Episode 125

'వడ దెబ్బ'!

 కథ పేరు 'వడ దెబ్బ'.

వడ దెబ్బ

“వెధవన్నర వెధవలు! నడుం వాల్చనియ్యరు. మీ మొహాలు మండా! వస్తున్నా నుండండి. మీ బుర్రలు బద్దలు కొడతాను." కోపంతో ఊగిపోతూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముసిలాయన గేట్లోకి పరిగెట్టేడు.

గేటు సందుల్లోంచి చూస్తున్న పిల్లలంతా ఆయస గేటు దగ్గర కొచ్చేలోగా తుర్రుమన్నారు.

ముసిలాయన తలుపు బార్లా తెరచి, జాపోస్తూ నిల్చున్నాడు. పారిపోయిన పిల్లలు సందు మొగని తొంగి తొంగి చూస్తున్నారు.

"బండ వెధవల్లారా ! బడుద్ధాయి గాడిదల్లారా ! రండి, మీ పని పడతా!" ముసిలాయన గట్టిగా అరిచేడు.

ఎండాకాలం మధ్యాహ్నం. ఒళ్లు చిట చిట లాడుతోంది. నుదుటి మీంచి చెమట, ధారకట్టి ఆయన మొహం మీద ముడతల్లోంచి కిందికి కారుతోంది. వీపంతా పేత పొక్కులతో, గోనెగుడ్డలా దళసరి ఎక్కి పోయింది. వీధిలో మనిషన్న వాడు లేడు. అందరి ఇంటి తలుపులు బిడాయించుకుని ఉన్నాయి.

గుంట వెధవలకి ఎండా లేదు కొండా లేదు. సందు మొగని నిల్చుని తొంగి, తొంగి, చూస్తున్నారు. ముసిలాయన ఎండలో నిల్చుని సందు వేపు తీక్షణంగా చూస్తున్నాడు. పిల్లలు ఏమను కొన్నారో ఏమో చల్లగా జారుకున్నారు.

"పోయారు వెధవలు, వారం రోజులై ఈ భాగోతం మొదలయింది. మధ్యాహ్నం, కాస్త నడుం వాల్చనియ్యరు" ముసిలాయన గొణుక్కుంటూ గేటు వేసి ఇంట్లోకి వచ్చేడు.

జాపోస్తూ పడక్కుర్చీలో పడుకున్నాడు.

నరసారావు పేట పడక్కుర్చీ!

దాంట్లో పడుకుంటే ప్రాణం సేద తీరుతుంది.

ఆయన ఆ కుర్చీని తన మొదటి జీతంతో కొనుక్కున్నాడు. చిన్నప్పటినుండి ఆలాంటి కుర్చీ ఓటి ఉంటే బాగుంటుందని ఆయనకి మా కోరిగ్గా ఉండేది. మొదటి జీతం చేతికి రావడం ఏమిటి, కుర్చీ కొండం ఏమిటి!

రిటైరై కొడుకూ కోడలి దగ్గరకి పూర్తిగా వచ్చేస్తున్నప్పుడు మిగతా సామాన్లు వాళ్లకి, వీళ్లకీ పంచేడు కాని, ఆ కుర్చీని మాత్రం జాగ్రత్తగా తనతో కూడా తెచ్చుకున్నాడు. 

“నాన్న గారూ! మీరూ మీ చాదస్తం గాని, ఆ కుర్చీని అక్కడెవరికన్నా ఇచ్చిలేకపోయారూ ? అంత దూరం నుంచి ఇక్కడికి మోసుకొచ్చేరు!" అన్నాడు కొడుకు.

కొడుక్కేం తెల్సు, ఈ కుర్చీలో ఉన్న సౌఖ్యం.

ముసిలాయన కుర్చీ చేతుల మీదకి, రెండు కాళ్లూ జాపుకుని విసనకర్రతో విసురుకుంటూ కళ్లు మూసుకున్నాడు.

“తెల్ల మీసం! తాటేకు విసనకర్ర, వెండి మీసం తాటేకు విసన కర్ర!"

పిల్లలు మళ్ళీ వొచ్చిపడ్డారు. నవ్వుతున్నారు. గేటుసందుల్లోంచి చూస్తున్నారు.

ముసిలాయన కి తాటేకు విసనకర్రే గతి అయింది.

సీలింగు ఫేను లోపలిగదిలో ఉంది. కొడుకూ కోడలూ అందులో ఉంటారు. ముందు గదిలో ఫేను లేదు.

తండ్రి రిటైరై వచ్చేడని మరో ఫేను కొడుకు వెంటనే ఎక్కడ కొంటాడూ! ఆదివారం సంతలో ముసిలాయన అరడజను విసనక్రరలు కొనుక్కు తెచ్చుకున్నాడు.

తాటికమ్మా ! తాటిముంజ! తెల్ల మీసం వెండి మీసం!" ముసిలాయన ఈసారి కుర్చీలోంచి లేవలేదు. కుర్చీలో పడుకునే గేటు వేపు చూస్తూ ఊరుకున్నాడు.

గేటు సందుల్లోంచి కొన్ని జతల కాళ్లు కని పిస్తున్నాయి. ఎర్రరంగు గౌను, నీలంరంగు రిబ్బనూ కనపడుతున్నాయి.

అన్ని కాళ్ళకి హవాయి చెప్పులు ఉన్నాయి. ఆ కాళ్లలో బుల్లిగాడి కాళ్లు ఏవైఁ ఉఁటాయో అని ముసిలాయన తేరిపారి చూసేడు. ఆ బుల్లి గాడు మా కాని వెధవ! ఆ వెధవే ఈ సజ్జు నంతటినీ తీసుకొచ్చి గొడవ చేస్తున్నాడు.

ఇదే తంతు. వెధవ సన్నేసులకి భయం అన్నది ఏ కోశాన్నీ లేదు.

మధ్యాహ్నం అయీ అవడంతో వొచ్చిపడ్డం. గేటు సందుల్లోంచి చూడ్డం.

ఒకటా రెండా-కాళ్లు, ఆరుగురో, ఎనమండుగురో! బొత్తిగా చిన్న వెధవలూ ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలూ ఉన్నారు.

మొదటి రోజు తిట్టేడు. కొడ్తానని కేకలేసేడు. ఎవరి పిల్లలని అదిలించేడు. అన్నిటికీ పకపక నవ్వులే.

ఆయన తిడుతున్న కొద్దీ వాళ్లకి మరింతనవ్వు. "బుల్లిగా బుల్లిగా!" అంటూ పరుగులు.

నిన్నటికి నిన్న ముసిలాయనకి చిన్న మాగన్ను పట్టింది. “తాటిముంజలండి ! తాటిముంజలండి !" చెవిలో కేక పడ్డాది. ముసిలాయన లేచి కూచున్నాడు. “ఏయ్ తాటి ముంజలూ!" అని చీడీ మీంచీ కేకేసేడు. “ఏయ్ తాటి ముంజలూ! ఏయ్ తాటి ముంజలూ" అని పిలుస్తూనే ఉన్నాడు.

తాటిముంజల వాడి అరుపు దూరం అయిపోతూ సందు మొగనుంచి వినపడుతోంది. ఊడిపోతున్న పంచెని దోపుకుంటూ ముసిలాయన గేటువరకూ పరిగెట్టుకు వెళ్ళేడు.

“తాటిముంజలండోయ్! తాటి ముంజలు", అరుపు వినపడుతోంది. ముసిలాయన వీథిని ఆటూ ఇటూ చూశాడు.

“ఏయ్ తాటిముంజలూ!" అంటూ కేకేశాడు.

సందు మొగనుంచి మళ్ళీ “తాటిముంజలండి తాటి ముంజలు!" అని వినిపించింది ముసిలాయన అటు చూసేసరికి పిల్లలంతా గొల్లని నవ్వేరు.

ఓకుర్రాడు ఏతాడి తాతలా "తాటిముంజలండి తాటిముంజలు" అని అరుస్తున్నాడు.

ముసిలాయనకి వెర్రి కోపం వచ్చింది.

“దొంగ వెధవల్లారా! సన్నాసి వెధవల్లారా !" అని తిడుతూ వెర్రి పీరులా ఊగిపోతూ వీదంట పరిగెట్టేడు. -

“బుల్లిగా! చచ్చేంరోయి!"అంటూ పిల్లలు పరుగు లంకించుకున్నారు.

. అప్పుడు తెలిసింది 'బుల్లిగాడు' ఆ కుర్ర కుంకల లీడరు గాడని!

“అమ్మడూ, ఆ బుల్లిగాడెవరో నీకు తెల్సా?" అని కోడల్ని అడిగేడు.

కోడలు మా తల్లి తిన్నగా జవాబిస్తుందా? తను వచ్చిందగ్గర్నుంచి చూస్తున్నాడు. తన పొడ ఆవిడకి కిట్టటం లేదని తెలుస్తూనే ఉంది.

“ఏమో ఎవడికి తెల్సు? బుల్లిగాడో, మల్లిగాడో, రోజూ న్యూసెన్సు. వాళ్లూ సరి మీరూ సరి! లక్షా తొంభై సార్లు చెప్పేను. తలుపులు వేసుకు పడుకోండి అని! ఉహూఁ మీరెక్కడ వింటారూ? పోనీ తలుపు తీసుకుంటే తీసుకున్నారు.ఆ కర్టెను ఉండనిస్తారా? చచ్చీ చెడీ ఆ ఎంబ్రాయిడరీ చేసేను. నలిపి నలిపి తలుపు మీదికి ఎత్తి పెట్టారు."

కోడలు విసుక్కుంది.

ముసలాయనకి తలువులు బిడాయించుకోవడం, తెర గుడ్డలతో ఇల్లంతా చీకటిమయం చేసుకోవడం ససేమిరా కిట్టదు. గాలీ వెలుతురూ రాకుండా, బైట ప్రపంచం కనపడకుండా ఉండటం ఆయనకిరాదు.

ఆయన కొడుకు దగ్గరికి రావడం ఏమిటి, సావిడి గదిని తనదిగా చేసు కోడం. వీధి గుమ్మాని కెదురుగా నర్సారావుపేట పడక్కుర్చీ వేసు కోడం, దాంట్లో పడుకుని, వీధి వేపు చూస్తూ, ఆకాశాన్ని చూస్తూ చుట్ట కాల్చుకోడం మొదలయింది.

ఆయన బతుకు బతుకంతా బాహాటంగా బతికేడు. బతుకులో రహస్యమన్నది లేదు.

ఆయన రాక పూర్వం అయితే వీధి తలుపులు వేసి ఉందేవి. అధవా తీసి ఉన్నా నిండా కర్టెను ఉండేది. ముసిలాయన వీధి తలువులు బార్లా తెరవడమే కాదు. ఆ కర్టెను ఎత్తి తలుపు మీదకి పడేస్తాడు. అప్పటికిగాని ఆయనకి ఊపిరి తీసు కున్నట్టు ఉండదు.

ముసిలాయన చేసే పన్లలో తన యింటి డీసెన్సీ పోయిందని కోడలి బాధ. గుమ్మానికి ఎదురుగా అడ్డంగా అంభేరీలా ఈ గోడ నుంచి ఆ గోడ వరకూ ఇంత పొడుగుని ఆ పడక్కుర్చీ ఓటి !

దానికి తోడు కంచు ఆపుకోరా, తాటాకు విసనకర్రా! ముసిలాయనా ఆయనచుట్టాను.

సందు దొరికితే చాలు ఆవిద రుసరుస లాడుతూ నే ఉంది. మొగుడితో ముప్ఫయిసార్లైనా చెప్పి ఉంటుంది.

“ఎందుకు అలా తొందరపడ్డావు. చెప్తున్నానా! నీకోరిక తీరుతుందన్నానా! ఎటొచ్చీ సీలింగు ఫేను మాత్రం ఇప్పుడు రాదు. వేసం కాలం కదా! కొంచెం కష్టం. నీ సోఫా సెట్టు వస్తుంది. నీ యిష్టం వచ్చినట్టూ నువ్వు ముందుగదిని డెక రేటు చేసుకుందువుగాని." అని మొగుడు ఎంతో ముచ్చటగా చెప్పి ఆవిడ చీకాకుని పటాపంచెలు చేసేడు. మొగుడి చాకచక్యం మీద ఆవిడకి చాలా నమ్మకమే.

అన్నాడు అంటే చేసేడూ అన్నమాటే! ఎక్కడో ఏదో పాచిక పారిఉంటుంది. అందుకే అంత ఖచ్చితంగా కోరిక తీరుతుంది అంటున్నాడు.

ఇదిగో, వారం రోజులై పిల్లల సంతొకటి మొదలయిం ది.

ఆ గుంట వెధవలు రావడం, ముసిలాయన్ని వెక్కిరించడం.. ఈయన వెర్రెత్తి పరుగులు తీయటం.

ఆ పిల్లల తల్లి తండ్రులకైనా బుద్ది లేదు. ఇంత ఎండల్లో పిల్లల్ని రోడ్డు మీదకి ఎలా వదులుతారో! ఏ వడ దెబ్బో తగిలితే కాని తెలిసిరాదు. కోడలికి మహా చికాగ్గా ఉంది. ఈ వేళ పిల్లల గొడవ తారస్థాయిని అండుకుంది. ఒకటే రొదగా అరుస్తున్నారు. కోడలు విసురుగా వచ్చి వరండా మీద నిల్చుని వాళ్లని తిట్టింది. కోడిల్ని చూడగానే పిల్లలందరూ మాయమై పోయారు. ఆవిడ గేటు వరకూ అయినా వెళ్లలేదు. వీధివరండాలో ఆవిణ్ణి చూసి వాళ్లు హడలిపోయేరు. కోడలు విసవిసలాడుతూ ముసిలాయన పక్కనుంచి ఇంట్లోకి వెళ్లి పోయింది.

ముసిలాయన తిట్లు పిల్లలకి లెక్క లేదు. ఆయన తిడితే వాళ్లకి ఆనందం! పకపకా నవ్వుతారు! పరిగెడతారు. ముసిలాయన దిగులుపడి పోయేడు. రోజురోజుకీ తను దిగజారిపోతున్నట్టుగా ఆయనకి ఆయనకే తెలుస్తోంది. పిల్లలు తనని చులకన చేసి ఆటపట్టిస్తున్నారని కాదు ఆయన బాధ.

మొట్ట మొదటి రోజు పిల్లలు గేటు సందులోంచి చూసినప్పుడు వాళ్లని ఆయనే ఉసిగొట్టి రెచ్చకొట్టేడు. ఆయన రెచ్చకొట్టినప్పుడు, తిట్టినప్పుడు పిల్లలకి నవ్వు వచ్చింది. ఆయన తిట్లు వాళ్లకి తిట్లలా అని పించలేదు. ఆయన కేకలు ఉత్తుత్తి గావుకేకలే! పిల్లలకి అదో ఆట అయింది. ముసలాయనకీ వాళ్ల ఆటలో ఏదో ఊరట కలుగుతోంది.

 ముసిలాయనకి బాధగా వుంది. తన బాధనీ దిగులునీ , ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావడం లేదు. 

ఆ వేళ మనవల్ని సెలవల్లో ఎక్కడికి పంపొద్దనీ వాళ్లకి తను పాఠాలు చెప్తాననీ తనకి కాలక్షేపం అవుతుందనీ, పిల్లలూ మెరుగవుతారనీ అన్నాడు.

కోడలు ససేమీరా వినలేదు.

కొడుకో! పెళ్లాం ఎంత చెపితే అంత!

"ఎలాగా ట్యూషను పెట్టాం. మీరేం చెప్తారూ?" అన్నాది కోడలు.

“మీ కెందుకండీ! రామ కృష్ణా అని రెస్టు తీసుకోక!" అన్నాడు, కొడుకు.

“మీకు అక్కర్లేని విషయాల్లో జోక్యం కలగ చేసుకోకండి. పిల్లలూ చదువుసంధ్యలూ వాటి ఊసు మీ కెందుకూ? మేం వాళ్ల మంచి చెడ్డా చూసుకోగలం" అని కోడలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది.

ఎండా కాలం సెలవలు ఇచ్చీ ఇవ్వడం, పిల్లలు వాళ్ల పిన్నిగారి ఊరు వెళ్లి పోయేరు.

పిల్లలు తిరగడానికి వెళ్లేరు. మంచిదే.

అదికాదు, ముసిలాయన కడుపులో బాధ.

మాటకి విలువ ఉండాలే !

కొడుకుని చూస్తూ ఉంటే. ఆయనకి ఆశ్చర్యం వేస్తోంది. కళ్ళెర్ర చేసి చూస్తే బిక్కచచ్చి నిల్చునే వెధవ వీడేనా! ఆయనంటే వీడొక్క డేనా, అదెంత హడిలి పోయేది? చచ్చి, స్వర్గాన్ని వుంది. ఎంత భయమో! ఒదిగి ఒదిగి ఉండేది.

ఆయనంటే ఒక్క పెళ్లానికేనా హడలు?

ఆఫీసులోనో, అందరికీ గడగడే! భయపడకేం చేస్తారు? నిప్పు లాంటి మనిషి.

ఎవరి పప్పులూ ఆయన దగ్గర ఉడకవు. ఆయన్ని ఎప్రోచ్ అవడమే?

బతుకు బతుకంతా అలాగే బతికేడు. పిల్లల చదువు విషయంలో తన జోక్యం పనికిరాదన్న వాళ్లనీ,. వాళ్ల బతుకుల్నీ తనేం దిద్దగలడు!

“మీకేమిటండీ! కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు" అంతా అన్నారు.

ఆయనా అదే అనుకున్నాడు. రిటైరై కొడుకు దగ్గరికి వచ్చేక, కన్నాడన్న మాటేకాని తనకే మాత్రం కొడుకు రూపం తెలీదన్న నిజం ఆయనకి తెలిసివచ్చింది. ఆయనదే ఆ సూది ముక్కు, ఆయనదే ఆ గెడ్డాం.

ఆయనదే ఆ ఉంగరాల జుట్టు. ఆయనదే ఆ మిసమిసలాడే తెలుపు. అన్నిటిలో ఆయన కొడుకేనని చూసినవాళ్లు ఆనవాలు కడతారు. కాని ఆయన తన కొడుకులో తనను తాను ఆనవాలు పట్టుకోలేక పోతున్నాడు.

ఆ డాబు దర్పం! ఆ పొగరు! ఆ గీర, కిందా మీదా కానరాని కావరం, వాడా ఆయన కొడుకు!

కొడుకు కన్నా నాలుగాకులు ఎక్కువ వల్లించే కోడలు! ఆ మా తల్లి నోట వచ్చే ప్రతీ మాటలోనూ అతిశయమే!

కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడని సుఖంగా ఉన్నాడని అనుకున్నాడే కాని వాడి రూపం ఇలా మారి ఉందని ముసిలాయనకి ఏం తెల్సు?

ఆయన తన ఉద్యోగంలో తాను ఉన్నాడు. కొడుకు ఈ దూర ప్రాంతాల్లో ఎలా రంగు మారి వున్నాడో , ఆయనకేం ఎరుక? నిజమే. ఈ రోజుల్లో గాలి వాటం అటే వుంది. అందరూ ఆ గాలిలో కొట్టుకు పోతున్నారు. అయితే వీడు - వీడు - తన కొడుకు గాలిలో కొట్టుకు పోతున్నాడు.

గాలికి ఎదురు వెళ్లాల్సిన వాడు కాదూ? తనకు పుట్టి !

"ఆయనకేం ఆయన కొడుకు రెండు చేతులా గడిస్తున్నాడు" అంటున్నారందరూ.

రెండు చేతులా గడిస్తున్నాడా? దోస్తున్నాడా? ముసిలాయన లోలోపల కుంగిపోతున్నాడు.

వీధిలో గుంట వెధవలు. పసికుంకలు. అతన్ని ఆటపట్టిస్తున్నారని ఆయన బాధపట్టం లేదు. ఓ రకంగా ఓ వారం రోజులు బట్టి ఆ పిల్లలతో ఆయనకి కాల క్షేపం అవుతోంది.

కడుపులో మండుతున్న మంటని ఆ కుర్రకుంకల మీద చూపెడుతున్నాడు.

తన దిగులునీ తన బాధనీ పోగొట్టుకోడానికి తన కోపాన్ని ఆ పిల్లల మీద రుద్దుతున్నాడు.

చెట్టంత కొడుకుని తిట్టడం ఎలాగో తెలీక ఆ కుర్ర వెధవల్ని తిడుతున్నాడు.

ప్రతిరోజూ ఆ పిల్లలు వచ్చే వేళ కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. మాగన్ను పట్టబోతున్నా ఆ ఆకతాయి పిల్లలు ఇంకా రాలేదేమా అనుకుంటూ రెప్పలు బలవంతాన్ని విప్పి, గేటు వేపు చూడ్డం, ఆయనకి అలవాటు అయింది

ఆ ఆదివారం ఆయనకి తిక్క ఎక్కి నట్లైంది. ఆయనకి ఇంట్లో ఉండబుద్ధి పుట్టలేదు.

ఆయన వీధిలో తిరగడానికి వెళ్ళాడు.

ఆ వెళ్లిన వాడు సూర్యుడు నడి నెత్తికి వచ్చే వరకూ ఇంటికి రాలేదు. ఎర్రగా కంద గడ్డలాంటి మొహంలో చెమటలు కక్కుకుంటూ ఎండపడి వచ్చేడు. ఆయన వచ్చేసరికి పక్కింటావిడా పిల్లలూ సావిట్లో ఉన్నారు. ముసిలాయన రావడం చూసి ఆవిడ వెళ్తానంటూ లేవబోయింది.

“ పెద్దవారు; ఆయన దగ్గర మీకు మొహమాటం ఏమిటండీ?" అన్నాది కోడలు.

ముసిలాయనకి అంతా చీకటిగా కనిపించింది. కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచి చూసేడు, తన పడక్కుర్చీ సావిట్లో లేదు.....

“మరేనండి. ఇది సోఫా కమ్ బెడ్డే నండీ. ఎవరన్నా ఇంటికి వస్తే మహా ఇబ్బందిగా ఉందనుకోండి. ఇంటి కొచ్చి, వాళ్లని కింద పడుకో పెట్టలేం కదా!” చెప్తోంది కోడలు.

“ఆసలే ఖరీదైన ఫర్నీచరు. అందులో ఇప్పుడు మరీ ధరలు పెరిగిపోయాయి. మీరు కాబట్టి కొన్నారు. మాలాంటి వాళ్లు కొండమే!?" అన్నాది పక్కింటావిడ.

కోడలు ఓ టెక్కు నవ్వు నవ్వింది. ముసిలాయనకి కళ్లు బైర్లు కమ్మినట్లుగా అనిపించింది. ఆయన నుదుటి మీద చెమటని చేత్తో తుడుచు కుంటూ మరోసారి గట్టిగా కళ్లు మూసుకుని తెరిచాడు. పక్కింటావిడ పిల్లలతో వెళ్లి పోయింది.

ముసిలాయనకి కొత్త సోఫా సెట్టు నల్లగా జీమూతంలా ఆనింది. ఆయనకి తన పడక్కుర్చీలో పడుకో వాలనీ కంచు ఆపుకోరాడు మంచి నీళ్లు గటగటా తాగాలని ఉంది.

“సోఫా సెట్టు బాగుందా? నాన్న గారూ! కూర్చోండి" లోపల్నించి కొడుకు వచ్చేడు.

సోఫాలో కూర్చోబడిపోయి “బాగుందిరా బాగుంది. ఎంతయిందీ?" అన్నాడు ముసిలాయన.

కొడుకూ కోడలూ మొహమొహాలు చూసుకున్నారు.

“కొనలేదండి. మనకి ఉత్తినే వచ్చింది" తండ్రితో అబద్ధం ఆడలేదు.

రక్తంలో ఆమాత్రం నిజాయితీ ఇంకా మిగిలి ఉంది.

“ఉత్తినే రావడం ఏమిటీ?" కళ్లు చిట్లించుకొంటూ అడిగేడు.

సావిడంతా ఆయనకి చీకట్లు ముసిరినట్లుగా ఆనుతోంది.

“మీరు ఉత్తి సత్తికాలం వాళ్లండీ మావగారూ! ఉత్తినే రావడం, అంటే మీకు అర్థం కాదు. పెద్ద బిల్లు ఓటి పాసు చేయించేరట. దాంతో ఆ పెద్ద మనిషి మనకిది ఇచ్చేడు.” మొగుడి ప్రయోజకత్వాన్ని చెప్తూ కోడలి మొహం మతాబాలా వెలిగింది.

నిప్పుల గాడ్పులో ఇంటికి వచ్చేడు. వస్తూనే నిప్పుల గుండంలో కూర్చోబడి పోయాడు.

ముసిలాయన సర్రుమని లేచేడు. “నా పడక్కుర్చీ ఏదీ?" పెద్దగొంతుకతో బొబ్బ పెట్టేడు.

"ఇక్కడెందుకూ? పాతడొక్కుది. అదిక్కడుంటే సావిడి అందం మరి అడగక్కర్లేదు. అదిగో చీడీ మీద పడేసాం."

"ఏదీ , నా కుర్చీ చీడిమీద పడేసారూ?

నాకుర్చీ ఉంటే సావిడి అందం పోతుందీ! ఓహో! అందం పోతుందా? చూస్తారేం? పారెయ్యండిరా! నన్నూ పారెయ్యండి."

వెర్రి కోపంతో రెచ్చిపోయి ముసిలాయన కళ్లు తెరుస్తూ మూస్తూ, ఊగిపోతూ చీడీ మీదకి వెళ్లేడు. హఠాత్తుగా ఆయన వేస్తున్న ఈ కేకలు విని కొడుకూ కోడలూ అట్టే ఉండిపోయేరు.

పెద్ద పెద్ద అంగలతో చీడి మీంచి పడక్కుర్చీని, జాపోస్తూ సావిట్లోకి తెచ్చేడు. పూసకం పట్టిన వాడిలా రెండు చేతుల్తో సోఫాని ఓ పక్కకి లాగేసి తన పడక్కుర్చీని పడాలున వేసేడు. పడక్కుర్చీలో పడి పోతున్నవాడిలా పడుకోబడి పోయేడు. ఆయనకి జూపోత ఎక్కువైంది.

“ఒరేయి! ఇది — ఈ కుర్చీ నేను చెమటోడ్చి కొన్నదిరా.

ఇదిగో !ఈ కుర్చీలో ఉండే ఈ ప్రాణి బతుకులో చేతులు తడిపించుకోలేదు. ఆహా! భ్రష్టు వెధవా! ఈకుర్చీ ఉంటే నీ ఇంటి అందం పోతుందా? అమ్మ! హాయ్ ! ఇల్లట్రా? నీ కొంప, నీ కొంప భ్రష్టు కొంప! భ్రష్టు వెధవకీ, భ్రష్టు కొంపకీ, అందం ఏమిటిరా?

ఒరేయి వెధవా! నీ కొంపలో ఉంటే నా కుర్చీ చక్కదనం పోతుంది. " ముసిలాయనకి ఆయాసం ఎక్కువైంది.

జాపోస్తూ బెక్కుతూ, చెమటలు కారుతూ ఆయన తిడుతున్నాడు.

ఆయనకి అంతా చీకటిగా నల్లగా కనపడుతోంది. ఈ హఠాత్పరిణామానికి కొడుకూ కోడలూ నోటమాట రాకుండా అలా నిలుచుండి పోయారు.

"ఒరేయి అప్రాచ్యుడా! నీ కొంపలో నేను ఉండను. నాకుర్చీ ఉండదు. అమ్మా! అబ్బా! " ముసిలాయన బెక్కుతూ ఉంటే కొడుక్కే ముందు తెలివొచ్చింది.

పెళ్లాన్ని కేకలేస్తూ కంగారుగా మంచి నీళ్లు ముసిలాయన మొహాన్ని చిలకరించి ఉపచారాలు చేసేడు గాని ముసిలి ప్రాణం హరీమంది.

“పెద్దవాడయి పోయేడా! ఇంటి పట్టున ఉండకూడదూ! ఎండలో తిరిగి తిరిగి వచ్చేట్ట. పెద్ద ప్రాణం. వడ దెబ్బకి తట్టుకో లేక గుటుక్కు మంది" , వీధి వీధంతా చెప్పుకున్నారు.

వెండి మీసాల తాత, తెల్ల మీసాల తాత. పడక్కుర్చీ తాత చచ్చి పోయాడని తెలిసి, పిల్లలంతా బిక్కచచ్చి పోయేరు.

“ఒరే బుల్లిగా! మనం ఎండలో ఆడుతూ తిరుగుతున్నాం కదా! వడదెబ్బ కొట్టి మనమూ చచ్చి పోతామా?" అని ఓ పిల్లడు బుల్లిగాణ్ణి అడిగేడు.

“ఆ వడ దెబ్బ మన పిల్లలకి కొట్టదు" అన్నాడు బుల్లిగాడు. అన్నీ తెలిసిన పెద్దవాడిలా!

------------------------------------------------------------------------------------------------------------------------

ఈ కథను రాసింది చాగంటి తులసి గారు. మధ్యతరగతి కుటుంబాల గురించే కాకుండా , దిగువ మధ్యతరగతి , బడుగు కుటుంబాలు , వాటిల్లో వున్న సమస్యలు సంఘర్షణలు తన కథల్లో అద్భుతం గా చిత్రీకరిస్తారు, తులసి గారు.

చిన్నతనం నించే సాహితీ వాతావరణంలో పెరిగిన తులసి గారు, సుప్రసిద్ధ తెలుగు కథారచయిత చాగంటి సోమయాజులు గారి కుమార్తె.

అనువాదం, సాహితీ విమర్శా, కథ రచన , లాంటి అనేక ప్రక్రియల్లో విశేషమైన కృషి చేశారు తులసి గారు.

ఇంగ్లీష్, ఒడియా, హిందీ భాషల్లోని సాహిత్యాన్ని అద్భుతంగా తెలుగు లోకి అనువదించారు. 'ఓల్గా నించీ గంగ వరకు' వారి సుప్రసిద్ధమైన అనువాద గ్రంధం.

ఎన్నో పురస్కారాలతో బాటూ , తెలుగు విశ్వ విద్యాలయం ద్వారా సర్వోత్తమ కథా రచయిత్రిగా బహుమతినందుకున్నారు.

వారి గురించి మరిన్ని వివరాలు, క్రింద ఇచ్చిన వికీపీడియా లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

లింక్ :

https://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BF



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations