Episode 184

'మంత్రపుష్పం' - మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ

హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ - మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన.

తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది.

కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది.

ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ సూరిబాబు గారికి కృతజ్ఞతలు.


హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1


స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)


ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

మంత్రపుష్పం :


పాపం! - చిట్టి రాలిపోయిందిరా!" అన్నాడు, మొనమొన్ననే జిల్లా కాంగ్రెసు సంఘంలో కృత్యాద్యవస్థమీద సభ్యుడుగా జొరబడ్డ మా పంతులు.

"ఎప్పుడు?" అని మేం నలుగురం అడిగాము, గొంతులు బిగిసి.

 “వారం రోజులయింది!" అని జవాబు ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టు!

"బ్రతికి ఎందర్నో సుఖ పెట్టింది! పోయి తాను సుఖపడుతుంది" అంటూ మాలో ఒకడి నిట్టూర్పు!

"ఆ బ్రతుక్కి చచ్చిపోవడంకన్న సుఖమేముంది? తెరిపి ఏముంది?- అదృష్టవంతురాలు!" అని మరొకడి సాకారం.

“అవును, దాని బ్రతుకంతా చచ్చినచావే! అది కాగా నెట్టుకొచ్చింది కాని, మరో ఆడదైతే-"

“మరో ఆడదానికి అంత దమ్ముంటుందా?- గట్టిగా చెడిపోయేందుకన్నా నిష్ఠంటూ ఒకటి ఉండాలి!"

చిట్టి బ్రతికి ఉన్నప్పుడు, ఎవరన్నా ఇలా నోరెత్తగలిగారా? - ఎవడికి గుండెలున్నాయ్

-ఎవరెల్లా మాట్లాడినా, మొత్తానికి అందరమూ చిట్టి స్వర్గానికి చేరుకున్నందుకు - సాదా స్వర్గం కాదు, పచ్చి వీరస్వర్గం - ఎంతో వాపోయినాము. మా విచారం చిట్టి పోయిందని కాదు. సరిగ్గా ఆ వేళకే - ఎప్పుడూ ఊళ్ళోనే ఉట్టి కట్టుకుని ఊరేగే బడుద్దాయిలం యావన్మందీ - ఏదో మునిగిపోయినట్లు - ఎవరమూ ఊళ్ళో లేకుండా పోయినందుకు, ఆ వైభవం కళ్ళారా చూసే భాగ్యం లేకపోయినందుకు..

చిట్టి భౌతిక శరీర లేశానికి వీరాధి వీరోచిత మర్యాదలు జరిగినవి. త్రివర్ణ పతాకాన్ని కప్పి, కాంగ్రెసు వాలంటీర్లు, రెండోరకం నాయకులూ జయజయ నినాదాలతో బారులు తీరి ముందు నడవగా, చిట్టి పితృవనానికి పయనించింది. మంచిగంధపు ధూళిలో మలిగిపోయింది.

ఈ మర్యాదలో మర్మం - మా ఊరి వారికి - అందులోనూ ఇంగితమున్న కొందరికి - కాని అర్థంకాదు. విన్నవాళ్ళూ - పత్రికలో చదివిన వాళ్ళూ - "ఇదేం విడ్డూరం? ఈ ఊళో కాంగ్రెసువారు కేమన్నా పిచ్చి ఎక్కిందా? లేకపోతే, పెద్దలను వెక్కిరించడానికా, ఈ తతంగమంతా. 

లేకపోతే.. సామాన్యపు బజారీ పడుపుగత్తె కనుమూస్తే బ్రహ్మరథం పడతారా? " అనుకుంటూ విసుపోవచును అందులో అబ్బురం ఏమీలేదు. చిట్టి బ్రతుకు మా సీమదాటి ఎందరికి తెలుసు? - ఆ మనిషి మనసు ఎవరికి తెలుసును .

పోనీ - ఇప్పుడన్నా, లోకం కనువిప్పడం మేలు.

చిట్టి - ఏ తల్లి కడుపునో పుట్టింది. ఏ చెట్టునీడనో తినో మానో ఎలాగో పెరిగింది. పదేళ్లు వయసులో బొద్దుగా గున్నలాగా ఉండేది. సినీమాకు, ఆడవాళ్ళ గేటు దగ్గిర సమ్మరం చూచుకుని దూసుకుపోయేది. సినీమాలో విన్న పాటలూ - చూసిన ఆటలూ - కునికిపాట్లు పడుతూండే జట్కాబండి వాళ్ళ దగ్గిరపాడేది - ఆడేది. వాళ్ళు విసిరేసిన కానీ డబ్బులు పరికిణీ రొండిన దోపుకునేది. ఎవడి చెవిసందునుంచో ఓ బీడీ ఎగేసుకుపోయి, కమ్మగా దమ్ముకొట్టి ఎక్కడ నిద్రవస్తే అక్కడే పడుకునేది. చెట్టుమీద వాలే గువ్వపిల్లంత గోముగా, ఈ చెట్టుకింద పక్షి పెరిగింది.

చిట్టికి ఎవరా పేరు ఎప్పుడు పెట్టారో, ఎవరా పేరుతో మునుముందుగా పిలిచారో తెలిసే దాఖలా ఏమీలేదు. కాని, ఓ రకంగా ఊహించడానికి కొంతవరకు వీలున్నది. అసహాయోద్యమ యోధులలో కొన్ని వర్గాలు కేవలం శాంతి సమరంమీద విసుగుపుట్టి - రైలు పట్టాలు లేవనెత్తడం, తంతితీగెలు తెంచడం ఇత్యాది సర్కస్ ప్రదర్శనానికి నడుంకట్టి దుమికిన రోజుల్లో - మా వూళ్ళో, ఉత్తరాదినుంచి వచ్చిన గారడివాడి ఆటలో, తొలుదొల్తగా  చిట్టి సాక్షాత్కరించింది. 

వాడు, ఏదో లాగవం చేయడానికి - ఎవరన్నా ఓ కూన అవసరమై,  చుట్టూ మూగిన మూకలో ఏ పోరగాణ్ణి రమ్మన్నా రాకపోవడంతో - "పోనీ నీవు రా చిట్టి, నిన్నేం కొరుక్కు తిననులే!" అని, జనం మధ్య కుమ్మిసలాడుకుంటూ ఆట చూడటానికి ముందుకు నెట్టుకువస్తున్న ఈ ఏబ్రాసిని, వాడు వెక్కిరింతగా పిలవడంతో, చిట్టి ఆ సుముహూర్తాన రంగంలోకి నిర్భయంగా దూకి - వాడితోబాటు ఆడి, వాడిని ఆడించి ఆ పూటనుంచీ - చిట్టి మాదైపోయింది. అదే పేరైపోయింది.

చిట్టి ఎవరు పిలిచినా పలికేది. అందరినీ కవ్వించి మాట్లాడేది. దాని మాటలో అదో పొంకం ఉంది. మాటకు మాటకూ మధ్య మౌనంగా పెదవి విరుపులో - ఆ కంటి చూపులో - ఏదో చెప్పరానంత నిండు ఉంది. చిట్టి అలవోకగా బూతులు మాట్లాడేస్తున్నా, ఎంత శోత్రియుడికైనా వినడానికి ఏమీ ఎబ్బెట్టు ఉండేది కాదు.

చిట్టి అధిక చక్కంది. అదంతా అర్థంకాని అందం. ఎండా వానా అనకుండా, అహర్నిశలూ ఆగమ్మ కాకిలాగా తిరుగుతూ, అందిందల్లా తింటూ, ఏ జన్మానా, జుట్టుకు చమురూ, ఒంటికి నలుగూ లేని ఏబ్రాసి - లక్సు పరిమళ సబ్బుతో చర్మ సౌందర్యాన్ని రక్షించుకునే తారల గ్లేజు  బొమ్మలకన్న పోణెం  గా ఉండేది. పిల్లదాని పోషణ యావత్తు పంచప్రాణభూతాలు చేసేవి,  అని మా కందరికీ గట్టి నమ్మకం! వచ్చిన ఏడాది లోపలే చిట్టికి నిండుగా వయసు వచ్చేసింది. 


వచ్చిన మరుక్షణంలోనే - ఎవరో , పొరుగూరు నుంచి బడి చదువుకోసం వచ్చిన ఓ కుర్రవాడి చెంప - నడి బజారులో నాలుగు రోడ్లు కలిపే రద్దీలో మెరుపు దీపం క్రింద చెళ్ళుమంది. అది ఎలా జరిగిందంటే -

చిట్టి అప్పటి నుంచి, కొన్ని రోజులుగా, సంజపడిన తరువాత సరిగా అదే వేళకు, ఆ దీపం దగ్గరకు వచ్చి, ప్రొద్దుపోయేదాకా ఉండి కడుపు పట్టినంత, ముంత క్రింద పప్పు కొనుక్కు తినేది. అంటే, తిన్నదంతా కొనుక్కునేది అనకూడదు. కొన్నప్పుడల్లా కొన్నంత కొసరేయించుకునేది. చనువైనవాడు కొంటూంటే కలియబడి ఓ పట్టెడు కముచుకునేది - బేరం సాగినంత సేపూ ఇలాగే బొక్కుతూ, చివరకు

వాడు జంగిడి ఎత్తేవేళకు - మిగిలిన అడుగూ బొడుగూ దులిపించుకుని - కారం చేయి, పక్కనున్న స్తంభానికి వేసి పామి - ఓ గుక్కెడు నీళ్ళు తాగి, చక్కా బోయేది.

అవాళా అలాగే పోతూంటే - అందుకోసమే కాపేసుకుని ఉన్న కుర్రవాడు చాలా దూరం వెన్నంటి వెళ్ళి - అడుగు కలిపి అడుగువేసి - పలుకరించబోయినట్లు గొంతు తడబడి అందుబాటులో ఉన్న చెయ్యి పుచ్చుకున్నాడు. చిట్టి నదురూ బెదురూ లేకుండా - తెరిపిగా ఉన్న చేత్తో, వాడి చెంప మోగించింది. దెబ్బతో, వాడు పాపం గింగిరాలెత్తిపోయి - ఓ పొల్లుకేక పెట్టి, రోడ్డు పుచ్చుకున్నాడు.

రాత్రి ఇలా జరిగిందని చిట్టి, తెల్లవారగానే ఎవరితోనో చెప్పింది. నిమిషంలో ఆ కథ ఊరు మొత్తంమీద గుప్ మన్నది. చిట్టికి వయసు వచ్చిందని అందరికీ అర్ధం అయింది.

ఊరు యావత్తూ విస్తుపోయిందంటే అబ్బురం ఏమీలేదు. అన్నాళ్ళనుంచీ చిట్టి, అలా వాళ్ళ నడుమను పెరుగుతున్నా. అంత ఏపుగా కనబడుతూన్నా - చిట్టి వయసు వచ్చిన పిల్లది అనే భావనగాని - దాన్ని చూసి మరులెత్తించుకోవాలనిగాని - ఎందుచేతనో జనాభాలో ఏ ఒక్కడికీ తోచినట్టులేదు.

ఆ క్షణాన్నుంచి ఎవడికివాడే చిట్టిని చూస్తే బెదిరిపోవడం మొదలు పెట్టాడు. చిట్టి మాత్రం ఏమీ మారిపోలేదు. చుట్టూ మెలిగే లోకం మాత్రం విచ్చిపోయింది.

బెదురు ఎందుకంటే ఆ చిన్నది చేయి చేసుకుంటుందని కాదు. అది భయం కూడా కాదేమో - ఎవరి మానాన వాడు తానంత యంబ్రహ్మ నేమో అని కించపడి ఉంటాడు. ఇంకోఫికరు కూడా ప్రతివాడికి ఉండి ఉంటుంది. చిట్టి ఎంతమాత్రమూ చాటూ మాటూ లేనిపిల్ల. ఇదివరకైతే ఆ చొరవ అందరికీ సరదా. ఇప్పుడు, మునుపటి ధోరణిలోనే పలుకరిస్తే - చిట్టి ఏమనుకున్నా అనుకోకపోయినా, చూసే మరో మగరాయడు అసూయతో అయినా, అపార్థం చేసుకుంటాడు.

చిట్టి కనబడ్డ ప్రతి మనిషితోనూ, రాత్రి జరిగిన ముచ్చట చిలవలు పలవలు లేకుండా చెప్పింది. ఎంత పనిమీద పోయే పెద్దమనిషినైనా, నిలవేసి చెప్పింది. కోర్టుకు వేళ మించిందని ఉరుకులు పరుగులుగా జట్కా ఉరికించే లాయర్లను నిలవేసి చెప్పింది. తప్పించుకుపోయేవాళ్ళని తరుముకు వెళ్ళి, చేయి పట్టుకుని జబర్దస్తీగా ఆపి చెప్పింది. ఓపికున్నంతవరకూ, ఒక్కొక్కడికే చెప్పి... ఎంతసేపటికీ తెమలక పోతే చిరాకుపడి పీచుమిఠాయి అమ్మే సాయెబ్ చేతిలో బాకా లాక్కుని, నాలుగు దిక్కులూ దద్దరిల్లేట్లు చెప్పింది.

జరిగిందేదో చెప్పిందే కాని, అవతల కుర్రవాణ్ణి తుట్టలేదు - తిమ్మలేదు. జాలిగా, విసుగ్గా, కసురుకుంటూన్నట్టు తనలో తాను గొంతెత్తి అనుకుంది. “వాడేం మొగాడు!- చెయ్యట్టుకున్నాడు!"

ఆ కథ అంతటితో పోలేదు. ఆ కుర్రవాడెవరో మాకెవరికీ ఈనాటికీ తెలియదు. చిట్టికీ తెలియదు. కాని అహోరాత్రాలు అదే చూపుగా తిరిగి, ఎక్కడో మొత్తానికి పట్టుకుంది. పట్టుకుని, వాడు కోరుకున్న సుఖం బలవంతం చేసి దక్కించింది.

ఈ చోద్యం తనంత తాను చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది. దోవ వెంబడి, పురివిప్పిన బుక్కా పావురం మల్లే చిట్టి ఏదో బరువెత్తి దించిన తేలికతో, నడిచిపోతూ - చంకనున్న పాపణ్ణి  ఆడించుకుంటూ గుమ్మంలో నిలుచున్న ఏ ఇల్లాలితోనో, ముచ్చటంతా చెప్పేసిందట!

_ “మగవాడంటే ఎలాటి గండో అనుకున్నానమ్మా, ఆస్తమానం పసిపాపే!- కడు పెరిగి ఉంగపట్టాలి. లేకపోతే జాతి జాతి ఆకలితో అటమటించి పోతుంది!" ఇంత నీతి చెప్పిందట!

చిట్టి ఈ మాటమీదే బ్రతికింది ఇన్నాళ్ళూ!

లోకం చిట్టిని ఏనాడూ వెర్రిదానికింద జమకట్టలేదు. వ్యభిచార నిర్మూలన చట్టం అమలుపరచే శాఖలో జమాశెట్టి లెవరూ, చిట్టి విషయంలో అలాటి పాపం ఎన్నడూ తలచలేదు. చిట్టి ఏం చేసినా, ఏమన్నా మాకెన్నడూ ఓగు అనిపించలేదు. అలా బ్రతికింది.

తాను బ్రతకడం కాదు, లోకాన్ని బ్రతికించింది.

ఊరేగే దేముడికన్నా ఊరి రోడ్లవెంట విచ్చలవిడిగా తిరిగే చిట్టికి బుద్ధి ఉన్న ప్రతివాడూ మనసులో ఎందుకు మ్రొక్కుతాడో మేం చెపితేకాని లోకానికి తెలియదు.

యుద్ధం ముమ్మరంగా ఉన్నరోజుల్లో కదలే పటాలం విడిసే పటాలంగా మా ఊరు, పవలూ రాత్రీ మేలుకునే ఉండేది. దండు స్టేషనులో దిగగానే - అందుకైనా అధికారులు వాళ్ళకి లెక్క ప్రకారం అన్నపానీయాలకు మటుకు ఏర్పాటుచేసి, తరువాత వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేవాళ్ళు. మా ఊళ్ళో.... మహానగరానికి అనువైన కశ్మలం తొక్కిడీ మటుకే కాని, సదుపాయాలు మాత్రం సున్న. కొమ్ములు తిరిగిన కొన్ని నగరాల్లో... ప్రపంచ సంగ్రామంలో ప్రాణాలు అర్పించటానికి... పొట్ట చేత్తో పుచ్చుకుని సన్నద్ధులైన  వీరులకోసం, ఎడనెడ చీకటి విడుదులు అధికారులు ఏర్పాటు చేసిన వైనం గ్రంథస్థం కాకపోయినా... అభిజ్ఞవర్గానికి  ఆ విషయం కరతలా మలకమే.

మా ఊళ్ళోమటుకు, దిగిన ఆసాములు ఆదమరవడానికి అలాటి సదుపాయం లేకపోవడంతో... సంజె పడగానే పారువేటకు తండాలు తండాలుగా బయలుదేరిన యోధులు. చీకటిలోనో గుయ్యారంలోనో ఆబకు అడుగువేసి... అడుగులోనే పడకవేసి... తరువాత ఏమైపోయేవాళ్ళో దైవానికి ఎరుక! ఒళ్ళు విరుచుకు వచ్చిన పటాలం మళ్ళీ తరలే వేళకు చచ్చి సగమైనంత హీనంగా, ముప్పాతిక మువ్వీసం జబ్బు పెట్టెలో పడిసాగిపోయేది. 

ఇది, అందరికీ తెలుసు! కాని ఎవరేం చేస్తారు? అధికారులు మట్టుకు ఎన్నింటికని దేవుల్లాడుతారు?

ఎవరికీ తరంకాని ఘనకార్యం చిట్టి సాధించింది. క్రొత్తలో, పటాలాలు దిగుమతి అవుతున్న రోజుల్లో, ఆ ఊరా నీలివార్తలు కోటాను కోట్లు పుట్టుకు వచ్చినవి. ఆ రవ్వంత సుకానికి, ఆడమొగాలకూ మొగం వాచిపోయిన మూక... ఏమరుపాటున ఆడదంటూ కంటబడితే ఊరికే పోనివ్వడం లేదనీ, అక్కడా అక్కడా వాళ్ళ అఘాయిత్యం మూలంగా ఎన్నో ప్రాణాలు కడకట్టిపోయినాయనీ... మొరాయించిన కొన్ని జీవాలు రూపులేకుండా పోయినాయనీ...... ఇంత గగ్గోలుగా ఉంది. 

ప్రతి ఆడగుండె పీచు పీచుమనే రోజులవి.

సరిగ్గా ఆ తరుణంలోనే - చిట్టి మాయమైంది. ఇకనేముంది. వాళ్ళెవళ్ళో ఎగరేసుకు పోయినారనుకున్నాం. నేడో రేపో, ఆ కళేబరం ఏకంచెలోనో ఏ కాలువగట్టు నో దొరుకుతుందనుకున్నాం. చిట్టి అంత దారుణంగా అవతారం చాలించిందనుకున్నాం.

కాని, అలా జరగలేదు. చిట్టి మల్లెపూవల్లే మళ్ళీ వాళ్ళ నడుమకు వచ్చింది. “ఇన్నాళ్ళూ ఏమైపోయినావ్ చిట్టి!"అని ఊరు ఊరూ ఏక గొంతున ఆడిగింది. తాను ఏమైపోయిందో ఏం చేసిందో అరమరిక లేకుండా చెప్పింది చిట్టి.

ఏనుగులల్లే బండి దిగిన ఎందరో పడుచువాళ్ళు... తెలతెలవారేసరికి, ఎవళ్ళో మోసుకెళ్లి బండిలో పడవేయవలసిన స్థితికి రావడం.......... చిట్టి చూసింది. దీనికి మందేమిటా అని ఆలోచించింది. అడుగు ముందుకు వేసింది.

అటూ ఇటూ మళ్ళీ మనుష్యులని అటకాయించింది. బ్రతిమాలింది. దేశం కోసం బ్రతకమంది. యుద్ధంలో నెగ్గి సీమ చల్లబడితే....... ఏ చిన్నదాన్నో ఏలుకుని పిల్లా పాప ఎత్తవలసిన మనిషివి... నీకు ఇంతలో ఈ బుద్ది ఏమిటంది. నీవు బొమికల బొమ్మవైపోతే, కన్నతల్లి కడుపు చేటుకదా అంది. నా మాట విను అన్నా అంది. వినని మొండి ఎవరన్నా ఉంటే....... నాకు రూకలొద్దు  కోకలొద్దు  నన్నేలుకో... నీ మనసంతా తీర్చుకో అంది.........

నదరుగానో, బెదరుగానో.......... ఎవడినీ త్రోవ తొక్కనీయకుండా అడ్డు పడింది.

"అందరూ నీ మాటలు విని నీతిమంతులైనా రంటావా?" అని ఎవడో అక్కసుగా అడిగాడు.

 మా అందరి మనసుల్లోనూ కొరకొరలాడుతూంది ఆ ప్రశ్నే. 

మాతో కలసిమెలసి-మా కోసం పెరిగిన చిట్టి ఎవళ్ళ ఊరూ పేరూ లేని వాళ్ళ ముందు, తన వయసంతా వలకబోస్తుందా? బావురుమంటూ వచ్చినవాడు - ఇది బ్రతిమాలితే - అన్నా అంటే అట్టె మారిపోయి, మడిగట్టుకుంటాడా? ఎదుటున్న సిద్ధాన్నం చెడగొట్టుకుంటాడా?

“నీతిమంతులంటే ఏమిటం” ది చిట్టి! 

“నీతి ఉన్నవాళ్ళు!" 

“నీతి అంటే?"

ఏం చెప్పాలో ఎవరికీ చేతకాలేదు. కాని, చిట్టిని అదుపులో పెట్టడం ఎలా? - నీవు చేసింది అంత మంచిపనికాదని నచ్చచెప్పడం ఎలా?

"నీ ఒక్కదానివల్లా ఏమౌతుంది?" అని అడిగామనుకో - అది అంతకన్నా మరో పెద్దతంటా అవుతుంది. “నా ఒక్కతెవల్లా కాకపోతే - నలుగురు మంచి ఏపైన వాళ్ళను సాయం రమ్మంటాలే! - 

అంటే? - ఇంటింటికి పోయి, కంటికి ఆనిన పడుచునల్లా నిలవేసి, "నీవిలా గోళ్ళు గిల్లుకుంటూ కూచోకపోతే, నాతోబాటు బయలుదేరరాదూ?- ఆ ఒళ్ళంతా ఏం చేసుకుంటావ్?- కదులు!" ఇలా పచ్చి పచ్చిగా రెచ్చగొడితే - ఆపడానికి బ్రహ్మతరమా?. అందుకని - డూడూ బసవన్నలమై చెప్పిందంతా విని గ్రుడ్లనీళ్ళు కక్కుకుని ఊరుకున్నాం..

చిట్టికి ఎక్కడెక్కడనుంచో ఉత్తరాలు వచ్చేవి - ఎన్నెన్నో బంగీలు వచ్చేవి - నగదు వచ్చేది - కాని, ఏం వచ్చినా చిట్టి ఏం చేసుకుంటుంది? ఏది వచ్చినా, వచ్చింది వచ్చినట్టుగానే కంటబడ్డవాళ్లకల్లా పంచిపెట్టేది. ఎవరన్నా తీయించుకున్న బొమ్మలు పంపితే - అవి అందరికీ చూపిస్తూ ఆ పడుచువాడికీ తనకూ ములాఖత్ - ఏం మాట్లాడుకున్నారో - ఎలా నవ్వుకున్నారో వాడెందుకు సిగ్గుపడ్డాడో - ఏం ఒట్టేసుకున్నాడో అన్నీ పూసగుచ్చినట్టు చెప్పేది.

యుద్ధం  ఉన్నన్నాళ్ళూ చిట్టికి తపాలు బట్వాడా చేయడం పోస్టువాళ్ళకు నిత్యమూ గండకత్తెరే - చిట్టికి ఫలానా చిరునామా అంటూ ఎక్కడుందీ? వచ్చిన సరంజామా అంతా - అందరు పోస్టు జవాన్లూ పంచుకుని - ఏ మూల ఎదురుపడితే అక్కడ అందిచ్చేవాళ్ళు. 

వ్రాత ఏమన్నా ఉంటే, ఎవడిచేతన్నాచదివిస్తుంది. 

చదివి నందుకు వాడికి, చేతనున్న వాటిలో దండిగా ఇస్తుంది. పగలల్లా పేట పేటకూ ఏదో సంబరం కాసేపు!

చిట్టి, అటు యుద్ధానికి - ఇటు ఈ ఊరికీ పుష్కలంగా సాయంచేసింది.

ఇంత చేసినందుకు - ప్రభుత్వం చిట్టి చేసిన మేలు మరచిపోలేదు. చిట్టితో మంతనాలాడిన పడుచువాళ్ళు అధికార్లతో ఏమేం చెప్పారో, చిట్టి చేసిన మేలు ఎలా వివరించారో, ఏమోగాని మొత్తానికి, మిలిటరీ అధికారులు గూడుపుఠానీ చేసి ప్రభుత్వానికి కనుసన్న చేశారు.

ప్రభుత్వం - చిట్టి అఖండ సేవకు సన్మానంగా, సేవాపతకాన్ని బహూకరించింది.

ప్రభుత్వం తలపెట్టిన తతంగం అంటే - ఎన్ని యోజనాల ఎర్రటేపుతోనో కూడిన పని. దానికి బ్రహ్మాండమైన ఈషత్- బహిరంగసభ - జిల్లా అధికారి రావడం, లెక్చర్ చదవడం - ఇత్యాది కామాటం లక్షంత.

ఆనాడు చిట్టిని సభకు బ్రతిమాలి తీసుకురావడం - వచ్చిందాన్ని ఒకచోట కూర్చోపెట్టడం బ్రహ్మప్రళయం అయింది. పతకం ఇచ్చారు - పుచ్చుకుంది -సభ యావత్తూ  అమ్మయ్య! అనుకుంది.

కాని, అంతలోనే చిట్టి అందుకున్న పతకాన్ని అగ్రాసనం పక్క ఆసనంలో కూర్చున్న అధికారి పెళ్ళాం ఒళ్ళోకి విసిరేసి- "పిల్లది అల్లా బోసిగా ఉందేం? చెరిపి చేయించి పెట్టండి!." అని ఒడిలో ఉన్న పాప బుగ్గలు పుణికి, మళ్ళీ రోడ్డు పుచ్చుకుంది.

చిట్టిని అదమాయించడానికి ఎవరి తరం? ఇలాటి రవంత అభాసు జరగడం మూలాన్నే పతక బహూకరణ విషయం ఏ పత్రికలోనూ పడలేదు.

ఇలా బ్రతికింది చిట్టి. ఇంత ఘనంగానూ వెళ్లిపోయింది.

-చిట్టికి ఏం జబ్బో ఎవరికీ తెలియదు. ఎవరూ మందివ్వలేదు. పోయినదన్నారు. 

బొమ్మనెవరూ చూడకూడదు. అది... చిట్టి ఆఖరి కోరిక అన్నారు.

అన్నారంటే... మరెవరో కాదు, సినోరా సీతాయ్. 

సీతాయ్ భవనం నుంచే ఉత్సవంగా ఊరేగించారు. నాయకులు ముందు నడిచారు. 

ఇల్లాటి విషయాల్లో సీతాయ్ మాట, మా కాంగ్రెస్ సంస్థ ఔదల ధరిస్తుంది.

ఎవరి మొగానా కత్తివేటుకైనా నెత్తురు లేదట ఆనాడు.

"జర్మనీవారు వచ్చి దేశం ఆక్రమించుకుని ఏదన్నా భీభత్సం చేసే అవకాశం ఉంది గనుక.... ప్రజలుయావన్మందీ, మాన ధన ప్రాణ రక్షణకు ఏ మారుమూలకేనా పోవలసిందోహా!" అని ప్రభుత్వం ఘార్ణిల్లినప్పుడైనా.... విశాఖపట్టణం, కాకినాడ గ్రామాలమీద జపానులో తయారైన బాంబులు రాలినప్పుడైనా.... బ్లిట్జ్ అవిచ్చిన్నంగా సాగితే..... ఇంగ్లాండు ద్వీపం ఇరవై నాలుగు గంటల్లో ఆనవాలు

లేకుండాపోయే అవకాశం ఉందని తోచినప్పుడన్నా.... ఎవరికీ; అంటే మాలో యెవరికీ ఇంత దుఃఖం రాలేదు.

 ఆకాశంక్రింద బ్రతికిన చిట్టి......చివరకు ఇలా ఎందుకు అయిపోయింది? ఏనుగులు, చివరి ఘడియలు వచ్చినాయని పసిగట్టినప్పుడు....... ఒంటరిగా..... ఎక్కడికోపోయి; కూలిపోతాయంటారు కాదూ?........ ఈ దిగ్గజమూ అంతే చేసిందా?..... చిట్టి రాలిపోయిందా.........

అన్ని గుండెలూ తరుక్కుపోయినాయ్...... కాని, ఎందుకో సీతాయ్ ఒక్కతె మాత్రం చెక్కుచెదరకుండా చిరునవ్వుతోనే ఉందట - అందరికీ ముందు నడిచిందట. 

ఏమిటా నవ్వు? - అని ఎవరడుగుతారు - సీతాయ్ని?

సీతాయ్ అంటే - మీకు అసలు తెలియదు. అదో పెద్దబాలశిక్ష.

(1953).


హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations