Episode 108

జన జీవన స్రవంతి

జన జీవన స్రవంతి :

చీకటి ఊరిని, నెమ్మదిగా కమ్ముకోడం కనిపిస్తోంది, కిటికీలోంచి చూస్తే. 

 దూరాన కనపడే మావిడి తోటల వెనకాల్నించీ సూర్యుడు ఎవరో తరుముతున్నట్టు హడావిడిగా కిందికి దిగిపోతున్నాడు . 

చదూతున్న పాత ఆంధ్రభూమి మూసి పక్కన పడేసా నేను . మిద్దె మీద గదిలో కూర్చోనున్నా. 

అమ్మమ్మ వాళ్ళ వూరు, పమిడిపాడు కొచ్చి రెండు రోజులైంది.  

ఎంసెట్ రాసి రిసల్ట్ కోసం వెయిటింగ్. పన్నెండు మైళ్ళు పమిడిపాడు గుంటూరుకి. 

మా అమ్మ ఏకైక తమ్ముడు, గంగాధరం మావ, ఆయన భార్య రాజత్త , అమ్మమ్మ వుంటారు ఇక్కడ. 

నేను వొచ్చిన రోజు సాయంకాలం నించీ మావ క్షణం తీరిక లేకుండా వున్నాడు

మామూలుగా ఇంటి పట్టున ఎపుడూ ఉండని గంగాధరం మావ, ఇల్లు వదట్లేదు. 

ఎదురింటి రాజా రావు గారు , ఇంకా మా వీధిలో వుండే కొన్ని పెద్ద తలకాయలూ , వచ్చి పొద్దున్నించీ రాత్రి దాకా మంతనాలు, ముందు హాల్లో కూర్చోని, మావతో.  

నన్నేమో ఈ రూములో పడేసారు, ఓ బండెడు పుస్తకాలూ , ఒక ట్రాన్సిస్టరూ ఇచ్చి. 

అప్పుడప్పుడు రాజత్త వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్తుంది. టిఫిన్ , భోజనానికి పడుకోడానికి మాత్రమే కిందికి. 

కిటికీ లోంచి, కిందికి వీధిలోకి చూసా.  వీధి అంతా నిర్మానుష్యం. మామూలుగా అయితే ఈ పాటికి వీధి అంతా సందడి సందడి గా ఉండాల. పొలాలకు పొయ్యినోళ్లూ వెనక్కొస్తూ.  

పైనున్న శాతవాహనుల కాలం నాటి ఫ్యాను గూడ నెమ్మదిగా తిరుగుతోంది. బైట గాలి గూడ బిగుసుకొపొయ్యింది. జైల్లో ఉన్నట్టుంది .

ఊరికొచ్చినప్పట్నుంచీ ఇదే పరిస్థితి. ఇల్లు దాటనివ్వట్లేదు ఎవ్వరూ. నాకేమో ఏదోరకంగా బయటికెళ్లి వెంకటి గాణ్ణి కలవాలనుంది. 

వెంకటి గాడు మూడో క్లాసు దాకా నాతో చదివి , స్కూలు మానేసాడు. పొలం పనులకు పోతాడు. చెర్వు అవతల వుండే గుడిసెల్లో ఉంటాడు వెంకటి గాడు, గంగాధరం మావ పాలేరు ఓబులేసు, ఉండేది కూడా అదే గుడిసెల్లో.  

ఐదు దాకా ఇదే వూళ్ళో, అమ్మమ్మ దగ్గరుండి చదూకున్నా నేను. వూళ్ళో వున్న ఒకే స్కూల్లో . పమిడిపాడు లో నేనూ, వెంకటిగాడూ కలసి చెయ్యని కోతి పన్లు అంటూ లేవు. 

గంగాధరం మావకి పెళ్ళై పదిహేనేళ్ళు అయ్యినా ఇంకా పిల్లలు లేరు. ఆయనకి చదువు పెద్ద అబ్బలేదు. సావాసాలు ఎక్కువ. ఎవరినో ఒకరిని వేసుకోని వారంలో రెండురోజులు గుంటూరు పొయ్యిరాందే మనిషి నిలవలేడు. 

పొలాలన్నీ కౌలు కి ఇచ్చేసాడు. రెండెకరాల మావిడి తోట తప్ప. మామిడి తోట చూసుకునే ఓబులేసు, గంగాధరం మావకి కుడిభుజం. 

వారానికోసారి చీట్ల పేక ఆడుకోడానికి తప్ప తోటగ్గూడా పోడు, గంగాధరం మావ. ఎవడికి గుంటూర్లో పనున్నా , వాడ్ని తన బైకు ఎక్కించుకొని గుంటూరు తీసుకోబోతూంటాడు. ఆయన బైకు, టికెట్ లేని ఓ మినీ టౌన్ బస్సు, వూళ్ళో జనాలకి. 

రాజత్త, అమ్మమ్మ కు అన్ని పనులలో చేదోడు వాదోడు. అమ్మమ్మ అంటూ ఉంటుంది, మీ అమ్మ పక్కన లేని లోటు లేదురా నాకు అని రాజత్త గురించి. ఇది గాక రాజత్త పుస్తకాల పురుగు. గంగాధరం మావ గుంటూరెళ్లిన ప్రతీ సారి పుస్తకాలూ కొనుక్కొస్తాడు. ఇంట్లో పన్లయ్యాక వాటిల్లో మునిగిపోతుంది. ఇంట్లో ఉంటే, నేను గూడ అత్త వెనకాలే. అత్త చదివే పుస్తకాల గురించీ మాటలే మాటలు.

ఉన్నట్టుండి కర కర మని మూల్గుతూ, ఫ్యాన్ ఆగిపోయింది. 

గది బయటకొచ్చి అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగడం మొదలుపెట్టా, 

వరండాలోంచీ మాటల శబ్దం. రాజత్త , గంగాధరం మావ గొంతులు.

తడుముకుంటూ వంటింట్లోకి వచ్చి చూసా. అమ్మమ్మ గూడ కనపళ్ళేదు. అంతా చీకటి. వంటింటిలోంచి పెరట్లోకి తలుపు తెరిచి ఉండడం, కుంపటి వెలుగులో కనపడింది. చిన్నగా పెరట్లోకి వచ్చి పిట్ట గోడ ఎక్కి దూకేసా. 

*********************************************

వీధిలో రెండడుగులు వెయ్యంగానే, కరంటు వచ్చినట్టుంది, రోడ్డు మీద అక్కడక్కడా విసిరేసినట్టుండే వీధి దీపాలు వెలగడం మొదలుపెట్టాయి. వడి వడి గా అడుగులేసుకుంటూ చెరువు అవతల గుడిసెల దగ్గరికి చేరుకున్నా. 

ఇంటి ముందర మట్టి అరుగుమీద కూర్చొని, లాంతరు సరిచేస్తూ కనపడ్డాడు వెంకటి గాడు. 

వాడు చూడకుండా , దగ్గరిగా పొయ్యి “ వెంకటీ !” అని అరిచా నేను. 

దడఁచుకొని వెనక్కి తిరిగాడు వెంకటి. నన్ను చూడంగానే వాడి మొహం లో ఒక వెలుగు వెలిగింది. మరు క్షణంలో వెలుగు ఆవిరై పొయ్యి భయం బయటికి రావడం మొదలైంది. మాట్లాడే లోపలే వెంకటి గాడే అన్నాడు. “ఇక్కడుండొద్దు రా రాంబాబు. ఇంటికెళ్ళిపో” 

“ఇంట్లో గూడ గోల గోలరా, బయటికి రానివ్వట్లేదు. ఏమైంది ఊరికంతా” ? 

“నీకేం తెలవదా ”?

అటూ ఇటూ తలూపా నేను.  

“మూడ్రోజులకిందట మీ మామిడి తోటలో పంచేస్తూంటే , లచ్చక్కని పక్క పొదల్లో కి తీస్కపొయ్యి గలాభా చేసారంట”.. 

వాడింకా ఏదో చెప్పబో తూంటే , అడిగేశా ఆదుర్దాగా, “ఎవరు” ?

“మీ పక్కతోట నాగోజీ సారు కొడుకు రవిబాబు” . 

లచ్చక్క అంటే, మావ ఇంట్లో పాలేరు, ఓబులేసుభార్య . 

నాగోజీగారిల్లు గూడ మా గంగాధరం మావ వాళ్ళ వీధి చివర్లో. రవిగాడు డిగ్రీ మధ్యలోనే మానేసాడు . ఊరి మీద తిరుగుతుంటాడు. 

ఇంకా ఏదోఆలోచిస్తూంటే వెంకటిగాడు అన్నాడు. 

“మా పెద్దోళ్లంతా ఓబులేసు ఇంటిదగ్గరే గూడుకొని వుంటున్నారు రోజంతా, ఎవ్వరూ గూడెం దాటి బయటకు పోవట్లా పనులకు.”

ఇంకేం మాట్లాడాలనే వాడు పడనిచ్చేటట్టు లేదు. గమ్మని ఎనక్కి తిరిగా.. 

*******************************************

ఇంటి వెనక వైపు కొచ్చి జాగర్తగా చూసుకుంటూ పెరట్లోకి దూకాను. 

నెమ్మదిగా అడుగులేస్తూ వంటిట్లో దూరా.  

ఇంకా ముందు హాల్లో నించి మాటలు వినబడుతున్నాయి. ఎవ్వరూ నేను ఇంట్లోంచి బైటికెళ్లినట్టు గమనించనట్టున్నారు. ఊపిరి పీల్చుకున్నా. 

రాజత్త స్వరం హెచ్చితే ఆగి పొయ్యా. 

అంటోంది ఆవిడ , “చేసినవాడు మనోడు గదా అని మీరందరూ కట్ట కట్టుకొని కళ్ళు మూసుకుంటే, అది ఆ రోజు జరిగిన దాని కన్నా పెద్ద అత్యాచారం. వూరికే పోదు . ఊరికంతా కొడ్తుంది. “

మావ ఏవన్నాడో సరిగ్గా వినిపించలేదు నాకు. ఏదో లీలగా.. “కోర్టులు కేసులూ”.. 

ఇంకొంచెం ముందుకు పొయ్యి హాలు తలుపు పక్కనే నిలబడ్డా . 

అత్తే మళ్ళీ మాట్లాడుతోంది. “ మన చేతిలో ఏది ఉందొ అది మనం చెయ్యాల. ఓబులేసు ఈ ఇంటిని నమ్ముకొని ఇరవై ఏళ్ళు గా పని చేస్తున్నాడు. వాళ్ళ నాయన గూడ ఈ ఇంటితోనే వున్నాడు బతికినన్నాళ్ళూ.” 

అంటున్నాడు మావ “ రాజారావు అన్న గూడ, గూడెం పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నాడు. డబ్బులు ఎవరి నోర్లన్నా మూయించగలవు.”

ఇంకా ఏదో అనపోతూంటే , అమ్మమ్మ నిశ్చయంగా చెప్పింది. “అమ్మాయి చెప్పింది కరెక్టు మాట. నేను రేపు ఓబులేసుని పిల్చి మాట్లాడ్తాను. వాణ్ని తీసుకెళ్లి కేసు పెట్టించు. ఎవడు అడ్డం వస్తాడో చూద్దాం.”

ఓ నిమిషం నిశబ్దం తర్వాత, గంగాధరం మావ “ఈ గొడవల్లో అంతా రాంబాబు గాడు ఇక్కడుండడం మంచిది కాదు.”

పక్కరోజు పొద్దున్నే నన్ను, గుంటూరు బైకులో తీసుకెళ్లి , తిరుపతి బస్సెక్కిచ్చాడు గంగాధరం మావ. 

ఆ తర్వాత నా చదువు గొడవల్లో నేను పడిపొయ్యి, వూరు వైపు పోలేదు. 

*************************************************************

ఈ ఇన్సిడెంట్ తర్వాత ఓ పదేళ్లకు, నాన్న ఫ్రెండు డాటర్, పెళ్లి కెళ్ళాం నేను మా అన్న.    

మంచి ఎండాకాలం. తెగ ఉక్కగా వుంది.

అక్కడ పెళ్ళికొడుకు పక్కన ఎవడో తోలాయ్ గాడు సూటు వేస్కొని చాలా హడావుడి చేస్తున్నాడు. “వీడెవడా ఎక్కడో చూసినట్టుందే” అంటూ బుర్ర గోక్కుంటున్నా. 

“ఎవడ్రా ఈ పులి వేషగాడు“ మా అన్ననడిగాను.

మా వాడు ఎక్కడో చూసి ఏదో గొణిగాడు. 

రెట్టించా. 

విసుగ్గా అన్నాడు వాడు “ గుర్తు పట్లా. పమిడిపాడు రవి బాబు గాడు. పెళ్ళికొడుకు ఫ్రెండట.”

ఇంతలో సూటేస్కున్న రవిబాబు గారు , తన భార్యా పిల్లలతో కలిసి, కొత్త దంపతుల తోటి ఫోటో లు దిగేస్తున్నాడు. 

తట్టుకోలేక అడిగేసా మా అన్నని,

 "మరి కేసు, జైలు ఏమయ్యింది?. గంగాధరం మావ గమ్మనున్నాడా "? అని. 

"లేదురా, రాజత్తా, మావ, ఓబులేసు పక్కనే ఉండి కేసు పెట్టిచ్చారు. దీని దెబ్బ, వాళ్ళకి ఓ ఐదేళ్లు, వూళ్ళో ఎవ్వరితో మాటలు లేవు. కేసు నత్త నడక నడిచి నడిచి చివరికి , సాక్షాలు లేవని కొట్టేశారు" అన్నాడు మావాడు. 

“లచ్చక్క , ఓబులేసు ఏవయ్యారు” ?, అడిగా నేను. 

“ఏవోరా . గ్రూప్ ఫోటో కి పిలుస్తున్నారు స్టేజి మీదకు పా.” అన్నాడు మా వాడు అభావంగా. 

ఉక్కపోయ్యడం ఆగిపోయింది. 

లేచి బయల్దేరా నేను గూడ ‘జన జీవన స్రవంతి’ లోకలవడానికి.

*Intro- outro BGM credits: *Intro- outro BGM credits: en vanile - jingle man (https://www.youtube.com/watch?v=fyM41M0n3lI)


*






This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations