Episode 48
అచ్చ తెనుగు కథ, 'తలుపు' : తమిళ మూలం - కి. రాజనారాయణన్
ఈ ఎపిసోడ్ లోని కథ 'తలుపు' - తమిళ మూలం రచయిత కి. రాజనారాయణన్. తెలుగు వారైన రాజనారాయణన్ తమిళంలో సుప్రసిద్ధ రచయిత. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత. ఈ కథను స. వెం రమేశ్ గారు తెలుగులోకి అనువదించారు. ఈ కథ 'తెన్నాటి తెమ్మెర' కథా సంకలనంలో చోటు చేసుకుంది. ఈ సంకలనంలోని కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. అన్ని తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు. 'తెన్నాటి తెమ్మెర' - కథాసంకలనం గురించి స. వెం రమేశ్ గారు హర్షణీయంతో చేసిన సంభాషణను మునుపటి ఎపిసోడ్ లో వినవచ్చు. (
'తలుపు' ఈ నాటి తమిళనాడులోని తిరునల్వేలి పరిసరాలకు చెందిన కథ. తిరునల్వేలి కరువు ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది. అనేక గొప్ప రచయితలను తమిళ సాహిత్యానికి అందించిన నేల.
ఈ కథల్లో ఇంకో ప్రత్యేకత , అనువాదంలో వాడిన ప్రతి పదం , అచ్చ తెనుగు పదం అయి ఉండటం. తెలుగులో మనం వాడటం మరిచిపోయి కోల్పోతున్న దాదాపు ఏడు వందల పదాలను రమేశ్ గారు మనకు గుర్తు చేశారు. ఈ పదాలన్నిటికీ పుస్తకం చివరలో అర్థాలను పొందుపరిచారు.
ఈ కథలో వాడిన మనం మరిచిపోతున్న అచ్చ తెనుగు పదాలకు అర్థం షో నోట్స్ లో కింద జత చేయబడింది.
ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని వాయిస్ మెసేజ్ ద్వారా తెలియచేయటానికి ఈ లింక్ ను ఉపయోగించండి.
https://www.speakpipe.com/Harshaneeyam
కథలో వాడిన కొన్ని తెనుగు పదాలకు అర్థాలు
తూరాకు = టికెట్
పాత తరి గార ఇల్లు = పాత కాలపు గచ్చు ఇల్లు
తెరువు = వీధి
నిప్పు పెట్టి = అగ్గి పెట్టె
తోమమయిందని = శుభ్రపడిందని
గాసిపడి = శ్రమ పడి
ఇచ్చుతో = సంతోషంగా
వెక్కసపడి = నిష్టూర పడి
ఒదవు లేదు = ప్రయోజనం లేదు
ఎడువుకొంటున్నప్పుడు = ఏరుకొంటున్నప్పుడు
పదరు పుట్టడం = కంపించడం
అలమట = దుఃఖం
ఏ మందలా లేదు = ఏ సమాచారం లేదు.
జీరాపి నెల = కార్తీక మాసం
నంజు గాలి = విషపు గాలి
తొప్పరగా = బాధగా
ఆబగా = ఆత్రంగా
విరవిరగా = వేగంగా
తలుపు : (తమిళ మూలం - కి రాజనారాయణ్)
తలుపు ఆట మొదలయింది. పక్కింటి పిల్లలంతా గోలగోలగా వచ్చి కలుసుకొన్నారు.
“అందరూ తూరాకును తీసుకోండీ,” అన్నాడు శీనివాసుడు.
వెంటనే, “నాకొకటి నీకొకటి," అంటూ గోల చేసినారు.
"ఏ ఊరికి కావాలి? ఏయ్ ఇలా నెట్టి తోస్తుంటే ఎలా? ఇలాగయితే నేను ఆటకే రాను.”
“లేదు లేదు తొయ్యంలే."
“సరే ఏ ఊరికి తూరాకు కావాలి?"
పిల్లలు ఒకరి మొకాలను ఒకరు చూసుకొన్నారు.
ఒకడు తిన్నెవెల్లికి అన్నాడు. అంతే, 'తిన్నెవెల్లికి తిన్నెవెల్లికి,' అని కూతపెట్టి కదలినారు అందరూ. లచ్చిమి ఒక గుడ్డతో తలుపును తుడుస్తూ ఉంది. శ్రీనివాసుడు వట్టి చేతులతోనే తూరాకులను చింపి ఇచ్చినాక కొందరు తలుపుమీద కెక్కి ఆనుకొన్నారు. కొందరు తలుపును ముందువెనకలకు ఆడిస్తున్నారు. తన మీదకు ఎక్కి తొక్కుతూ, నిలబడిన పిల్లలను, బరువయిన ఆ పెద్ద తలుపు వడివడిగా ఆడించి అలరించసాగింది.
తలుపును నెట్టినవాళ్లు తూరాకుల్ని తీసుకొని ఎక్కినారు.
“తిన్నెవెల్లి వచ్చేసింది దిగండి," అన్నాడు శీనివాసుడు. ఎక్కినవాళ్లంతా దిగేసినారు. దిగినవాళ్లు నెట్టసాగినారు. మళ్లా తలుపాట మొదలయింది.
అది పాతతరి గార యిల్లు. పెద్దదయిన ఒంటిరెక్క తలుపును నిలుపుకొని ఉంటుంది. అందులో ఉంటున్న వాళ్ళు ఒకప్పుడు బాగా బతికినవాళ్లే, ఇప్పుడు చితికిపోయినారు. ఆ ఇంట్లోని ఆడపిల్లలో పెద్దదానికి ఎనిమిదేళ్లు, చిన్నది చంకబిడ్డ. అమ్మ చేను పనికి కూలికి పోతుంది. నాన్న మణిముత్తారుకు బతుకుతెరువు కోసం వెళ్తున్నాడు. లచ్చిమీ శ్రీనివాసుడూ కలిసి పసిబిడ్డను చూసుకొంటూ అమ్మ
చేను నుండి వచ్చేవరకూ తలుపాటను ఆడుకొంటూ ఉంటారు.
—
ఒకనాడు తెరువులో ఒక నిప్పుపెట్టి అట్టబొమ్మను చూసి తీసుకొనింది లచ్చిమి. అదొక కుక్కబొమ్మ. మురికిగా ఉండేసరికి బొమ్మమీద ఉమ్మేసి పావడతో తుడిచింది. దాంతో అక్కడక్కడా ఉండిన మురికి, బొమ్మంతా అలుముకొనింది. కానీ లచ్చిమికి ఎంతో తనివి, బొమ్మ బాగా తోమమయిందని.
బొమ్మను మొకానికి నేరుగా పెట్టుకొని తలను కాస్త వంచుకొని చూసింది. ఆనక తలను ఇంకొకవైపుకు వంచుకొని చూసింది. నవ్వుకొనింది. అది దొరికిన చోట ఇంకెవరయినా ఉన్నారా అని అటూ ఇటూ చూసింది. ఎవరూ లేరు. ఇంటి వైపుకు వడివడిగా గంతులేస్తూ వెళ్లింది, ఇచ్చును తట్టుకోలేక .
లచ్చిమి ఇంటికి వచ్చేసరికి శ్రీనివాసుడు చేపట్టుకు ఆనుకొని వాకిలి మెట్ల మీద కూర్చుని ఉన్నాడు. వాడిని చూస్తూనే బొమ్మను వెనుకవైపున దాచి పెట్టు కొంటూ, “రేయ్ నేను ఏం తెచ్చినానో చెప్పుకో చూద్దాం," అనింది. “ఏం తెచ్చినావో నాకెలా తెలుస్తుంది?"
“చెప్పేమి చూద్దాం.”
“నాకు తెలియదు.”
లచ్చిమి ఎడంగా నించునే బొమ్మను చూపించింది.
"అక్కా అక్కా నాకు ఇయ్యవా?" అని అడుగుతూ దిగి వచ్చినాడు శీనివాసుడు.
. 'కుదరదు అన్నట్లుగా తలను అడ్డంగా ఆడించి, బొమ్మను పైకి లేపి పట్టు కొంది. శ్రీనివాసుడు అక్క చుట్టూ తిరిగినాడు.
"ఊహూఁ కుదరదు, ఇవ్వను... నేను ఎంతో గాసిపడి వెతకి తెచ్చుకొన్నాను తెలుసా?" అనింది.
"ఒకే ఒక్కసారి చూసేసి ఇచ్చేస్తాను. అక్కా అక్కా అని బతిమాలినాడు.
“చూసేసి ఇచ్చేయాలి.”
“సరే.”
“చింపకూడదు.”
“సరే సరే.”
శ్రీనివాసుడు బొమ్మను తీసుకొని చూసినాడు. ఎలమితో వాడి మొహం వెలిగిపోయింది.
“రేయ్, లోపలకు వెళ్లి కాస్త సజ్జ మెతుకుల్ని తీసుకొనిరా, దీనిని మన తలుపుకు అంటిద్దాం,” అనింది.
“అలాగలాగే,” అంటూ లోపలికి పరుగెత్తినాడు శీనివాసుడు.
ఇద్దరూ కలసి బొమ్మను తలుపుకు అంటించినారు. బొమ్మను చూసి ఇచ్చుతో చప్పట్లు చరుస్తా ఎగిరినారు. ఆ చప్పుడు విని పక్కింటి పిల్లలు పరుగెత్తి వచ్చినారు. మళ్లా తలుపాట మొదలయింది.
ఆ తలుపును కాస్త గమనించి చూస్తే, పిల్లలు అంటించిన బొమ్మకు కాస్త పైన ఇలాగే అంటించున్న ఇంకొక బొమ్మ కనిపిస్తుంది. దానిని అంటించి ఎన్నాళ్ళో అయినట్లుగా మురికీ పొగా పట్టి మాసిపోయి ఉంటుందది. ఒకవేళ దానిని, లచ్చిమివాళ్ల నాన్న చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అంటించుండవచ్చు.
పిల్లలు తలుపాటను ఆడుకొంటూ ఉన్నపుడు ఊరి తలారి అక్కడకు వచ్చినాడు.
"లచ్చిమీ మీ నాన్న ఎక్కడే?” “ఊరికి వెళ్తున్నాడు.” "మీ అమ్మా?”
“చేనుపనికి పోయుంది.”
“మీ అమ్మ వస్తే ఇంటిపన్నును తెచ్చిచ్చి పొమ్మను. తలారి వచ్చి అడిగేసి
వెళ్లినాడని చెప్పు, సరేనా!”
సరేనన్నట్లుగా తలను ఆడించింది లచ్చిమి.
—
మరునాడు, లచ్చిమి వాళ్ల అమ్మ ఉన్నపుడే వచ్చి పన్ను కట్టమని వచ్చి కూర్చున్నాడు తలారి.
అయ్యా, ఆయన ఊర్లో లేడు. మణిముత్తారుకు వెళ్లి అయిదు నెలలు అయింది. ఏ మందలా లేదు. మూడేళ్లుగా చుక్క చినుకు లేదే. మేము ఎక్కడి నుండి తెచ్చి కట్టేది పన్నును? ఏదో కూలికినాలికి పోయి ఈ బిడ్డల్ని కాపాడుకోవడమే పెద్దపనిగా ఉంది. మీకు తెలియనిదా?" అనింది.
ఈ మాటలు తలారి గుండెల్ని తడమలేదు. ఇలాంటి పలుకుల్ని ఎందరో పలుకగా విన్నవాడు కదా అతడు.
“మేమేం చేయగలం తల్లీ ఈ ఏడాది ఎలాగైనా పన్ను కట్టే తీరాలి. ఆనక మామీద వెక్కస పడి ఒదవులేదు," చెప్పేసి వెళ్లినాడు.
--
ఒకనాటి పొద్దుటిపూట ఇంటి ముందున్న బయలులో పిల్లలంతా కూర్చుని మాట్లాడుకొంటూ ఉన్నారు. నలుగురుని పిలుచుకొని ఆ తలారి ఇంటివైపుకు వచ్చినాడు. వాళ్లు బిరబిర ఇంటి దగ్గరకు వెళ్లి చూసినారు. తలారి చేదోడుతో వచ్చిన వాళ్ళందరూ కలసి ఆ తలుపును విప్పి, తలమీద పెట్టుకొని వెనుతిరిగినారు.
చూస్తున్న పిల్లలకు ఇదంతా ఒక వేడుకగా అనిపించింది. ఒకడు సన్నాయిని వాయిస్తున్నట్లుగా చేతుల్ని ముందుకు చాచి పీప్పీ... పీ... పీ అని సద్దు చేసినాడు. ఇంకొకడు వేళ్లను చాపి, ఒళ్లును వెనక్కు వంచి, తొడలమీద డోలు కొడుతున్నట్లుగా కొట్టుకొంటూ డుండుం డుండుం అని చప్పుడు చేసినాడు. శ్రీనివాసుడు కూడా అందులో పాలు పంచు కొన్నాడు. అలా ఆ పిల్లలు తలుపును ఎత్తుకెళుతున్న వాళ్ల వెనక ఉవ్వాయిగా ఊరేగుతూ వెంబడించినారు.
తలారి ఆ గోలను తట్టుకోలేక, “వెళతారా లేదారా పిల్ల గాడిదల్లారా,” అని అరచినాడు.
పిల్లలు వెనక్కు పరుగుపట్టినారు. వాళ్లంతా ఇంటికి తిరిగి వచ్చేసరికి, లచ్చిమి వాకిలి గుమ్మంలో కూర్చుని ఏడుస్తూ ఉంది. అందరూ గోల చేయకుండా వచ్చి లచ్చిమి దగ్గర కూర్చున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అలా ఎంతోసేపు ఉండలేకపోయినారు. తనకు తానే చెప్పుకొంటున్నట్లుగా ఒక అమ్మాయి, “నేను మా ఇంటికి వెళుతున్నా,” అంటూ లేచింది. వెంటనే బిలబిలమని అందరూ లేచి వెళ్లిపోయినారు. లచ్చిమీ శీనివాసుడూ మట్టుకే అక్కడ మిగిలినారు. చాలాసేపటి వరకూ వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.
పసిబిడ్డ ఏడుపును విని, లచ్చిమి లోపలకు చూసింది. ఆ లోపలే శీనివాసుడు బిడ్డను ఎత్తుకోడానికి వెళ్లినాడు. బిడ్డను తాకి చేతిని చటుక్కున వెనక్కు లాక్కున్నాడు. అక్కను చూసినాడు. లచ్చిమి కూడా చూసింది.
"పాపను తాకి చూడక్కా, ఒళ్లు కాలిపోతూ ఉంది," అన్నాడు. లచ్చిమి తాకి చూసింది. నిప్పులాగా కాలుతూ ఉంది.
—
పొద్దు మునిగిన చాలాసేపటికి, తలమీద పుల్లల మోపుతో వచ్చింది అమ్మ. పుల్లల్ని ఎడువుకొంటున్నపుడు ఆమె చేతిని తేలు కుట్టింది. నొప్పిని అణచుకొంటూ నెమ్మదిగా వచ్చి పిల్లలు పక్కన కూర్చుని పసిబిడ్డను ఎత్తుకొనింది. " ఒళ్ళు కాలిపోతున్నదే,' అని లోలోపల సణుక్కొనింది. అంతలోనే పిల్లలు పొద్దున జరిగిన దానిని అమ్మతో చెప్పినారు.
వినిన రంగమ్మకు ఊపిరి ఆగినట్లయింది. ఒళ్లంతా పదరు పుట్టింది. కడుపులో తట్టుకోలేనంత అలమట కలిగి, పిల్లల్ని గట్టిగా పొదువుకొనింది. పిల్లల ముందు ఏడవకూడదనుకొని ఎంతగా అణచుకొన్నా ఆగలేదు. 'అయ్యయ్యో' అంటూ అలమటించిపోయింది. బెదరిపోయిన పిల్లలు ఎడంగా జరిగినారు. ఏదో తెలియని జడుపుతో వాళ్లు కూడా ఏడుపునెత్తుకొన్నారు.
మణిముత్తారు నుండి ఏ మందలా రాలేదు. నాళ్లు జరిగిపోతూనే ఉన్నాయి. రేయిపూట చలికి తాళలేక పిల్లలు వణుకుతూ ఉన్నారు. తలుపు లేకపోవడంతో ఇల్లుండీ ఒదవు లేనట్లయింది. జీరాపి నెల చలి, నంజుగాలిలాగా ఇంట్లోకి జొరబడి వాళ్లను గుద్దుతూ ఉంది. పసిపిల్ల ఒళ్లు పాడవుతూ ఉంది. ఒకనాటి రేయి చలిని తట్టుకోలేక అది ఆ ఇంటినీ తనవాళ్లనీ వదలి వెళ్లిపోయింది. రంగమ్మ అలమటను ఇంతని చెప్పలేము. లచ్చిమి కోసం శీనివాసుడి కోసమే ఆమె ఊపిరిని నిలుపుకొనుంది.
—
శీనివాసుడు ఇప్పుడు బడికి వెళుతున్నాడు. ఒకనాటి నడిపొద్దులో బడి నుండి ఇంటికి వస్తున్నపుడు, వాడికొక నిప్పుపెట్టి అట్టబొమ్మ దొరికింది. తెచ్చి అక్కకు చూపించినాడు. లచ్చిమి పట్టించుకోలేదు.
"అక్కా నాకు తొందరగా గంజి పోయి, ఆకలవుతున్నది. తాగేసి ఈ బొమ్మను అంటించాలి.”
“తమ్ముడూ, గంజి లేదురా. ఈ మాటను ఎంతో తొప్పరగా చెప్పింది. "ఏం? నువ్వు పొద్దున కాస్తుంటే నేను చూసినానే?”
అవునన్నట్లు తలనాడించి, “నేను బయటకు వెళ్లున్నపుడు ఏదో కుక్క వచ్చి గంజినంతా తాగేసి పోయిందిరా, తలుపు లేదుకదా,” అనింది అలమట అంగ లారుపూ పొంగుతుండగా. అమ్మ ఆకలితో చేను నుండి వస్తే ఏం చెప్పాలి అనే తలపును అణచుకొనింది లచ్చిమి.
శ్రీనివాసుడు అక్కడ చింది పడున్న ఒకటి రెండు సజ్జ మెతుకుల్ని ఏరి, బొమ్మ వెనకాల పూసి అంటించడానికి వచ్చినాడు. తలుపు లేదు, ఏం చేయాలో తోచలేదు. గోడకు అంటించినాడు. బొమ్మ కింద పడిపోయింది. మరో చోటా మరో చోటా అంటించి చూసినాడు. అంటుకోలేదు.ఏమరుపు వల్లా, ఆకలివల్లా వాడు ఏడవడం మొదలిడినాడు.
—
మాపటేళ లచ్చిమి కుండా చట్టిని రుద్ది కడుగుతూ ఉంది. మొకంలో ఆబ పొంగుతూ ఉండగా, ఎగూపిరి దిగూపిరిగా పరుగెత్తి వచ్చినాడు శీనివాసుడు. "అక్కా అక్కా మన బడి పక్కన చావడి ఉంది చూడూ... దాని వెనక మన ఇంటి తలుపు ఉంది, నేను నా కళ్లారా చూసినాను,” అన్నాడు.
“అలాగా, నిక్కమేనా? ఎక్కడ రా చూద్దాం,” అని శీనివాసుడి చేతిని కొనింది. ఇద్దరూ చావడివైపుకు పరుగు తీసినారు.
నిక్కమే! అదే తలుపు పడి ఉంది. దూరం నుండి తమ నేస్తాన్ని కనిపెట్టేసి నారు ఆ చిన్నారులు. పక్కన ఎవరైనా ఉన్నారా అని చుట్టుపక్కల చూసినారు. ఎవరూ లేరు.
వాళ్లకు కలిగిన ఎలమిని మాటలతో చెప్పలేము.
అక్కడ మొలిచున్న వామింటా మెట్టతామరా చెట్లు వాళ్ల కాళ్ల కింద పడి పరపరమని నలిగినాయి. విరవిరగా ఆ తలుపు పక్కకు పరుగెత్తినారు. దగ్గరకు పోయి దానిని తాకినారు, తడిమినారు. దానికి అంటుకొనున్న చెదమన్నును తన పావడతో తట్టి తుడిచింది లచ్చిమి.
తలుపుకు తన మొకాన్ని ఆనించుకొనింది. ఏడవాలనిపించేలాగా ఉంది ఆ పిల్లకు.
శీనివాసుడిని గట్టిగా పట్టుకొనింది. ముద్దు పెట్టుకొనింది. నవ్వింది. కళ్లలో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. శీనివాసుడు కూడా లచ్చిమిని చూసి నవ్వినాడు. వాళ్ల ఇద్దరి చేతులూ తలుపు నేస్తాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాయి.
(ఈ కతలోని 'శీనివాసన్' అనే పేరును కీరాగారి కోరిక మేరకు తెలుగులో 'శీనివాసుడు'గా మార్చినాను - స వెం రమేశ్ )
—--------
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -
https://bit.ly/3NmJ31Y
*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –
స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam
ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5
*మమ్మల్ని సంప్రదించడానికి harshaneeyam@gmail.com కి మెయిల్ చెయ్యండి.
హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.
https://bit.ly/Storycollection
హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.
https://bit.ly/44v7CzW
హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి
https://bit.ly/vanavasinovel
వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.
https://bit.ly/Ecovanavasi
***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp