Episode 299

ఖదీర్ బాబు గారి ‘గేట్’!

‘గేట్’ ఖదీర్ బాబు గారి రచన. ‘ గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయితగా మనల్ని అలరిస్తున్న శ్రీ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా కావలి లో జన్మించారు. బి.ఎస్. సీ కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రులు. పత్రికా రంగంలో, సినీ రంగంలో తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. . వారు రాసిన పుస్తకాలలో కొన్ని ‘ దర్గామిట్ట కథలు ‘ , ‘ న్యూ బాంబే టైలర్స్ ‘ , ‘ పోలేరమ్మ బండ కథలు’ , ‘ కథలు ఇలా కూడా రాస్తారు’.

వీరు రాసిన ‘ న్యూ బాంబే టైలర్స్’ ప్రతిష్టాత్మకమైన ‘కథ’ అవార్డు ను గెలుచుకోవడమే కాక, నాటకంగా రూపాంతరం చెంది అనేక ప్రశంసలందుకుంది.కృతజ్ఞతలు ఖదీర్ గారూ హర్షణీయం ద్వారా ఈ కథను పరిచయం చెయ్యడానికి అనుమతినిచ్చినందుకు.

గేట్ :

గొణుక్కుంటున్నారు ఇద్దరూ.‘లాగండి’ అంటోంది.లాగితే రావడం లేదు. మూడు మెట్లు ఎక్కితే ఉంది గేటు. పైన చిలుకు తీసి ముందుకు లాగుతుంటే కదలడం లేదు. ఇద్దరు పిల్లలూ ఊరికే చూస్తున్నారు. టక్‌ చేసి ఉన్న అతడు బెల్ట్‌ సర్దుకుంటూ మళ్లీ లాగాడు

.‘రావడం లేదు’ అన్నాడు.

అలికిడి లోపలి వరకూ వినిపించినట్టుంది…

‘ఎవరూ’ అంటూ వచ్చి అవతలి నుంచే మునిగాళ్ళు ఎత్తి గేటు బయటకు చూస్తూ ‘ఏంటి.. ఏంటి… నిజమే.. సుదా.. నువ్వేనా’ అందామె అతణ్ణి చూస్తూ.

‘గేటు ఇంటి వైపుకు నెట్టాలి. వీధి వైపుకు కాదు. ఏం మారలేదు నువ్వు’ అంటూ ఇంటి వైపుకు లాగింది.

గేటు తెరుచుకుంది. కిరకిరమని కఠినమైన శబ్దం చేసింది.

‘గ్రీజు పూయాలి దీనికి. ఎప్పట్నించో. అలాగే పోతా ఉంది. ఓహో… అమ్మాయి వచ్చిందా… అరెరె… ఈ చిన్న మినిస్టర్లు ఎవరమ్మా’ అంటూ పిల్లల్ని జవురుకుంది. మొదటిసారి చూస్తున్న పిల్లలు. బెదరలేదు. అలాగని సంబర పడలేదు. కొత్త చేసి చూస్తున్నారు.‘ఇదిగో.. ఎవరొచ్చారో చూశారా’ పెద్దగానే అరిచింది.

‘అచ్చు సినిమాల్లోలాగే చేస్తున్నావు అమ్మీ’ అన్నాడు నవ్వుతూ.

‘ఓహో.. అమ్మీ అనే అన్నావు. టీచార్‌ అంటావేమో అనుకున్నా చాకు దీర్ఘం పెట్టి’ అని పిల్లల వీపు మీద ఇంకా గట్టిగా చేతులు అదిమింది.

గేటు నుంచి ఇంటి వరకూ నాప పలకలు పరిచి ఉన్నాయి. ఎండ వాటి మీద పడి మెరుస్తూ ఉంది. నీడల్ని బట్టి పన్నెండు లోపే అయి ఉండవచ్చు టైము. పదిహేను ఇరవై నాప పలకలు పరిచేంత ముంగిలి ఉంది. తర్వాత గడప.

హాలులోనే ఉన్నాడు సారు. వైరు మంచం మీద కూచుని. ఒక కాలు కిందకు జార్చి. ఒడి మొత్తం కప్పేలా టర్కీ టవల్‌ పరుచుకుని. ‘ఏమిటీ పిడుగు… సుదా’ అన్నాడు. తెల్లటి గడ్డంలోని లేత బూడిదరంగు పెదాలు విడివడి ఎప్పటిలాగే తెల్లటి పలువరుస మెరిసింది. చుబుకం నుంచి కంఠానికి రెండు తాళ్లు కట్టినట్టు ఉంటుంది చర్మం. ఆ తాళ్లు ఊగాయి నవ్వుకు.

అతడు వొంగి ఆయన కాలుకు నమస్కారం పెట్టాడు. కళ్లు ఉబికాయి. ఆమె కూడా ఒంగి నమస్కారం పెట్టింది.

‘ఏమిట్రా సుదా.. ఊ’ అన్నాడు సారు.‘పిల్లలు… మినీ.. బూ… ఇట్రండి. తాతకు నమస్కారం పెట్టండి’పెద్దది– తొమ్మిదేళ్లు ఉంటాయి… దళసరి కళ్లద్దాలు… రెండు చేతులు జోడించి పెట్టింది. చిన్నాడు– ఆరుంటాయి– వంకర్లు తిరిగాడు. సారు టవల్‌ అంచు తీసుకుని కళ్లు వొత్తుకుని, ఏమి ఇద్దునా అని చొక్కా జేబు తడుముకున్నాడు. ఇంకు పెన్ను ఉంది. దానిని తీసి, ఆగి, భార్య వైపు చూస్తూ ‘ఇంకో పెన్ను ఏదైనా ఉంటే చూడు. చెరొకటి ఇవ్వకపోతే అదొక గలభా’ అన్నాడు.

‘ఇప్పుడు మీ పాతకాలపు పెన్నులే వీళ్లక్కావాల్సింది. రూములో టీవీ ముందు కూచోబెట్టి బూస్టేదైనా ఇస్తాగాని… మీరు మాట్లాడుకోండి’ అందామె నవ్వుతూ.

‘అహ్మద్‌కు ఫోన్‌ చేసి నాటు తెమ్మను. ఫారమ్‌ తెస్తే పడతాయ్‌ అని చెప్పు. కుర్మా చేసి వేపుడు కూడా చెయ్‌. గుడ్లు ఉడకెయ్‌’… పిల్లల్ని వెంటబెట్టుకు వెళుతుంటే గట్టిగా చెప్పాడు.

‘ఇప్పుడవన్నీ ఎందుకు మావయ్యా’ అందామె.

‘నువ్వూర్కోమ్మా. ఇప్పటికి తీరి వచ్చారు. ఏరా… తినే దాకా ఉండవా? పరిగెత్తి పోతావా? ఇన్నాళ్లూ పరిగెత్తి పోయావుగా’ అన్నాడు సారు.అతడు మాట్లాడలేదు. గతంలో మల్లే స్టూడెంట్‌ మొహం పెట్టాడు.

‘కూచో’ అన్నాడు సారు. ఆమె కూడా ప్లాస్టిక్‌ కుర్చీలో కూచుని హ్యాండ్‌ బ్యాగ్‌లో నుంచి మడిచి ఉన్న పాలిథిన్‌ కవర్‌ తీసింది. అందులో సాధారణంగా అమెరికా నుంచి వచ్చేవాళ్లు తెచ్చే చాక్లెట్లు, ఏవో చిన్న చిన్న కానుకలు ఉన్నట్టున్నాయి. ఇద్దునా అన్నట్టు భర్త వైపు చూసింది. ఇప్పుడు కాదు అన్నట్టు వారించాడు.

సారు అదంతా పట్టక శిష్యుణ్ణే చూస్తున్నాడు.‘ఏమ్మా… వీడు బాగానే ఉంటున్నాడా నీతో. చెప్పు. గల్తీ గిల్తీ ఉంటే బయట ఎండలో రెండు రౌండ్లు ఫ్రంట్‌ రోల్‌ చేయిస్తా’ అన్నాడు.

భర్త వైపు చూసి సారు వైపు చూస్తూ ‘మీ స్టూడెంట్‌ కదా మావయ్య’ అంది.

‘ఏరా… డేగిశా సుమారుగా పెంచావు. అమ్మాయి చేత రోజూ రెండేసి ప్లేట్ల టిఫిన్‌ పెట్టించుకుని తింటున్నావా’… నవ్వాడు.ఆ మాటకు అతడు నవ్వాడు. దాని అర్థం ఆమెకు తెలుసులా ఉంది… ఆమె కూడా నవ్వింది.

హైస్కూల్లో చేరినప్పుడు తల్లి సద్దన్నం కట్టి, ఎరగడ్డను ఒలవడానికి కూడా టైము లేక సంచిలో పడేసేది. రెండు మైళ్లు నడుచుకుంటూ వచ్చి పొద్దునంతా పాఠాలు వింటే మధ్యాహ్నానికి అదే. మూడు ముద్దల్లో అంత సద్దెన్నమూ మింగేసి తింటున్న మిగతా పిల్లలవైపు కళ్లు పెట్టుకుని చూసేవాడు. సాయంత్రం ఇంటికెళితే పరమాణ్ణం ఉంటుందనా. కలో గంజో. ఉన్న బరెగొడ్డు మీద కూతుర్నీ కొడుకునూ సాకాలి తల్లి. తండ్రి ఏనాడో పొలంలోనే పాము కరిచి పోయాడు. ఎదిగే వయసు. ఎప్పుడూ ఏదో ఒకటి బుక్కమనే ఆకలి. ఒరే అర కడుపోడా… పోయి అమీర్‌ అలీ సార్‌ని కలువు… ఎన్‌.సి.సిలో చేర్చుకుంటాడు… తినొచ్చు అని సలహా ఇచ్చారెవరో. ఏం తినొచ్చు అనడిగాడు. వారంలో రెండుమాట్లు డ్రిల్లుంటుంది… అయ్యాక చెంగయ్య హోటలు ఇడ్లీ, వడ ఇస్తారు అని చెప్పారు. యూనిఫామ్‌ ఇస్తారని కూడా చెప్పారు.

అప్పుడు కలిశాడు అమీర్‌ అలీ సార్‌ను. పూర్తిగా ట్రిమ్‌ చేసిన నల్లగడ్డం. లేత బూడిద రంగు పెదాలు. తెల్లని పలువరుస. పెద్ద కాలరు… బ్రౌన్‌ కలర్‌ ఉంగటం చెప్పులు… ఆరు, ఏడు తరగతులకు ఇంగ్లిష్‌ చెప్పేవాడు. కాని ఎన్‌.సి.సి వరకు ఆయనది భుజాన రెండు స్టార్లు పెట్టుకునే ట్రూప్‌ కమాండర్‌ హోదా.‘ఎందుకు చేరతానంటున్నావ్‌ ఎన్‌.సి.సిలో’ అన్నాడు సారు.‘క్రమశిక్షణ కొరకు’ బట్టీ వేసింది చెప్పాడు.

‘అంటే?’‘యూనిఫారమ్‌ కొరకు’

‘సరిగా చెప్పు’

‘చెంగయ్య హోటలు టిపిను కొరకు సార్‌’పై నుంచి కింద దాకా చూశాడు.

‘తెల్లారే టైములో ఉంటుంది పరేడ్‌. మీ ఊర్నుంచి నువు రాలేవు’

‘ముందు రోజు రాత్రే ఇంట్లో అన్నం తినేసి స్కూల్‌కొచ్చి పడుకుంటా సార్‌’

‘దెయ్యాలుంటాయ్‌రా’

‘ఆకలి మీదుంటే నా అంత అలివి మాలిన దెయ్యం లేదు సార్‌’పరికించి చూశాడు.‘ఏం పేరు నీది?‘సుధాకర్‌. ఎయిత్‌ సి.

’అమీర్‌ అలీ సార్‌ ఒక పెంకుటింట్లో అద్దెకుండేవాడు. దాని వరండాలో ఎప్పుడూ ఇంటి ఓనరు రెడ్డాయన వడ్ల బస్తాలు పెట్టుండేవాడు. వాటి పక్క స్థలం అతనికి ఇవ్వబడింది. వారంలో రెండు రోజులు రాత్రి బస సారు ఇంట్లోనే. తెల్లారి లేచి సార్‌తో కలిసి యూనిఫామ్‌ వేసుకుని పరేడ్‌.

మొదటి రోజు పరేడ్‌కు తీసుకెళుతూ ‘సుదా… చూడాలిరా నీ అదృష్టం’ అన్నాడు సారు.‘ఏం సార్‌’ అన్నాడు అతడు.‘చెప్తా’ అన్నాడు సారు.పరేడ్‌ ముగిసింది. నలబై మంది స్క్వాడ్‌కి ఒక్కొక్కటి లెక్కన, అమీర్‌ అలీ సార్‌కి రెండు, హెడ్మాస్టర్‌ ఇంట్లో ఇచ్చేందుకు నాలుగు మొత్తం నలబై ఆరు ప్లేట్ల టిఫిను విస్తరాకు, పైన న్యూస్‌పేపరేసి కట్టి ఒక వెదురుబుట్టలో తెచ్చి పెట్టి వెళ్లడం చెంగయ్య పని. చేరేదే ఆ టిఫిను కొరకైనప్పుడు ఆబ్సెంట్‌ అయ్యే కేడెట్‌లు ఎవరుంటారు? సారు అదృష్టం అనింది అందుకే. ఆ రోజు ఒకడు డుమ్మా కొట్టాడు. ‘బోణి… రెండు ప్యాకెట్లురా’ అని ఆ డుమ్మావాడిది అతడికి ఇచ్చాడు సారు. ఆ ముహూర్తం బలమైనది. అతడు ఎన్‌.సి.సిలో ఉన్నన్నాళ్లు, పరేడ్‌కు హాజరైనన్నాళ్లు ఏ రోజూ రెండు ప్యాకెట్లు నాగా కాలేదు.

పేరు కూడా ‘రెండు ప్లేట్ల సుదా’ అయ్యింది సారు పుణ్యాన. ఆదివారం ఊళ్లో వేటను కోసి పోగులేసి అమ్మితే సారు భార్య కూర తెప్పించి టమేటాలు ఎక్కువేసి పలావు వండేది. అతడికి ముందు రోజు రాత్రి నుంచే ఆహ్వానం ఉండేది. స్కూల్‌ అవుతూనే సారు పిలిచి ‘రాత్రి ఇంటికొచ్చి పడుకోరా. రేపు పలావు. డేగిశా పగిలిపోవాలి’ అనేవాడు. అదృష్టం ఉంటే అన్నీ కలిసొస్తాయి. సారు కూతురు షమీమ్‌ గర్ల్స్‌ హైస్కూలులో ఆరు చదివేది. ‘సుదా భయ్యా’ అని అతణ్ణి అతుక్కుపోయేది. ఒక్కగానొక్క కూతురనీ సారు ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములుంటే ఈయనకు మాత్రమే ఆడపిల్ల పుట్టిందని అందరూ తెగ ముద్దు చేసి చిల్లరిచ్చి పోతుండేవాళ్లు. జామెట్రీ బాక్సులోని ఆ చిల్లరకు సుదా భయ్యాను కూడా హక్కుదారును చేసింది. జామకాయలు ఆధా ఆధా. రేగుపళ్లు ఆధా ఆధా. లెక్కలు బాగా వచ్చినందుకు ఆ పిల్లకు వాటిని నేర్పించి ఆ రుణం తీర్చుకున్నానని అనుకునేవాడు అతడు. ఏకు సుదా మేకు సుదా అయ్యి సారు భార్యను ‘టీచార్‌ ఉప్మా చేసి పెట్టు’ అనే దాకా వెళ్లాడు.

‘ఒరే నువ్వు దీర్ఘం తీసి నన్ను చారు పెట్టకు. అమ్మీ అని పిలు’ అంది ఆ మహాతల్లి.ఆమె ఆ మాట అన్నాక సారు ఇల్లే అతడి ఇల్లు అయ్యింది. ఎండలొస్తే ఆరుబయట పడుకునేందుకు నులక మంచం వచ్చింది. చలికాలం కోసం ఒక దుప్పటి వచ్చింది. ఎప్పుడు అడుగుతాడోనని సారు భార్య ఒక గుప్పెడు బియ్యం ప్రతిపూటా ఎక్కువేసి వండటం అలవాటు చేసుకుంది. కొడుకు దొరికాడు అని సారు, సారు భార్య అనుకున్నారో ఏమో. కొడుకును దొరికినట్టే అని అతడు అనిపించేలా చేశాడో ఏమో. ఎంతలా అనిపించకపోతే ఏనాడూ సినిమాలు చూడని సారు అతడు అడిగాడని తుపానప్పుడు రిలీజైన చిరంజీవి, శ్రీదేవి సినిమాకు గొడుగు పట్టుకుని సెకండ్‌ షో వెళ్లి అతణ్ణి సినిమాకు వదిలి ఆయన మాత్రం హాయిగా పక్కసీట్లో నిద్ర పోతాడు? ఇవన్నీ అప్పుడప్పుడు ఆమె అడిగితే అతడు చెప్పేవాడు. ఎప్పుడైనా అడక్కపోయినా.

‘షమీమ్‌ ఎలా ఉంది సార్‌’ భార్య చివుక్కున చూసి ‘చూడండి మావయ్యా ఎలా అడుగుతున్నాడో. షమీమ్‌ ఎలా ఉందో ఈయన కదా మీకు చెప్పాలి. ఈయన కదా తెలుసుకుని ఉండాలి’ అంది.

‘పోనీలేమ్మా. వాడి గోలలో వాడు పడ్డాడు’ అన్నాడు సారు.సారు భార్య టీ తీసుకు వచ్చి చక్కర లేని కప్పు మొదట సార్‌కి ఇచ్చి తక్కినవి వాళ్లిద్దరికీ ఇచ్చింది.‘సుదాది ఏముంది తప్పు. బి.టెక్‌ అయ్యేదాకా వచ్చి పోతానే ఉండేవాడు. ఉద్యోగం రావడంతోటే కంపెనీ చెన్నై పిలిచింది. ఆ తర్వాత జపాన్‌ పంపింది. అట్నించటే అమెరికా పంపింది. సెలవు నాలుగురోజులు కూడా లేదని విమానం సీట్లో కూచున్నట్టుగా పెళ్లి చేసుకున్నాడు. ఆ పూటే కదా మేం మిమ్మల్ని ఆకరుసారి చూసింది. ఏమున్నావులే నువ్వు పెళ్లికూతురిగా. వీడే… బోజనాలెప్పుడు పెడతారా అన్నట్టు కూచోనున్నాడు పక్కన లడ్డుముక్కలాంటి నిన్ను పెట్టుకుని’… తల మీద మొడుతున్నట్టుగా అభినయించింది.‘బిటెక్‌ చదివేప్పుడే అనేవాడులే అమెరికా వెళతానని’ అన్నాడు సారు.‘వెళ్తే ఫస్టు ట్రిప్పులో మమ్మల్నే తీసుకెళతానని ఒట్లు’ సారు భార్య నవ్వుతూ. తాగేసి కప్పులిస్తే వెళతాను అన్నట్టుగా నిలబడి ఉందామె.

‘మీ చెల్లెలు ఎలా ఉంది సుదా’

‘పెళ్లి చేశాను సార్‌. నేను అమెరికాలో ఉంటే ఆమె ఇక్కడెందుకని అమెరికా సంబంధమే చూసి చేశాను. కాకపోతే వాళ్లో మూలా నేనో మూలా ఉంటున్నాం. అమ్మను చెల్లెలి దగ్గరే పెట్టాను’

‘షమీమ్‌ను బుచ్చిరెడ్డిపాలెంలో ఇచ్చాంలే. అతనూ టీచరే. ఇద్దరు పిల్లలు. బాగనే ఉందిలే’ అందుకున్నట్టుగా అంది సారు భార్య. కప్పులు తీసుకున్నా కదలకుండా ‘నిన్ను గుర్తు చేసుకోవడం మాత్రం మానలేదు’ అంది.సారు ఒడి మీదున్న టవల్‌ను అవసరం లేకపోయినా సర్దుకున్నాడు.

‘సొంత ఇల్లు కొనుక్కున్నాం మావయ్యా అక్కడ. అప్పుడు ఫోన్‌ చేసి చెప్పమన్నాను మీకు’ అంది అతడి భార్య ఏదో ప్రయత్నంగా.

‘ఏమ్మా.. అమెరికాలో పది పన్నెండేళ్లు ఉన్నాక ఆస్తులు పాస్తులు కార్లు విశేషమా. ఏరా.. ఇది కాదు… అక్కడ నలుగురు మనుషుల్ని కూడేసుకున్నావా లేదా అది చెప్పు’గేటు కిరకిరమని తెరుచుకుంది.

‘అదిగో.. అహ్మద్‌ వచ్చినట్టున్నాడు చూడు’ అన్నాడు సారు.క్రీమ్‌ కలర్‌ ప్యాంట్, మోచేతుల వరకూ మడిచిన పూల చొక్కా, తలకు టోపీ పెట్టుకున్న కుర్రాడు రెండు మూడు పాలిథిన్‌ కవర్లతో వచ్చాడు. చొరవగా వంటగదిలోకి వెళ్లి వాటిని ఉంచి హాల్లోకి వచ్చాడు. ‘చెప్పినవన్నీ తెచ్చా’ అన్నాడు సారు భార్యతో.

‘వీడే అహ్మద్‌. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌. స్కూల్లో నా రిటైర్మెంట్‌ బ్యాచ్‌ స్టూడెంట్‌. నీలాగే ఇప్పుడు’ అన్నాడు సారు.‘సరే. మనుషులొచ్చారు. మళ్లి రాపో’ అన్నాడు అహ్మద్‌తో.

‘డ్రస్సింగ్‌ ఉందిగా. చేసి పోతా’ అన్నాడు వాడు.

‘వద్దులే. సాయంత్రం చేద్దువు. రెండు సిగరెట్లు తెచ్చిచ్చిపో’

‘మేం తెచ్చాం మావయ్యా’ అంది అతడి భార్య టక్కున పాలిథిన్‌ కవర్‌ మీద చేయి వేస్తూ.‘ఉంచమ్మా. అవి పనికొస్తాయా నాకూ? నోటికే తప్ప గుండెకు చాలవు అవి. నువ్వు తేపోరా’ అన్నాడు.

అహ్మద్‌ పోబోతుంటే అతడు లేచాడు.‘నేను తెస్తాను సార్‌. స్కూల్లో ఉన్నప్పుడు నాకే కదా చెప్పేవారు. నన్ను తేనీయండి’ గుంజాటనగా నిలబడ్డాడు.

‘వద్దు కూచో. నువ్వు పోరా’ అన్నాడు అహ్మద్‌తో. అహ్మద్‌ కదిలాడు. సారు తన ఒడి మీదున్న టర్కీ టవల్‌ను ఇరు చేతుల మునివేళ్లతో పట్టుకుని సర్దుకున్నాడు.

సారు భార్య వంట చేయడానికి వెళ్లింది. అతడు, ఆమె అలాగే కూచుని ఉన్నారు. ఆమె సారు వైపు కంటే భర్త వైపే ఎక్కువగా చూస్తూ ఉంది ఎందుకో.

సారు చేతులు రుద్దుకుంటూ శిష్యుడితో మాటవరసకన్నట్టు చెప్పుకున్నాడు–‘రిటైర్‌ అయ్యాక ఇదిగో ఈ ఇల్లు కట్టుకున్నాం. దీనికి కూడా బయట ప్లాస్టరింగు ఈ మధ్యే చేయించాను. అమ్మాయి పెళ్లికి, ఇంటికి ఉన్నది మొత్తం అయ్యాక పెన్షన్‌తో బాగానే ఉండేదిలే. కాని షుగర్‌ దెబ్బ కొట్టింది. షుగర్‌ వచ్చినట్టే నాకు తెలియలేదు. తెలిశాక నేరుగా ఇన్సులిన్‌కే వెళ్లాల్సి వచ్చింది. డ్రిల్లు చేసిన శరీరం కదా ఏం కాదనుకున్నాను. ఇదిగో… ఈ కాలు బొటనవేలికి గాంగ్రెయిన్‌ మొదలయ్యింది. ఖర్చు. భయం. హైదరాబాద్‌లో మావాళ్ల చారిటీ హాస్పిటల్‌ ఉంది… చీప్‌ అనుకుని వెళ్లాను. మెడికల్‌ కాలేజీకి అటాచ్డ్‌ ఆస్పత్రి అది. జూనియర్‌ డాక్టర్లు పని గట్టుకుని అక్కడ ఉద్యోగాల్లో చేరతారు. ఎందుకంటే బీదా బిక్కి నాబోటి మిడిల్‌క్లాస్‌ వాళ్లు గుంపులు గుంపులు వైద్యానికి వస్తారు. వాళ్ల మీద చేయి సాపు అవుతుందట. తర్వాత తెలిసింది. ఇక్కడ పని చేసిన జూనియర్‌ డాక్టర్లని పెద్ద ఆస్పత్రులు అందుకే టక్కున తీసుకుంటాయి. వాళ్లు మొదట బొటనేలు తీసేస్తే ఇన్ఫెక్షన్‌ పాదానికి వచ్చింది. పాదం తీసేస్తే మోకాలి దాకా వచ్చింది. ప్రస్తుతం మోకాలు కిందకు తీసేశారు. ఇన్ఫెక్షన్‌ ఆగిపోయి ఉంటుందని ఆశ’… అన్నాడు.

మంచానికి రెండు చేతులూ బలంగా ఆన్చి నేలకు తాకించి ఉన్న కాలును ముందుకూ వెనక్కూ ఊపాడు.‘ఈ కాలు బలం పోలేదులే. కర్ర మీద నా పనులు నేను చేసుకుంటున్నా. కాకపోతే… ఇన్ని వందల మంది కేడెట్‌లకు సావధాన్‌ చెప్పి సరిగా నిలబడేట్టు చేశాను కదా నేను నిలబడలేనే అని ఇది. ఎవరైనా ఒక కొడుకు మాదిరి ఉంటే ఆ తీరు వేరు. ఈ అహ్మద్‌ రేపు వెళ్లిపోతే నాకు కొత్తగా శిష్యులు కూడా రారు’…ఆమె వైపు చూసి ‘అరెరె… ఎందుకు ఏడుస్తున్నావు తల్లి’ అన్నాడు.

ఆమె ఏం లేదు అన్నట్టుగా తల ఊపుతూ ‘వినే వచ్చాం మావయ్యా’ అంది.అతడు తల దించుకున్నవాడు ఎత్తి, భంగ పడుతున్నట్టుగా ‘పాస్‌పోర్టులు, వీసాలు చేయిస్తాను సార్‌’ అన్నాడు.

‘పాస్‌పోర్ట్‌లు, వీసాలు చేయిస్తావా?’ అన్నాడు సారు శిష్యుణ్ణే చూస్తూ.

ఆ చూపుకు అర్థమేమిటో వాళ్లు తెలుసుకునేలోపు సారు భార్య వచ్చింది.‘ఏమిటి.. నా కొడుకును అలా చూస్తున్నారు. సుదా… నువు రా… మసాలా లెక్క నీకు తెలుసు కదా’ అని వంట గదిలోకి పిలుచుకుని వెళ్లింది.

ఆ తర్వాత మాటలన్నీ అతని ఇద్దరు పిల్లల గురించే నడిచాయి. పెద్దది ఫోన్‌ తీసి అమెరికాలో తన హార్స్‌ రైడింగ్‌ వీడియోలు సారుకు చూపించింది. తాము పెంచుతున్న రిట్రీవర్‌ను చూపించింది. సారు భార్య ఆ పిల్లల కోసమని ఉప్పు కారం లేని పప్పు విడిగా చేసి చిన్నాణ్ణి చంకనేసుకొని దొడ్లో తిప్పుతూ, మధ్య మధ్య కుళాయి నీళ్లలో కడిగి కూర ముక్కలు తినిపించింది. గురుశిష్యులు ఎన్‌.సి.సిలో సాగిన పనిష్మెంట్లేవో గుర్తు చేసుకుని నవ్వుకున్నారు.

భోజనం అయ్యాక అహ్మద్‌ తెచ్చి పెట్టి వెళ్లిన సిగరెట్లలో ఒకటి తృప్తిగా కాల్చాడు సారు.ఎండ వాలుతోంది.‘గూడూరంటే రెండు గంటలన్నా పడుతుంది. చీకటి పడ్డాక ఎందుకు. పిల్లలున్నారు. బయలుదేరండి. సుదా… మీ అత్తగార్ని మామగార్ని అడిగినట్టు చెప్పు. అమ్మాయ్‌… అంతా సడన్‌ సడన్‌గా ఉంది మీరు రావడం. నీకు ఏమీ పెట్టలేకపోతున్నా’ అంది సారు భార్య.

అతడు, ఆమె ఒకరినొకరు చూసుకున్నారు. పాలిథిన్‌ కవర్‌ అలాగే ఉంది. ఇవ్వు అన్నట్టు చూశాడు. ఆమె తటపటాయిస్తోంది.

సారు భార్య గమనించింది.‘ఈ చాక్లెట్ల వయసు కాదు మాది. ఈయనకు అవి విషం. మీరు తెచ్చినవి మాకేం ఉపయోగపడవు. ఇంకా బంధువులను కలుస్తారుగా వాళ్లకు ఇవ్వండి. చిన్న మినిస్టర్లూ… ఈ నానమ్మను గుర్తు పెట్టుకోండ్రోయ్‌’ అందామె.

బయలుదేరడమే మంచిదన్నట్టు చూస్తున్నాడు సారు.అతడు, ఆమె సారుకు మరోసారి మొక్కారు. సారు తన చేతిని అతడి తలకు తాకించాడు. సారు భార్య పిల్లల్ని చెరో చేత్తో పట్టుకొని నాప పలకల ముంగిలిలోకి వచ్చింది.

అతడు భార్యవైపే చూస్తున్నాడు.‘ఏంటి?’ అంది భార్య.‘ఏమైనా రహాస్యం చెబుతాడేమో వెళ్లు’ అంది సారు భార్య నవ్వుతూ.ఇద్దరూ ముంగిలిలోనే ఒక మూలకు వెళ్లారు.‘

ఏం చేయమంటావు?’ అన్నాడు పెదవులను అదిమి పెడుతూ.

‘మీకు దండం పెడతాను. గమ్మున రండి. చెక్‌ బయటకు తీయొద్దు. వాళ్ళు తీసుకోరు.

’‘ఎలా వదిలేస్తాను చెప్పు’‘ఇన్నాళ్లు వదిలేసినట్టుగానే. మనం ఎంత పెద్ద సాయం చేయాలన్నా అంత కంటే పెద్దగా బంధం ఉండాలండీ. గొలుసు తెగకుండా కాపాడుకోవాలి. హైరానా పడి వెంట్రుకను కూడా తాడుగా పేనుకోవాలి. ఐదేళ్లకో పదేళ్లకో మొక్కు తీర్చుకోవడానికి వచ్చినట్టుగా వస్తే దేవుళ్లు ఊరుకుంటారేమో మనుషులు ఊరుకోరండి. అనుభవించండి’ అంది

.‘అయ్యాయా.. రహస్యాలు’ సారు భార్య పెద్ద గొంతుతో అడిగింది.‘ఏం లేదులే అత్తయ్యా. ఈయనదేదో చాదస్తం’ అందామె.

‘నాకు తెలియదా’ అంది సారు భార్య.

‘కారు ఎక్కడ పెట్టారు’ అడిగింది.

‘ఈ సందులో పట్టదని రోడ్డు మీద పెట్టాం’ అతడి భార్య అంది.

అతడు ఇద్దరు పిల్లల్ని చేత బట్టుకుని, భార్యను పక్కన జేసుకొని మూడు మెట్లు దిగి ‘వెళ్లొస్తానన్నట్టు’ సారు భార్య వైపు చూశాడు

. ఆమె గేటు దాటి బయటికొచ్చి రోడ్డు వరకూ వస్తుందేమోనని ఒక్క క్షణం ఆగాడు.

ఆమె చేయి ఊపి గేటును వీధి వైపు నెట్టింది.

కిరకిరమని కఠోరమైన చప్పుడు చేస్తూ గేటు మూసుకుంది.

నవంబర్‌ 5, 2021

కథను –

‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

(Harshaneeyam on Gaana app)

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam

(Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5

(Harshaneeyam on Apple. Podcast)



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations