Episode 304
వర్షంలో పిల్లి : (ఆంగ్లమూలం 'Cat in the Rain' by Ernest Hemingway)
‘ వర్షంలో పిల్లి’ , ఈ కథకు అనువాదకులు శ్రీ పతంజలి శాస్త్రి గారు. కథకు ఆంగ్ల మూలం ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ‘Cat in the Rain’. కథకు అనువాదంతో పాటూ , కథ గురించి వారు ఇచ్చిన వివరణ కూడా ఇదే పేజీలో చదవవొచ్చు.
‘వర్షంలో పిల్లి’: తెలుగు అనువాదం – పతంజలి శాస్త్రి
(‘Cat in the Rain’: ఆంగ్ల మూలం – ఎర్నెస్ట్ హెమింగ్వే)
ఆ హోటల్లో ఇద్దరే అమెరికన్లు దిగేరు. వాళ్ళ గదిలోకి వెళ్తూ, మెట్లెక్కి దిగుతున్నప్పుడు తారసపడే వాళ్ళెవ్వరూ తెలీదు వాళ్ళకి. ఎదురుగా సముద్రం కనిపించే రెండో అంతస్థులో గది వాళ్ళది. పార్కు, వార్ మెమోరియల్ కూడా కనిపిస్తుంది అక్కణ్ణించి. పార్కులో పెద్ద కొబ్బరిచెట్లు, ఆకుపచ్చని బెంచీలు.
వాతావరణం బాగున్నప్పుడు ఎప్పుడూ ఎవరో ఒక చిత్రకారుడు సరంజామాతో వుంటాడక్కడ. పెరిగిన కొబ్బరిచెట్లూ, పార్కులు, సముద్రం, ఎదురుగా మెరుస్తున్న హోటళ్ల రంగులూ, చిత్రకారులు ఇష్టపడతారు. వార్ మెమోరియల్ చూడ్డానికి దూరంనించి ఇటాలియన్లు వస్తారు. కంచు పోతపోసిన మెమోరియల్ వర్షంలో మెరుస్తోంది. వర్షం పడుతోంది. కొబ్బరి చెట్ల మీదనించి జారుతోంది. కంకరరోడ్ల మీద నీళ్లు మడుగులు కట్టేయి. పొడవుగా వర్షంలో విరిగిపడుతూ, తిరిగి వెనక్కి జారుతూ,మళ్ళీ తీరం మీదికి పొడుగు గీతలా విరిగి పడుతోంది సముద్రం. వార్ మెమోరియల్ చౌరస్తా దగ్గిర కార్లు వెళ్లిపోయాయి. అవతల హోటలు గుమ్మంలో ఖాళీ చౌరస్తా చూస్తూ నుంచున్నాడు హోటలు వెయిటరు. బయటకు చూస్తూ కిటికీ పక్కన నుంచుంది అమెరికన్ గృహిణి. బయట సరిగ్గా కిటికీ కింద ఒక పిల్లి. అది వర్షపు నీళ్లు కారుతున్న ఆకుపచ్చ టేబిలు ఒకదాని కింద నించుంది. వర్షం మీద పడకుండా, సాధ్యమైనంత ముడుచుకుపోవడానికి ప్రయత్నిస్తూ వుంది.
“కిందికి వెళ్లి ఆ పిల్లిని తెస్తున్నాను” అందామె.
మంచం మీంచి ఆమె భర్త “ ఒద్దు. నేను వెళ్లి తెస్తాలే” అన్నాడు.
“కాదు. నే తెస్తాను. ఆ టేబిలు కింద తడిసిపోకుండా కూచోడానికి ప్రయత్నిస్తోంది పాపం.”
మంచం కాళ్ళ వేపు రెండు దిండ్ల మీద ఆనుకుని, మళ్ళీ చదువులో పడ్డాడు భర్త.
“తడవకేం” అన్నాడతను.
ఆమె కిందికి వెళ్ళింది. ఆఫీసు గది దాటుతుండగా, హోటల్ మేనేజర్ లేచి ఆమెకి గౌరవంగా తల వంచాడు. అతని టేబిలు ఓ చివర వుంది. పొడవాటి వృద్ధుడతను. “వర్షం పడుతోంది” అందామె. యజమాని అంటే అభిమానం ఆమెకి.
“అవును మేడమ్. ఏమీ బాగా లేదు. పాడు వాతావరణం.”
గదిలో టేబిలు వెనక నుంచున్నాడతను. ఆమెకి నచ్చుతాడతను. ఫిర్యాదులు తీసుకునేటప్పుడు తీవ్రంగా పెట్టే అతని గంభీరమైన ముఖం ఆమె కిష్టం. అతని హుందాతనం ఆమెకిష్టం. ఆమెకి సేవలందించటానికి అతను చూపించే ఉత్సాహం ఆమెకిష్టం. అసలు అతను హోటలు మానేజర్ గా ఎట్లా వుండాలనుకుంటాడో అదామెకిష్టం. పెద్దతనంతో భారీగా వుండే ముఖం, అతని పెద్ద చేతులు, ఆమెకిష్టం. అతని గురించి ఆలోచిస్తూనే , తలుపు తీసి బయటికి చూసిందామె.
గట్టిగా పడుతోంది వాన. రబ్బరు కోటు వేసుకుని ఒక వ్యక్తి చౌరస్తా దాటుతూ హోటలు వేపు వస్తున్నాడు. కుడివైపు ఎక్కడో ఉంటుంది పిల్లి. సన్ షేడ్ల కిందినించి బహుశా తను వెళ్లగలదేమో. గుమ్మంలో నుంచుని ఉండగానే తన వెనక గొడుగు తెరుచుకుంది. వాళ్ళ గది శుభ్రం చేసే అమ్మాయి.
“మీరు తడవకూడదు” ఇటాలియన్ మాట్లాడుతూ చిరునవ్వింది. హోటలు మేనేజర్ పంపించాడన్నమాట. ఆ అమ్మాయి పట్టుకున్న గొడుగు కింద ఆమె కంకర బాట కింద నడుస్తూ వాళ్ళగది కిటికీ కిందికి వచ్చిందామె. వర్షంలో శుభ్రమై పచ్చగా మెరుస్తూ టేబిలు వుంది గానీ, పిల్లి వెళ్ళిపోయింది. హఠాత్తుగా ఆమెకి ఏదో నిరాశ కలిగింది. అమ్మాయి ఆమెని చూసి అంది, “ మీరేవన్నా పోగొట్టుకున్నారా?”
“ఒక పిల్లి వుంది”
“పిల్లి”
“అవును”
“పిల్లి? వర్షంలోనా” నవ్విందాఅమ్మాయి.
“ ఊ.టేబిలు కింద” అని మళ్ళీ అందామె, “దాన్ని ఎంతో కావాలనుకున్నాను. ఆ పిల్లి కావాలి నాకు.”
ఆమె ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ముఖం బిగుసుకుంది.
“ రండి మేడమ్. లోపలికి వెళ్దాం. తడుస్తారు మీరు.” అంది.
“అవును గదా” అందామె.
మళ్ళీ కంకర కాలిబాటలో నడుచుకుంటూ లోపలి వచ్చేరు.
పనమ్మాయి గొడుగు ముడవడానికి గుమ్మం దగ్గర ఉండిపోయింది. అమెరికన్ అమ్మాయి ఆఫిసు దాటుతూండగా మేనేజర్ తలవంచాడు. ఆమెకు తనలో ఏదో కుచించుకుపోయినట్టై, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తను ఒక అల్పప్రాణిలా, అదే సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తిలా, అనిపించేలా చేస్తాడు అతను. ‘తాను చాలా ప్రాధాన్యత గల మనిషిని’ అనే ఒక క్షణికమైన భావన కల్గుతుంది. మెట్లెక్కి వెళ్లిపోయిందామె. గది తలుపు తీసుకుంది. మంచం మీద జార్జి పడుకుని చదువుకుంటున్నాడు. పుస్తకం కిందపెడుతూ అడిగేడతను.
“పిల్లి దొరికిందా”?
“అది వెళ్ళిపోయింది”
“ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా!” చదివిన అలిసిన కళ్ళకి విశ్రాంతినిస్తూ అన్నాడతను. ఆమె మంచం మీద కూచుంది.
“దాన్ని ఎంతో కావాలనుకున్నాను. ఎందుకంతకావాలనుకున్నానో తెలీదు. పాపం ఆ పిల్లి కావాలనిపించింది. వర్షంలో తడుస్తూండడం ఏం సరదా దానికి . ?”
జార్జి మళ్ళీ చదువుకుంటున్నాడు. ఆమె వెళ్లి డ్రెస్సింగ్ టేబిలు అద్దం ముందు కూచుని చేతి అద్దంలో ముఖం చూసుకుంటోంది. ముందు ఆ పక్కనించి తరువాత రెండో వేపు నించి, తల వెనక భాగం, కంఠభాగం పరిశీలించింది.
ఒక వేపు ముఖాన్ని చూసుకుంటూ అడిగిందామె. “జుట్టు బాగా పెరగనివ్వడం బాగానే ఉంటుందంటావా?”
కళ్ళెత్తి ఆమె మగవాళ్ళ లాగ దగ్గిరిగా కత్తిరించుకున్న జుట్టు చూసి అన్నాడు.
“అలా ఉంటేనే ఇష్టం నాకు.”
“విసుగెత్తి పోయింది నాకు. మగపిల్లాడిలా కనిపించడం విసుగ్గా వుంది.”
“చక్కగా ఉంటావు నువ్వు” అన్నాడతను.
డ్రెస్సింగ్ టేబిలు మీద అద్దం పెట్టి కిటికీ దగ్గరికి వెళ్లి బయటకి చూస్తూ నుంచుందామె. చీకటి పడుతోంది.
మంచం మీద జరిగి కూచున్నాడు జార్జి. ఆమె మాట్లాడ్డం మొదలుపెట్టినప్పట్నుంచి తదేకంగా ఆమెనే చూస్తున్నాడతను.
“జుట్టు వెనక్కి దువ్వుకుని, చిక్కగా మెత్తగా, పెద్ద కొప్పు నాకు తగులుతూ ఉండాలి. ఒళ్ళో ఓ పిల్లి ఉండాలి, తాకినప్పుడల్లా మ్యావు మంటూ.” అందామె.
“అలాగా?” అన్నాడు పక్క మీంచి జార్జి.
“డైనింగు టేబిలు మీద నా సొంత వెండి గిన్నెల్లో తినాలి. క్యాండిల్స్ కావాలి నాకు. అది వసంతకాలం అయివుండాలి. అద్దం ముందు నించుని జుట్టు దువ్వుకోవాలి. పిల్లి పిల్ల కావాలి. కొత్త బట్టలు కావాలి కాసిని.”
“ఇంకా చాలు. ఏదేనా తెచ్చుకుని చదువుకో” అని మళ్ళీ చదువుకోడం మొదలుపెట్టేడు జార్జి.
“ఏవయినా నాకో పిల్లి కావాలి. పిల్లిపిల్ల కావాలి. ఇప్పుడు పిల్లిపిల్ల కావాల్సింది. పొడుగాటి జుట్టూ, సరదాలూ లేకపోయినా పిల్లి పిల్ల కావాలి.”
ఆమె కిటికీలోంచి బయటికి చూస్తోంది. చీకటిగా వుంది. కొబ్బరి చెట్ల మీద వర్షం పడుతోంది. జార్జి వినడం లేదు. పుస్తకం చదువుకుంటున్నాడు. అప్పుడే చౌరస్తాలో వెలుతురు పడ్డ చోటు కిటికీలోంచి చూస్తోందామె.
ఎవరో తలుపు తడుతున్నారు.
“అవంతి” అన్నాడు జార్జి. పుస్తకంలోంచి తలెత్తి చూసాడు.
గుమ్మంలో పని అమ్మాయి నుంచుని వుంది.
తాబేలు రంగు పిల్లిని గట్టిగా ఆమె హత్తుకుని వుంది. ఆమె వొంటి మీద నించి పిల్లి కొంచెం జారి వుంది.
“మన్నించండి. మేనేజర్ గారు మేడమ్ గారికి పిల్లిని యిచ్చిరమ్మన్నారు.” అందామె.
‘తడుస్తూ ఆమె’ – పతంజలి శాస్త్రి గారి వివరణ
హెమింగ్వే రాసిన ఒక అతి చిన్న కథ ‘వర్షంలో పిల్లి’ 1924 లో భార్య Hadley తో ఇటలీలో Pablo అనే చోట Splendid అనే హోటల్లో దిగి ఈ కథ రాసాడాయన. కథావస్తువు ని బట్టి హోటల్ పేరు ‘Splendid’ అని ఉండడం యాధృచ్చికం అయినా స్పష్టమైన వ్యంగ్యం. అప్పటికే భార్యాభర్తలిద్దరికీ మనస్పర్థలు తీవ్రంగా ఉండేవి. కథ ఆమె గురించి రాసాడు. కానీ కథాబీజం ‘1923’ లో Hadley వేసింది అనుకోవచ్చు. ఆ ఏడాది ఇద్దరూ Ezrapound ఇంట్లో అతిధులు. ఆయనింట్లో చక్కని పిల్లి పిల్లను చూసి ముచ్చటపడి పిల్లి కావాలని అడిగిందామె. “ఖర్చు” మనం భరించలేం అన్నాడు హెమింగ్వే .
ఈ వివరాలన్నీ చదివి సేకరించాను. ఈ కథ మీద కనీసం రెండు వందలకి పైగా విమర్శనా వ్యాసాలు ఉంటాయి. ఇంకా వస్తున్నాయి. హెమింగ్వే రచనల్లో క్లుప్తత, స్పష్టత, తళుక్కుమనే వాడి కనిపిస్తాయి. ఆయన Theory of omission అనే కథన పద్ధతిలో రాసేడు. మామూలు మాటల్లో చెప్పాలంటే చెప్పవలసిన విషయం పాఠకుల ఆలోచనకు విడిచిపెట్టడం. అది ఈ రెండు పేజీల కథలో సాధించినంతగా మరే ఇతర కథల్లోనూ జరగలేదని అనుకోవాలి. ఒక కారణం కథ చిన్నది కావడం, రెండు ఇతివృత్తం అనేక జీవితాలకి చేరువైనది కావడం.
ఈ కథ హెమింగ్వేల కథ. ఇంకా స్పష్టంగా హెమింగ్వే భార్య వేదన. అప్పటికి ఆయన ఆర్థిక పరిస్థితి అంత ఆరోగ్యంగా లేదు. భార్య సుఖంగా లేదు. ఆమె చిన్న చిన్న కోరికలు కూడా బరువు పెంచుకుని ఆమెని కుంగదీస్తున్నాయి. ఇంతవరకూ కథలో జార్జి భార్య Hadly. కథలో జార్జి ఆమెని పట్టించుకోడు. నిస్సహాయత కావచ్చు. ఆమెని ఓదార్చే ప్రయత్నం కూడా చెయ్యదు. పాఠకులు సులభంగా భార్య పక్షాన వుంటారు. ఆమె బాధ చూసి కాదు. భర్త పట్టించుకోడని. ఇది ఆసక్తికరమైన అంశం. ఏమంటే నిజ జీవితంలో హెమింగ్వే జార్జి కాదు. మరి జార్జిని ఎందుకలా చిత్రించాడు.? జార్జి భార్య పట్ల పాఠకులకి సానుభూతి కలగాలని. హెమింగ్వేల వ్యక్తిగత జీవితం, నిజానికి పాశ్చాత్య రచయితల వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం. ఆయన అందరికీ తెలిసినా జార్జిని మంచి భర్తని చెయ్యలేదు ఆయన.
కథలో ప్రతీక స్పష్టం. వర్షంలో తడవకుండా తలదాచుకున్న పిల్లి జార్జి భార్య. రెండు అది ఆమె కోల్పోయిన సుఖం సంతోషం. కళ్లెదుట కనిపిస్తూ తెలుస్తూ చేజారిపోయిన సంతోషం. అందుకే ఆమె వెనక్కి తిరిగి గదిలోకి వచ్చి రెండు మూడు సార్లు ‘నాకు ఆ పిల్లి పిల్ల ఇప్పుడే కావాలి’ అంటుంది. – ఆమెకి మన సానుభూతి సులభంగా ఎందుకు చేరుతుందంటే, ఆమె కోరికలు చిన్నవి. గొప్ప సౌఖ్యం, విలాసాలూ కోరుకోవడం లేదు ఆమె.
కథలో ఒక లైంగిక అంశాన్ని కూడా కొంతమంది చూసారు. నేను ఈ కథ చదివి నాలుగు దశాబ్దాలు అయింది. అప్పుడు చూసిన ఒక వివరణ అది. కానీ అది సమంజసం కాదనిపించింది. ఈ కథా నిర్మాణం నాకు నచ్చింది. ఇది ‘సరళ – క్లిష్టమైన’ కథనం. (ఈ మాట నా కథలకి R.S. వెంకటేశ్వర రావు గారు ఇచ్చిన కితాబు. )
కథ ఒక వర్షాసంధ్యలో జరుగుతుంది. సీతువులో వర్షంలో మనం శారీరకంగా మానసికంగా కుచించుకుపోతాం. మన సుఖసంతోషాలు, భయాలు, ఆశలు, బహిర్గతం అవుతాయి. వర్షం మన దుఃఖం. సీతువు వేదన. తరువాతి కాలంలో ప్రసిద్ధమైన ‘మినిమలిజం’ వంటిదే ఈ కథనం.
కథ మొత్తంలో చివరి వాక్యాలు నన్ను గాయపరిచినాయి.
ఆమె కోరుకున్నదేమిటి?
ఆమెకి దక్కినదేమిటి ?
అది ఒక జీవన సారాంశం.
చివరికి మిగిలేది ఏది?
నువ్వు కోరుకున్నది కాదు. ఆశించినదీ కాదు. అడిగినదీ కాదు…
‘What we get in life ofen is a small compensation like an unattractive tortoiseshell cat. That is life”
వర్షంలో తడిసింది జార్జి భార్య.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy