full
ప్రణవం ప్రణయం పరిణయం
చక్కగా టేపు వేసున్న కవర్ కొరియర్ లో వస్తే వెనక్కి తిప్పి చూశాను. పంపిన ఊరు అందరికీ తెలిసిన మదనపల్లె అయినా పంపివాయన పేరు నాకు తెలియని ఆనందరావు. ఆ ఊళ్ళో మనకు ఎవరూ పరిచయం లేరే అనుకుని వచ్చిన అడ్రస్ చూస్తే నా పేరు మీద కరెక్టుగానే ఉంది.
ఎవరబ్బా అనుకుంటూ జాగ్రత్తగా టేపులన్నీ దాటి కవర్ మెల్లగా తెరిస్తే లోపల ఒక ఫోటోలో బాటు ఏదో లెటర్ ఉంది. ఫోటోలో ఓ అమ్మాయి!! మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు. అలా చూస్తూ ఉండాలనిపించే అందం నన్ను ఓ తెలియని ఏకాంతానికి తీసుకెళ్ళింది.
ఇంతలో పక్కనే ఉన్న రెడ్డినాయుడు 'ఏందియ్యో' కధ అంటూ వాడి చిత్తూరి మాండలికం మొదలుపెట్టి నే చెప్పేలోపే ముందు ఉత్తరం 'సదూవన్నా' అంటూ నన్నొదల్లేదు.
లెటర్ మంచి ఫస్ట్ క్లాస్ ఇంగ్లీషులో రాసుంది.
ప్రస్తావన వాళ్ళమ్మాయి పెళ్లిచూపులు.
రెండు కుటుంబాలకు తెలిసిన వ్యక్తి పేరు చెబుతూ అమ్మాయి ఫోటోతో పాటు జాతకం పంపారు. అందులోని గళ్ళు నాకేం అర్థం కాలేదు.
వెంటనే అమ్మకో ఫోన్ కొట్టి విషయం చెబితే అప్పుడే పంపించేశారా అంటూ చిన్ని నవ్వుతో నువ్వు ఎప్పుడు ఖాళీ అంటూ అడిగింది. దేనికి అన్నా చేతిలో ఫోటో తదేకంగా చూస్తూ!! అదేంటి.. మరి మదనపల్లె వెళ్ళాలి కదా అంది. సరే సరే నేను రేపు చెప్తా అంటూ ఫోన్ పెట్టేసి మళ్ళీ ఆ ఫోటో లోకంలో మునిగిపోయా..
అమ్మాయి పేరు మధుర ప్రణవి. ఓ ప్రణవ నాదంలా పేరులో ఏదో తెలియని కొత్తదనం. పుట్టిన తేదీ చూస్తే మూడు సంవత్సరాలు చిన్న. వెంటనే నా ఆలోచన "జ్యోతిష్కురాలు లిండా గుడ్ మాన్స్ సన్ సైన్స్" బుక్కు మీద పడిండి.
అది మన పుట్టిన రోజు ప్రకారం వచ్చే ఇంగ్షీషు రాశుల గురించి ఆమె రాసిన ప్రఖ్యాత గ్రంధం. ఫోన్ లో ఆ బుక్కు ఓపెన్ చేసి మా ఇద్దరి ఇంగ్షీషు పుట్టిన రోజుల ప్రకారం కుదిరే గుణాల గురించి చదివేయడం, బుక్కులో చెప్పిన పాజిటివిటీయో ఏమో మెల్లగా ఆమె మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడ్డం మొదలైంది. అమ్మాయి అందంగా ఉంది. ఫోటోలో ఇలా ఉందంటే ఎదురుగా చూడాలనిపించే ఒక తెలియని ఆత్రుత, ఉత్సాహం, నవ్వు నా గురించి నాకు తెలిసిన నా మొహం మీద తెలుస్తోంది.
అన్నో ఏంది.. తెగ 'నౌతాన్నావ్' అక్కడ ప్రొడక్షన్ లో సాండల్ ఆయిల్ అయిపోతోంది.. హెడ్ అఫీసుకు ఫోను కొట్టు అని మా చిత్తూరు నాయుడు అంటూంటే వాడి జిల్లాకే అల్లుడైనంత ఆవేశం నాకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేసింది.
ఫోన్ మోగుతున్న శబ్దం ఆ తెల్లవారి నా నిద్రను డిస్టర్బ్ చేస్తూ నన్ను లేపింది. చూస్తే అమ్మ.. ఫోన్ ఎత్తడంతోనే 'ఏంట్రా రాత్రి సరిగా నిద్ర పోలేదా' అంటూ అదే చిన్ని నవ్వు.
అసలు వీళ్ళకు ఇవన్నీ ఎలా తెలుస్తాయో ఏంటో!!
సరేలే ఫ్రెష్ అయ్యాక ఫోన్ చేయి అంటూ నాకు ఓ బ్రేక్ ఇచ్చింది. నేను రెడ్డి నాయుడు ఆఫీసులోనే కాదు ఇంట్లో కూడా కోలీగ్స్ అన్నమాట.
అసలు మీకు మా గురించి చెప్పనే లేదు కదా.. మీకు మైసూర్ సాండల్ సోపులు తెలుసుగా.. బెంగుళూరులోని ఆ ఫ్యాక్టరీ లో నేను అసిస్టెంట్ మేనేజర్ గా నాయుడు నా కింద సీనియర్ ప్రాడక్ట్ ఇంజనీర్ గా పని చేస్తూ కలిసే ఉంటాం. అమ్మ మైసూరులో ఉంటుంది.
నాన్నే లేరు!!
మేం తెలుగు వాళ్ళే అయినా తాతల కాలం నుండి వొడెయార్ మహారాజా వారి సంస్థానంలో సేద తీరాం. మీ అందరికి తెలుసు కదా దసరా ఉత్సవాలకు మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుందో.. క్లుప్తంగా చెప్పాలంటే
మా దేవత చాముండి, మా తియ్యదనం మైసూర్ పాక్, మా దోశె మైసూర్ మైలారి, మా నీరు కావేరి. మా శుభ్రత మైసూర్..
అప్పటికే నాయుడు లేచిపోయి వంటింట్లో ఏవో శబ్దాలు చేస్తున్నాడు . ఏంటదీ అని అడిగేలోపు చేతిలో కాఫీతో గూడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేశాడు. నాయుడు ఏ విషయమైన నవ్వుతూనే మాట్లాడుతాడు..అది ఒక అదృష్టం. ఇద్దరూ వంటలు చేసేస్తాం కానీ ఆ వంటల్లో మా మద్య కత్తులు నూరుకునేంత వివాదం ఒకటుంది. అదే "ఉబాసం" ( ఉప్మా బాధితుల సంఘం ), "ఉప్రేసం" ( ఉప్మా ప్రేమికుల సంఘం ) పదాలు. నేను మొదటి దాని ప్రెసిడెంటు అయితే వాడు రెండో సంఘానికి. ఇది తెగని గొడవ.
నా ఖర్మ కు ఆ రోజు టిఫిను ఉప్మానే. నాయుడు ఆ కాంక్రీటు చాలా ప్రేమతో చేసి నన్ను చూస్తూ కన్ను కొట్టాడు. నాకు అది చూస్తే పరమ చిరాకు. ఏవో నాలుగు స్పూన్లు లోపలికి తోసి అమ్మకు ఫోన్ చేశా..
ఉభయకుశలోపరి అయ్యాక అమ్మ అసలు విషయం చెప్పింది. ఫలానా వారి బంధువులట. నేను ఫోటో చూసా.. నీకు నచ్చితే వెళ్ళి అమ్మాయిని చూసి రావొచ్చు అంది.
ఎప్పుడు వెళ్ళాలి అన్నా. శుక్రవారం రోజు బాగుంది రా నీకు వీలౌతుందా! లీవ్ పెటాలేమో కదా లేకపోతే ఇంకో రోజుకు మారుద్దామా..
వాళ్ళకి చెప్పాలి కదా అంది.
ఏదో ఆలోచిస్తుంటే నాకైతే శుక్రవారమే బాగుంది ఇక నీ ఇష్టం.. సాయంత్రం లోపు ఫోన్ చెయ్యి, నాయుణ్ణి అడిగానని చెప్పు ఉంటా అని ఫోన్ పెట్టేసింది. పక్కనే ఉన్న నాయుడికి విషయం చెబితే.. ఓస్ ఇంతే కదా రత్నం సార్ ని ఆడగన్నా అన్నాడు.
రత్నం సార్ నాకు బాసు కానీ అలా ఎప్పుడూ ఉండడు. ఫాక్టరీకి ఆయనే నిండుగుండె. మేమిద్దరం వాళ్ళింట్లో చాలాసార్లు మొహమాటం లేకుండా భోజనాలు కూడా చేసేవాళ్ళం. ఇల్లు దగ్గిరే కదా అని నడిచి వెళ్ళా.. అక్కడ ఇంకో రౌండు కాఫీ అయ్యాక విషయం చెబితే లీవుతో పాటు కారు కూడా ఇచ్చాడు మదనపల్లెకు వెళ్ళడానికి.. అమ్మకు ఫోన్ చేసి చెప్పడంతో సంతోషించింది. ఇక మదవపల్లె వెళ్లాడమే తరువాయి.
ఆ నాలుగు రోజులు ఎలా గడిచాయో అస్సలు తెలిసి రాలేదు. ఏదో తెలియని ఓ కొత్త అసహనం, మద్యలో నాయుడి నవ్వులు. మొదటిసారి సెళ్ళిచూపుల ప్రభావం అని క్లియర్ గా తెలుస్తోంది.
అమ్మ గురువారం తెల్లారే బయలుదేరి మా ఊళ్ళోనే ఉండే మామయ్య ఇల్లు చేరింది. అమ్మ ఇద్దరి తమ్ముళ్ళూ ఇక్కడే ఉన్నా నాకు స్వతంత్రంగా ఉండడమే ఇష్టం.
సాయంత్రం రత్నం గారి కారు తెచ్చేసి అమ్మకు ఫోన్ చేశాను. మనతో పాటు మావయ్యలు, పెద్దోడి పిల్లలు కూడా వస్తారట అంది.
మదనపల్లెకు ఆరుగురా!! చిరాగ్గా ఇంతమంది ఎందుకు అని అంటే అమ్మ సైలెంట్ అయింది. నాకు తమ్ముళ్ళే పెద్ద దిక్కు అన్నట్టుంది ఆ నిశబ్దత. నేనే కలగజేసుకుని సరే పొద్దున్నే ఆరుకే వస్తాను. మూడు గంటల ప్రయాణం, పెద మావయ్యను మద్యలో పికప్ చేద్దాం అన్నా. నేను ఫోన్ చేసి చెప్తా అని అమ్మ అనడంతో ఆ రోజు అలా ముగిసింది.
కారులో స్పీడు ముల్లు వంద టచ్ చేస్తూ మదనపల్లె వైపు ఉరకలేస్తోంది. ఆరుగురితో అప్పటికే సిటీ దాటి ఓ ఇరవై కిలోమీటర్లు వచ్చాం. తెల్లవారే సూర్యుడి వెలుగును చూస్తూ అందరూ మైమరచిపోయారు. మద్యలో వచ్చే కోలార్ ఊరు ఏడున్నరకు చేరి మెడికల్ కాలేజ్ పక్కనున్న వుడీస్ రెస్టారెంట్ లో ఆపి బ్రేక్ ఫాస్ట్ కు ఇరవై నిముషాల స్టాప్ అంటూ ట్రావెల్స్ బస్సుగాడి లాగా అనేసి లోపల తినేసి తిరిగి ప్రయాణం సాగించాం. అక్కడ తింటున్నప్పుడు వాళ్ళని చాదస్తం మాటలతో విసిగించొద్దు అని నే చెప్పింది కారులో అందరూ గుర్తు చేసుకుంటూ ఇక మదనపల్లె దాకా నన్ను మంచింగ్ మొదలెట్టారు.
తొమ్మిదిన్నరకు ఆ ఊరు చేరి ఆనంద రావు గారికి ఫోన్ చేసి వాళ్ళింటికి రూట్ తెలుసుకున్నా. హార్స్లీ హిల్స్ వైపు వెళ్ళే దారిలో వాళ్ళ కాలనీ చెట్లతో చాలా అందంగా ఉంది. కరెక్టుగా ఇంటి ముందు కారాపుతుంటే అయ్యో.. పూలు పళ్ళు మర్చిపోయాం వెళ్ళి తేరా అని అమ్మ అనడంతో వాళ్ళని దింపేసి అవన్నీ తెచ్చా.
లోపలికి వస్తుంటే ఒక పెద్దాయన నమస్కారం పెట్టి రండి అని తీసుకెళ్ళారు. అప్పటికే మావాళ్లు ఏవో జోకులు కూడా వేసుకుంటున్నారు.
నేను లోపలికి రావడంతో ఒక్కసారి సైలెన్స్. ఎవరెవరో ఉన్నారు.. రావుగారు అందరినీ పరిచయం చేస్తున్నారు ప్రతి నమస్కారం చేస్తున్నా ఏమీ అర్థం కాక అమ్మను చూశా.. కాసేపు ఆగు అని కళ్ళతో చెప్పింది. చాలా మంది నన్ను స్కాన్ చేస్తున్న ఫీలింగ్, ఇంకొన్ని గుసగుసల మద్య మధుర ప్రణవి కనిపించింది.
చాలా అందంగా ఉంది. ఫోటో తీసిన వాడిని తిట్టుకున్నా.. నేను అమ్మాయిని గమనిస్తున్న విషయం అందరికీ తెలిసిందేమో, నన్నే చూస్తున్నారు. మెల్లగా కాస్త రిలాక్స్ అయ్యి చుట్టుపక్కల వాతావరణం గమనించడంతో ఆనందరావు గారు వాళ్ళ ఇంటి గురించి చెబుతూ కట్టించినప్పటి తన కష్టాలన్నీ చెప్పారు కానీ నాకన్నీ సగం సగమే ఎక్కాయి. అమ్మ కూడా మా మధ్యతరగతి జీవితం గురించి ఏదో చెప్పింది.
వచ్చింది చూడ్డానికే కదా అన్నట్లు కాసేపు అలా ప్రణవిని చూస్తుంటే ఇంకా చూడాలనిపించే అందం. ఇంతలో చటుక్కున తనూ నన్ను చూసింది. నేను తల తిప్పేశాను. తను ఇంకో పది నిమిషాల వరకు ఏదో పనున్నట్టు తల అటూ ఇటూ తిప్పుతూ మద్యలో నన్ను చూడ్డం మానలేదు.
నా కళ్ళు నన్ను పట్టించుకోక ఆమె వైపే అతుక్కుపోయాయి. ఆమె పలువరస ఎంతో అందంగా తళుక్కుమంటోంది. మొదటి సారి నేను ఒక అమ్మాయిని ఇంతలా చూడ్డం నాకే ఆశ్చర్యమేసింది.
ప్రయాణపు బడలిక ఎప్పుడు ఎగిరిపోయిందో నాకే తెలియలేదు.
వాళ్ళంతా సబ్బుల నుండి రాష్ట్రాలు దాటి దేశాల మీద ఏవో చర్చలు పెట్టారు. అవేవీ నా కాన్సంట్రేషన్ దెబ్బ తీయలేదు.
కానీ ఇదిగో అంటూ అప్పుడొచ్చింది నా ఉభాసం. చిరాకు దాచేసి ఆ ఉప్మా మీద ఆలోచనలతో టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక అమ్మను చూశా.. వాడు ఉప్మా తినడు లేండి కాఫీ తాగుతాడు అని రక్షించింది.
ప్రణవి మాత్రం చాలా సున్నితంగా నవ్వుతూ అమ్మ ఏదో అడిగితే జవాబిస్తోంది. ఆమె భావాలు చూస్తే కాసేపు నాతో మాట్లాడాలని అనిపించిందేమో! ఈ ఉప్మా గోల అయ్యాక ఇచ్చిన కాఫీ తాగితే ఓ పెద్ద రిలీఫ్.
అరచేతిలోని ఇసక లోకమంతా చూసినట్టు నాకు అమ్మాయిని చూసే ఫ్రీడం ఇచ్చి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదుగా.. అసలు ఇస్తారా లేదా అని నా ఆలోచన.
మా ఇద్దరిని వదిలేసి వాళ్ళంతా ఏవో ఫోటోలు అవీ ఇవీ అంటూ మాట్లాడటం కాస్త వినిపించినా మా కళ్ళు మాత్రం ఏవో కధలు చెప్పుకుంటున్న ఓ చిన్న సంతృప్తి.
ఇంతలో అమ్మ నన్ను చూస్తూ నువ్వు ఆ పూలు పళ్ళ కోసం వెళితే నీకన్నా ముందే మేమంతా లోపలికి రావడంతో వాళ్ళకు అబ్బాయి ఎవరో అర్థం కాలేదట.. నీ ఫోటో చూడలేదుగా అంది.
నా నోట మాట రాలేదు. తల గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. అసలు నేను ఎలా ఉంటానో తెలియకుండా, చూడకుండా ప్రణవి పెళ్ళిచూపులకు ఒప్పుకుందా!! ఒప్పించారా!! ఏం అర్థం కావట్లేదు.
అంతవరకూ ఉన్న నా ఉత్సాహం ఎవరో పీల్చేస్తున్నట్టు ఇంకిపోతోంది.
అమ్మాయి ఎలా ఉంటుందో తెలిసి ఏవేవో ఊహించుకున్న అబ్బాయికి, అసలు అబ్బాయే ఎలా ఉంటాడో తెలియని అమ్మాయికి మద్య ఉన్న స్పష్టమైన తేడా నన్ను ఇక మాట్లాడనివ్వలేదు.
ఎవడో అనామకుడి ముందు కూర్చుని తమ ప్రైవసీ తెంపుకుని గోప్యతంతా వదిలేసి మాట్లాడటం నాకే సిగ్గనిపించే విషయం. ఇదే ప్రణవి ఏదన్నా బస్టాప్ లో నాతో ఇలాగే ప్రవర్తించేదా అన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు.
ఎందుకిలా జరుగుతోంది.. స్త్రీ పురుష సమానత్వం ఒట్టి పేపరుకే పరిమితమా!! మగవాడి ఆధిపత్యం ఇంకా సాగుతూనే ఉందా!! మహిళా సాధికారత అంతా బూటకమా!!
ఇలాంటి ఆలోచనలు నన్ను బ్యాలెన్స్ చేయట్లేదు.
ఏదో ఫోన్ మాట్లాడాలి అని బయటకొచ్చా.. చుట్టూతా ఉన్న చెట్లు నాతో ఏకీభవిస్తున్నట్టు తలలు ఊపుతున్నాయి. ఆ వాతావరణం నాలో అలజడి కాస్త తగ్గించింది.
ఒక్కో విషయం మెల్లగా అర్థమౌతోంది. వాళ్ళు నన్ను స్కాన్ చేయలేదు. మొట్టమొదటి సారి చూస్తున్నారు. అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. జాతకం ఫోటో అంత త్వరగా పంపారా! అమ్మ మాట్లాడినవారు అసలు నా ఫోటో వీళ్ళకు పంపించారా అని!
ఎందుకో ఆనందరావు గారిని, వారి తాపత్రయాన్ని చూసి బాధేసింది. అమ్మాయిని కన్న తల్లిదండ్రులకెంత కష్టం!!
మావైపే తప్పు జరిగిందని తెలుస్తోంది కాని అది ఎలా దిద్దుకోవాలో అర్థం కావట్లేదు. ఏదో తెలియని సానుభూతి నాలో రకరకాల ఆలోచనలతో ఇబ్బంది పెడుతూంటే అమ్మ పిలిచింది.
ఇక బయలుదేరే సమయం రాగానే నాకు తెలియకుండానే అప్పటికప్పుడు నన్ను మారుస్తున్న ప్రణవిని చూస్తూ మనసు నిండిపోయేలా నవ్వడంతో ఆమె కూడా హాయిగా ఒక మంచి నవ్వుతో నాకు బై చెప్పింది.
బెంగుళూరు చేరుకోగానే అమ్మతో ఒంటరిగా కూర్చొని నేనాలోచించిన విషయం అంతా చెబితే కళ్ళలో చిరుచెమ్మతో నా మైసూర్ మహారాజు ఇంతగా ఎదిగిపోయాడా అంటూ పొంగిపోయింది.
ఇక నేను అంగీకారం చెప్పడం, ఆ విషయాన్ని వాళ్ళకి చేరవేయడంతో మైసూర్ ప్యాలెస్ ఈసారి నా పెళ్ళి కోసం వేచి చూడడం మొదలెట్టింది.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy