Episode 301
అనుకొన్నాదొకటీ - హర్ష
“అరే అబయా హర్షయ్య నువ్వెక్కడుండావో అని ఎతకతానే వుండా పొద్దుకాడినుండి, ఇక్కడుండావా” అంటూ వచ్చాడు నాకు చిన్నాయన వరుస అయిన శేఖరయ్య
“ఏంది చిన్నాయన మందల” అంటూ పలకరించా.
“నీ దశ తిరిగిందబ్బయ్యా! నీకు పిల్లనిచ్చిన మావ వుళ్లా! సుబ్బ మావ! ఆయనకి ఇరవై లక్షల ఆస్తి కలిసొచ్చిందంట. ఊరంతా ఒకటే ఆగమయిపోతావుంటే, ఆ ముక్క నీ చెవిన బడ్డదో లేదో అని నాకు విన్నకాడినుండి ఒకటే కడుపుబ్బరం గా వుండిందనుకో. ఆ సంగతేందో తేల్చుకోపో మీ అత్తగారింటి కెళ్ళి” అని చెప్పి సక్కా పోయాడు.
“వార్నీ మా మావ పాసుగాల! బీడీలకి, సిగరెట్లు తెచ్చిపెట్టడానికి నేను, ఆయన ఉద్యోగం చేసే రోజుల్లో ఏమేమి చేసాడో చెప్పే సోది కబుర్లు వినటానికి నేను, ఇటుమంటి సంగతులు పంచుకోడానికేమో మా షడ్డకుడా మా మావకి, ఇంతకీ మా ఇంటిదానికన్నా తెలుసా! లేదా!నాలుగు రోజుల నుండి అక్కడే పడి వుందిగా, చెప్పనే లేదు, లేక తెలిసి నేను చేయబోయే రచ్చకు భయపడి రహస్యం దాచేసిందా! డబ్బుల సంగతేందో ఈ రోజు తేల్చి పారెయ్యాలి” అని సక్కా మా అత్తారింటికి బయల్దేరా!
మా పెళ్లి అయ్యి నాలుగేళ్లు అయ్యింది. నాకేమో హైదరాబాద్ లో ఉద్యోగం. వారం రోజులయ్యింది సెలవుల మీద వూరుకొచ్చి.
నేను వెళ్లే సరికి, మా వాళ్ళ మావా, మా మావకి పిల్లనిచ్చిన ఆయన మావా, చాలా కుశాలగా కబుర్లు చెప్పుకుంటుండారు వరండాలో కూర్చొని. “ఇదేదో ఎనిమిదో వింతలాగా వుందే, ఎప్పుడూ పిల్లీ ఎలుకల్లాగా పోట్లాడుకునే మావా అల్లుళ్ళు ఇంత ఒద్దిగ్గా వుండటమేంది. అయితే మా శేఖర చిన్నాయన చెప్పింది నిజమేనేమో. అందుకే మా మావ మీద వాళ్ళ మావ కి ఇంత ప్రేమ కలిగింది” అనిపించింది నాకు.
మా మావ చాలా కళ మీద వుండాడు. “మే ఇందిరా! హర్షయ్యొచ్చాడు వచ్చాడు, రెండు టీ లు పట్టుకురా అని కేకేశాడు”. ఆ కేక లో నాకు అంతక మునుపు లేని ధీమా కనపడింది. అంతకు ముందు ఒక టీ కోసం పది సార్లు మా అత్తని బతిమాలుకొనే ఆయన, యీ సారి ఇలా కేకెయ్యటం తొమ్మిదో వింతే.
“రోజుకి వంద బీడీలు తాగటం, అస్తమానం టీ కావాలని మమ్మల్ని సంపక తినటం” అని విసుక్కునే మా అత్త, వెంటనే జీ హుజూర్ అన్నట్టు రెండు టీలు, ప్లేట్ నిండా బిస్కట్ లతో రావటం, అది చూసి నా తల తిరగటం వెంట వెంటనే జరిగిపోయాయి.
నాకై నేను యీ కొత్త ఆస్తి వచ్చి పడటం గురుంచి ఎవర్నీ అడగలేడు. అందుకే నా భార్య కోసం చూపుల్తోనే ఎతకటం మొదలు పెట్టా! అది గమనించి “అమ్మి, దొడ్లో పూలు కట్టుకుంటుంది పో” అని వాళ్ళ మావతో కబుర్లలో పడ్డాడు మా మావ, నా పేరు జెప్పి తెప్పించుకున్న టీ జుర్రుకుంటూ
“ఏందిమే, సంగతి, వూరు వూరంతా గుప్పు మంటూండాదే, మీ నాయనకేదో లిబ్బి దొరికిందని, నిజమేనా” అని అడిగా గుప్పెడు మల్లె పూలు దొరగ్గానే పండగ జేసుకొనే నా పెళ్ళాం దొడ్లో కనపడగానే
“అబ్బో! దిగబడింది, ఇందుకా! నేనింకా ఎదో నా మీద ప్రేమ కారిపోయోచ్చాడు అనుకున్నాలే” అని ఎత్తి ఒక్క పొడుపు పొడిచింది నా పెళ్ళాం.
అట్టా, యిట్టా చూసి, “వాటాలేమన్నా! తేల్చేరా, యింతకీ” అని మన్సులోది కక్కేశా ఆత్రం గా. “మనం దేన్నీ ఎక్కువ సేపు నాన్చము కదా” అని అనుకుంటూ.
“ఏందీ! వాటా కావాలా నీకు. పెళ్లప్పుడు డబ్బు అంతా వసూలు చేసుకొని, ఇచ్చిన పొలాలు అయినకాడికి అమ్ముకొని పోతిరి, మీ అబ్బా కొడుకులు. ఇప్పుడేమి వాటా కావాలి నీకు” అని దండయాత్ర చేసింది.
“ఏంది మే! నీకు ఇచ్చింది? రెండెకరాలు నీకు, మీ అక్కకి ఎనిమిది. కునిష్ఠ వని రెండుతో సరిపెట్టారు నీకు, నీకేమో ఏమీ పట్టదు, చేతిలో కుడుము పెట్టగానే పండగనుకుంటావు”
“సడే! మా అక్కోళ్ళ కి పొలాల విలువ తెలుసు కాబట్టి, డబ్బులు వద్దు అని పొలాలు తీసుకున్నారు. మీ నాయనా కొడుకులు డబ్బో డబ్బో అని, డబ్బులెక్కువ, పొలాలు తక్కువ తీసుకొని, ఇప్పుడీ ఏడుపులేడుస్తున్నారు, ఇక్కడెవరో మీకు అన్యాయం చేసినట్టు. ఇదిగో విను, మా వాళ్ళు పెళ్లప్పుడు పెట్టాల్సిన పెట్టు పోతలన్నీ పెట్టేసారు. ఇప్పుడు గాని వాటా గీటా అన్నావంటే మర్యాద దక్కదు, రేపే మన ప్రయాణం మనూరికి” అని డిసైడ్ చేసేసింది.
“ఇంత తెలివి లేని దాన్ని కట్టబెట్టావేందిరా దేవుడా” అనుకుంటూ స్నానానికి బయల్దేరా!
స్నానం చేసేటప్పుడంతా ఒకటే ఆలోచన, ఈ విషయం ఎలా కదపాలి, ఎవర్ని కదపాలి అని. ఉడుకుడుగ్గా నాలుగు చెంబులు పోసుకొనే సరికి మనస్సు, శరీరం కాస్త స్వాధీనం లోకి వచ్చాయి.
ఆపాటికే అందరు వరండాలోకి చేరారు. బహుశా, నా కెలా చెప్పాలో అని తర్జన భర్జన ముందే పడ్డట్టు వున్నారేమో, మా అత్తగారు, సూటిగా సుత్తి లేకుండా అసలు విషయం లోకి వచ్చేసారు.
“మీ మావకి ఇరవై లక్షలు వస్తాయి. మీ మావ గారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఆయన లోకంలో ఆయన బతుకుతూ, ఇంటిని గురించి పట్టించుకోకుండా, వుంటే, మా పెద్ద అల్లుడు అంటే మీ షడ్డకుడు ఒక బిడ్డలా, ఈ ఇంటిని ఆదుకున్నాడు. కాబట్టి మీ మావకొచ్చే ఆస్తిలో ఎక్కువ భాగం ఆయనకి చెందాలి. యీ విధం గా అయినా ఆయన అప్పు తీర్చినట్టు” అని.
నాకు తెలుసు, తాను ఆమె కంటి లో నలుసు అని. కానీ పెద్దల్లుడు ముందర తన విలువ యింత తక్కువ అని నా భార్య వైపు చూశా. వాళ్ళమ్మ చెప్పింది నూరు పాళ్ళు నిజం అనే తన్మయత్వం కనిపించింది తనలో
ఈ లోపల మా అత్త గారి నాయన మొదలుపెట్టాడు, “అబ్బ! సుబ్బయ్య, చాలా తెలివికల్లోడు. నాకు తెలుసు ఎప్పటికైనా, పైకొస్తాడు” అని. “ఈ మావ అల్లుళ్ళ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గు మనేది. కానీ ఈ ఆస్తి కలిసి వస్తుందని తెలిసినప్పటి నుండి ఆయనకీ అల్లుడు మరీ ముద్దు అయిపోయాడు. అరవై ఏళ్ల అల్లుడు ఇంకా పైకొస్తాడట, ఏమి మిగిలుందో రావడానికి” అని కసిగా అనుకున్నా!
ఇంకమావ ఏమంటాడో అని ఆయన వయిపు చూశా! ఆయన దొరక్క దొరక్క దొరికిన సెలబ్రిటీ స్టేటస్ ని ఇంకా ఆస్వాదిస్తున్నాడు. ఆస్వాదిస్తూనే ఉండిపోవాలనే కోరిక ఆయన మోహంలో చాలా బాగా కనపడుతుంది. పాపం ఆయన అప్పట్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ బెనారస్ యూనివర్సిటీ చదివాడు. మంచి కుటుంబంలో పుట్టాడు. మంచి ఉద్యోగం చేస్తూ, వాళ్ళ బాస్ తో పడక, ఆవేశంతో రాజీనామా లెటర్ మొహం మీద కొట్టి, గత ఇరవై ఏళ్ళు ఆ పని ఎందుకు చేసానా అని రిగ్రెట్ అవుతూ బతికేస్తున్నాడు.
ఇప్పుడాయన వంతు వచ్చింది. ఆయన వంతు వచ్చినప్పుడు, యూనివర్సిటీ లో నేర్చిన క్లాసికల్ ఇంగ్లీష్ బయటకి వస్తుంది. అవతలోడికి అర్థమవుంతుందా లేదా అని ఆయనకి పట్టదు. గొంతు సవరించుకొని, “సీ మై డియర్ మెంబెర్స్! ఐ హావ్ డన్ మై పీజీ ఇన్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్. ఐ వర్కడ్ అండర్ గ్రేట్ స్కాలర్స్. ఐ హావ్ బీన్ ఇన్ ది బెస్ట్ ప్లేసెస్. ఐ హావ్ డైన్డ్ ఇన్ ది బెస్ట్ రెస్టారెంట్స్. ఐ హావ్ మారీడ్ ది బెస్ట్ వుమన్ అండ్ హావ్ బెస్ట్ చిల్డ్రన్స్. ఐ సీమ్ టు హావ్ వరస్ట్ సన్-ఇన్-లా. మై ప్రాపర్టీస్ విల్ గో టు వన్ అమోంగ్స్ట్ యు హూ విల్ గివ్ మీ ది బెస్ట్ పాసిబుల్ కేర్. గెట్ మీ వన్ కోక్ ప్లీజ్” అని ఒక ఆర్డర్ పారేసి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
నాకు చాలా సమయం పట్టింది మావ ఏమి చెప్పాడో అర్థం చేసుకోవడానికి. ఆ రోజు నుండి మొదలయ్యాయి నా తిప్పలు, మా మావకి గాడిద చాకిరీ.
హైదరాబాద్ వచ్చేశాక, ఒక రోజు ఆఫీస్ కి వెళ్లే హడావుడిలో వుండగా మావ గారినుండి ఫోన్, “హైదరాబాద్ వస్తున్నా, సెకండ్ ఏ/సీ లో టికెట్ రిజర్వు చెయ్. పికప్ చేసుకో” అనే హుకుం. చచ్చామురా దేవుడా ఈయన ఎన్నిరోజులుంటాడో అనుకోని, “రిటర్న్ ఎప్పుడు చేయించమంటారు అదే అడిగితే, లెట్ మీ డిసైడ్ వెన్ ఐ అరైవ్” అని సమాధానం.
ఆయనహైదరాబాద్ వచ్చాక, నా పడక హాల్లో కి షిఫ్ట్, ఎందుకంటే మావ గారికి కొత్తగా హైదరాబాద్ లో ఏ/సీ లేనిదే నిద్ర పట్టని అలవాటు పట్టుకుంది. నేను ఎక్కడున్నా ఆయన ఫోన్ చేయగానే ఆయన కోరికలు తీర్చాలి. ఫోన్ లో సంభాషణ చాలా క్లుప్తంగా ఉంటుంది. “ఐ వుడ్ లైక్ టు హావ్ ఫిష్ ఇన్ ది డిన్నర్”, మళ్ళీ ఈ ఫిష్ కొర్రమీను అయ్యుండాలి. ప్రాన్ అయితే టైగర్ ప్రాన్.
ఇవి కాక మావగారి కోరికలు చాంతాడంత, తాజ్ బంజారాలో ఒక రాతిరి డైన్-ఇన్ చేయాలి, నెల్లూరు జై హింద్ నుండి గులాబీ జామూన్, మురళి కృష్ణ నుండి మలయ కాజా తెప్పించాలి ఎక్కడో మలక్ పేటలో ఎవడో రాజస్థానీ రోటీవాలా అట వాడు చేసే పుల్కాలు. ఊర్లో బీడీలు మాత్రమే తాగే మా మామ నా చేత నా ప్రాజెక్ట్ మేట్ అమెరికా నుండి వస్తుంటే తెప్పించుకున్న పనామా సిగార్ లు మాత్రమే కాలుస్తున్నాడు, అవి అయిపోతే నన్ను కాలుస్తున్నాడు. నేను ఇంకా కాలకుండా మిగిలి ఉంటే మామ్ అండ్ డాడ్ స్టోర్ నుండి లోకల్ మేడ్ స్ట్రా బెర్రీ ఫ్లేవర్ సిగార్లు కొనుక్కొచ్చి మావని తృప్తి పరుస్తున్నా.
మావ నెలకోసారి హైదరాబాద్ ప్రయాణం పెట్టుకోవడం, పైన కోరికలన్నీ ఒక సారి రివైజ్ చేసుకొని మార్పులు చేర్పులు ఎమన్నా ఉంటే చేసుకోవటం, వాటిల్ని తీర్చుకొని ఊరెళ్ళటం ఒక ఏడాది పాటు జరిగింది.
“ఎప్పుడు మావ నీ ఆస్తి వచ్చేది, అది నాకు ఇచ్చేది, నువ్వన్నట్టుగానే నేను నీకు బెస్ట్ కేర్ ఇస్తున్నాను కదా” అని ఎన్నో మార్లు మొరపెట్టుకుంటుంటే, అన్నిటికీ ఒకటే సమాధానం, “ఇవాళ, లేక రేపు అంతే” అని. మావ రేపు ఎంత ఇస్తాడో కానీ, మావ బెస్ట్ కేర్ కి నా క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకున్న అప్పు పెరిగి పోయి, దాన్ని కట్టడానికి ఇంకో కార్డు, ఆ కార్డు కి కట్టడానికి ఇంకో కార్డు, నేను రాసిన ప్రోగ్రాం లాగ, లూప్ లోంచి బయటకి రావటం లేదు.
క్రెడిట్ కార్డు రికవరీ వాళ్లంతా ఇంటి మీద పడటం తో, ఇంటికి తాళం వేసుకొని, ఓ రెండు వారాలు సెలవు పెట్టి, అత్తగారి ఇంట్లో దిగిపోయా. వెళ్లే సరికి ఇంట్లో వాళ్ళ మొఖాల్లో కళా కాంతి లేదు. ఏమయ్యింది అంటే ఎవరూ ఏమీ చెప్పరు. అంతా నిశ్శబ్దం. మావగారు నన్ను చూడగానే, “ఇందిరా! రెండు కప్పుల టీ” అని కాన్ఫిడెంట్ గా అరవటం లేదు. నేను పంపిన సిగార్లు పక్కన పడేసి, బీడీల్లోకి దిగిపోయుండాడు. మావ వాళ్ళ మావగారు, “మా సుబ్బయ్య! చాలా తెలివి గల్లోడు! ఎప్పటికైనా పైకొస్తాడు అనటం లేదు పొరపాటున కూడా”.
నాకు తిక్క పుట్టి పోతుంది. “మావా! ఏమయ్యిందో చెప్పు” అని గట్టి గా చేయి పట్టుకున్నా మూడో రోజు.
మావ నిశ్శబ్దంగ గదిలోకి వెళ్లి, “ఓ మూడు పోస్టల్ కవర్లు తెచ్చి నా చేతిలో పెట్టాడు”. వాటిల్ని డేట్ వారీగా పెట్టి, మొదటి దాన్ని ఓపెన్ చేశా! దాని తెలుగు సారాంశం ఏమనగా!
11/6/2010,
“డియర్ సుబ్బయ్య!
మీరు ఎక్స్ అను మా మ్యాగజైన్ కి గత పదేళ్లుగా సభ్యత్వం కలిగి వున్నారు.
“…”
“…”
కావున మీరు ఈ కింది పజిల్ ని పూరించి పంపిన ఎడల, మీరు మేము ఎంపిక చేసిన సభ్యులలో రూ|| ఇరవై లక్షలు లాటరి ద్వారా గెలుచుకొనే అవకాశం కలిగి వున్నారు.
ఇట్లు మీ భవదీయులు, ఎక్స్ మ్యాగజైన్ యాజమాన్యం
రెండో లెటర్ ఓపెన్ చేయగా, దాని సారాంశం, ఏమనగా!!
1/1/2011,
“డియర్ సుబ్బయ్య!
“…”
“..”
మీరు పంపిన పజిల్ అందినది. మరియు అది సరియైనది. కావున లాటరి ద్వారా ఎంచుకొని బహుమతి పంపగలము.
ఇట్లు మీ భవదీయులు, ఎక్స్ మ్యాగజైన్ యాజమాన్యం
ఇంకా ఆశ చావక మూడో దాన్ని కూడా ఓపెన్ చేశా. దాని సారాంశం ఏమనగా!!
6/1/2011
“డియర్ సుబ్బయ్య!
“…”
“..”
మీరు మా లాటరి లో విజేతలు గా ఎంపిక అవటం తృటిలో చేజారినదని తెలియ పరచుటకు మిక్కిలి విచారిస్తున్నాము.
ఇట్లు మీ భవదీయులు, ఎక్స్ మ్యాగజైన్ యాజమాన్యం
నా ముఖం లో మామ పెట్టిన కత్తి గాటుకి ఒక్క నెత్తురు చుక్క కూడా రాల లేదు. ఎక్కడో దూరం గా పాట వినిపిస్తుంది మైకు , “అనుకున్నదొక్కటి, అయినదొక్కటి, బోల్తాకొట్టావులే బుల్బుల్ పిట్టా!” అని.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy