Episode 173

'ఎందుకు పారేస్తాను నాన్నా!' చాగంటి సోమయాజులు గారి రచన


చాగంటి సోమయాజులు గారు 'చాసో' గా తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. ఆధునిక తెలుగు కథను ప్రగతి శీల భావాలతో సుసంపన్నం చేసిన చాసో ఎన్నో గొప్ప కథలను రచించారు. 1945 వ సంవత్సరంలో 'భారతి' మాస పత్రికలో ప్రచురితమైన ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చింది చాగంటి తులసి గారికి , కథకు ఆడియో ని అందించిన చాగంటి కృష్ణ కుమారి గారికి కృతజ్ఞతలు.

ఇదే పేజీలో ఈ కథపై, సారంగ వెబ్ మ్యాగజైన్ లో ప్రముఖ రచయిత శ్రీ అరిపిరాల సత్య ప్రసాద్ గారు చేసిన చక్కని సమీక్షను కూడ వెబ్ లింక్ ద్వారా మీరు చదవొచ్చు.



కథ :

చెల్లిని వొళ్ళో కూచో పెట్టుకుని కృష్ణుడు వంటింట్లో కబుర్లు చెప్పుతున్నాడు. వాళ్ళనాన్న పిలిచి చుట్టలు తెమ్మని డబ్బులిచ్చేడు. 

కృష్ణుడు వీధిముఖం చూడకుండా, మొగుడు చచ్చిన విధవలాగ ఇంట్లో దూరి కూచుంటున్నాడు. నాన్న చుట్టలు తెమ్మని పురమాయించేడు. హైస్కూలుదాటి -చుట్టల దుకాణానికెళ్ళాలి. మేష్టర్లు, తోటి విద్యార్థులు అక్కడుంటారు. కృష్ణుడికి రోడ్డెక్కటమే నామోషిగా ఉంది. బడిపక్క నుంచి ఎలాగ వెళ్ళడమని గింజుకుంటూ బయలుదేరేడు.

ఉదయం ఎనిమిది గంటలు కావొస్తున్నది. బడి పెట్టేవేళ. వీధి చివరనుంచే బడిగోల సముద్రపు ఘోషలాగ వినబడుతున్నాది. బడిపక్క నుంచి వెళ్ళక తప్పదు; రాక తప్పదు.

బడి కనబడగానే కృష్ణుడికి బెంగపట్టుకుంది. హైస్కూలు పిల్లల గందరగోళంతో కలకల్లాడుతున్నాది. వరండాలు, గదులు, చుట్టూ రోడ్లూ, విద్యార్థులతో, విద్యార్థినులతో చూడ సొంపుగా ఉంది. రోడ్డు వారగా కృష్ణుడు తలొంచుకుని పరిగెట్టాడు. 

 "కృష్ణా!" అని స్కూలు వరండాలోంచి కేకొచ్చింది. కృష్ణుడు తిరిగి చూడక తప్పింది కాదు. 

నరిశింహం పరి గెట్టుకొచ్చి వాడి భుజంమీద చెయ్యేసి “ఏంరా, నువ్వు బళ్ళోకి రావడం లేదు.” అనడిగేడు.

 “సోమవారం చేరుతాను” అని కృష్ణుడు చెప్పేడు.

 “పుస్తకాలు కొన్నావా?" 

“ఇంకా లేదు.”

“ వేగిరం కొనుక్కో. మళ్ళా అయిపోతాయి. ఎక్సరు సైజు పుస్తకాలు షాపుల్లో కొనకేం స్టోర్సులో చవగ్గా వున్నాయి. ధరలన్నీ దారుణంగా పెరిగిపోయాయిరా!" - నరశింహం డబుల్ కప్పు చొక్కా, జనావా పేంటూ, జోళ్ళూ తొడుక్కుని నీటుగా ఉన్నాడు. 

కృష్ణుడికి ఉన్న బట్టలన్నీ రెండు నిక్కర్లు, రెండు చొక్కాలు; ఉన్నాయంటే ఉన్నాయి. ఒక నిక్కరుకి పోస్టాఫీసుంది. ఒక చొక్కా భుజం చిరిగి జారిపోతే, వాళ్ళమ్మ ఎత్తి కుట్టింది. చెయ్యి బుట్టలాగ లేచిపోయింది. రేవుకో జత. కృష్ణుడు పేంట్లు కుట్టించమని ఎప్పుడూ ఏడవ లేదు. పేంటుకైతే బట్ట ఎక్కువ పడుతుంది. బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువవుతుందని వాడికి తెలుసు. మరి రెండు జతలు కుట్టించమని బతిమాలుకున్నాడు. కాళ్ళా వేళ్లా పడ్డాడు. ఏడ్చుకొన్నాడు. ప్రయోజనం లేకపోయింది.

నరశింహం చంకలో కృష్ణుడికి కొత్త పుస్తకం కనబడ్డాది. “ఏం పుస్తకంరా అదీ?" అనడి గేడు.

“ఇంగ్లీషు పుస్తకం. నేనన్ని పుస్తకాలూ కొనేశాను. జాగ్రఫీ పుస్తకమే కొనలేదు. జాగ్రఫీ పుస్తకాలింకా స్టోర్సువాళ్ళకి రాలేదు. చూడు పుస్తకం" అని ఇచ్చేడు.

కృష్ణుడు పేజీలు తిరగేశాడు. కొత్త పుస్తకంలోంచి ఒక విధమైన పరిమళం పైకి వచ్చింది. కృష్ణుడు పుస్తకంలోకి మొహం పెట్టి వాసన చూశాడు.

“కొత్తపుస్తకం వాసన బాగుంటుందికదరా?” అన్నాడు నరశింహం. 

"కమ్మగా ఉంటుంది. నా కెంతో యిష్టం" అన్నాడు కృష్ణుడు.

 “నీ కింగ్లీషులో ఫస్టుమార్కు రాలేదు, కదరా?” 

“నాలుగు మార్కుల్లో పోయింది."

 “ఎవరి కొచ్చిందిరా?" . “శకుంతల కొట్టేసింది.” 

“నిజమే! నేన్నమ్మ లేదు; దాని కెన్నొచ్చాయి.”

 “నా కరవై నాలుగు, దాని కరవై ఎనిమిది,"

 “ఆడపిల్లని మేష్టరు వేసేసుంటాడు."

 “నీ మొహం! అది తెలివైంది.”

 “తస్సాచెక్కా! ఆడపిల్లలు చదివేస్తున్నారురా!"

కృష్ణుడు మార్కుల గొడవ తేగానే గొప్పవాడయిపోయాడు. తెలివైనవాడు కాబట్టే నలుగురూ గౌరవిస్తున్నారు. లేకపోతే వాడి కుళ్ళుగుడ్డలని చూసి అంతా దూరంగా ఉండేవాళ్ళే. వాడికి బడిపక్కని నిలబడడం, బడి కెళుతున్న నరశింహాన్ని చూడడం చాలా కష్టంగా ఉంది. ఎంచేతంటే, కృష్ణుడు బడి కెళ్ళి చదువుకొనే అవకాశాలు తప్పిపోయాయి. వాళ్ళ నాన్న ఈ ఏడాది కృష్ణుడికి చదువు చెప్పించనని నిశ్చయంగా చెప్పేశాడు.

“ఎక్కడేనా చదువు మాన్పించుతారండి? 

ఋణమో పణమో చేసి ముక్క చెప్పించకపోతే కుర్రా డెందుకేనా పనికొస్తాడా? చదువుకునే ఈడులో బడి మానిపించి, ఇంట్లో కూచోబెడితే తరవాత గాడిదలని కాయడానికేనా పనికిరాకుండా పోతాడు. ఏదో చూసి బడిలో వెయ్యండి" అని వాళ్ళమ్మ శతపోరి చెప్పుకొస్తున్నాది.

“బళ్ళో వెయ్యగనే సంబరమా? వాడు చదివేది ఫోర్తు ఫారమ్. జీతమెక్కువ. నెల నెలా ఎంత కట్టాలో తెలుసా? తూగ్గలనా? ప్రవేశ పెట్టడానికి, పుస్తకాలకే డౌతుంది ఏభై రూపాయలు. దస్తాకాగితాలు రూపాయి, అర్ధగా పెనసలు ఆరణాలు! ఎక్కణ్ణుంచి తేవడం. మొహాన్ని వాడికి లేందే! వాడి ప్రారబ్ధం, మన ప్రారబ్దం! వారం వారం ఎక్కడ లేని డబ్బూ బియ్యానికి ముడుపు చెల్లించడానికే తలప్రాణం తోక్కొస్తున్నాది. మాటలా?" అని వాళ్ళ నాన్న చెప్పుకొస్తున్నాడు.

తల్లి మాటే నెగ్గుతుందో, తండ్రిమాటే నెగ్గుతుందో ఇంకా తేల లేదు. కృష్ణుడికి మాత్రం సందిగ్ధం లేదు. వాడు తలిదండ్రులని బాగా ఎరుగు. తల్లి ప్రతీ విషయంలోనూ బడబడలాడడమేకాని ఆఖరికి తండ్రి చెప్పినట్టే జరుగుతూ ఉంటుంది. అంచేత చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమని నిర్ధారణ చేసుకొని నామార్దాతో కృష్ణుడు కుళ్ళిపోతున్నాడు.

శ్రీ కృష్ణుడికి కొత్త ఇంగ్లీషు పుస్తకం పేజీలు తిరగేసినకొద్దీ గుండెల్లో గాభరా పుట్టింది. చదువుతున్న కుర్రాళ్ళమీద ఈర్ష్యా, తనకి చదువు లేకుండా పోయిందన్న దుఃఖము - రెండూ రెండు లేడిక పాములై అతని బుర్రని కరకర లాడిస్తున్నాయి.

“కృష్ణా, వేగం చేరరా! డివిజన్లు పెట్టేశారు. నేను 'జే' డివిజనులో పడ్డాను . మన బేచివాళ్ళంతా 'జే' జీవిజనులోనే పడ్డారు” అన్నాడు. నరశింహం. 

“అమ్మబాబో! 'జై' డివిజనుదాకా పిల్లలున్నారా?" అని ఆశ్చర్యపడ్డాడు. కృష్ణుడు. - 'జే' తో ఐపోలేదు. 'కే' డివిజను కూడా ఉన్నాది." 

ఏ, బి, సి, డి, అని లెక్కబెట్టి - "పదకొండు డివిజన్లో!" అన్నాడు కృష్ణుడు. ఒక్క ఫోర్తు ఫారములో సుమారు ఐదు వందలమంది విద్యార్థులున్నారు. 

కృష్ణుడు అక్కడ నిలబడ లేక పుస్తకాన్ని చ్చేసి “నేను చుట్టల కెళ్ళాలి, పోతా” నన్నాడు.

"ఈ బొమ్మ చూశావట్రా?" అని నరశింహం పాఠాలకి ముందున్న త్రివర్ణ చిత్రం తీసి చూపించేడు.

రైతులు జొన్న చేలు కోస్తున్నారు. జొన్న రేకులని కూడదీసి కట్టుకొన్న పిట్టగూడు గుడ్ల తోటే జారిపోతున్నాది. చేలమీద రెండు పిట్టలు ముక్కులు విప్పి ఎగురుతున్నాయి. కోతల వాళ్ళు తలలెత్తి పిట్టలని చూస్తున్నారు. అదీ త్రివర్ణ చిత్రం!

హైస్కూలు మొదటిబెల్లు ఖంగు ఖంగు మంటూ దూరంగా ఉన్న పిల్లలం దరినీ పిలుస్తున్నాది. రోడ్డు, వరండాలు, గదులూ విద్యార్థులతో, విద్యార్థినులతో, ఉపాధ్యాయులతో కలకల్లాడుతున్నాయి.

పుస్తకాలు పట్టుకుని సరస్వతీ దేవిలాగు శకుంతల వొచ్చింది. ఆమె చిన్నపిల్ల. పదకొండేళ్ళది. సూదిముక్కు, సూది గెడ్డాం, ఆ రెంటికీ పొందికయిన నోరు కలిగి ముదొస్తూ ఉంటుంది. తెలివితేటల తళుకుతో దాని కళ్ళు చాంచల్యాన్ని పొందుతున్నాయి.

"కృష్ణా! ఇంగ్లీషులో ఫస్టుమార్కు నాది!" అని వొస్తూనే ఉడికించింది. - “ఒక్క ఇంగ్లీషులో నేకదా! నాకు మూడింట్లో ఫస్టుమార్కు లొచ్చాయి, లెజ్జల్లో నూటికి నూరు!" అన్నాడు కృష్ణుడు. 

"ఇంగ్లీషు ముఖ్యమైందండీ!" అన్నాది శకుంతల.

“లెస్టైలంతకన్నానండి. ఆమాటకొస్తే తెనుగు ముఖ్యమండి. తెనుగులో ఫస్టు ఆ మార్కెవరిదండి." - ఇంగ్లీషే ముఖ్యమండి. ఎవరి నడుగుతావో అడుగు!"

“తెను గేనండి. బియ్యేవాళ్ళక్కూడా ఇంగ్లీషులో మానేసి లెక్కలూ అవీ తెనుగులోనే : చెప్పాలని పేపర్లో పడ్డాడండి. -

.

“నువ్వు మహా పేపరు చదివి ఏడిశావు!"

 "నే నాంధ్రపత్రిక రోజూ చదువుతాను. మా యింటి దగ్గర వాళ్ళకొస్తుంది." 

రెండోబెల్లు ఖంగు ఖంగుమని ప్రారంభమైంది. 

నరశింహానికి శకుంతల మొహం చూడ్డానికి లజ్జ వేసింది. వాడు చదువూ సంధ్యారాని దద్దమ్మ. వాళ్ళతోపాటు సంభాషించడానికి తాహతులేక తల వాల్చుకుని మౌనవ్రతం పట్టేడు. తన హనావా  పంట్లాము ధగధగలాడుతున్నా,

 కృష్ణుడి కుళ్ళు నిక్కరు కనబడుతున్నా వాడికి తక్కువతనం పట్టుకుంది. రెండోబెల్లు కాగానే చల్లగా బడిలోకి జారిపోయాడు.

“బెల్లయింది, బళ్ళోకిరా!" అన్నాది శకుంతల. 

“నేను సోమవారం నుంచి వస్తాను" అన్నాడు కృష్ణుడు.

 “ఫోర్తు ఫారమ్ లో నీ పని చెపుతాను. ఒక్క ఫస్టుమార్కు రానివ్వను." 

“ఇహనన్నీ  ఫస్టుమార్కులూ నీవేలే!" 

“ఏం?" 

“ఏమీ లేదు.”

“నువ్వు మా ఇంటికి రావడం మానేశావేంరా? మా అమ్మా, నాన్నా 'కృష్ణుడు రాలేదేమా' అని రోజూ అంటారు."

"ఏమీ లేదు." 

“నేను బళ్ళోకి పోవాలి బాబూ!" అని పరిగెట్టింది.

 “శకుంతలా?” అని పిలిచాడు.

 “ఏం!" అని ఆగింది.

ఎందుకు పిలిచాడు. ఆమెతో నిజం దుఃఖోపశమనం చేసుకుందుకా? ఎందుకు పిలిచాడో వాడికే తెలియలేదు. .

"ఏమీ లేదు" అన్నాడు.

శకుంతల వెళ్ళిపోయింది. ఇద్దరూ ఒక్క ఈడువాళ్ళు. క్లాసుకి వాళ్ళిద్దరే అందరికన్నా తెలివైనవాళ్ళు. ఒకరి నోట్సు ఒకరు పుచ్చుకుంటూ స్నేహంగా వుండేవాళ్ళు. పంతంతో చదివేవాళ్లు. శకుంతలతో పోటీ కృష్ణుడికి వికాసవంతంగా ఉండేది. శకుంతల దస్తూరీ కృష్ణుడికి జ్ఞాపకమొచ్చింది. ఆమె దస్తూరీ మంచిదికాదు. కొక్కిరిబిక్కిరిగా రాస్తుంది. అతనిది ముత్యాలకోవ.

శకుంతల బడిలోకి పరిగెడుతుంటే కృష్ణుడు స్తంభించిపోయి చూస్తూ నిల బడిపోయాడు. పిల్లల గోలంతా క్రమేణా అణిగిపోయింది. వరండాలన్నీ ఖాళీ అయిపోయాయి. మేష్టర్ల మాటలు ఉండుండి వినబడుతున్నాయి. వేలకొద్దీ విద్యార్థులు డెస్కులు మీదవాలి కూచుని పాఠాలు వింటున్నారు. - బడిదగ్గరనుంచి కృష్ణుడు కదలలేకపోయాడు. తన చదువుపోయింది కదా అని కుమిలిపోతున్నాడు స్కూలు వరండాలో కెళ్ళాడు.

“నే నిక్కణ్ణుంచి కదలను” అనుకొని స్తంభానికి జేరబడ్డాడు.

"నే నింటికే వెళ్ళను" అని నిశ్చయించుకొన్నాడు.

నాలుగోక్లాసు దగ్గరనుంచి బడిలో తను చదివిన ఐదేళ్ళ సంగతులూ ఒక్కొక్క టే జ్ఞప్తికి వొచ్చాయి.

ఐదవక్లాసు చదువుతుండగా ఒక పిల్లడు కృష్ణుడు మీద మేష్టరుతో చాడీలు చెప్పేడు. మేష్టరు నమ్మక, అబద్ధాలు చెప్పేడని వాళ్లే చితకతన్నేడు.

మూడవఫారంలో తెలుగు మాష్టరు "గాంధారపతి" అంటే అర్థం చెప్పమన్నాడు. అంతా నేలచూసి, ఇంటికప్పుచూసి, ధృతరాష్ట్రుడని చెప్పేరు. తనొక్కడే "గాంధార దేశపు రాజు" అని చెప్పేడు.

రెండవఫారం చదువుతుండగా దసరా తరువాత ఒక కుర్రవాడు బడికి రావడం మానేశాడు. వాడి పేరు రోజూ పిలిచి మేష్టరు ఆబ్సెంటు వేస్తూ ఉండేవాడు. ఆఖరికి వాడు. చదువు మానేశాడని తెలిసింది. ఆవేళ అటెండెన్సు రిజిష్టరులో వాడి పేరు కొట్టేసి, మేష్టరు "డిస్కంటిన్యూడ్ " అని రాసి, ఇంగ్లీషు మాటకి అర్థం క్లాసులో చెప్పాడు. ఆనాటి నుండి కృష్ణుడు "డిస్కంటిన్యూ" అన్నమాటకు అర్థం మరచిపోలేదు. ఆ పదం జ్ఞాపకం రాగానే అతనికి దుఃఖం పొర్లుకుంటూ వొచ్చింది.

“నే నింటికే వెళ్ళను” అని పునఃనిశ్చయించుకొన్నాడు. “నేను భోజనానికి వెళ్ళను” అనుకొన్నాడు.

అతని మొహం గాలికొట్టిన కొత్త ఫుట్ బాలులాగ దుఃఖంలో పొంగి కందగడ్డ అయిపోయింది. ముక్కు నీటితో బరువెక్కి దిబ్బ డేసిపోయింది. ముక్కు ఎగబీల్చు కుంటూ పొంగుకొస్తున్న దుఃఖానికి ఆనకట్టలు కట్టి దిగమింగుతూ స్తంభానికి జేరబడి పోయాడు. 

మొదటి పీరీడైపోయింది. కృష్ణుడు కదలలేదు. వాళ్ళ నాన్న బజారుకి బయలుదేరేడు. వరండాలో కొడుకుని చూశాడు.

“ఓరి వెధవా! చుట్టలు తెమ్మంటే ఇక్కడ దిగమారేవేం?” అన్నాడు.

 “చూడు!" అన్నాడు కృష్ణుడు. 

“ఏమిట్రా చూడ్డం!” అన్నాడు తండ్రి.

 “పాపం, కనబడదు!" “ఏమిటిరా నీ శ్రాద్ధం ."

 “నా శ్రాద్ధమే!" “ఏమిటిరా!?” 

“వాళ్ళంతా బడి కెళ్ళారు! అప్పుడు తండ్రికి కొడుకు మొహంలో విచార రేఖలన్నీ కనబడ్డాయి.

“వెర్రి నాగమ్మా. అదిరా!" అన్నాడు. 

కృష్ణుడికి ఆనకట్టలు తెగొట్టుకొని దుఃఖం కొట్టుకొచ్చింది. వెక్కి వెక్కి చుట్టుకుపోతూ ఏడుపు మొదలెట్టేడు. 

కొడుకు బాధంతా తండ్రికి బోధపడ్డాది. కొడుకు బాధంతా తండ్రి పడ్డాడు.

"చదువు మానిపించానని అంత బాధపడుతున్నావా? బడివరండాలు పట్టుకుని దేవుళ్ళాడుతున్నావా నాయనా? పద ఇంటికి!" అన్నాడు.

"నే న్రాను!" అని భూమి బద్దలైపోయినంత గట్టిగా అరిచేడు. “ఏం చేస్తావురా?"

“గోడ కేసి బుర్ర బద్దలుకొట్టుకొంటాను!" అని ఇంకా గట్టిగా అరిచేడు.

 అంతపనీ చేస్తాడేమోనని వెళ్ళి తండ్రి కౌగలించుకొన్నాడు.

“పద నాయనా, ఇంటికి!” అన్నాడు. 

“బడి నాది!" అని గట్టిగా కేకేశాడు.

 “నీదేనురా బాబూ!" “బడిలోకి తీసి కెళ్ళు మరి.”

 “తల తాకట్టు పెట్టుకునేనా బళ్ళో వేస్తాను, ఇంటికి పద.” 

“ఇప్పుడే వెయ్యి!” 

“డబ్బు చూసి వేస్తాను." 

“ఇంటికి వెళ్ళి లేదంటావు."

 “అన్ను రా!” 

“ఐతే పుస్తకాలు ముందు కొను!" 

“వెర్రి నాయనా! వాటికి మాత్రం డబ్బులుండొద్దూ”

 “ఒక్క పుస్తకం కొను." 

“ఏ పుస్తకం కొనమన్నావు." 

“ఇంగ్లీషు పుస్తకం కొను.”

“కొందాం, పద. ఏడవకు నాయనా, నే చచ్చిపోయాను, ఏడవకు!" అన్నాడు తండ్రి. 

తండ్రి చెయ్యిని చంకలో పెట్టుకొని గిలగిల కొట్టుకొని ఏడుస్తూ బడిలో స్టోర్సుకి  తోవతీసాడు.

తండ్రి దీర్ఘంగా ఆలోచించాడు. చుట్టలు మానేద్దామనుకొన్నాడు. ఎంత మానుదా మనుకొన్నా మానలేక పోతున్నాడు. చుట్టలు మానేస్తే కృష్ణుడి జీతానికి సరిపోతుంది. ఇంకోవిధంగా పాలుపోలేదు.

“ఇందాకా చుట్టలకిచ్చిన డబ్బులున్నయా, పారేశావా?" అనడిగేడు కొడుకుని.

 “ప ప .....ప్పారీలేదు. జేబులో ఉన్నాయి....ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్నాడు కృష్ణుడు.

భారతి, 1945.


శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారి సమీక్ష ఈ కథ పై - http://bit.ly/aripirala

చాసోని కథకుల కథకుడుగా వర్ణించారు కొకు. ఆ మాటేమో నిజమే. కానీ అందుకు నిదర్శనం? చాసో ఏ కథ తీసుకున్నా అందుకు నిదర్శనం కనపడుతుంది. ముఖ్యంగా ఆయన శిల్పాన్ని గమనిస్తే అందుకు తార్కాణాలు కథ కథలోను కనిపిస్తాయి. “వాయులీనం”, “ఏలూరెళ్ళాలి”, “బొండుమల్లెలు”, “ఎంపు”, “కుంకుడాకు” ఇంకా ఎన్నో…! ప్రతి కథలో ఓ వైవిధ్యమైన కథా వస్తువు, అలవోకగా సాగిపోయే నడక, అమాంతంగా వచ్చి మీదపడే ముగింపు. ఇవన్నీ గమనించుకుంటూ చదివితే ప్రతి కథకుడూ ఓ మెట్టు పైకెక్కడం ఖాయం. అలా ఎదిగిన ప్రతి కథకుడూ మళ్ళీ అదే మాట అంటాడు – “చాసో కథకుల కథకుడు” అని.

చాసో కథలలో బాగా నచ్చిన కథ ఏది అంటే చెప్పటం చాలా కష్టం. “ఎంపు” నేను మొట్టమొదట చదివిన చాసో కథ. అందులో నిష్కర్షగా, కఠోరంగా ఓ చెప్పిన జీవిత పాఠాన్ని ఆకళింపు చేసుకోడానికి గడిపిన ఒంటరి రాత్రి గుర్తొస్తుంది. “వాయులోనం” కథ చదవడం అయిపోయినా అందులో లీనమై బయటపడలేక గిలగిలలాడిన సందర్భం గుర్తుకొస్తుంది. కనీసం పది కథలు గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ పాఠకుడిగా. ఈ మధ్యకాలంలో ఓ కథకుడిగా ఆయన్ని మళ్ళీ చదివినప్పుడు నాకు చాసోలో కనపడ్డవి జీవిత పాఠాలే కాదు, కథా రచన పాఠాలు కూడా. ఆ దృష్టికోణంలో చూస్తే నాకు చాలా బాగా నచ్చినది, ప్రభావితం చేసినది “ఎందుకు పారేస్తాను నాన్నా” అనే కథ.

(కథ చదవనివారుంటే ఆ కథని చదివి ఈ వ్యాసం కొనసాగించగలరు. ఇక్కడినుంచి తొలిపఠనానుభూతిని తగ్గించే సంగతులు వుండగలవు)

కృష్ణుడనే కుర్రవాడు. చదవాలని ఆశ. పేదరికం వాడి చదువుని మింగేసిన భూతం. తండ్రి చుట్టలు తెమ్మంటాడు. బడిమీదుగా పోక తప్పదు. నామోషీగా అటు వైపు వెళ్తాడు. నరిశింహం, శకుంతల అనే సహాధ్యాయులతో మాట్లాడతాడు. బడి మొదలైనా అక్కడి వరండాలో స్తంభానికి జేరబడి వుండిపోతాడు. తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. కొడుకు బాధని తెలుసుకుంటాడు. కొడుకు బాధని తనూ పడతాడు. చుట్టాలు తెమ్మని ఇచ్చిన డబ్బులు వున్నాయా పారేశావా అంటాడు. – “ప… ప్ప… ప్పారీలేదు. జేబులో ఉన్నాయి… ఎందుకు పారేస్తాను నాన్నా?” అంటాడు కృష్ణుడు.

ఆ వాక్యంతో కథ అయిపోయింది. అదే వాక్యంలో మాట కథకి శీర్షిక అయ్యింది.

అదలా పక్కనపెడదాం. ఏమిటీ కథలో గొప్పదనం? చెప్పాలనుకున్న విషయం చిన్నదే. స్పష్టంగా చెప్పేడు కూడా. “ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్న ఒక్క ప్రశ్న ఎన్ని ప్రశ్నలు పుట్టిస్తుంది? “ఎందుకు పారేస్తాను? ఎలా పారేస్తాను? నాకు బాధ్యత తెలుసు కదా నాన్నా. నా చదువాపేసిన పేదరికం గురించి కూడా తెలుసు కదా నాన్నా. ప్రతి రూపాయినీ పారేయకుండా ఉంచుకుంటే అవి నా పుస్తకాలకు పనికొస్తాయనీ తెలుసు కదా నాన్నా..” అంటూ పిల్లాడు అడిగనట్లు అనిపిస్తుంది. అంతకు ముందే పుస్తకం కొంటానని మాట ఇచ్చిన నాన్న, చుట్టలు మానేస్తే కృష్ణుడి జీతానికి సరిపోతుందనుకున్న నాన్నా, పిల్లాడు పారేయకుండా వుంచిన డబ్బుతో అప్పటికప్పుడు ఇంగ్లీషు పుస్తకం కొన్నాడా? ఎమో తెలియదు. కానీ తెలుసుకోవాలనిపిస్తుంది. కథ అయిపోయిన తరువాత ఏం జరిగుంటుందో అన్న ఆలోచనపుడుతుంది. ఇలా జరిగి వుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చేదాకా వెంటాడుతుంది. అదీ గొప్ప ముగింపు లక్షణం. చాసొ ప్రతి కథలో, (ప్రత్యేకించి ఈ కథలో) ఇలాంటి ముగింపులే వుంటాయి. తెలుగు కథలలో వచ్చిన అత్యుత్తమ ముగింపు వాక్యాలు రాస్తే అందులో పదింట అయిదు చాసోవి వుండితీరాల్సిందే..!

ముగింపుకు అంత బలం ఎక్కడ్నుంచి వచ్చింది? కథ మొదటి ముగింపుకి బలాన్ని ఇస్తూనే వుంటాడు చాసో. వాతావరణ చిత్రణ, పాత్ర చిత్రణ అన్నీ క్రమంగా ఈ సొరంగం తొవ్వుతున్నట్లు నిర్దేశించిన ముగింపు వైపు వెళుతూనే వుంటాయి. పాఠకుడి గమనించినా గమనించకపోయినా.

(కేవలం ఆరు పేజీల కథ ఇది. నేను పూర్తిగా విశ్లేషిస్తే అంతకన్నా ఎక్కువే అవుతుందేమో)



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations