Episode 127

'ఇల్లు'!

ఎండాకాలం ఒంటి నిట్టాడి ఇంటిపట్టున రెండు నిట్టాళ్ళ ఇల్లు వేయాలని మా అమ్మా నాయన నిర్ణయించుకొన్నారు. మా చిన్న ఇల్లు పీకి పెద్ద ఇల్లు వేస్తామని పల్లె అంతా టాంటాం వేశాను. ఒంటి నిట్టాడి ఇంటికి మధ్యలో నిట్టాడి ఉంటుంది. రెండు నిట్ఠాళ్ళ ఇంటికి రెండు నిట్టాళ్ళు గోడల మీద ఉంటాయి. ఆ రెండు దూలాల మీద ఇల్లు నిలబడుతుంది.

చిన్న ఇల్లు, దాని తడిక గోడలు, పీకి చిన్నపాక ఆగ్నేయం మూలకు వేసి, ఇంట్లోని సామాను అందులోకి చేర్చారు. ఆ ఎండల రోజుల్లో మేం అందులోనే ఉండేవాళ్ళం. లేదంటే వేపచెట్టు నీడన చేరేవాళ్ళం. కట్టబోయే ఇల్లు పన్నెండు అడుగులు వెడల్పు పద్దెనిమిది అడుగుల పొడుగు ఒకేగది.

దానిముందు పంచ ఆరు అడుగుల వెడల్పు, పద్దెనిమిది అడుగుల పొడుగు, గోడలు పది అడుగుల ఎత్తు, పంచ తూర్పుకు వాలి ఉంటుంది. ఉత్తరం దక్షిణం నడవ. దక్షిణం తూర్పు మూల పొయ్యి. ఎడ్లబండ్లు ఎర్రమట్టి తోలితే దక్షిణపు బావి నీటితో తడిపి ముద్దలు ముద్దలు చేస్తే, ముద్దలు కూలీలు అందిస్తే మేస్త్రి కీటు పెట్టేవాడు. అయిదు కీటులు, కీటుకు కీటుకు మధ్య విరామం, కారణం కీటు ఎండాలి, బిగవాలి. ఐదు కీటులు పెట్టడానికి ఐదు వారాలు పట్టింది.

కంసాలి బత్తుడు రెండు నిట్టాళ్ళు కావాలని ఒకటి పాతది సరిపోతుందని, రెండోది కొత్తది కావాలని తెప్పించాడు. రెండు నిట్టాళ్ళు పడమటి నుంచి తూర్పుకు గోడలమీద పండుకోబెట్టాడు. రెండు నిట్టాళ్ళ మీద మధ్యలో ఎనిమిది అడుగుల ఎత్తు కట్టెలు పాతి, వాటిని కలిపి వాటి మీదగా బొంగులు దిగేట్టు చేసి, నిలువు బొంగులకు అడ్డం వాసాలు వేసి, తాటి నారతో బిగదీసి కట్టేస్తే ఇంటి రూపం కనిపించింది.

అంగలకుదురు నుంచి మా తాతలు ఎడ్ల బండ్లు రెండింటి నిండా తాటాకు పంపించారు. దాన్ని కప్పితే ఇల్లు ఎంతో అందంగా ఉంది. ఇంక పాక వదిలి, ఇంట్లోకి పోవచ్చును, అనుకుంటే మా అమ్మ 'వీల్లేదు' అంది. ఇంకా పాకలోనే ఉన్నాం .

ఎండలు ఘోరంగా కాస్తున్నాయి. రోహిణి కార్తె అని, రోళ్ళు పగులుతున్నాయని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. పాక వదిలి బైటికి వస్తే కాలు గాల! నెత్తి గాల ! పాకలో ఉంటే వంట్లో ఉన్న నీళ్ళన్ని చెమటగా కారిపోతున్నై.

పాకలో చెమట బాధ, బైట ఎండ గోల. బతకలేం అనుకునేవాణి కింద తలా కాలదు, కాలు కాలదు కానీ వడగాలి విదిలించి కొట్టేది. పడమటి శాంబరం నిప్పులు మోసుకొని వచ్చేది.

పడమటి శాంబరం సుడిగుండం తిరిగితే చిన్న పిల్లల్ని ఆకాశంలోకి ఎతుకు పోయి సముద్రంలో పారేస్తుందని అందరూ భయపెట్టేవాళ్ళు.

అమ్మ పాటి మట్టిని తెప్పించి, పేడ కలిపి గోడలు లోపలా వెలుపలా అలకడంతో పాటు నట్టిల్లు కూడా నాజూకుగా అలికింది. ఆరితే ఇంట్లోకి పోవచ్చునని చల్లగా ఉంటుందని చాలా ఆశపడ్డాను. ఇల్లు ఆరింది కానీ మా అమ్మ మమ్మల్ని ఇంట్లోకి పోనివ్వలేదు.

గోడలకు సున్నాలూ కొట్టింది. ఇంక ఇంట్లోకి పోవచ్చునా- అంటే వీల్లేదంది, ఇల్లంతా వల్లమాలినన్ని ముగ్గులు వేసింది. 'ఈ రాత్రికి ఇంట్లో పడుకోవచ్చునాఅంటే 'వీల్లేద'ని అమ్మ కరాఖండిగా, తీక్షణంగా చెప్పింది. దొంగచాటుగా ఇంట్లోకి పోతే, ఇల్లు చల్లగా ఉంది. ఎండలేదు, మంట లేదు, చెమట లేదు. ఇంతలో అమ్మ అలికిడి వినిపించింది. గబగబా లగెత్తుకొచ్చి పాకలో నక్కాను.

పూజారి వచ్చాడు. ఇంటి చుట్టూ తిరిగాడు. ఏమేమో గొనిగాడు. బియ్యంలో పసుపు కలిపాడు. ఇంటి చుట్టూ చల్లాడు, ఇంట్లో చల్లాడు. పంచలో రంగుదారాలు కట్టాడు. పొయ్యి మీద పాలు పొంగించారు. పాలు పొంగి పొయ్యి ఆరిపోయింది. కుండలోని పాలల్లో బెల్లం వేసి కలిపి, అమ్మ అందరికీ గిలాసుల్లో పోసి ఇచ్చింది.

పాడి బర్రెను ఇంట్లోకి తోలుకొని పోయింది. ఇల్లంతా తిప్పింది. పంచలో తిప్పింది. తోలుకొని వచ్చి పాకలో కట్టేసింది. సూర్యుడు తూర్పున పొడిచాడో లదు | నన్నూ, చెల్లెల్ని ఇంట్లోకి తరిమింది. ఇల్లంతా తిరగమంది. ఇష్టమొచ్చిన చాటు కూర్చోమంది. లేకపోతే పడుకోమంది. చెల్లికి నడక రాదు. అడుగులు వేస్తుంది.

పాకలోని సామానంత ఇంట్లోకి తెచ్చి పెట్టుంది. మా నాయన మంచం మీద కూర్చుని చోద్యం చూస్తున్నాడు.

అమ్మకు సాయం చేయబోతే 'నువ్వాడ కూకో. ఏది ఏడ సర్దుకోవాలో నాకు బాగా తెలుసు,' అంది. ఉట్టి తెచ్చి నాయన కడితే 'అట్టాగేనా కట్టేది' అని గదురుకొంది.

మెట్టు బల్ల పాకలోంచి తెచ్చి ఇంట్లో పెడుతుంటే “ఆడగాదు ఈడబెట్టు' అంది. నేను దెచ్చుకుంటాగా, నీకెందుకు పో కూకో' అంది. 'మోయలేవే!' అని 'నాయన అంటే 'అదెంత దాని బరువెంత? మోస్తాలే! నువ్వు కూకో' అంది. తేప తేపకూ చెప్పించుకోలేక మంచం మీద కాళ్ళు ఆడిస్తూ కూర్చున్నాడు నాయన.

ఇల్లంతా సర్దుకొంది. మెట్టుబల్ల మీద వడ్ల బస్తాలు నాలుగు పెట్టాలి. 'ఏందా విచిత్రమైన సూపు? బస్తాలు నేను మోస్తానా?' అంది. 'మోయలేవు!' అన్నాడు నాయన 'మరి తే!! 'తెస్తానుండు'! 'ఏంది ? ఆలస్యం?' గదమాయించింది. నాలుగు బస్తాలు మెట్టు బల్లమీద పెట్టాడు. మా అమ్మ పాక దగ్గరకు వచ్చి, నిటారుగా నిలబడి ఇల్లు చూస్తూ, వెనక్కు వంగి నడ్డి విరుచుకొంది.

'నడ్డిరిగేను” అన్నాడు నాయన. 'సాల్లే సంబడం' అంది అమ్మ. ఆ చెట్టు కింద, ఈ చెట్టు కింద బతుకీడుస్తున్న బర్రెల్ని దూడల్ని చూపించి 'ఆట్ని సావిట్లో కట్టేయ రాదూ!' అంది అమ్మ. వాటిని తోలుకొచ్చి కట్టేశాడు. అప్పటి దాకా అది మేమున్న ఇల్లు. ఇక పశువుల పాక.

నాకు ఐదేళ్లు. చెల్లికి ఏడాది దాటలేదు. కొత్త ఇల్లు ఎంత చల్లగానో ఉంది. రాత్రి చాలా సుఖంగా ఉంది. మేం తిని పడుకున్నాం, రాత్రంతా వాళ్ళు మాట్లాడు కుంటూనే ఉన్నారు. 'కొత్త ఇంట్లో నీ కాపురం ఎట్టా ఉందే' అంది మా అమ్మమ్మ. 'మాకేం? బాగానే ఉన్నాం' అంది మా అమ్మ. కొంత నిష్ఠూరం ఉన్నమాట నిజమే!

మా అమ్మ అన్నలు తమ్ముడు బంధువులు అందరూ వచ్చి ఇల్లంతా కల తిరుగుతున్నారు. 'బురద కాళ్లతో రావొద్దురా' అంటుంది. 'చెప్పుల కాళ్లతో ఇల్లంతా తొక్కొద్దురా' అంటుంది. 'మురికి ముకాల్లారా! ఇటు రావద్దురా' అంటుంది. మా ప్రకాశం పంతులు గారికి ఇల్లంతా చూపించింది. ఇవి కిటికీలు అంది. ఇది మచ్చు అంది. ఏందేందో అంది. పంతులుగారు 'ఆ!' 'ఉ!” అంటూ తల ఊపుతున్నాడు.

'నీ కొడుకు బడికి వచ్చే వయస్సే!' అన్నారు పంతులుగారు. 'ఏడా? ఆడికి అయిదన్నా నిండలా!” అంది అమ్మ. 'ఇంట్లో సల్లగా, కడుపులోకి సల్ల కదలకుండా, ఈ ఏడన్నా ఉండనీయండి ఇంట్లో పంతులుగారు' అంది అమ్మ.

'ఇల్లు బాగుందమ్మా బాగా కట్టించుకున్నావు' అన్నారు. ఆ పైట చెంగుకు చేతులు ఊరికే తెగ రుద్దుకుంది. అంది మా అమ్మను మెచ్చుకుంటున్నారు. ఇల్లు బాగుంది. ఎత్తు బాగుంది..? గాలి గంతలు వెడల్పుగా ఉన్నాయి. గుమ్మం భద్రంగా ఉంది... గటివి. ఇలా పడిన కష్టానికి ప్రతిఫలం మెచ్చుకోళ్ళు వస్తుంటే - వింది మా అమ్మ.

పల్లెలో వాళ్ళు ఎవరైనా వచ్చి ఇల్లు చూడకపోతే, వాళ్ళ ఇళ్ళకు పోయి తీసుకువచ్చి ఇల్లంతా చూపించి పడిన కష్టమంతా చెప్పి 'అలకలేక నేను బొబ్బలెక్కినై' అని అరచేతులు చూపించేది. మా అమ్మ చేతులు ఎరుపు, నును మెత్తన. ఇల్లు కట్టేలోపల గట్టి పడ్డాయి. రంగు తగ్గాయి. బొబ్బలు లేచాయి.

అప్పుడు అమ్మ బుగ్గలు పుడికితే వెన్న అద్దినట్లు ఉండేది. ఇప్పుడు అట్లేదు కానీ అమ్మ సంతోషంలో సప్తసముద్రాలు తరంగాలెత్తుతూ ఉండసాగాయి. ఎండమమ్మల్ని ఏమి చేయలేకపోయింది. నేను ఇంట్లోంచి వెలుపలికి వచ్చేవాణి కాను.. రాత్రి ఇంటిముందు, గొడ్డ, సావిడి పక్క నిద్రపోవటం ఎంత సుఖంగానే ఉండేది. అమ్మ అటునుంచి వస్తూ, ఇటునుంచి వస్తూ ఇంటిని చూచుకుంటూ మురిసిపోయేది. మా నాయన మా అమ్మ ఆనందం చూడటం చాలా ఇష్టపడేవాడు. -

'అటు కోడురోళ్ళు, ఇటు సుద్దపల్లోళ్లు నీ ఇల్లు సూళ్ళా! పో! పోయి, ఆళ్లను పిలుసుకొచ్చి ఇల్లు సూపిచ్చు. సంతోషిస్తారు' అనేవాడు ఎగతాళి చేసినట్లు మా నాయిన. మా అమ్మ 'సాల్లే సంబడం' అని నవ్వేది.

మా కొత్త ఇల్లు మమ్మల్ని ఎండల నుంచి కాపాడింది. ఎండలు తగ్గాయి. వానలు మొదలయ్యాయి. ఎంత పెద్ద వాన వచ్చినా ఇల్లు తడవటం లేదు. చాలా సుఖంగా ఉంది. వాన కురుస్తున్నప్పుడు మా అమ్మ వేరుసెనక్కాయలు వేయించి, బెల్లం ముక్క ఇచ్చేది.

వాటిని వలుచుకు తింటూ, బెల్లం ముక్క కొరుక్కు తినటం ఎంతో రుచిగా ఉండేది. తినన్ని పెటేది. తినలేనంటే వేరుసెనకాయలు వొలిచి గుప్పెళ్ళు గుప్పెళ్ళు నోటిలో పోసేది. బెల్లం ముక్క నోట్లో కూరేది. 'కలిపి నమిలి మింగరా మగ పిల్లోడు తెనాలి!' అనేది.

చెల్లి పాలే తాగుతుంది. వేరుసెనక్కాయలు తినలేదు. బెల్లం ముక్క కొరకలేదు. ఎన్ని నోరు. చిన్ని చిన్ని కళ్ళు! చిన్ని మూతి. పసిది కదా పాపం!

వేరుసెనక్కాయలు తినవచ్చునని, వానంటే నాకు ఇష్టం. వానలో ఎగుర్లాడ వచ్చునని ఆశ. దుప్పటి కప్పుకొని మూల కూర్చుంటే వెచ్చగా ఉంటుందని బలే కుశాల.

కానీ ఆ రోజు వాన పెట్టినంత భయం ఈ రోజుకు మరుపురాదు. తెల్లవారక ముందే వాన కురవటం మొదలయింది. వానలోనే ఒంటికి పోయి రావలసివచ్చింది. వానలో చెంబట్టుకుపోయి రాక తప్పలేదు.

వాన విసిరి విసిరి కొడుతూ ఉంది. చిన్నా చితక వాన కాదు. మాలావు వాన. పిడుగులు పడతాయని భయం. ఆకాశం చింపేస్తున్నట్లు మెరుపులు, ఉరుములు. ఒకేసారి అవి వస్తే పిడుగులు పడతాయి అనేది అమ్మ. వెలుపలికి పోవద్దు అనేది. ఎంత మాలావు వాన కురిసినా ఇల్లు తడవదు కానీ, భయం ఎవరు పోగొడతారు?

పంచలో కూర్చొని వానను చూడటం ఆనందమే కానీ దాని ఉధృతి చూస్తే వణుకు పుడుతూ ఉంది. చూరులోంచి వాన నీరు ధారలు ధారలుగా పడుతూ ఉంది. డొంకలోంచి దేవళ్ళ చెరువులోకి వాన నీరు రైలు బండి కంటే దూకుడుగా పోతూ ఉంది.

భయమెరుగని మా అమ్మ 'ఏం వానరా దేముడా!” అంది. వానలో మా నాయనకు వంద రకాలు తినాలని కోరిక. జీతం ఎగరగొట్టి ఇంట్లోనే కూర్చున్నాడు. పొయ్యి అంటుకోక మా అమ్మ తిప్పలు అంతా ఇంతా కాదు. కట్టెలేమో తడిసినై.

ఈ తిప్పలు అట్టాబెడితే వాన ధాటికి తట్టుకోవడం కష్టంగా ఉంది. సావిట్లో పాడి బర్రె 'అంబా' అని మా అమ్మను పిలుస్తూ ఉంది. వానలోనే పోయి కుడితి పెట్టి, గడ్డి వేసి వచ్చింది. వానలోనే ఇంట్లోకి సావిట్లోకి అమ్మ తిరుగుతుంటే అయ్యో పాపం అమ్మ అనిపించేది.

తలకే రక్షణగా ఉన్న గొడుగు గాలికి వెనక్కు తిరిగిపోయింది. కాళ్ళ బురద, తడిసిన చీరలోంచి కారే నీళ్ళు, తలలోంచి వళ్ళంతా. జారే నీళ్ళు. అమ్మ నీటి దేవతగా మారింది.

తడిబట్టలతోనే మా అమ్మ అన్నం వండుతుంటే మా నాయన హాస్యం. 'మీ అమ్మ ఇయ్యాల బేపన పణితి' అని నవ్వేశాడు. తడిబట్టలతో వంట చేస్తున్న అమ్మ మడి బట్టలతో వంట చేస్తున్నట్లుంది.

అన్నం వండింది. కూరల్లేవు. పచ్చళ్లేసి పెట్టింది. వానలో చలి కప్పుకొని వేడి వేడి అన్నం తినటం బలే రుచిగా ఉంది.

తెల్లారి చాల సేపయింది. సూర్యుడు నిద్రలేచినట్టు లేడు. ఇంట్లోంచి వెలుపలికి తెల్లారి చాలా సేపయింది. సూర్యుడు నిద్రలేచినట్టు లేడు రాలేదు. మబ్బులు కప్పుకొని ఏ మూలనో నక్కి ఉంటాడు. పాపం చొక్కా నిక్కరు ఉన్నాయో లేవో!

అంత ఉధృతంగా కురిసే వానకు అంతే వేగంగా గాలి తోడయింది. తన ఎరుగని అమ్మ 'గాలివాన' అంది. 'చూడబోతే అట్టాగే ఉందే' అన్నాడు నాయన ఇద్దరూ కూడబలుక్కొని భయపడుతుంటే నా కుశాల మాయమయింది. చెల్లి ఇంకా నిద్రలేవలేదు. చల్లగా గుడ్డల మధ్య మునగర దీసుకొని పడుకుంది. లేచిందా ముందుగా నవ్వుతుంది. ఆ పైన ఇల్లు ఎగిరిపోయేట్టు ఏడుస్తుంది. ఆకలి కదా పాపం.

అమ్మా నాయన వానకు గాలికి అల్లాడి పోతున్నారు. నాకూ భయం కలిగింది. మూడు పక్కల కిటికీల లోనుంచి ఈదురుగాలి విదిలించి విదిలించి కొడుతూ ఉంది. చూరుగంతల్లోంచి చలిగాలి దూరి ఇల్లంతా వ్యాపించి, దడ పుట్టిస్తూ ఉంది.

ఉన్నట్టుండి గాలికి ఇల్లు కదిలింది..! అందరికీ భయం. 'ఏందీ గాలి? ఏందీ ఇల్లు కదలటం?” అంది అమ్మ. మళ్ళీ ఇల్లు వణికింది. అమ్మ వణికింది. నాయనా భయపడ్డాడు.

'గొడ్డు ఎట్టున్నాయో' అని మంచం దిగాడు. అది పందిరి లాంటి పాక! ఎటునుంచి గాలి వచ్చినా ఎటయినా వెళ్ళిపోతుంది. గోడల్లేవు. పాకకు అడ్డంలేదు. పాకకు ఇబ్బంది లేదు. ఇంటి గోడలు గాలిని ఆపుతున్నాయి. అందుకు ఇల్లు కదులుతూ ఉంది, ఊగుతూ ఉంది. చూస్తూ ఉండగానే పాక ఒరిగింది. నేలమీద కూలింది. పశువులు వానలో నిలబడ్డాయి. వాననీళ్లు వాటికి ఇష్టంగానే ఉన్నట్లుంది. అమ్మకు భయం పట్టుకొంది. 'ఇల్లు కూలితే పిల్లలేం గాను?” అంది. 'మనం లేమా?” అన్నాడు నాయన. 'మన మీదా పడితే' అంది అమ్మ. నాయన ఆలోచనలో పడ్డాడు.

వానలో బయటికి పోయాడు. అమ్మ మంచాలు లేపి మూలన గోడకు చేర వేసింది. బరిగొడ్డును తోలుకొచ్చి ఇంట్లో తోలాడు. మూలన ముడుచుకొనిపడుకొన్నాయి.

ఇల్లు ఉయ్యాల లాగా అటూ ఇటూ ఊగింది. 'ఇల్లు భద్రమేనా?” అని భర్తను అడిగింది. 'భయంగానే ఉంది' అన్నాడు. 'కొత్త ఇల్లు!' అని ఏడిచింది. “ఏడవకే వాడు నాయన. నాకూ ఏడుపు వచ్చింది. 'నోరు మూయరా' అన్నాడు నన్ను. అణెందుకు కసురుకుంటా' అంది అమ్మ. 'ఇల్లు భద్రం కాదు' అన్నాడు నాయన. “ఏం చేద్దాం?” అంది అమ్మ. 'ఎక్కడకయినా పోదాం ' అన్నాడు. 'పల్లెలో ఏ ఇల్లు భద్రం? అందరియి అంతంత మాత్రం కొంపలే!” అంది అమ్మ.

- 'గమిని శ్రీరామయ్య గోరి సావిడి మేలు! రాతి గోడలు, మొద్దుల పై కప్పు! ఆకాశం ఊడిపడ్డా సావిడి పడదు. పోదాం ' అన్నాడు. 'సరే' అంది. ఇంటికి తాళం వేసింది. చెల్లిని పొట్టలో పెట్టుకొని పైట చెంగు కప్పింది. నన్ను మా నాయన చేయి పట్టుకొని లాక్కుపోతున్నాడు. నాయన ఆ యింటి జీతగాడు!

ఇంటి ముందు గిలకల దాకా నీళ్ళు, వీధిలో మొల లోతు నీళ్ళు, డొంకలో పీకల దాకా నీళ్లు. నాయన నన్నెత్తి భుజం మీద పెట్టుకొన్నాడు. నా తల తడవకుండా చుట్టిన దుప్పటి తడిసిపోయి బరువెక్కింది.

సావిడి ఎంతో దూరంకాదు. కానీ గాలిలో, వానలో పీకల్లోతు నీళ్ళ డొంకలో | నడుస్తుంటే సావిడి చాలా దూరం అనిపించింది. నేల మీద నడిచినట్లు కాకుండా నీళ్ళలో ఈదినట్లు మేం వెలుతున్నాం .

'నీకు ఈత వచ్చునంటరా' అన్నాడు నాయన. 'రాదు' అన్నాను. 'నేర్చుకో!' అన్నాడు. 'ఇప్పుడా?” అంది అమ్మ. 'ఎప్పుడైనా' అన్నాడు. నాయనకు ఈతవచ్చు! నాకూ భయం లేదు. అమ్మకో! చెల్లికో? ఈత వచ్చో రాదో! నాకూ భయం. అందువల్ల | ఏడుపు. ఏడవ్వద్దురా! సావిడి కాడికొచ్చేఁవు' అన్నాడు నాయన.

నన్ను దించాడు. గొడ్డుకు మేత వేశాడు. అంత వానలో వరిగడ్డి పొడిగా ఉంది. నన్ను, చొక్కా నిక్కరు విప్పి, తలగుడ్డ తీసి, దిసె మొలతో ఎండు గడ్డిలో పండుకోబెట్టారు. నాకూ చలిలేదు. మా అమ్మ, చెల్లిని నావళ్ళో పెట్టి, వంటి మీద బట్టలు పిండుకొంటూ ఉంది. గమిని శ్రీరామయ్య గారి ఇల్లు సందుకా పక్క ఉంది. వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చి వచ్చాడు నాయన.

'ఇల్లు ఏమయిపోతుందో!' అంది అమ్మ. 'ఏం కాదు' అన్నాడు నాయన. "పడిపోయిందేమో' అంది అమ్మ. 'పడితే మళ్ళీ కట్టుకొందాం' అన్నాడు నాయన. ఇల్లు పడిపోతుందంటే నాకూ ఏడుపు వచ్చింది.

పాలు తాగింది కదా చెల్లి నా వళ్ళో నిద్రపోయింది. నాయన బూసిమ్మ పాసీర తెచ్చి అమ్మకి ఇచ్చాడు. పొడి సీర కట్టుకుంది. తడి సీర ఆర బెట్టింది. నాయన చొక్కా తీసి, పిండి ఆరేశాడు. పంచె పైకి ఎగబీక్కొని పిండుకొని , నా పక్కన ఎండు గడ్డి మీద కూర్చున్నాడు నాయన.

పశువులు నాయన్ను గుర్తుబట్టి పండుకొన్నాయి. బైట గాలి హోరు జోరు భీతావహంగానే ఉంది. సావిడి గోడలకు కొట్టుకొన్న వాన తలపగిలిలము పడి ఏడుస్తూ, తోటి నీటితో కొట్టుకుపోతూ ఉంది. సావిడి మొద్దుల మీద కపిన తాటాకు మీద ఎండుగడ్డి వేసి ఉండటంతో సావిడి తడవటంలేదు.

నలుగురం ఎండుగడ్డిమీద మూలన కూర్చున్నాం. చెల్లిని అమ్మ గుండెలకు పొదుకొని కూర్చుంది. గాలివాన విదిలించి విదిలించి కొడుతూ ఉంది. పలె సరే సరి, ఊరూకూడా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూచినా నీరే! పక్కనే ఉన్న వామిలోంచి గట్టి పీకి ఎంత పొడిగా తెద్దామన్నా తడవనే తడిసింది. తడిసినా గొడు గడ్డి మేయడానికి ఇష్టపడుతూనే ఉన్నాయి.

చీకటి పడింది కానీ, వాన తగ్గలేదు, గాలి ఆగలేదు. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టలేదు. సావిట్లో మూలకు వొదిగి కూర్చుంటే వానపడటంలేదు. చలిగా ఉన్నా, గడ్డి వేడి వల్ల కొంచెం మేలుగానే ఉంది..

నాయన పోయి, విస్తరి నిండా బువ్వ, దబరా నిండా నీళ్ళు తెచ్చాడు. ఆ రాత్రి. దట్టంగా చీకటి. అయినా తడుంకొని అన్నం తిన్నాం. చెల్లికి ఈ కష్టం లేదు. సుఖంగా అమ్మ పాలు తాగుతుంది. దబరా నీళ్ళు తాగటానికే ఉంచుకొన్నాం. చూరు నీళ్ళతో చేతులు కడుక్కున్నాం.

నేను అమ్మ కాళ్ళ పక్క చెల్లి అమ్మ వళ్ళో నిద్రపోయేమ్. అమ్మా నాయన రాత్రంతా నిద్రపోలేదని, తెల్లారాక చెప్పారు.

'అదే మోయిన రాత్రంతా ! గాలివాన దుంపదెంచింది' అని చెప్పారు. ఊరంతా ఇంత ఘోరంగా ఉంటే, పల్లె జనం పాట్లు ఎట్లా ఉన్నాయో అని అమ్మా నాయన దిగులుపడ్డారు. ఎవరి రైతు సావిడికి వాళ్ళు చేరి ఉంటారని మా నాయన చెప్పాడు.

నాకు ఆకలి అవుతూ ఉంది. పొద్దున్నే పెట్టేది అమ్మ గిన్నె నిండా బువ్వ, 'తెల్లారి చాలాసేపు అయినట్లుంది. పిల్లోడికి ఏవన్నా తెచ్చి పెట్టు!" అంది అమ్మ. 'ఆడసలే ఆకలోడు!' అన్నాడు నాయన.

వంటి మీది పంచె రాత్రంతా వంటి మీదే ఆరి పోయింది. చొక్కా వేసుకుంటే తడుసుద్దని వేసుకోకుండా దబరా తీసుకుపోయాడు. వస్తూ మళ్ళీ విస్తరి నిండా అన్నం , పప్పు, పచ్చడి దబరా నిండా నీళ్ళు తీసుకువచ్చాడు.

మేం అన్నం తినబోతున్నప్పుడు గొడ్డు అరిశాయి. వాటికి వామిలోంచి ఎండు గడి పీకి వేశాడు. వానలో, గాలిలో, చలిలో అన్నం బొవ్ రుచిగా ఉంది. విస్తట్లో ఏమి మిగలకుండా ముగ్గురం తినేస్తే విస్తరి దూరం విసిరాడు నాయన.

గాలి తగ్గింది కానీ వాన కుండపోతగా కురుస్తూనే ఉంది. చలి తగ్గింది కానీ భయం పెరిగింది.

వాన ఆగదా? ఇంటికి పోలేమా? ఆడుకోలేమా? అని నా దిగులు. నన్ను సావిట్లో కట్టేసినట్లు కదలకుండా ఉంచారు. అమ్మ భయం అమ్మది. 'ఇల్లు పడిపోయిందో ఏమో, గొడ్డు చచ్చాయో ఏమో, మళ్ళీ ఇల్లెట్టా కట్టుకోవాలి రా దేవుడా' అని ఏడిచింది. పాపం మా నాయన అమ్మను ఓదార్చడానికే సరిపోయింది. ఇల్లు పడిపోయిందో ఏమో అని తేపతేపకి అంటుంటే విసుగుపుట్టి 'పడితే పజ్జీ! మళ్ళీ కట్టుకొందాం'! అన్నాడు. ఈ

మాపిటేలకి వాన కూడా తగ్గుముఖం పట్టింది. పడ్డ వాననీళ్ళు, ప్రవహిస్తూనే ఉన్నాయి. గాలి తగ్గింది. 'ఈదురుగాలి దేవుంది?” అంది అమ్మ. తుంపర పడుతూనే ఉంది. 'వాన తగ్గింది' అంది అమ్మ. 'పడతానే ఉంది' అన్నాడు నాయన. 'ఇంటికి పోదాం' అంది అమ్మ. నాయన కాదనలేదు.

తుంపర సన్న తుంపరగా మారింది. కాళ్ళ కింద నీళ్ళు చాలా దూకుడుగా ప్రవహిస్తున్నాయి. నీటి ఉరవడికి పడతానేమో అన్నంత భయంగా ఉంది.

పల్లె నుంచి ఊళ్ళోకి వచ్చేటప్పుడు భుజాల మీద ఎక్కించుకొన్నాడు నన్ను నాయన. కానీ పల్లెకు వెళ్ళేటప్పుడు 'నడుస్తాను' అన్నాను. సరే అన్నాడు. ముందు నీళ్ళు గిలకల దాకా వచ్చాయి. ముందుకుపోతే నడుములు దాకా వచ్చాయి. నాయన చేయి పట్టుకొన్నాను. నీళ్ళు పీకలదాకా వచ్చినా భయం లేకుండా నడిచాను.

'ఈడికి ధైర్యం ఎక్కువ' అన్నాడు నాయన. 'మరి ఆడు నీ కొడుకు' అంది అమ్మ. సత్రం మలుపు తిరిగాం. పల్లె కనబడుతూ ఉంది. పల్లెలో పడ్డ పాకలు కనిపించసాగాయి. చిన్న ఇళ్ళు! ఒంటి నిట్టాడి ఇళ్ళు! కూలాయి. 'మన ఇల్లు ఎట్టా ఉందో” అంది అమ్మ. 'పోతాంగా సూద్దాం పద!! అన్నాడు నాయన.

నీళ్ళు పీకలదాకా రావటం లేదు. నడుం దాకా వచ్చాయి. రైలు కట్ట దాకా వచ్చం. గిలకల దాకా కూడా రావటంలేదు నీళ్ళు. మసక వెలుతురులో బూజర బూజర గా మా ఇల్లు కనిపించింది. 'ఇల్లు పడినట్లు లేదు' అన్నాడు నాయన, పక్కకు వొరిగినట్టుంది' అంది ఆ అమ్మ. ఇల్లు చూడగానే నేను నాయన వదిలి పెట్టి, ఇంటివైపు పరుగుతీశాను.

తుంపర కూడా తగ్గిపోయింది. మేం ఇంటికి పోయేసరికి మా ఇలు నిటారుగా నిలబడి నవ్వుతూ చూస్తూ 'రండి! రండి' అని పిలిచింది, చిల్ల కంప దాటి ఇంటి ముంగిట్లోకి అడుగు పెడితే బురద, పెరుగు అన్నం లాగా అనిపించింది.

పంచ నిండా బిలబిలలాడుతూ జనం ఉన్నారు. నాలుగు కుటుంబాల వాళు! ఇరవై మంది జనం! పంచలో ఇరుక్కొని కూర్చొని ఉన్నారు. వాళ్ళ పాకలు, ఒంటి నిట్టాడి ఇళ్ళు పడిపోయాయంట.

పల్లెలో చాలా ఇళ్ళు పడిపోయాయంట. పదో పాతికో పడలేదంట. జనం నెమ్మదిగా బయలుదేరటానికి సిద్ధమవుతున్నారు. మా అమ్మ తలుపు తాళం తీసి, గొళ్ళెం తీసి, తలుపులు బార్లా తెరిచింది. గొడ్డు 'అంబా' అని అరిచాయి. మా

అమ్మను అవి చుట్టుకొన్నాయి, వాటేసుకున్నాయి. గొడ్డును బయటకు తోలి దూడల్ని కట్టేసింది అమ్మ. ఇంట్లో పడ్డ పేడ తీసేసింది.

ఇల్లు తడవలేదు. చుక్క నీరు ఇంట్లో లేదు. ఇల్లు పడలేదు సరే, వొరగను కూడా ఒరగలేదు. పంచలోని వాళ్ళు పడిపోయిన వాళ్ళ ఇళ్ళు నిలబెట్టుకోవటానికి వెళ్ళిపోయారు. మా అమ్మ ఇంటిని చూచి నవ్వింది. భయంతో మేం మా ఇంటిని నమ్మలేదు. ధైర్యంగా మా ఇల్లు మమ్మల్ని నమ్మింది.

పుస్తక లభ్యత వివరాలు:

ఈ కథ ఆచార్య ఇనాక్ గారి ‘మన ఊళ్ళల్లో మా కథలు’ కథాసంపుటి నుంచి స్వీకరించబడింది.

ప్రతులకు సంప్రదించండి -

జ్యోతి గ్రంథమాల

4-282, యన్ యస్ నగర్

మీర్ పేట్, హైదరాబాద్ - 500 097.

ఫోన్: 94402 43433



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations