Episode 122

పి.రామకృష్ణ గారి కథ - 'దయ్యం'



'భయాన్ని దాటడమే జ్ఞానం' అన్న గొప్ప విషయాన్ని , తేలికైన తేట తెలుగులో మనకు వివరిస్తారు ప్రసిద్ధ కథకులు , విమర్శకులు , పాత్రికేయులు శ్రీ. పీ. రామకృష్ణ గారు, తాను రచించిన 'దయ్యం అనే ఈ కథ ద్వారా.

ఇంత చక్కటి కథను హర్షణీయం ద్వారా అందించడానికి, అనుమతిని ఇవ్వడమే కాక, కథ పై హర్షణీయం చేసిన వ్యాఖ్యకు స్పందిస్తూ , కథా నేపధ్యం గురించి, ఆడియో ద్వారా వివరించిన శ్రీ.రామకృష్ణ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

రామకృష్ణ గారి సమగ్ర సాహిత్యం కొనేటందుకు కావలసిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

ఉపోద్ఘాతం:

‘భయం’ అనుభవించని మనిషిని , ఊహించడం కష్టం.

మన భయానికి  కారణం - ఒక మనిషి కావచ్చు, ప్రత్యేకమైన వాతావరణం  కావచ్చు, ప్రదేశం  కావచ్చు, లేదా అప్పటి మన మానసిక స్థితి కావచ్చు.  

భయపడుతున్న పరిస్థితుల్లో ,   తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి  మన  జీవితాలని విపరీతంగా ప్రభావితం చెయ్యవచ్చు. నెగటివ్ గా కానీ , పాజిటివ్ గా   కానీ. 

'భయాన్ని దాటడమే జ్ఞానం' అన్న గొప్ప విషయాన్ని , తేలికైన తేట తెలుగులో మనకు వివరిస్తారు ప్రసిద్ధ కథకులు , విమర్శకులు , పాత్రికేయులు శ్రీ. పి. రామకృష్ణ గారు, తాను రచించిన 'దయ్యం అనే ఈ కథ ద్వారా.

కథలో ముఖ్య పాత్రలు ఒక పల్లెటూరిలో ప్రభుత్వ పాఠశాల లో పని చేసే ఒక ఉపాధ్యాయుడు (ఆయనే కథకుడు) , ఆయన క్లాస్ లోనే చదువుకునే ఒక బీద విద్యార్ధి, ఆ విద్యార్ధి తల్లి .

కథలోకొస్తే -

ఒక రాత్రి,  కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో , కథకుడైన టీచరు గారు,  పక్కనున్న పట్టణం నుంచి , పల్లె కి నడిచి రావాల్సి వస్తుంది,  మధ్యలో వున్న పొలాల గుండా.  

వాతావరణాన్ని , కథ మొదట్లో  అందంగా ఆహ్లాదంగా  ఉందని వర్ణిస్తారు రచయిత.

ఆ నడిచే  దారి ఆయనకు కొత్తదేమీ కాదు. అలాగే రాత్రి పూట పొలాల వెంబడి నడక గూడా టీచరు గారికి  అలవాటు లేని విషయం కాదు.

నడుస్తూ వున్నప్పుడే, అంతర్మధనం మొదలౌతుంది  ఆయనకు.  తన  జీవితంలో అప్పుడున్న పరిస్థితులూ, ఎదుర్కొంటున్న చికాకులూ , నిరాశ చెందే విషయాలూ అన్నీ గుర్తుకొస్తాయి.   కథకుడి మానసిక పరిస్థితి ,  పూర్తిగా  మనకు అవగతమౌతుంది.

 ఇట్లా  అతను నడుస్తూండగానే  , తన పాత్ర  మానసిక పరిస్థితిని, సూచిస్తున్నట్టుగా,  వాతావరణం మారిపోతుంది. చీకటి కమ్ముకుంటుంది . ఉరుములూ మెరుపులూ మొదలౌతాయి. 

వూరికి వెళ్లాలంటే 'దయ్యం మాను' అనబడే   ఒక చింత  చెట్టుని దాటుకు వెళ్ళాలి.  ఆ దయ్యం మాను గురించి వూళ్ళో వాళ్ళు చెప్పుకునే కథలూ....... ఆ చెట్టుని అంటి  పెట్టుకుని వుంది,  అని అందరూ అనుకునే, ,  చనిపోయిన అంకమ్మ, తన దగ్గర క్లాసులో చదువుకునే అంకమ్మ కొడుకు పది పన్నెండేళ్ల గొల్ల పాపయ్య, వాళ్ళ వికృతమైన రూపాలు   ఇవన్నీ గుర్తుకొస్తాయి.

ఎన్నోసార్లు ఆ మానుని నిర్భయంగా దాటుకుంటూ వెళ్లిన,  ఆయనకు   మనసులో ఒక  చిన్న సందేహం మొదలౌతుంది. 

చెట్టువైపు నించి ఏడుపు వినబడడం మొదలౌతుంది.

వింటున్నది చూస్తున్నది నిజమా , కాదా అనిపించి ఆ సందేహం ,  పెనుభూతంగా మారి మనసూ , వొళ్ళూ,  అంతా  ఆవరిస్తుంది.

 సరళమైన పదాలను  వాడుకొని  అద్భుతమైన   వాక్యాలను సృష్టించి,   కథా నిర్మాణం  చేశారు రామకృష్ణ గారు. 

ఈ రీతిలో , కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకువెళ్లి ఒక అద్భుతమైన ముగింపు ఇస్తారు రచయిత.

కథ చివరలో టీచరుని,  స్టూడెంటుగా , స్టూడెంట్ ని టీచరుగా మార్చివేస్తారు రామకృష్ణగారు చాకచక్యంగా. 

నిస్సదేహంగా 'దెయ్యం' తెలుగు కథాసాహిత్యంలో మనకు లభించిన, అత్యుత్తమ కథల్లో ఒకటి.

దయ్యం:

నేను రోడ్డు దిగేటప్పుడు సూర్యుడు పడమటదిగిపోయినాడు. పొలాలదారి వెంటనడుస్తున్నాను. విశాలమైన, పైరులేని సేద్యం చేసిన పొలాలు ప్రశాంతంగా వున్నాయి. నీలం రంగు ఆకాశం కింద దూరానికి కనిపించే నిశ్చల సముద్రం మాదిరి కనిపిస్తున్నాయి. కాళ్ళ కింద బండ్ల జాడలు ఏర్పరచిన గోతులు ఎండి పెళ్ళలుగా మారి చెప్పుల్లేని పాదాలను నొప్పిస్తున్నాయి. వారం రోజుల కిందట పెద్ద వర్షం కురిసింది. తేమ ఆరీ ఆరక ముందే రైతులు పొలాలకు ఎరువుతోలుకున్నారు. ఇప్పుడు ఎరువుతోలి సేద్యం చేసుకుంటే, ఈసారి వర్షానికి విత్తనం వేసుకోవచ్చని వాళ్ళ తొందర. ఒక్కవర్షం వృధా అయితే, ఎంత నష్టమో అది మెట్ట రైతుకే తెలుసు.

ఈ వేళ పట్టణంలో చెప్పులు కొనుక్కోవాలనే ఆలోచనతో చార్జీలకు గాక పదిరూపాయలు ఎక్కువే జేబులో వేసుకున్నాడు. కానీ, పదిరూపాయలకు చెప్పులు కొనగలిగిన పరిస్థితి నుంచి దేశం చాలా 'అభివృద్ధి'ని సాధించిందని అర్థమయింది. ఎక్కడో ఉరిమిన శబ్దం ఆలోచనను కదిలించింది. ఈ వేళ పగలు ఎండ చాలా తీవ్రంగా వుంది. ఇప్పుడు ఉరిమింది (అది ఉరుమేనా? ఏదన్నా శబ్దమా?) ఇంకా రెండు మైళ్ళ పైనే నడవాలి. దారిలో వర్షమొస్తుందేమో, గొడుగన్నాలేదు. గొడుగు కొనాలన్న 'ఆశయం' కూడా వుంది. ఆ ఆశయం పుట్టినప్పుడు ఏడెనిమిది రూపాయలో సాధ్యమయ్యేది. ఇప్పుడు రెండు మూడు రెట్లకు కానీ సాధ్యమయ్యేట్టు లేదు. అవసరాలు తీరడమే గగనంగా వుంటే, ఆశయాలు తీరేదెన్నడు? చెప్పులూ, గొడుగూ ఇట్లాంటివి అవసరాలే. అవీ అందనంత ఎత్తుకు వెళ్తే ఆశయాలవుతాయి. నవ్వొచ్చింది.

ఈ సారి స్పష్టంగా ఉత్తరం దిక్కున పుట్టిన ఉరుము తూర్పున సరిగ్గా పొద్దుపొడిచే ప్రాంతం దాకా పయనించింది. ఇంతవరకూ కనిపించనిమేఘాలు ఆకాశం అంచులనుంచి పైకి లేస్తున్నాయి. ఉరుము అనే పిడికిలి దెబ్బకు మేఘం తల బద్దలైనట్టు మెరుపు చీల్చుకుని పోయింది. చల్లని గాలి తాకుతోంది. ఖాయంగా వర్షమొస్తుంది. వర్షమొచ్చేలోపల ఇల్లు చేరుకోడమొక్కటే ఇప్పుడు 'ఆశయం'. వడివడిగా అడుగులేస్తున్నాను. దారి కనిపించని కనుచీకట్లు వ్యాపిస్తున్నాయి. ఇంతకు ముందటి కంటే ఎక్కువగా పాదాలు దెబ్బలు తింటున్నాయి. 

తోడి టీచర్ను జిల్లా చిట్టచివర్న, గుట్టలనడుమ కట్టిన స్కూలుకు బదిలీ చేశారు విద్యాశాఖాధికారి. టీచర్ భార్య నిండుగర్భవతి, తల్లి గుడ్డిమనిషి, తండ్రి జబ్బు మనిషి, పుడు పనిచేస్తున్న ఊరు ఆయన స్వగ్రామం. కట్టుకొంటున్న కొంప సగంలో వుంది.

విద్యాశాఖాధికారి యువకుడు, నా తమ్ముడి స్నేహితుడు. ఈ సంగతి తెలుసుకున్న -కోటీచర్, ట్రాన్స్ఫర్ కాన్సిల్ చేయించమని తగులుకున్నాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా అని పరిస్థితి చూసి మెత్తబడ్డాను. అటు మాతమ్ముడినుంచీ డి.ఇ.వో.గారికి ఉత్తరం వచ్చిన తర్వాత, ఈ యన్నుతో డ్కొని సమ్ముఖాన వినిపించడానికి వెళ్ళాను. కాన్సిల్ అయినట్లు త్వరలో తెలియజేస్తామన్న డి. ఇఓ. గారికి కృతజ్ఞత తెలిపి బయలుదేరాము. నేను బస్సెక్కి కూర్చున్నా. అతను కిందనే వుంటే “రావా?” అనడిగాను. 'రాత్రికి వుండి సినిమా చూసొస్తా అని నసిగాడు. సమస్య తీరింది. ఇక సరదా తీరాలన్నమాట. ఏమనుకున్నాడో “మీరూ వుండండి, ఇప్పుడేం పోతారు? ఊరుచేరేసరికి రాత్రవుతుంది. అర్లీ మార్నింగ్ బస్సుకే వెళదాం” అన్నాడు. “కాదులే, నే వెళ్తా" అన్నాను.

ఇట్లా పొలాల్లో రాత్రిళ్ళ నడవడం నాకు మంచి అనుభవంగా వుంటుంది. పట్టణానికి వెళ్ళినప్పుడు, కావాలనే ఆఖరి బస్సులో వస్తాను. ఎక్కడో కప్పఒకటి గొంతు నరాలు తెగిపోతాయన్నంత బిగింపుతో, బిగించిన తంత్రుల మీద బలంగా నిదానంగా మిటి నట్టు అరిచింది. దారిలోకి సాగిన ఏదో చెట్టు కొమ్మన కూచోనున్న పిట్ట ఒకటి బుర్రున ఎగిరిపోయింది. దాని రెక్కల శబ్దంతో పాటు నాగండె లయగా టపటపా కొట్టుకుంది. పిట్ట ఎగిరిపోతే బెదిరిపోయినానా? దూరాన వర్షం కురుస్తున్నట్టు తేమగాలి తాకుతోంది.

ఈ సారి పెద్ద తీగె మెరుపు! ఎంత అద్భుతంగా వుంది! ఎందువల్లనో యీ అద్భుత దృశ్యాన్ని స్థిమితంగా చూసి ఆనందించలేకపోతున్నాను. వర్షం వస్తుంది, తడిసిపోతాను.... అన్న భయం కారణమేమో! మెరుపు వెలుతుర్లో అంతదూరంలో పక్కనున్న చింతచెట్టు కనిపించింది. నాలో ఇంతవరకూ వున్న అస్థిమిత సంచలనానికి కారణం తెలిసినట్టుయింది. ఆ చింతచెట్టును 'దయ్యంమాను' అంటారు. చుట్టుపక్క ఊళ్ళలో ఎవరికైనా దయ్యాలుపడితే, మంత్రగాళ్ళు విడిపించి.. యీ చింత చెట్టుకు మేకు కొట్టి దయ్యాన్ని ఇందులో వుంచి పోతారట! ఈ చింత చెట్టు చిగురుకానీ, కాయలు కానీ ఎవరూ కోసుకోరుభయంతో. అంకమ్మ ఒక్కతే నంట ఈ చెట్టు చిగురుకోసి అమ్ముకునేది. -

మొదట్లో, అంకమ్మ ఈ చెట్టు చిగురు కోసితెస్తే, కొనడానిక్కూడా భయపడేవాళ్ళట. తర్వాత్తర్వాత భయం తగ్గింది. “దయ్యం మానుసిగురుగదూ, బలేరుసిగా పుల్లగా, తియ్యగా వుంటాదిలే, పప్పులో పెడే దయ్యం పట్టినట్లు తినాల్సిందే” అని నవ్వించే దంట అంకమ్మ. ఆఖరికి అంకమ్మ యీ చెట్టు మీదనుంచే పడి చచ్చిపోయింది. 'దయ్యం మాను' భయం మరింత పెద్ద మానయింది. అంకమ్మను దయ్యమే సుడిగాలి రూపంలో చెట్టు మీద నుంచీ తోసేసిందట. చెదరిపోతున్నభయం మళ్ళీ యీ వదంతుల్లో చిక్కబడి, యీ చింత చెట్టు దగ్గరికి ఎవరూ రాకుండా పోయినారు. “మా వానికి పెద్దగా సదువు సెప్పుసోమి! నీరుణం ఎట్టనోకట్టతీర్చుకుంటాను” అనేది అంకమ్మ కనిపించినప్పుడల్లా,

తను టీచర్‌గా యీ వూరికొచ్చి, బడిలోకి అడుగు పెడుతూనే... పిల్లల్లో అంకమ్మ కొడుకే ముందు కనిపించింది. వాణ్ని చూసి కొయ్యబారిపోయినాడు. ఎంత వికారంగా వున్నాడో! తలకాయ వాడి శరీరానికి మించిన సైజులో, ఏదో ముడిమొద్దు పెట్టినట్టుగా వుంది. అసలు వాని శరీరం పెరక్కుండా వుండడానికి అంత పెద్ద తలను పెట్టినట్లుగా వుంది. ఆ తలకాయ కూడా ఎట్లుంది? గుండ్రంగా లేదు. మాను తోలి చదరం చేసిన మడికయ్య మాదిరుంది. వెంట్రుకల్లేవు. మడికయ్యలో వుండే బురదకు బదులు వాడితలమీద జిడ్డు కారుతూ ఆముదం వుంటుంది. తెల్లగా పెద్దవిగా వున్నకళ్ళు కూడా వాడికి వికారాన్నే ఇచ్చాయి. గుండీలు లేని చొక్కాకింద, రొమ్ము కనిపిస్తోంది. అది పిల్లవాడి రొమ్ముకాదు. నొక్కులు పడిన డొక్కు సత్తుడబ్బా మాదిరుంది. వాన్ని చూడటమే కష్టం, చూస్తే, చూపుమరల్చు కోవడమూ కష్టమే. పిల్లల హాజరువేస్తున్నప్పుడు వాడి పేరు గమనించాడు. జి.పాపయ్య, 'జి' అంటే మరేంలేదు... 'గొల్ల పాపయ్య'. కులం పేరే ఇంటి పేరు. కొంచెం జ్ఞానం వున్న టీచరెవరో... 'జి.పాపయ్య' అని రాసారు. పాఠం చెబుతున్నప్పుడు కూడా వాడిమీద అతుక్కుపోయే చూపుల్ని లాక్కుని... ఆ మూలకూ, ఈ మూలకూ, వాకిలి వైపూ విసరేస్తూ వుండగా...

వాకిలి వద్ద ఏదో గ్రామదేవత వెలిసినట్టు ఆమె. నెత్తిమీద పేడతో పూసి అలికిన దబ్బలబుట్టవుంది. ఆ బుట్టనామె చేతుల్తో పట్టుకోలేదు. చేతుల్తో... ఆకులకు సున్నంరాయడమూ, మడిచి నోట్లో పెట్టుకోవడమూ, ఇటువంటి పని చేస్తోంది. ఎత్తుగా, బలంగా ఇనుప అవయవాల్లో వుంది. చీరెమోకాళ్ల దాకా పైకి పీకి,

గోచీ పెట్టుకుంది. (చింత చెట్టు ఎక్కినప్పుడు గోచీ పెట్టుకుంటుందని తర్వాత తెలుసుకున్నాను). ఒకకాలికి ఒకరకం చెప్పు, ఇంకోకాలికి ఇంకోరకం చెప్పువున్నాయి. నేను ఆమెవైపు చూస్తున్నాను. ఆమె ఎవరివైపూ చూడలేదు. ఆమె నోరు దారుణంగా తాంబూల చర్వణం చేస్తోంది. మిగిలిన తమలపాకుల్ని మూసింది. దిండుమాదిరి చుట్టిన చీరకట్టులో దాచి, చూపుడు వేలికి మిగిలిన సున్నాన్ని వాకిలితలుపుకురాసి... అప్పుడు తలెత్తింది. క్లాసులో వున్న పిల్లలు ".... రే.. తోలుగా మీ అమ్మ" అని కేకేసినారు. వాడు.. ఆ గురుమస్తకుడు లేచినాడు. వాడునడుస్తున్నప్పుడు ఇంకా వికారంగా వున్నాడు. కాళ్ళలో ఎముకలు లేనట్టు వంగిపోతాయేమో అనిపించేట్టు, రబ్బరు గొట్టాల్లాగున్నాయి. పాదాలు వెడల్పుగా అరిగిన చెప్పుల మాదిరి ఉన్నాయి. మొత్తం మీద శరీరంలో ఎముకలే లేనట్టు తోలుబొమ్మ మాదిరున్నాడు.

అందుకే నేమో పిల్లలు వాన్ని 'తోలుగా' అన్నది.

ఆమె ప్రశ్నలు వేస్తోంది. వాడు తలూపుతున్నాడు. "సద్దితాగినావూ?” “ఊ...." (తల ఊపు). “మజ్జిగ కనుక్కున్నావా?" "ఊ..." (తలూపు), "సద్దివుందా? అయిపోయిందా? ఊహూ!(తల ఊపు అడ్డంగా).

వాడు సద్దితాగడమూ, మిగలడమూనా...! అనుకున్నాను. ఆ ప్రశ్నలడుగుతూనే ఎడంపక్క రొండిలోంచి ఏదో నాణెం తీసి, వాడి జేబులో వేసింది. - నడుంచుట్టూ చీరెలోనే అరలేర్పరచుకుని, ఒక్కోరకం సంపదనూ దాచుకున్నటుంది. వాడు క్లాసులోకి వస్తుండగా... "రే అబ్బిగా” అని కేకేసింది. వాడు ఆగినాడు. “మీ నాయినొచ్చినాడా?” “రాలా...” “యాడసచ్చినాడో, సరేలే నువ్వుపో” తుపుక్కున వూసి అంత సిగురమ్మో..." అని కీచుగొంతుతో అరుచుకుంటూ పోయింది. మగవాడికి ఆడవేషం చేసినట్లున్న ఆమెకు అంత కీచుగొంతా? అనిపించింది. సరే... ఆమె గొంతు సంగతి అట్లావుండనీ, నేనెంత నిమిత్తమాత్రున్ని అయిపోయినానోతల్చుకోగానే, ఆమె మీదా, ఆమె కొడుకు మీదా కోపమొచ్చింది. ఉపాధ్యాయుడనే వాడిని నేనొకడినుండగా, ఆమె రావడమేమిటి? వచ్చెనుబో... నన్నడక్కుండా వాన్ని పిల్వడమేమిటి? పిల్చెనుబో, వీడు నాతో చెప్పకుండా పోవడమేమిటి? క్లాసులో పిల్లవెధవలైనా తోలుగాడి అమ్మకిచ్చిన గుర్తింపు తోలు బొమ్మమాదిరికుర్చీలో కూర్చునున్న టీచర్ కివ్వకపోవడమేమిటి? అంటే, ఇదికూడా మామూలుగా జరిగేదిగా మారిందన్న మాట. క్లాసులోకి అడుగుపెడుతూనే వాడు కనిపించడం, వాడి అమ్మ ఇట్లా చెయ్యడం... నాకు చిరాకు పెరిగింది. వాన్ని లేపి, కేకలేశాను. నన్నడక్కుండా క్లాసులో నించీ లేవకూడదని అందర్నీ హెచ్చరించాను. అట్లా చేస్తే 'తోలువలుస్తా'నని చెప్పాను. తోలుగాడిని చూసినాక 'తోలు' నాకు పట్టుకుందేమో ననిపించి నవ్వొచ్చింది.

ఆ తర్వాత మూడు నాల్గురోజులు ఆమె స్కూలు దగ్గరికి రాలేదు. 'ఇక రాదులే' అనుకుంటూండగా ప్రత్యక్షమయ్యింది. అయితే, ఆమె వైఖరిలో మార్పువచ్చింది. “సోమి! మా పిల్లగాన్నిట్టా పంపుదురూ” అని వినయంగా అడిగింది. ఇంతకుముందు ఆమె ప్రవర్తన తప్పని ఎవరూ చెప్పకపోవడం వల్లనే, ఆమె అట్లా చేస్తూ వచ్చిందని అర్ధమయింది. నేను వెళ్ళు' అన్న తర్వాతనే పాపయ్యకూడా వెళ్ళినాడు. దాన్తో, క్రమశిక్షణను నెలకొల్పగలిగానన్న గర్వంతో పాటు, ఉభయపక్షాలూనన్ను గుర్తించాయన్న సంతృప్తి కలిగింది. అది నా భ్రమేనని మరా వారానికి అర్థమయింది. పాపయ్య అమ్మ అంకమ్మ రోజూ రావడమూ, తల్లి కొడుకూ నా పర్మిషన్ అడగడమూ... ఇదితంతుగా మారింది. ఆమె ఎట్లాగూ రావడం తప్పనప్పుడు,

అనుపట్లాగూ ఒప్పుకోక తప్పనప్పుడు... ఈ అనవసరశ్రమ ఎందుకు? ఇంతకు ముందటి టీచర్లక్కూడా ఇట్లాగే అనిపించి, వాళ్లిద్దరికి స్వేచ్ఛనిచ్చి వుండవచ్చు. దాన్తో... క్రమశిక్షణను నెలకొల్పానన్న గర్వం కరిగిపోయింది. సాయంత్రం వరకూ ఇల్లు చేరుకోలేని ఒక తల్లి, తన కొడుకు అన్నం తిన్నాడో లేదో కనుక్కోరాదనేంత కఠినంగా ఎట్లావుండగలను?

ఒకరోజు బాగా ఆకలేసి, ఇంటికి చేరుకున్న రోజున చింతచిగురు వేసిన పప్పూ. అన్నమూ తిన్నాను. బ్రహ్మాండంగా వుందనిపించింది. ఆ తర్వాత చింతచిగురుపప్పు తరుచూ కనిపించేది. చింతచిగురు పప్పు నాకిష్టమే. కృష్ణదేవరాయలకే అది ఇష్టంగా వుండినట్టు తెలుస్తోంది. అయితే, మాత్రం రోజూ ఎక్కడ తినగలం? రోజూ తినమంటే, ఆయన కూడా ఆ పప్పును గురించి పద్యం చెప్పక పోవునేమో! “ఏం చేసేది? అంకమ్మ రోజూ వద్దన్నా పోసిపోతుంది. కాయగూరలేం లేక నేనూ చేస్తున్నాను” అంది గృహిణి. అంకమ్మ నా 'రుణం' ఇట్లా తీర్చుకోవాలనుకుంటూందేమో! అంకమ్మ భర్త రైతులకు, సేద్యం పనులకు పోతుంటాడు. వాళ్ళు గింజలేస్తే, అవితీసుకుని అట్లానే సారా కొట్టుకుపోతాడు. అంకమ్మ రైతుల ఇళ్ళలో ధాన్యందంచీ, విసరీ, ఒక్కోసారి పేడారొచ్చు ఎత్తిపోనీ... తననూ కొడుకునూ బతికించుకొంటోంది. పొలాల్లో మగవాళ్ళు చేసేపనీ, ఆడవాళ్ళు చేసేపనీ చేస్తుంది. వర్షాకాలంలో, పొలంపని లేని రోజుల్లో చింతాకు కోసి అమ్ముతుంది.

పటపట చినుకులురాలేటప్పటికి గమనించి చూస్తే, దయ్యంమాను కెదురుగ్గా దారిలో వున్నాను. వర్షం రానే వచ్చింది. వస్తుందని తెలిసిన పది నిముషాలలోపలే, వచ్చిపడింది. కానీ తనమనస్సులో అంకమ్మ పరిచయానికి సంబంధించిన పూర్వాపర జ్ఞాపకాలన్నీ తిరిగినాయి. అందుకే దీన్ని 'మనోవేగం' అన్నారుగావాల. మెరుపుల్లో చింతచెట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా ఆ చెట్టును దాటేసి పోబోతున్నానంటే, ఏదో గుండెలో కొంచెం అదురుపాటుగా అనిపించింది. ఇంతకు ముందు ఈ దారిలో వచ్చినప్పటికే ఇక్కడ దయ్యముందన్నపుకార్లు వుండేవి. అప్పుడెప్పుడూ ఇట్లా అనిపించలేదు. ఇప్పడెందుకని పిస్తోంది? ఆ దయ్యాలెవరూ తనకు తెలీదు, ఈ దయ్యం తనకు తెలుసు. అందువల్లనేనా? ఛీ! ఛీ! ఏమిటీ మూఢనమ్మకం! వడిగా నడిచాను. ఇంతవడిగా ఎందుకు నడుస్తున్నాను? భయంవల్లనేనా? భయమేమీ లేదని నాకు నేను చెప్పుకోడానికన్నట్టు ఆ చెట్టు కేసి చూసినాను. అది చింతచెట్టు, దయ్యం మానుకాదు. ఇంతలో మళ్ళీ మెరుపు. చెట్టుకింద...! ఒళ్లు ఝల్లుమంది. అంకమ్మ దయ్యమయింది. నిజమేనా? అయితే, అక్కడ కనిపిస్తున్నది పిల్లవాడి ఆకారం.

పిల్లవాడి ఆకారంలో వున్న దయ్యమేమో! లేకపోతే, ఇంతరాత్రి, యీ వర్షంలో మనుషుల పిల్లవాడొక్కడూ ఎందుకుంటాడక్కడ?

పరిగెడదామనుకున్నాను. పరిగెత్తితే దయ్యం గమనించి వెంటపడుతుందేమో! ఎప్పుడెప్పుడో విన్న దయ్యాల కథలన్నీ కమ్ముకున్నాయి. నిశ్శబ్దంగా దాటుకుని తర్వాత అతడమా! ఏడుపు వినిపిస్తోంది. అమ్మా! అమ్మా! అంటున్నట్టుంది. చెట్టుదగ్గరున్న పిలవాడేనేమో ఇదంతా దయ్యం ఎత్తుగడేనేమో! నా గుండె ఆగిపోతుందేమో ననిపించింది. ఎవరూ తోడులేకుండా, ఈ రాత్రి ఈ దారినరావడం పొరపాటేమో! ఒకసారి చుట్టూ చూశాను, ఆకాశం కేసిచూశాను. ఎందుకనో నాబెదురు అర్థం లేని దనిపించింది. ఈ ప్రకృతిలో, యీ పరిసరాల్లో ఏదీకూడా నన్ను భయపెట్టాలన్న ఉద్దేశంతో లేవనీ, పైగా భయపడుతున్నందుకు జాలిపడుతున్నాయనీ, 'భయమెందుకూ?' అంటూ సముదాయింపజూస్తున్నాయని అనిపించింది. కుదించుకపోతున్న నన్ను నిటారుగా నిలబెట్టుకున్నాను. చెట్టుదగ్గరికి పోయి చూడాలనుకున్నాను. అటువంటి ధైర్యం చూపగలిగి నందుకు నామీద నాకు గౌరవం కలిగింది.

వెంటవెంటనే కళ్ళార్పినట్టు మెరుపులు. ఎవరు... ఎవరు? “పాపయ్యా" ప్రకృతి ధ్వనించింది. “ఈ వేళప్పుడు..... ఇక్కడ...." నాకు ఉద్వేగంతో మాటరాలేదు. వాడు ఏడుపు అందుకున్నాడు. వీపున చెయ్యేసి రాస్తున్నాను. మెల్లిగా నాకాన్చుకుని దారిలోకి నడిపిస్తున్నాను. నా చేతికింద వాడి శరీరం వెక్కిళ్ళతో ఎగసిపడుతోంది.

"ఈ వేళప్పుడు ఇక్కడి కెందుకొచ్చినావు?” ఇప్పటికి పూర్తి ప్రశ్నను వేయగలిగాను.

“మా అమ్మ కనిపించలేదు. మా అమ్మ దయ్యం కాలేదు. వట్టిది ఎంతసేపు కూచున్నా కనిపించలా”

నాకేదో అర్ధమౌతోంది. వాడిచుట్టూ నా చేతులు బిగిసిపోతున్నాయి. ఏడుపు ఊపుకి వాడు కదిలిపోతున్నాడు.

“మా అమ్మ..." ఈ సారి మాటపూర్తి చెయ్యనీకుండా వాడిని హత్తుకున్నాను.

నా గుండెలమీద వాడి కన్నీరు! వాడి పెద్ద తలమీద ఒకటి రెండు నాకన్నీటి చుక్కలు. ఇంతకు ముందు వాడిని చూడటానిక్కూడా అసహ్యించుకున్న సంగతి అప్పుడు జ్ఞాపకమేరాలేదు.

(24-4-75 'ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితం)

*** పుస్తకం క్రింది లింక్ ద్వారా కొనవచ్చు.

https://www.logili.com/novels/p-ramakrishna-rachanalu-p-ramakrishna/p-7488847-32580481781-cat.html#variant_id=7488847-32580481781

  • BGM credits:Kanmani Anbodu Kadhalan Piano Cover - Jingleman Cover #11 (https://www.youtube.com/watch?v=LSolsKyf6Vs)


This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations