Episode 221

'ఎండమావుల్లో తిమింగలాల వేట'

కె.సభా (జూలై 11923 – నవంబరు 41980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా , నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.

కథను మీకందించడానికి సహకరించిన శ్రీమతి రమణ గారికి కృతజ్ఞతలు.

 ముక్కంటి సీమలో పెద్ద కాటకం వచ్చింది. క్షామ దేవత విలయతాండవంలో జన పదాలన్నీ అల్లల్లాడి పోయినవి. దప్పిక చల్లార్చుకోవడానికి చుక్కనీరు కూడా లభించని అసహాయ స్థితిలో కొంపాగోడూ వదలి దేశం ఎల్లలు దాటిపోతున్న కూలీల గోడు అవర్ణనీయమై పోయింది.

రోజూ పత్రికల్లో ఈ వార్తలే అచ్చు కావడం వల్లా మంత్రి వర్గం, అత్యవసర సమావేశంలో కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకొన్నది. మండలానికొక మంత్రి వెళ్లి అప్పటికప్పుడే కరువు నివారణ కార్యక్రమాలను ప్రారంభించాలని ఎన్ని కోట్లనైనా వెచ్చించి ప్రజలను కాపాడి తీరాలని అమాత్యులందరూ కంకణం కట్టు కొన్నారు.

మత్స్య శాఖామాత్యులు రాజాసుందర ప్రకాశ గోవర్ధన శతపధిగారు, కనకాచలం జిల్లా పర్యటనకు బయలుదేరారు. మంత్రిగారి పర్యటన కార్యక్రమాన్నంతా స్థానిక పత్రికలు ప్రముఖంగానే ప్రచురించాలనుకొన్నందున ఆ జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అవసరమైన ముందు జాగ్రత్తలన్నీ తీసు కొన్నాడు. దిన వార పత్రికల విలేఖరులనే కాక మాసపత్రికల విలేఖరులను కూడా పిలిపించి కనకాచలంలో ప్రెస్సు కాన్ఫరెన్సును యేర్పాటు చేశాడు.

ఆరోజు కనకాచలం ట్రావెలర్సు బంగళాలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో మత్స్యశాఖామాత్యులు రాజా సుందర ప్రకాశ గోవర్థన శతపధి గారనేక కొత్త విషయాలను వెల్లడించారు.

డైనమెట్ పత్రిక విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ మత్స్య శాఖామాత్యులు యిలా అన్నారు. –

‘మనం సామ్యవాద యుగంలో ఉన్నాము. రుచిలో బేడిసెలే బాగుంటాయి. నీ బుడ్డపక్కెలు బాగుండవనీ భేదాలుంచుకోరాదు. మనకు కొరదైనా ఒకటే కొరమేనైనా ఒకటే. పూజేపను పెంచుతూ మావురాయిని మరచిపోరాదు. మన నేతల వలె పీతలను కూడా సంరక్షించుకోవాలి. జపానులో నేను గమనించాను. వాళ్లు సీఫుడ్ ను బాగా ఉపయోగించుకొంటారు. ఈ కరువులో ప్రతి చెరువులో జెల్ల లనో ఇసుక దొందులనో పెంచుకోకుంటే దేశం దెబ్బతింటుంది,

“మన చెరువుల్లో నీళ్లుంటే గదసార్?” మధ్యలో ప్రశ్నించాడు, సౌదామిని విలేఖరి.

“ డోన్ట్ డిస్టర్బ్ మి, దటీజ్ అనదర్ ప్రాబ్లం” అంటూ అమాత్యులు సిగరెట్ ముట్టించి –

‘యుసీ … ఈ నత్తలున్నాయే వీటిని పుష్కలంగా పెంచాలి. వాటిలో కొవ్వు పదార్థం యెక్కువ. ప్రతి గుంటలోనూ పెంచే వీలుంది. అన్నట్టు మరచాను. నేను ఇండో చైనా వెళ్లినపుడు అక్కడొక మ్యూజి యంలో నాయెత్తు తాబేలును చూశాను. కాదూ కూడదంటే కొంత మసాలా ఎక్కు వవుతుంది. కాని అది బలే రుచిగా కూడా ఉంటుందని నా నాన్ వెజిటేరియన్ ఫ్రండొ కాయన చెప్పాడు. అతడిపుడు చికాగోలో ఉన్నాడనుకోండి. ఇక్కడ చెరువు లెక్కువేగా?’ ప్రశ్నించాడు గౌరవనీయులైన మత్స్య శాఖామాత్యులు.

అందరూ కాకున్నా ఇంచుమించు సగం మంది ఎక్కువనే చెప్పారు. కాని జాజిమల్లె పత్రిక కరస్పాండెంటు మాత్రం ‘అర్థం చెరువులకు పైగా కట్టలు తెగిపోయినవే’ అన్నాడు.

“ డజన్ట్ మేటర్. ఆ పని మనది కాదనుకోండి. ఇరిగేషన్ మినిస్టర్ చూస్తారు. మన చెరువుల్లోనే కాదు. ప్రతి బావిలోనూ చేపల్ని పెంచాలి. కరువులో చేపల్ని పెంచే కార్యక్రమం క్రింద కనీసం పది కోట్ల రూపాయలసైనా ప్రత్యేకించమని నేను సి.యం. తో గట్టిగా చెప్పాను. కానీ మా ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పుకొంటేగా. చివరికి యాభై లక్ష లిచ్చాడు. కడకు నేను మొండిగా పేచీ పెడితే రెండుకోట్లు చేపలు పట్టే వలల్ని కొనడానికి అలాట్ చేశారు.” 

“ పెంచకనే పడే పశ్న ఎక్కడుంటుందండీ ?” చిన్నగా నసిగాడు సిగ్నల్ పత్రిక విలేఖరి.

“మీ కదే అర్థం కాదు. ఒక్కసారిగా వలల్ని కొంటే, పెంచే చేపలనంతా పదుతూ ఉండవచ్చు. జాలర్లు వీకర్ సెక్షన్ కు చెందిన నాళ్ళు. అసలు మైనారిటీ కమ్యూనిటీస్ ని డెవలప్ చెయ్యడమే మన ధ్యేయం. సోషలిజం ముఖ్య సూత్రం ఒకటుంది. చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగివేసినట్లు మెజారిటీ కమ్యూనిటీస్ మైనారిటీ కమ్యూనిటీస్ ను మింగివేయడాన్ని చూస్తూ ఊరుకోరాదు. అందుకే మా డిపార్టు మెంటకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సులో పెద్ద చేపలు చిన్న చేపల్ని మ్రింగి వెయ్యకుండా చూడాలి’ అన్నాము. ఒకే సైజా చేపల్ని పెంచమన్నాము. బొమ్మిడాయిలు వుండే బావిలో మావురాయిల్ని వదిల్తే ఏమవుతాయి చెప్పండి ? తాటాకు చేపలు పాము చేపల్ని పక్కెల్లో విడిస్తే, బతకవు! … “ 

అంటూ టైం చూచుకొని “వేర్ ఈస్ అవర్ ఇన్స్పెక్టర్” అన్నారు అమాత్యులు. ఏడుకొండలవాడికంటే వెడల్పైన నామాలు పెట్టుకొన్న బంట్రోతు వచ్చి “వారు పరిగిలగుట్ట లో తమ రాకకు యేర్పాట్లు చెయ్యడానికి వెళ్లారు, దేవరా” అన్నాడు.

పరిగిలగుట్ట అక్కడికి పాతికమైళ్లుంది. కార్యక్రమం ప్రకారం చెన్నారాయుడి చెరువు చేపల పెంపకం కేంద్రానికి మంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ఉత్సవానికి కనకాచలం జిల్లా పరిషత్ అధ్యక్షులు, మచ్చా జీవానందంగారు అధ్యక్షత వహిస్తారు. అదే సభలోనే బెస్తలకు కొత్త వలలు పంచబడతాయి. 

జిల్లా కలెక్టర్ కారు ముందు దారి తీసింది. వెనుక మత్స శాఖామాత్యుల కారు ఆ వెనుక పబ్లిక్ రిలేషన్సు డిపార్టుమెంటు వారి వ్యాను నిండుకూ పతికా విలేఖరులు, పరిగిలి గుట్ట సమితి అధ్యక్షుల జీపు ఇంకో యేవో కొన్ని వాహనాలు తుర్రు మంటూ దూసుకపోయాయి.

పరిగిలి గుట్టలో పెద్ద పందిరి వేశారు. భగ భగ నుండే ఎండను లెక్క చెయ్యకుండా ఆ పరిసరాలనుండి పంచాయతీ సర్పంచులు, మునసబులు, కరణాలు, కాంట్రాక్టర్లు, సమితి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వందల సంఖ్యలో సమావేశమయ్యారు. బాగా అలంకరించిన బండిపై పెద్ద గాజు తొట్టెలో లో రకరకాల చేపలు విలాసంగా విహరిస్తున్నాయి. వాటిలో బంగారు వన్నెల మీనులూ, కుచ్చుతోకల జలపుష్పాలు కూడా ఉన్నాయి.

మంత్రిగారు. పరిగిలి గుట్టకు చేరేలోగా గంట మూడు దాటింది. అక్కడి నుంచి రాయడి చెరువు అరమైలు. ఆ దారిపొడుగునా పెద్ద ఊరేగింపు, అమాత్యులను లారీపై అమర్చిన పూల పల్లకిలో కూర్చోబెట్టారు. ఆ పల్లకిని కూడా మత్స్యాకారంతో అతి రమణీయంగా పచ్చ చామంతి పూల తోనే జోడించారు.

‘కరువులో చేపల్ని విరివిగా పెంచండి’  

 ‘ఎండుచేపల తిండి గుండె బలాన్నిస్తుంది’ 

‘పూజేవల్ని పెంచితే పుణ్యం వస్తుంది’ 

‘తాబేళ్లను పెంచండి కుబేరులై పోండి’ 

‘ఎండ్రకాయల కొవ్వులొ ఎంతో బలముంది.

‘అన్ని రకాల చేపల్ని పెంచడమే అసలైన సోషలిజం’

‘కరువు బరువు తగ్గా లంటే కరవాళ్లను వాడండి’

‘పప్పన్నం తినకండి. ఉప్పు చేపలు వాడండి”

ఇంకా రకరకాల నినాదాలు వ్రాయబడిన అట్టలతో కొమ్ములు, తుతార్లు, పిల్లనిగ్రోవులు, జాగంటలు, జవనికలు, తుడుములు, పలకలు, గోళ్లు, మేళాలు, నాగ స్వరాలు, కిలారినట్లతో భూనభోనాంతరాలు దద్దరిల్లేట్లు ఊరేగింపు ఆరంభమైంది.

మత్స్యశాఖామాత్యులు శ్రీ రాజా సుందర ప్రకాశ గోవర్ధన శతపధి గారు కోర మీసాలను మెలి వేసు కొంటూ సుఖాసీనులైన దృశ్యం నయనానందకరమైనా ఎండధాటికి తట్టుకోలేక విలేఖరులందరూ ముందుగ చెన్నారాయడి చెరువు వేపు దారి తీశారు.

పబ్లిక్ రిలేషన్సు ఆఫీసరు వారిని చెరువులో నున్న వేదిక వద్దకు తీసుకపోయి తలో కొబ్బరి బోండా ఇప్పించాడు. వారా నీటిని త్రాగి సిగరెట్లు కాల్చుకొంటూ వేదికకు దక్షిణం వైపుగా నున్న సిమెంటు తొట్టి దగ్గరకు వచ్చి నిలబడ్డారు. వంద అడుగుల పొడవు, నలభై అడుగుల వెడల్పున్న ఆ తొట్టిలో అర్థానికి పైగా, నీరున్నది. నునువెచ్చని ఆ నీటిని ఆ ఉదయమే తెచ్చిపోసినట్లు అతి ప్రయత్నం మీద కనుగొన్నారు. ఏడేండ్ల క్రితం మొరవ సాగిన చెన్సారాయుడి చెరువులో మూడేళ్ల నుండి నీటి చుక్క లేదు. నిరుడు చెరువు గర్భంలో జొన్నలు చల్లినా వాన బొట్టు లేక విత్తనాలు మాడిపోయాయట .

ఐనా మత్స్య శాఖామాత్యులు ఇటీవలే అనేక దేశాలలో పర్యటించి వచ్చిన విశేషానుభవాలతో కరువులో చెరువుల్లో చేపల్ని పెంచే విస్తృతమైన పధకాన్ని చేపట్టారు. అతి సాహసోపేతము, పరిశోధనాత్మకమూనైన ఈ పథకంతో ముక్కంటి సీమ లెక్కలేనన్ని టన్నుల చేపల్ని ఉత్పత్తి చెయ్యగలదని వారి విశ్వాసం. ఈ దెబ్బతో ఇంటర్నేషనల్ మార్కెట్టు లభించినా ఆశ్చర్యం లేదు. విలేఖరులలా విచిత్రమైన భోగట్టాలనంతా సేకరిస్తుంటే అప్పుడే జీపునుండి దిగిన ఫోటోగ్రాఫర్లు ఊరేగింపు దృశ్యాలను కెమెరాలలో సంక్షిప్తంగా దాచు కొంటున్నారు.

ఆకసమే చిల్లులుపడే అట్టహాసాలతో ఊరేగింపు చెన్నారాయడి చెరువులో ప్రవేశించింది.

బ్రహ్మాండమైన పందిరిలో అత్యంత శోభాయమానంగా అలంకరించ బడిన వేదికపై అమాత్య శేఖరులు, నాయకులు ఆశీనులైన వెనుక స్థానిక నియోజకవర్గం యం. యల్. ఏ. మైకు ముందు నిల బడ్డారు. రెండున్నర మీటర్లు వ్యాసంకల వారి బొజ్జపై హాయిగా శయనించి యుండిన వారి హస్తాలను అతి ప్రయత్నం మీద పైకెత్తి ఒక్క దండం పెట్టి సభాంగణము నుద్దేశించి వారిట్లా అన్నారు. 

“ నా రైతు సోదరులారా ! కూలీ సోదరులారా ! హరిజన సోదరులారా ! ఈ దినం శుభదినం. ఎన్నో వ్యయ ప్రయాసలతో ఎంతో దూరం నుండి ఈ చండ్ర నిప్పులు కురిసే – బండలైనా చిట్లి పోయే

యెండల్లో మన మంత్రి మన మధ్యకి వచ్చారంటే ఏమనాలి. ఇది ప్రజా రాజ్యం . సోషలిజంలో ఇదే ఉంది. నా సేవ మీకు తెలిసిందే. గుండ్రాళ్ల పల్లె కుంటకట్టుకు దున్ను పోయించాను. పాపాది ఊరిబడిలో రెండో టీచర్ని వేశాను. నక్కావాళ్ల పల్లెలో మంచినీళ్ల బాయి తొవ్వించాను. ఇప్పుడు వేళ కాదు. ఎన్నో ఉన్నాయి. ముందు మంత్రిగారు మాట్లాడుతారు” అని అంటుండగానే – 

“ సన్మాన పత్రాలు, సన్మాన పత్రాలు , సన్మాన పత్రాలు” అంటూ కేకలేశారు జిల్లా పరిషత్ చేర్మన్ మచ్చా జీవానందం గారు.

కోర్టులో విన్పించే నిశబ్దం వంటి ఆ కేకతో సభలో నుండి పది మంది వేదిక పైకి దుమికారు. వాటిలో ఒక్కటి మాత్రం చదివితే చాలన్నారు. అమాత్యులు.

పరిగిలిగుట్ట హైస్కూల్ సీనియర్ టెలుగు పండిట్ హానరబుల్ పోయట్ సుగ్రీవాచార్యులుగారు గస పోసుకొంటూ మైక్ దగ్గరికి వచ్చి వణుకుతూ గొంతును సవరించుకొని పఠనానికి ఉపక్రమించారు. ఆయనా పంచాయతీ సమితికి ఆస్థాన కవి.  

“గౌరవనీయులు ముక్కంటి సీమ మత్స శాఖామాత్యులు శ్రీ రాజా సుందర ప్రకాశ గోవర్థన శతపథిగారికి పరిగిలి గుట్ట పంచాయతీ సమితి సమర్పించిన సన్మానపత్రము. అమాత్య సత్తమా! అత్యంత పరాక్రమోపేతులై, అరివీర భయంకరులై, అత్యధిక శౌర్య ధైర్య సాహసోపేతులై, అతల వితల సుతల తలా తల రసాతల పాతాళ లోక భయద వికటాట్టహాస వీరవిహారంలో అలనాటి భారత స్వాతంత్ర్య సంగ్రామ రంగము నందు దుమికి, విజయ దుందుభి మ్రోగించి స్వరాజ్యమును సాధించి…’

అనగానే సభాంగణంలో నున్న సౌదామినీ కరస్సాడెంటు “ ఆనాడీయన వయస్సు ఐదా రేండ్లుంటాయా’ అని ససిగాడు కానీ ఎవరికీ వినిపించలేదు.

“ స్వరాజ్యమును సాధించి నేడు సామ్య వాదమును స్థాపించుటకు కంకణము దాల్చి మత్స్య శాఖామా త్యులుగా మన ముక్కంటి సీమ లోని ఒక్కొక్క చెరువులోనూ లెక్క లేనన్ని చేపలను పెంచి దశదిశలకూ పంచి కరువును నివారించి కొత్త చరిత్రను సృష్టించుటకు అవతారమెత్తిన మత్స్యావతారుడైన మీ రాక మాడెందములకానందదాయకమై నోటమాట రాక యున్నది. మంత్రి శేఖరా ! మా చేద బావులలో చేపలు లేవు, నీరు లేకున్ననూ బ్రతికే చేపలను శాస్త్రజ్ఞులు పరిశోధించునట్టు ఉత్తరువులు దయచేయ ప్రార్ధన. మంత్రి పుంగవా ! మా వాగులలో అక్కడక్కడ మడుగులున్నవి. వాటిలో వదలుటకు తాబేళ్ళను నత్తలను సరఫరా చేస్తూ, వాటిని భక్షించడానికి వచ్చే కొంగలను కాల్చడానికి తుపాకులతో పాటు లైసెన్సులు కూడా ఇచ్చునట్లు కలెక్టర్ల కిప్పుడు అనుగ్రహించమని మా విజ్ఞప్తి!

ప్రజల పాలిటి పెన్నిదీ ! మా చెరువులు ఎండిపోయి ఉన్నందున ప్రతి చెరువులోనూ సిమెంటు తొట్లు కట్టించి వాటి నిండుకూ నీటిని పోయించి, చిన్న చేపలతో పాటు పెద్ద చేపలను కూడా తెప్పించి కొరదలు బతకడానికి వీలుగా సిమెంటు తొట్లలో బొ రియలు త్రవ్వించమని అభ్యర్థన. 

మేరునగధీరా! సాగరాధీరా ! మా పెరళ్ళలో నీటి తొట్లలో కూడా చేపల్ని పెంచడానికి అనువుగా వారానికొక కిలో వంతున ఉలవల్ని సరఫరా చేసి, ఈ కరువులో ఆదుకోవాలనీ ఈ చేపలను పట్టుకోడానికి ఇంటింటికీ ఒక వల మంజూరు చేయాలనీ, ప్రార్థన. 

ఇంత శ్రమతో ప్రయాసతో మా మొర ఆలకించిన మీకు ఆ దేవదేవులు , శివుడు, అల్లా , ఏసు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములను ప్రసాదించు గాక !

ఇట్లు: పంచాయతీ సమితి అధ్యక్షులు మరియు సభ్యులు, పరిగిలి గుట్ట, 1- 10 – 1972. 

చిరునవ్వులొలికిస్తూ, సమయోచితంగా తలనాడిస్తున్న మంత్రిగారు పైకి లేవగానే వంద పూల దండలు వారి మెడను అలంకరించాయి. పరిగిలి గుట్టంత పూల గుట్టను పక్కకు నెట్టి, అమాత్య వర్యులు గంభీర స్వరంతో ఇలా అన్నారు.

సోదరులారా! అనడంతోనే కెమెరాలు క్లిక్కు మన్నాయి. కరస్పాండెంట్లందరూ కలాలు తీసుకొన్నారు. ప్రేక్షకుల చెవులు నిక్క పొడుచుకున్నాయి. 

‘ ముందు కావలసిన పని’ అంటూ మంత్రి ఉన్నట్టుండి వేదిక దిగారు. వారి వెంట నాయకులూ వచ్చారు. సిమెంటు తొట్లలోకి మంత్రి గారు గాజులు తోట్ల లోని చేపల్ని వదిలారు. అప్పటికే సుమారుగా 

కాగిన ఆ వేడినీటిలో ప్రవేశించిన చేపపిల్లలు అల్లల్లాడుతుండగా అమాత్యులు వేదికవద్దకు వచ్చి ఉపన్యాసం ప్రారంభించారు.  

ఇంగ్లాండు, స్కాట్లాండు ఐర్లాండు, పోలెండు, ఫిన్లాండ్, నార్వే, స్వీడెన్ , డెన్మార్క్ మొదలైన దేశాలలో తాను చూచిన చేపల్ని గురించి చెబుతూ ముక్కంటి సీమనంతా మత్స్య పరిశ్రమతో నింపి తన బాధ్యతను నెరవేర్చుకొంటానన్నారు. కరువులో చేపల్ని పెంచాలనీ, కరువు నివారణకి అదొక్కటే తరుణో పాయమనీ సెలవిస్తూ, పరిగిలి గుట్ట లోని బెస్తలకు వలలను బహూకరించారు. వలలతోపాటు సింగితాలు, కొడాలు, గాలాలను కూడా విరివిగా పంచిపెట్టి చేపల్ని ఎలా పట్టాలో కూడా పట్టి చూపెట్టారు. ఆయా శాఖ కు ఆధిపత్యం వహించే అమాత్యుడాయా పనులను స్వయంగా చేసి చూపడం ఆదేశంలో అనుశ్రుతంగా వస్తున్న సాంప్రదాయం.

మంత్రిగారు తొట్టిలోకి వదలిన చేప లన్నీ నీటిపై తేలుతూ ఉన్నందున స్వహస్తంతో దేవి దేవి పై కి తీశారాయన. చేపలల్లా వెల్లకిలా పడిపోవడం ఎందుకని జాజిమల్లె పత్రిక కరస్పాండెంట్ అడుగ బోతుండగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అతని వెనుకనుండి చొక్కా లాగాడు! కరస్పాండెంటు మౌనంగా వ్యాన్ నైపు నడిచి పోయాడు.

మత్స్యశాఖామాత్యులు సరదాగా పట్టిన చేపల్ని ఆ జాలర్లకే యిచ్చి మళ్ళీ వేదిక పై ఆశీనులయ్యారు.

పంచాయతీ సమితి అఢ్యక్షుల కృతజ్ఞతతో సమావేశం ముగిసిపోయింది. ఆ సమయానికి సరిగ్గా పొద్దు కూడా పోయింది. 

పరిగిలిగుట్టలో ఆ రాత్రి డిన్నరున్నట్లు విలేఖరులకు తెలిసింది. వెజిటేరియన్స్ కు కూడా మత్స్యాల ఆకారంతో కజ్జి కాయలు, రొయ్య రూపాలతో బూంది, వడ్డించబడుతాయని ఆ రాత్రికేదో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని పౌర సంబంధ శాఖాధికారి సెలవివ్వడంతో విలేఖర్లు అందరూ ఆలోచనలో పడ్డారు. 

‘కరవులో విందులేమిటని” నసిగాడు సౌదామిని విలేఖరి. 

“అసలు బస్సెక్కడుందయ్యా ! ఆయన బండే శరణ్యం అర్ధరాత్రయినా” అంటూ అంగీకరిస్తున్నట్టు తల ఊపాడు జాజిమల్లె కరస్పాండెంటు.

అందరూ పంచాయతీ సమితి అధ్యక్షుల వారి కొత్త భవనంలో ప్రవేశించేలోగా హాలంతా విస్తళ్లు కన్పించాయి.

ఆ విందును, ఎన్నో రకాల పిండివంటలతో పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డించిన ఆ విందును, అరగించి తాంబూల ల ను సేవిస్తూ, అక్కడే అందిచ్చిన సిగరెట్లను కాలుస్తూ, అప్పుడే ప్రారంభమైన వినోద కాలక్షేపంతో నిమగ్నులైన విలేఖర్లు కరువునే కాదు ఈ లోకాన్నే మరిచి పోయారు.

మత్స్యశాఖామాత్యులు శ్రీ రాజా సుందర ప్రకాశ గోవర్థన శతపధిగారు మరునాటి కార్య క్రమాన్ని గురించి కలెక్టరుతో ముచ్చటిస్తూ, సోఫాలో పడుకొన్నారు.

చేపల మంత్రి పర్యటనలో తొలి కరువు నివారణ కార్యక్రమం నిర్విఘ్నంగా జయప్రదంగా జరిగిపోయింది. ముక్కంటి సీమ సామ్యవాద ప్రభుత్వ జైత్ర రథం ప్రగతి పధంలో ఒక కిలోమీటర్ ముందుకు సాగింది. 



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations