Episode 111

కే ఎన్ వై పతంజలి గారి 'మోటుమనిషి '

"సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు" - సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు కె ఎన్ వై పతంజలి .

హర్షణీయానికి స్వాగతం.

ఇప్పుడు పరిచయం చేయబోతున్న కథ పేరు 'మోటుమనిషి'.

ఈ కథను హర్షణీయం ద్వారా పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన శ్రీమతి ప్రమీల పతంజలి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

పతంజలి గారి సాహిత్యం , మీరు కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే పేజీ లో ఇవ్వబడ్డాయి.

పతంజలి గారు , అనేక కథలూ నవలలూ రాయడమే గాక, మూడు దశాబ్దాలకు పైగా పత్రికారంగానికి కూడా తన సేవలను అందించారు.

తెలుగు కథ ను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లిన కే ఎన్ వై పతంజలి గారి గురించి, ఆయన చిరకాల మిత్రులు , సుప్రసిద్ధ రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు ఏమంటారంటే

'' రచయిత అయినవాడు తన ఆవరణంలోంచి ఎదిగి మరో ఆవరణం నుంచి జీవితాన్ని దర్శించగలగాలి. అట్లా దర్శించగలిగిన వాళ్లు గొప్ప రచయితలుగా మిగిలిపోతారు. ఒక సంకుచితమైన పరిమితిని విధించుకుని చేసే రచనలకీ వార్తా కథనాలకీ పెద్ద తేడా ఉండదు. ప్రపంచ సాహిత్యంలో గొప్ప వనుకుంటున్న రచనలన్నీ సమకాలీనతని జీర్ణించుకుంటూనే దాన్ని అధిగమించినవే. పతంజలి రచనలు ఆ కోవలోకి వస్తాయి.మంచి రచనకీ గొప్ప రచనకీ ఉండే మౌలికమైన భేదం అదే. పూర్తిస్థానీయత, సమకాలీనత రచయితకి సంకెళ్లు కాకూడదు. గొప్ప రచన అనేక పొరలుగా, అనేక స్థాయిలలో పాఠకుడికి చేరువవుతుంది. అట్లా ఎప్పుడు ఏ కాలంలో చదివినా పాఠకుడు ఆ రచనలో రిలేట్ అవుతాడు. అటువంటి రచనలు ఉత్తమ సృజనాత్మకతకి ఉ దాహరణలు..."

మోటుమనిషి

అతని వయసు నా వయసుచేత రెండుసార్లు భాగారింపబడుతుంది. అతని ఒళ్లు కూడా నా సైజు ఇద్దరు మనుషులకు సరిపడా ఉంది. అతను వ్యవసాయదారుడే అయిన పక్షంలో, పొలానికి సరిపడే ఎరువు అతని ఒంటినే ఉంది.

కాని, వెధవకి బుద్దే ఉన్నట్టు లేదు. ఖచ్చితంగా చెప్పగలను. లేదు. ఉంటే నేనతన్ని మర్యాదగానే - "మీరు నా సీట్లోకి వచ్చేస్తారా - నా కా కిటికీ పక్క చోటిచ్చేసి?” అనడిగినప్పుడు - “రాను... నాను సుట్ట కాల్చుకోవాలి” అని నిర్మొహమాటంగా చెప్పడు.

'వీణ్ణి చుట్ట కాల్చుకోనివ్వకూడదు.” గట్టిగా నిశ్చయించుకున్నాను. బస్సు వేగంగా పోతూంది. గాలికి కామోసు అతని తలమాత్రం కొంచెం కదులుతూంది. జిడ్డు తల.

అరచేతులంతేసి చెవులు. వాటికి స్కూటర్ చక్రాలంతేసి తమ్మెట్లు. వాటికి మురికి పూసుకున్న ఎరుపూ, తెలుపూ పొళ్లు.

బుద్ది లేకపోయిన తరువాత ఇంకా ఏమేం ఉంటే మాత్రం ఏమిటి లాభం ? అసలు ఉదయం లేచిన దగ్గరి నుంచి తల నొప్పిగా ఉంది. దరిద్రపు తలనొప్పి, తెలుగు సినిమాలాగన్నా వచ్చిన వెంటనే తిరిగిపోదు. నిద్రలేచి మంచంమీద నుంచి కాళ్లు కింద మోపేసరికి, పనిలేని పెళ్లాం లాగ, పనున్న స్నేహితుడిలాగ వచ్చేసి నెత్తికెక్కి కూర్చుంది దిక్కుమాలిన తలనొప్పి.

మళ్లీ పక్కన కూర్చున్న నాయుడికేసి చూశాను. అతను కిటికీలోంచి కనబడుతూన్న చెట్లకేసీ, చేమలకేసీ కాబోలు దీక్షగా చూస్తున్నాడు. వీడి దృష్టి తగిలితే అవి చటుక్కున చచ్చి ఊరుకుంటాయి.

వీడు ఎంతకీ చుట్ట కాల్చటానికి ప్రయత్నించటం లేదు. ఇలా వాడు చుట్ట తీసి ముట్టించ ప్రయత్నించడం, నేనిలా మొదట ఇంగ్లీషులోనూ తరువాత తెలుగులోనూ అభ్యంతరం చెప్పి పగ తీర్చుకోవడం - ఈ పూటకి సరదా తీరేలా లేదు.

కిటికీ పక్క సీటయితే ఓ చేయి కిటికీ చువ్వల మీద ఆన్చి, రెండో చేయి ఎదుటి సీటు తాలూకు చట్రం మీద ఆన్చి, చేతుల మీద తలాన్చుకుని పడుకోవచ్చు - ముఖ్యంగా ఇలా తలనొప్పిగా ఉన్న సమయాల్లో,

కానీ, ఈ భారతదేశపు హృదయాలయిన పల్లెటూరి తాలూకు పౌరుడు, రాతి గుండెవాడు. ఎక్కడ దిగిపోయి నన్ను సంతోష శిఖరాల మీదికి ఎక్కిస్తాడో? “ఎక్కడ దిగుతారు?” అడిగాను. 

అతను నాకేసి పరీక్షగా చూశాడు. “సోడారం.” చచ్చాం .

వీడు నన్ను చివరివరకూ వదలడు. “మందే ఊరు?” నాయుడడిగాడు నన్ను.

నా ఎడమచేతి పక్కకి చూశాను. ఓ ముఫ్ఫై ఏళ్ళ వయసున్న టెరిలిన్ బట్టల ఆసామీ వీక్లీ ఒకటి మధ్యకి మడత పెట్టి చదువుతున్నాడు.

“ఎక్కడి కెళ్తన్నావు?” నాయుడే మళ్లీ అడిగాడు.

గొంతు తగ్గించి, “వెస్ట్ జర్మనీ” అన్నాను నెమ్మదిగా. నాయుడికి అర్థమయినట్టు లేదు. “అదెక్కడ?” ఆశ్చర్యంగా అడిగాడు.

“చోడవరానికి ఇంకా అవతలుందిలే” అన్నాను.

“చోడారంలో ఈ బస్సాగిపోద్ది. ఆ మీదికెళ్ళదు.” నాయుడు ముతకగా నవ్వాడు.

“చోడవరంలో దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చులే.” విసుగ్గా అన్నాను.

దెబ్బతో నోరు మూసుకున్నాడు.

బస్సు ఆగింది. చిన్నాపురం జంక్షన్. ఇద్దరో ముగ్గురో దిగి, ఆరుగురనుకున్నాను కానీ - ఏడుగురెక్కారు.

లాభం లేదు. నాకు తెలియకుండానే ఏయే ఊర్లలో ఎందరెందరు దిగి ఎంతమందెక్కారో లెక్క పెడుతూ చెక్కర్ ఉద్యోగం చేస్తున్నాను.

తలనొప్పి రానురానూ ఎక్కువవుతూంది. చిరాకుగా ఉంది.

జీనియస్సులు పరాకుగాను, కాదలుచుకునే నాలాంటి జీనియస్సులు చిరాకుగానూ ఉంటారు కామోసు. .

పక్కాయన్ని వీక్లీ అడిగినా బాగుండును. చూసి ఇచ్చేయవచ్చు. సరే “వీక్లీ ఓసారిస్తారా?” అడిగాను.

అతను నాకేసి సీరియస్ గా చూశాడు.

“ఇవ్వను.” ఖచ్చితంగా చెప్పాడు. ఆహా! దుర్మార్గుడు. పైగా హృదయం లేనివాడు. ఏ కో-ఎడ్యుకేషన్ లేని కాలేజీకో ప్రిన్సిపాలుగా ఉండదగ్గవాడు.

కుడిచేతి పక్క నాయుడే బెటర్. అడిగితే చుట్టన్నా ఇచ్చేలా ఉన్నాడు.

చుట్టేం ఖర్మ? గారంటీగా భుజంమీదున్న తువ్వాలు కూడా ఇచ్చేసే అంత ధాటీగా ఉన్నాడు.

కానీ, నాకు కావలసిన ఆ కిటికీ పక్క సీటే ఇవ్వడు.

పక్కనున్న వీక్లీ వెధవని టైమడిగితే, అదన్నా చెబుతాడా? చెప్పకపోయినా చెప్పకపోవచ్చు. ఏ దుర్మార్గుడి నోటి వెంట ఎలాంటి సమాధానం వస్తుందో ఎవరికి తెలుసు?

వీడిని టైముగాని, వీక్లీగాని, అప్పుగాని ఏమీ అడగకూడదు. నాయుడిని చుట్టకాని, సీటు కాని, ఓ భోగట్టాకాని అడగకూడదు.

పక్కవాడిని అడగనవసరం లేకుండానే టైమెంతో తెలుసుకోవచ్చు. ఈజీ. వాడు చేయి కిందకి దించినప్పుడు

చూశాను.

“ఒంటిగంట.” పెళ్లికెళ్ళి జోడు పోగొట్టుకున్న వాడిలాగ ఎండ మండిపోతూంది.

చోడవరం చేరడాని కింకా గంటన్నర టైముంది. గంటన్నర... దుర్మార్గులిద్దరి మధ్యా... ముఖ్యంగా తలనొప్పితో.

పరీక్ష హాలులో మూడు గంటలు తెల్ల కాగితం వాడకుండా ప్రయత్నం మీద కూర్చోవచ్చు. తెలుగు నాటకం కాని, సినిమా కానీ కదలకుండా చూడొచ్చు ఆ మాటకొస్తే.

కానీ, వీళ్ళద్దరి మధ్యా...???

భోజనం చేసి విజయనగరంలో బస్సెక్కెను. ఎంతో పాపం చేసుకోబట్టి వీద్దరి మధ్యా పడ్డాను. ఇంకో సీట్లోకి మారిపోవచ్చు. ప్రభుత్వం కాని, కండక్టర్ కాని, ప్రయాణికులు గాని ఎవరూ అభ్యంతరం చెప్పరు.

కానీ, ఇంకే సీటూ ఖాళీగా లేదు.

బస్సు అక్కడక్కడ ఆగుతూ జిడ్డుగా ముందుకి వెళుతూంది. తలనొప్పి మాత్రం ఎక్కడా ఆగకుండా చురుగ్గా పెరుగుతూంది.

కొంతమంది మగాళ్ళని చూస్తే చిరాకేస్తుంది. చంపేయబుద్ధవుతుంది.

నమ్మకంలో ప్రస్తుతం కుడి ఎడమయినా పొరబాటు లేదు.

ఈ చిరాకూ, తరవాతదీ మగవాళ్ళకి మాత్రమే పరిమితం.

అదేమిటో గాని అమ్మాయిల్ని ఎవర్ని చూసినా చిరాకెయ్యదు. పైగా ఎంతో ముచ్చటేస్తుంది. అదీ గమ్మత్తు.

బస్సు జిడ్డుగా ముందుకు పోతూంది. గాలి మొహమాటపడి వీస్తున్నా - నాయుణ్ణి దాటి నా దగ్గరికి చేరలేక పోతూంది. చిరాకుగా ఉంది.

ముందు సీటుకి చేతులాన్చి, చేతులమీద తల వాల్చి పడుకున్నాను. దుమ్ము పూసుకున్న నాయుడి రాకాసి పాదాలు టైరు చెప్పులు వేసుకుని ఉన్నాయి. కాళ్ళ వెనక, సీటు క్రింద మైకా సంచీ ఒకటి ఉంది.

కళ్లు మూసుకున్నాను. కళ్లు మూసుకుంటే ఒళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. కళ్లు విప్పి కిందికి చూస్తున్నాను.

నాయుడు క్రిందికి వంగి కాళ్ళ మధ్య నుంచి మైకా సంచీ ఇవతలికి లాగాడు.

దాన్నిండా వేరుశెనక్కాయలు, రెండు గుప్పిళ్ళు తీసి కాలితో సంచీ మళ్లీ వెనక్కి తోసేశాడు.

బహుశా గడ్డి తవ్వడానికో, గొడ్డలితో కర్ర మొద్దులు చీల్చటానికో పుట్టిన మొద్దు వేళ్ళతో వేరుశనగ ఒలుస్తున్నాడు. చిటుకూ, చిటుకూమని.

ఒలుస్తున్న చప్పుడు. నములుతూన్న మెత్తని, అసహ్యకరమయిన శబ్దం... క్షణాలు గడుస్తున్న కొద్దీ అన్ బేరబుల్ గా, పెయిన్ ఫుల్ గా ఉంది.

బస్సు ముందుకి వెళుతున్న కొద్దీ దూరంతోపాటు ఓర్పు తగ్గుతూంది.

చిటుక్... చిటుక్... చెవుల్లో కాదు, మెదడులో కాదు నా సహనం మీద సమ్మెట దెబ్బలు.

దుర్భరంగా ఉంది. నా పక్క ఉన్న ప్రిన్సిపాల్ బుద్ధులున్న వీక్లీ వాడి కిదేం పట్టినట్టు లేదు.

వెధవలు. ప్రక్క మనిషి బాధ అర్థం కాదు.

సినిమా చూసేవాడి బాధ తీసేవాడికి అర్థం కాదు. చదివేవాడి అవస్థ వ్రాసేవాడికి అక్కర్లేదు.

బస్సులో కూర్చున్న వాడి బాధ కండక్టర్ కి అవసరం లేదు.

రిజల్ట్ను చూసే విద్యార్థుల ఘోష కంపోజ్ చేసేవాడికి అక్కర్లేదు.

ముఖ్యంగా ఇల్లాంటి రూట్ బస్సులలో నాలాంటి నాజూకు మనిషికి నరకం.

అసలు అడ్డమైన వాడినీ బస్సులలో ఎక్కనివ్వకూడదు.

ఎక్కనిచ్చినా బస్సులో కూర్చుని ఏ గడ్డీ నమలరాదని రూలింగివ్వాలి.

తింటే జేబులోని డబ్బులన్నీ లాక్కుని సగం దారిలో దించెయ్యాలి.

నా మటుకు నాకో రోజు సర్వాధికారం ఇస్తే, ఈ నాయుడితో మొదలెట్టి అనాగరికులందరినీ ఉరి తీయించి పారేస్తాను.

అఫ్ కోర్స్! మనకి ఇష్టంలేని లెక్చరర్స్ నీ, ప్రిన్సిపాల్స్ నీ, కొంతమంది కథకుల్నీ, మరికొంతమంది సినిమావాళ్ళనీ, కొంతమంది ఆడపిల్లల తాలూకు క్రూరులైన తండ్రుల్నీ ఈ స్కీములో కలిపేయవచ్చు.

ఎన్నయినా చేయచ్చు కాని, ఈ నాయుడు చేత శనక్కాయలు తినడం మాత్రం తక్షణం మానిపించలేం.

తలనొప్పి తల కొరుకుతూనే ఉంది. వేరుశనగ తింటూనే ఉన్నాడు నాయుడు. నా చేతిని లేని, నాది కాని, నా ప్రక్క ఉన్న ప్రిన్సిపాల్ పోలికగాడి చేతినున్న గడియారం తిరుగుతూనే ఉంది. 

బస్సు కొత్తవలసలో ఆగింది.

ప్రిన్సిపాల్ దిగిపోయాడు. అతను ఖాళీ చేసిన స్థలంలో ఒక బెల్ బాటమ్ అబ్బాయి కూర్చున్నాడు. ఎర్రగా, నాజుకుగా, సన్నగా ఉన్నాడు. నాకేసి చూసి పలకరింపుగా నవ్వాడు.

నాయుడు జంతికలు కొనుక్కుని, గ్లాసుడు మజ్జిగ కొనుక్కుని తాగాడు. ఇండీసెంట్, అన్ హైజినిక్. అడ్డమయిన గడ్డి తినడం, తాగడం. మొత్తం సమాజం ఇంకా తిండి అవస్థకి మించి ఎదగలేదు.

కొంతమంది దిగారు కాని, నా నెత్తిమీదున్న తలనొప్పి మాత్రం దిగలేదు. కొంత సేపు పోయిన తరువాత బస్సు బయలుదేరింది. తలనొప్పికి తోడు, ప్రాణాల్ని తినేస్తున్న దరిద్రపు జంతికల చప్పుడుకు తోడు కడుపులో తిప్పుతూంది. నోట్లో విజృంభిస్తున్న ఉమ్మి.

కొత్తగా వచ్చి కూర్చున్న కుర్రాడు అతి మంచివాడులాగానూ, సంస్కారవంతుడు లాగానూ ఉన్నాడు. స్నేహపూర్వకంగా నవ్వి వక్కపొడి ఆఫర్ చేశాడు. మొహమాటపడినా ఒకే ఒక్క పలుకు మాత్రం తీసుకున్నాను. అంతమంచి అబ్బాయితో మంచీ చెడ్డా మాటాడితే బాగుండును.

కానీ, ఒంట్లో ఓపిక మాత్రం లేదు. బస్సు మెలికలు తిరుగుతూంది. కడుపులో తిప్పు లావయింది. భోజనం చెయ్యకుండా బస్సెక్కి ఉండవలసింది.

లాభం లేదు, లాభం లేదు. వాంతయ్యేట్టుంది. ఇంక ఆగేలా లేదు. దుస్సహంగా ఉంది. భళ్లున వాంతి అయింది.

నా బూటు మీదా, నాయుడి దుమ్ము కొట్టుకున్న పాదాల నిండా అసహ్యంగా అరిగీ అరగని అన్నం మెతుకులు. నాయుడీ వేళ నా అంతు చూస్తాడు... తప్పదు.

“అరర్రే!...” నాయుడు గాభరా పడ్డాడు. ఇక తన్నడం తరవాయి.

“ఏక్...”

నా పక్కనున్న అబ్బాయి అసహ్యించుకుని లేచి ముందుకు వెళ్లి నిలబడ్డాడు. చివుక్కుమంది మనసు.

“ఛ! ఛ! కొంచెం చెబితే బస్సాపుదుం కదండీ... ఫ్లోరంతా పాడయిపోయింది.” కండక్టర్ విసుక్కున్నాడు.

ఒళ్లు స్వాధీనం తప్పుతూంది. గుండెలు ఎంతో వేగంగా కొట్టుకుంటున్నాయి. ముందుకు తూలి ఎదుటి సీటుకి నుదురు కొట్టుకుంది.

“అరర్రే... పాపం...” నాయుడి గొంతుకే అది.

నా తలని, గడ్డి తవ్వడానికీ, కట్టెలు చీల్చటానికీ, వేరుశనగ మోటుగా ఒలవటానికి పుట్టాయనుకున్న మోటు చేతులే జాలిపడి అప్యాయంగా పట్టుకుని, దుమ్ముపట్టిన, తెగ మాసిన, అసహ్యకరమయిన ఒడిలోనే పడుకో బెట్టుకున్నాయి.

***************

పుస్తకం వివరాలు :

'పతంజలి సాహిత్యం : సంపుటం - 2'

పుస్తకం కొనడానికి 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.

నవోదయ బుక్ హౌస్

3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్

ఫోన్ నెంబర్: 90004 13413

https://kinige.com/book/Patanjali+Sahityam+Volume+2

లేదా డిజిటల్ ఎడిషన్ కొనడానికి పై లింకుని క్లిక్ చెయ్యండి.

*Intro- outro BGM credits: Envanile | Jingleman (https://www.youtube.com/watch?v=fyM41M0n3lI)



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations