుకు?” 

“అమ్మకి డబ్బులిచ్చిపోతా.”

 “ఎక్కడికి?”

ఆమె మాట్లాడలేదు. మళ్లీ అడిగేడతను. 

అతని కళ్లలోకి చూస్తూ మెల్లిగా స్పష్టం గా చెప్పిందామె. “రామేశ్వరం.”

                                        *******************

ఇద్దరూ పొలంగట్టు మీద కూచున్నారు. వెచ్చగా ఉన్న పకోడీ పొట్లాలు రెండూ విప్పుకుని ఒక్కోటీ తింటూ కబుర్లు నంజుతున్నారు. అన్నివైపుల నుంచీ వాళ్లని పొలం పచ్చటి దుప్పటి కప్పింది. పొలం మీంచి చల్లటి గాలి ఇద్దరికీ స్నానం చేయిస్తోంది.

“పద్దూ ఈ డ్రెస్సులో బలేగున్నావే. సినిమాల్లో జేర్రాదూ ,” పెద్దగా నవ్వింది

పద్మ.

“అప్పుడుగాని నాన కాళ్లిరగనూకి ఇంట్లో కూచోపెట్టడూ,” ఇద్దరూ కలిసి నవ్వు కున్నారు.

“ఏమోగానీ నువ్వు హీరోయిన్లా ఉంటావంట గదా?”

 “ఆ చెప్పినోడెవడో?”

 “ఏం నీకు చెప్పాలేంది?”

 “నన్ను హీరోయినన్న సుత్తి మొకమోడెవడా అని.”

“అట్టనబాక. ఆడిది సుత్తిమొకం కాదు.” పద్మ దుర్గవైపు అర్థమైందన్నట్టుగా చూసింది.

“రాంబాబు బస్సులో నీ యెనకనే నిలబడతాడా లేదా? కాలేజీ దగ్గిర దిగినాక నీ యెంబడే కుక్కమాదిరి లోపలికి రావట్లే? నిన్ను ప్రేమిస్తున్నాడంట.” 

దుర్గ జాగ్రత్తగా రాంబాబు గురించి చెప్పింది. రోజూ సత్తెనపల్లి బస్సులో కనీసం పదిమంది కాలేజికి వెళ్లిస్తుంటారు. పద్మకి రాంబాబు తెలుసు. ఒక ఊరే. ఈ ప్రేమే ఆమెకు తెలీదు. మరో రెండు మూడు రోజుల తరువాత , నాలుగు పకోడీ పొట్లాల తరువాత పద్మ ఒప్పుకుంది. “నీకేం బయం లేదు. నేను ఆ యెనక గట్టుమీద దాక్కొనుంటా. రాంబాబు ఏదేనా జేస్తే నే ఒస్తా గదా. ఊరికే కోకాకోలా తాగి కాసేపు మాట్లాడుకోండి.”

మర్నాడు రాంబాబు ఏవీ చెయ్యలేదు. పద్మ కోకాకోలా తాగింది. అలా రెండు సార్లు అతను పొలం గట్టుమీద కబుర్లు చెప్పాడు. మూడోసారి కనుచీకటి పడుతుండగా పద్మ ఇంటికి పోవాలంది. “సర్లే. ఈ బాటిలు మిగిలిపోయింది. సగం నువ్వు తాగు. సగం నేను.” ఆమె సగం తాగింది ముందు. దుర్గ ఎప్పుడో వెళ్లిపోయింది. తరువాత ఎప్పుడో చిమ్మచీకట్లో మెలకువ వచ్చింది పద్మకి. పూర్తిగా స్పృహలోకి రాగానే ఏమైందో అర్థం అయిందామెకి. మర్నాడు కాలేజీకి వెళ్లిన పద్మ మళ్లీ రాలేదు. 

చాలా కాలం తరువాత తల్లి పేరిట డబ్బు వచ్చేది. కూతురు చేసే ఉద్యోగం మీద ఆమెకి నమ్మకం లేదు. తండ్రికి నమ్మకం ఉందో లేదో తెలీదు. ఆయన అప్పట్నించీ క్లాసులో మాట్లాడ్డం మానేశాడు. ఊళ్లో వాళ్లు అడగడం మానేశారు. ఏవైందో మాత్రం ఎవరికీ తెలీదు, దుర్గకి తప్ప.

విశాఖపట్నం, కడప, గుంటూరు, శ్రీకాకుళం నగరాలు తిరుగుతూ అయిదేళ్లు గడిపింది పద్మ. తన వయసులో బాగున్న అమ్మాయిలకి మామూలు ఉద్యోగాలు రావని ఆమెకి రెండోరోజే అర్థమైంది. విశాఖపట్నం నుంచి వచ్చి మూడునెలలైంది. బేబీ జాగ్రత్తగానే చూసుకుంటుంది. ఎవరూ చూడకుండా సత్తెనపల్లి కాలేజికి వెళ్లి చూసి రావాలని అనిపిస్తూండేది అనేకసార్లు. దుర్గ ఎందుకు మోసం చేసిందో అడగాలని అనుకుంది. కానీ క్రమంగా తెలుసుకోవలసిన అవసరం కనిపించలేదు.

ఓరోజు రాత్రి ఏడు దాటిం తరువాత బేబీ పిలిచింది. ఆమె ఎదురుగా కుర్చీలో ఒక వ్యక్తి కూచుని ఉన్నాడు. పద్మని అందరి దగ్గరికి పంపించదామె. కాలుమీద కాలు వేసుకుని కూచున్న విరుగుడు చేవ బొమ్మలా ఉన్నాడతను. పద్మ మొగవాళ్ల ముఖాల్ని పరిశీలనగా చూడ్డం ఎప్పుడో మానేసింది. నలుపు తెలుపులు తప్ప పెద్ద తేడా కనిపిం చదు. అలవాటుగా అతనివైపు చూసి చిరునవ్వు నవ్విందామె. తల తిప్పి ఆమెవైపు నిశ్శబ్దంగా చూసాడతను. ఆ క్షణంలో అతను తనలోంచి బయటికి చూస్తున్నట్టనిపించింది. తిరిగి నవ్వలేదతను. అతనికేమీ సంబంధం లేదన్నట్టు కూచుని ఉన్నాడు.

మరో నిమిషం తరువాత అతన్ని గదిలోకి తీసికెళ్లింది పద్మ. మంచం మీద , కాకుండా మంచం పక్కన కుర్చీలో కూచున్నాడతను. అతనికి దగ్గిరగా మంచంమీద కూచుందామె.

“సిగరెట్టు కాల్చుకోవచ్చా?” వింతగా చూసిందామె. దిగి టీపాయి కింద నుంచి ఏష్ ట్రే అతని ముందు పెట్టింది. సిగరెట్టు వెలిగించాడతను. ఆమెవైపు చూడ్డం లేదతను.

మొదటిసారిగా అప్పుడతన్ని పరిశీలనగా చూసిందామె. సగందాకా నెరిసిన నొక్కుల జుట్టు, మంచి ముక్కు చక్కటి పెదాలు, మూసుకుపోయిన చెవిచిల్లు. ముఖ్యంగా అతని నల్లటి ముఖంలో తెల్లగా మెరుస్తున్న అతని కళ్లు ఆమె నాకర్షించాయి. సన్నగా పొడుగ్గా… ఆ పొడుగు పెరగడానికి కనీసం యాభై ఏళ్లు పట్టిందనుకున్నదామె. తెల్లటి పేంటు, లేత నీలం చొక్కా. 

• “మీదీ ఊరేనా?” చటుక్కున ఆమె జ్ఞాపకం వచ్చినట్టు పక్కకి తిరిగి ఆమెను చూశాడతను. రెండు కనుబొమల మధ్య చిన్న గుండ్రటి తిలకం కనిపించిందామెకి. “కాదు.”

“పనిమీదొచ్చేరా?”

“నాకేం పనిలేదు. ఉత్తినే వచ్చేను.”

“మీ సొంతూరు?”

"రామేశ్వరం"

ఆమెకి వెంటనే నవ్వొచ్చింది. “సారీ సార్. రామేశరం పోయినా శనీసరం వదల్లేదంటారు. అదేనా?”

“అదే. నాదీ అదే పరిస్థితి.” ఆమె అతన్ని చూస్తూ కాసేపు మాట్లాడలేదు. “మీ మనసు బాలేదేం?”

తల ఊపేడతను. సిగరెట్టు ఏష్ ట్రేలో నలిపేశాడు. ఇష్టంగా కాల్చినట్టు అనిపించలేదామెకి.

“ఎన్ని సిగరెట్లు కాలుస్తారు?”

“నాకలవాటు లేదు.. ఈ మధ్యనే అలవాటైంది. ఇన్నని లేదు.” అతను కుర్చీలో వెనక్కివాలి కూచుని ఎదుట గోడవేపు చూస్తున్నాడు. మరో ప్రశ్న ఆమె ఆలోచించేలోగా అన్నాడతను. “నా పేరు వరహాలు. మా పెద్దలు ఎందుకో శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి రామేశ్వరం వెళ్లిపోయారు. అక్కడ నాకు బట్టలకొట్టు ఉండేది. ఇప్పుడు లేదు. అమ్మేశాను.”

“ఏం? నష్టం వచ్చిందా ఏంది?”

“ఒక రకంగా. డబ్బు కాదు… ఏడాది క్రితం నా భార్య పోయింది. కడుపులో కేన్సరు.”

“అయ్యో.” కాసేపు మళ్లీ అతనేం మాట్లాడలేదు. ఆమెకేం చెయ్యాలో తోచలేదుగానీ అతనక్కడుండడం బాగుంది. మాట్లాడకపోయినా సరే. అతనామెతో మాట్లాడుతున్నాడు అనిపించడం లేదు.

“నీ పేరు?”

 “పద్మ.”

 “మంచి పేరు.”

“ఇట్టా రండి.” ఆమె చెయ్యి అందించి అతన్ని మంచంమీద కూచోబెట్టింది. ఆమె వేపు చూస్తూ రెండు దిళ్లు తలవేపు చెక్కమీద వేసి తల వాల్చుకున్నాడతను. ఒక చెయ్యి అతని నడుం మీంచి అవతలికి వేసి మరో చేత్తో అతని ఛాతీ మీద రాస్తూ అందామె. “ఇక్కడికెప్పుడొచ్చారు?”

“నాలుగు దినాలైంది. సాయంకాలం గోదావరి గట్టుమీద కూచున్నాను. తరవాత రోడ్డు మీద కొచ్చేను. అతనెవరో ఇక్కడికి తీసుకొచ్చేడు.”

“నాలాంటి అమ్మాయిలు తెలుసా?”

 “తెలీదు. కానీ అతనెవరో అడిగితే రావాలనిపించింది. ” 

“ఎంతమంది పిల్లకాయలు?” 

“ఇద్దరమ్మాయిలు. పెళ్లి అయిపోయింది. వచ్చే ముందు షాపు అమ్మేసి ఇద్దరికీ డబ్బులిచ్చి వచ్చేశాను.”

“ఎక్కడికి?” 

“తెలవదు. తిరుపతి పోయినా. కాళహస్తి, విజయవాడ తిరుగుతూంటి.”

“ఇక ఊరెళ్లరా?”

“ఊరు లేదు. అక్కడ నాదేమీ లేదు. నాకు ఏవీ అవసరం లేదు. నాతో నాకు పర్లేదు. ఎవరితో పర్లేదు. నా భార్యకోసం వ్యాపారం చేశా. ఇంక దేనికి? పిల్లకాయలకి వాళ్ల భర్తలు, సంసారాలున్నాయి. నా అవసరం లేదు. ఇప్పుడు తేలిగ్గా ఉంది. ఏ దినం అయినా, పగలూ రాత్రీ అన్నీ ఒకటే.” –

“ఏం చేసేరిక్కడ?”

“గోదావరి గట్టమ్మటే తిరిగినా. రోజూ పొద్దుపోయినాక పడవెక్కి నదిలో తిరిగా. ఒడ్డుకు రాబుద్ది పుట్టలా. నదిలో పడవలో ఒంటిగా. ఇంకా రాత్రి అయినాక రమ్మంటే పడవోడు రానన్నాడు. ఒక్కడే పడవేసుకుని సముద్రంలోకి పోవాలనుకున్నా.”

“మరి ఇక్కణ్ణించి ఎక్కడికి?”

 “తెలీదు… నీకు భీమునిపట్నం తెలుసా?” 

“తెలుసు సార్.”

“అక్కడికి వెడతాను. చిన్నప్పుడు వెళ్లేను. అక్కడ సముద్రం బావుంటుంది. ఆమెకీ సముద్రం అంటే ఇష్టముండేది.”

ఆమె అతని వైపు అలాగే చూసింది. తన నల్లటి జాకెట్టు పక్కన పడేసి అతని ఛాతీ మీద వాలి పడుకుంది. వరహాలు ఆమె వీపు మీద చెయ్యివేసి తన పొడవాటి వేళ్లతో నిమురుతూ ఉండిపోయాడు. మగవాళ్ల చేతులామెకు తెలుసు. అతని చెయ్యి మగాడి చెయ్యిలా అనిపించలేదు. ఆమె ప్రాణం కదలాడింది. అతని పొడవాటి వేళ్లు అలలు అలలుగా ఆమెకు గగుర్పాటు కలిగించాయి. ఆ స్పర్శలో ఆమె నది అయిపో యింది. అతని వేళ్లు మృదువుగా ఆమె వీపు మీద ప్రవహిస్తున్నాయి. తల మెల్లిగా ఎత్తి అతనివేపు చూసింది. అతను కళ్లు మూసుకుని ఉన్నాడు. ఆమెకు నిద్రలాంటి మత్తులాంటి హాయివంటిదేదో చర్మంలోంచి శరీరంలోకి ప్రవహిస్తున్నట్టనిపించింది. అతని చెయ్యి ఆమె వీపుని మంత్రిస్తూనే ఉంది. ఆమె చటుక్కున లేచింది. అతను చెయ్యి తీశాడు. పక్కన పడేసిన జాకెట్టు వేసుకుని అతని భుజం వంపులో తల పెట్టుకుంది. అతని చెయ్యి ఆమె వీపు మీద మృదువుగా సంచరిస్తుంటే అది అతని మాటల కొనసాగింపులా అనిపించిందామెకి. తల కొంచెం పైకి జరిపి మెల్లగా అడిగిందామె.

“రామేశ్వరం బావుంటుందా?” 

కళ్లు మూసుకునే అన్నాడతను, “ఊఁ సముద్రం ఒడ్డున కూచోవాలి. అది చివరన్నమాట. అది నీ చివరి చిరునామా. చాలామంది ఒస్తారు. పెద్దలందరికీ అక్కడ పిండాలు పెడతారు. అందరి ఆత్మలూ అక్కడికి వచ్చి వెళతాయి.”

“మీరు చూసేరా?”

“అవి కనబడవు. ఉంటాయి. ఉన్నాయని అనుకుంటాం. అనిపిస్తుంది. అనిపించడమే ముఖ్యం.”

“నన్ను మీ ఊరు తీసుకెళ్తారా?” 

 “ఉహు. నేను వెళ్లను. నాకు ఊరు లేదు.” 

కాసేపాగి అన్నాడు. “నువ్వు వెళ్లు.”

ఆమె అలాగే ఉండిపోయింది. సముద్రపు గాలి సోకిందామెకి, వీపు మీద పొడవాటి – వెచ్చటి అలలేవో కదులుతున్నాయి. చెవుల్లో దూరం నుంచి అలలు విరిగి పడ్డం వినిపించింది. కాసేపు అలాగే సముద్రపు గాలిలో ఉండి మళ్లీ అంది,

 “భీమ్లీలో  ఉండరా సార్?”

“ఉంటాను.”

 “ఊం ఎన్నాళ్లు?”

“రెండు రోజుల కంటే ఉండను. చిన్నతనంలో వెళ్లా. ఒకసారి గుర్తు చేసుకుంటా. అక్కా నేను, తమ్ముడు, అమ్మ, నాన్న…”

ఆమె కాసేపు మాట్లాడలేదు. 

“తరవాత?”

అతను సమాధానం చెప్పలేదు. తల ఎత్తి అతని వైపు చూసిందామె. అప్పుడే వరహాలు కళ్లు తెరిచాడు. తదేకంగా ఆమెవేపే చూస్తుండగా అతని పెదాల చివరనుంచి అతి చిన్న నవ్వు కదిలింది. ముడిపడ్డ ఆమె కనుబొమలు విడివడ్డాయి. ఫెళ్లున పెద్ద అల ఆమె చెవిలో విరిగిపడింది. ఆమె కళ్లు విప్పారాయి. అతని కళ్లలోకి మంత్రించినట్టు చూస్తుండిపోయింది. అతనామె కళ్లలోకి చూస్తున్నాడు. ఆ కళ్లేదో ఆమె కళ్లకి రహస్యం చెప్పినట్టనిపించింది. అతని కళ్లలోకి చూడలేక ఆమె అతని ఛాతీకి అతుక్కుపోయింది. అతని చేతివేళ్ల అలలు ఆమెని మృదువుగా చిక్కటి నీలిమలోకి తీసుకెళ్తున్నాయి.

అతను ఎప్పుడు లేచి వెళ్లిపోయాడో ఆమెకు తెలియలేదు. తలవాల్చిన దిండు తడిసిపోయింది. ఒక శూన్యంలో మేలుకుందామె. పెద్దచక్రం నుంచి విడిపడి శూన్యం లోకి జారిపడినట్టనిపించింది. బయటికి రాగానే బేబీ అంది.

“ఆయనగారు రేపిదే టయానికి ఒస్తానన్నాడు. నువ్వే కావాలంట.”

వరహాలు మర్నాడు రాలేదు. మర్నాడూ ఆ తరువాతా కూడా రాలేదు. పద్మకి తన ప్రపంచం, మనుషులు, తన శరీరం కొత్తగా కనిపిస్తున్నాయి. తన శరీరం ఎలాగూ తనది కాదు. ఇంక వరహాలు రాడని ఆమెకి అర్థం అయింది. ఆమె నిద్ర నిండా సముద్రం నిండిపోయింది. ఇంక తను వెళ్లిపోవాలి.

                                               ****************

మంత్రించినట్టు ఉండిపోయాడు రెడ్డి. ఆమె మళ్లీ ఒంగి అతని కాళ్లు పట్టు కుంది. ఆమెను లేపాలని కూడా తోచలేదతనికి. నీళ్లు నిండిన ఆమె కళ్లలోకి చూస్తుండి పోయాడతను.

“లే. లేచి కూచో.” 

అతని కంఠంలో మార్పు ఆశ్చర్యం కలిగించిందామెకి. తటపటాయించి జాగ్రత్తగా కుర్చీ చివర కూచుంది.

“రామేశ్వరంలో ఎన్నాళ్లుంటావు?” అడిగాడని కూడా అతనికి తెలిసినట్టు లేదు. 

ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. “రెండు రోజులు. సముద్రం దగ్గరే ఉంటాను.” 

మెల్లిగా తల ఊపుతూ ఆమెనే చూస్తున్నాడు రెడ్డి. 

కాసేపుండి అన్నాడు. “తరవాత?”

ఆమె చెంపలు కన్నీటితో తడిగానే ఉన్నాయి. కళ్లు విప్పి అతని వేపే నిశ్చలంగా చూస్తుండిపోయిందామె. 

                                         *******************

ఆమె అట్లా చూస్తున్నంత సేపూ పాత చీకట్లోంచి అతనికి మాటలు వినిపించేయి. తలకీ, చేతికి రక్తం మరకలు కనిపిస్తున్న కట్లతో అక్క మంచం మీంచి మెల్లిగా లేచి మంచం కింది నుంచి ఇత్తడి చెంబు తీసుకుంది. 

“తమ్ముడూ, ఇక నావల్ల కాదు. చదువుకో. అమ్మనీ నాన్ననీ జాగర్తగా చూసుకో.”

“ఏంటక్కా అది?” ఆమె చెంబులోంచి పూర్తిగా గొంతులో పోసుకుని తమ్ముడ్ని చివరిసారిగా గట్టిగా హత్తుకుంది. 

                                         ***************

ఆ జ్ఞాపకం నుంచి బయటపడి, “రామేశ్వరం ఎలా వెళ్లాలో తెలుసా?” అన్నాడు

“అడుగుతాను. తెలీదు.”

 “విను.” అతను రామేశ్వరం, ధనుష్కోటిల గురించి చెప్పేడు.

 “నువ్వు వెళ్లు. డబ్బు తీసుకుని ఇక్కడికి రా. వెళ్లు.” 

ఆమె గాలిలా వెళ్లిపోయింది. 

“సార్. అదెక్కడికో పోతోంది సార్.” “ రామేశ్వరం.”

“సార్?”

మరో సిగరెట్టు వెలిగించి కళ్లు మూసుకున్నాడు రెడ్డి. పద్మ వెనక్కి రావడానికి గంట పట్టింది.

“డబ్బులున్నాయా?”

 “ఉన్నాయి సార్.”

 “ఇది ఉంచు. నువ్వెళ్లు.” 

ఆమె దణ్ణం పెట్టి నుంచుంది. వేపగాలి ఇద్దర్నీ ముంచెత్తుతోంది.

అతను ఆమె వైపు చూస్తూ అన్నాడు- “సెల్ ఇవ్వు. నా నంబరు ఇస్తాను. రామేశ్వరం నుంచి నాకు ఫోన్ చెయ్యి.”

సెల్ తిరిగి తీసుకుంటూ అడిగిందామె. “ఎప్పుడు చెయ్యమంటారు సార్?”

అతను మాట్లాడకుండా ఆమె కళ్లలోకి చూసాడు. క్షణం ఆగి తల ఊపి ఆమె వెళ్లిపోయింది. నీలంగా ఆమె వరండాలోంచి బయటకు వెళ్లిపోయింది. మళ్లీ కాళ్లు రెండూ ఎదుట కుర్చీలో పెట్టుకుని రెడ్డి కళ్లు మూసుకున్నాడు. ఈసారి వేపగాలి, సముద్రపు గాలి అతన్ని నిద్రపుచ్చేయి. తరువాత నాలుగైదు రోజులు అతను సెల్ ఫోన్లో జీవించాడు. ఆరో దినం సాయంకాలం ఆరుగంటలకి సెల్ మోగింది. నంబరు చూడగానే చల్లటి సముద్రపు గాలి అతన్ని కమ్ముకుంది. కళ్లు మూసుకుని అన్నాడు.

“హలో.” 

“హలో సార్. నేను.” 

“అవును. చెప్పు. ఎక్కడున్నావు?”

“సముద్రంలో ఉన్నాను సార్. మోకాలు లోతుకొచ్చాను సార్. ముందుకు పోతున్నా సార్. సముద్రం చాలా బావుంది సార్. కొంచెం భయంగా హాయిగా ఉంది సార్.”

“భయం లేదు. వెళ్ళు”

 “సముద్రం నా మీదికే వస్తోంది సార్. పెద్ద అల వస్తోంది సార్….”

                   xxxxxxxxxxxx

రామేశ్వరం కాకులు – ప్రతిస్పందన:

ఎస్సై గా పని చేసే రెడ్డికి, ముందు రోజు  రాత్రి రైడ్ లో పట్టుబడిన పాతికేళ్ళ  పద్మావతికి మధ్యలో జరిగిన కథ ‘రామేశ్వరం కాకులు’  

వేపచెట్టుకింద  రిలాక్స్ అవుదామని కూర్చున్న రెడ్డిని కలిసి “నన్ను కోర్టుకి తీసుకెళ్ళొద్దు, నన్నొదిలేస్తే రామేశ్వరానికి వెళ్ళిపోతాను” అంటుంది పద్మావతి. ఆమె అక్కడికి ఎందుకు వెళ్లాలనుకుంటోందో తెల్సుకుని , ఎలా వెళ్ళాలో వివరం తెలీకపోతే చెప్పి, చేతిలో కొంత డబ్బులు పెట్టి,  ఆమె అసాధారణమైన కోరిక తీరేటట్టుగా చూస్తాడు ఎస్సై రెడ్డి. కథ మొదట్లో వేపచెట్టు చల్లటి నీడలో నిద్ర పట్టని రెడ్డి, ఆమెకు సహాయం చేసి అదే వేపచెట్టుకింద హాయిగా పడుకుని నిద్రపోతాడు. కథలో ఇంకో ముఖ్య పాత్రధారి, ఒంటరిగా పడవేసుకుని గోదావరి దాటి  సముద్రంలోకి వెళ్లిపోవాలనుకున్న  వరహాలు. ఎక్కడో పక్క రాష్ట్రంలో  చిన్న బట్టలకొట్టు నడిపి, దేశ దిమ్మరిలా తిరుగుతూ గోదారి పక్కనున్న రాజమండ్రికొస్తాడు.  ఒక రాత్రి ఉబుసుపోక , కాకతాళీయంగా పద్మ దగ్గరికి వచ్చి,  కొన్ని గంటలు గడుపుతాడు. తానున్న చట్రంలోనించి బయటపడడానికి  రామేశ్వరపు  సముద్రానికి  వెళ్లిపోవాలనే తీవ్రమైన కోరిక, ఆమెలో కలిగిస్తాడు. 

రెడ్డి గురించి చెప్తూ – “తన జీవితంలో ఎంతో...

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations