Episode 167

'బేడమ్మ' - శ్రీరమణ గారి కథ

'బేడమ్మ' అనే ఈ కథ శ్రీరమణ గారు రచించింది.

శ్రీరమణ గారు రాసిన శ్రీ ఛానల్ - 2 అనే సంకలనం లోనిది. పుస్తకం కొనడానికి ఇదే వెబ్ పేజీ లో ఉన్న లింక్ ని ఉపయోగించండి.

https://www.telugubooks.in/products/sri-channel-2

బేడమ్మ ఆవిడ అసలు పేరేమిటో తెలియదు. పుట్టు పూర్వోత్తరాలూ తెలియవు.  ఎవర్ని అడిగినా “మాకు గ్రాహ్యం వచ్చినప్పట్నించీ బేడమ్మ యిలాగే వుంది. గోగుకాడలా” అంటారు తప్ప వయసు చెప్పలేరు. 

ఒంగిపోకపోయినా నిలువెల్లా  వార్థక్యం తెలుస్తూనే ఉండేది.

బ్రాహ్మణ వీధిలో ఉన్న పది యిళ్లూ తనవే అనుకునేది బేడమ్మ. రోజుకో  ఇంట్లో భోజనం చేసేది. అదీ ఒక్కపూట ! ఆ రోజు ఆ ఇంటెడు చాకిరీ తనే చేసేది “అప్పనంగా తింటే అరగదు నాయనా' అనేది. 

ప్రతిరోజూ గుడిబావి నించి పది ఇళ్లకీ మడినీళ్లు మోసేది. 

బ్రాహ్మణ వీధికీ, శివాలయానికి పది గడపల దూరం. తెలతెలవారకుండానే ఆలయానికి వెళ్లి, గుడిముందు కసువూడ్చి, బిందెడు నీళ్లు జల్లి ముగ్గువేసేది. తను తలారా నీళ్లు పోసుకుని, ఆనక గుడిబయట నందిబొమ్మని కడిగి, నిక్కపొడుచుకున్న నందిచెవుల మధ్య కాసిని పూలు పోసి, మూసి వున్న తలుపుల్లోంచి చంద్రశేఖర స్వామికి దణ్ణం పెట్టుకునేది బేడమ్మ. 

కళ్లాపు జల్లులకు ధ్వజస్తంభం మీది చిలకలూ పిచ్చుకలూ నిదురలేచి మేతలకు బయలుదేరేవి. ఆ అలికిడికి ధ్వజస్తంభపు చిరుగంటలు వులిక్కిపడేవి. రాలిన జువ్వి పూరేకుల్ని చూసి బియ్యపు  గింజలనుకుని పిట్టలు ఆశగా చెట్టుకింద వాలేవి, నిద్రమొహాలతో. 

కాదని తెలిసి టపటపా రెక్కలు కొట్టుకుంటూ గుంపుగా  ఎగిరిపోయేవి. ఈ లోగా బేడమ్మ బిందె నిండా నీళ్లు చేదుకుని - ఓ మందారం. నాలుగు  నందివర్ధనాలు, గుప్పెడు పారిజాతాలు, పుంజీడు పచ్చ గన్నేరులు  బిందెలో వేసుకునేది.  తళ తళలాడే నీళ్ల బిందె నడుముకి మోపి బేడమ్మ రోడ్డు వారగా వెళ్తుంటే పూలకలశం కదిలి వెళ్తున్నట్టుండేది.\

ఆ పసిపొద్దు కిరణాలలో  బిందెలోపూలు నీళ్లకుదుపులకి లయలూ హొయలూ వొలికించేవి. ఆ లేత వెలుగులకి సువాసనలు అద్దేవి. 

అలా మొదలైన నీళ్లమోత సాగి సాగి, బేడమ్మ తలమీంచి కొసలనించి జారిన నీటిచుక్కలతో రోడ్డు వారగా పడిన నీళ్ల చార వీధికి అంచుదిద్దినట్టు అయ్యేది. పూర్తిగా తెల్లారేసరికి బ్రాహ్మణవీధి గడప గడపనీ శివాలయంతో తడిపోగులతో ముడివేసేది బేడమ్మ.

ఆ వీధిలో ఏ కాస్త సందడి వచ్చినా బేడమ్మ సాయం కోరేవారు. అప్పడాలు, వడియాలు, ఊరగాయలూ లాంటి పై పనులు వచ్చినా, నోములూ, వ్రతాలు, చుట్టాలూ, తద్దినాలూ ఏమొచ్చినా బేడమ్మ రంగంలోకి దిగేది. రూపాయి అర్థా ఇస్తే పుచ్చుకునేది. ఏరోజు ఎక్కడ పెద్దతోడు కావాలంటే అక్కడా రోజు మకాం. పుట్టెడు అమాయకత్వం తప్ప పేచీ లేని మనిషి.

ఓసారి దసరా ఉత్సవాలకి బెజవాడ కనకదుర్గమ్మని చూడ్డానికి వెళుతూ ఎవరో బేడమ్మని కూడా తీసికెళ్లారు. ఊరి పొలిమేర దాటడం, బస్తీ చూడడం బేడమ్మకి అదే మొదటిసారి. వచ్చాక అక్కడి వింతలూ, విశేషాలూ అనేకం చెప్పింది. “అక్కడ బారెడు, బారెడు అరటిదూటలకి వెలట్రీ తగిలించి వెలిగించారు నాయనా, అది వెలుగంటే వెలుగు కాదు... వెన్నెల..” అని ట్యూబులైట్లని గురించి చెబితే అందరూ నవ్వుకుని మళ్లీ మళ్లీ చెప్పించుకునేవారు. 

ఆడైనా, మగైనా, పిల్లయినా, పెద్దయినా, పక్షయినా, జంతువైనా 'నాయనా' అని సంబోధించడం బేడమ్మ సొంత ముద్ర.

పేచీ పూచీ లేని బేడమ్మకి వేరే దిగులూ విచారమూ లేవు గానీ ఒకే ఒక్క భయం ఆవిడని వేధించేది పాపం. తను చచ్చిపోతే కట్టెల్లో వేసి కాల్చేస్తారని ఆవిడకి చచ్చేంత భయం....

చిన్నా, పెద్దా ఎవరు పలకరించినా “ నన్ను కాల్చకండి నాయనా... నొప్పి పుడుతుంది... భరించలేను నాయనా” అని బతిమాలుకునేది. చీరకొంగున బేడకాసు తీసి లంచంగా ఇచ్చి ఒట్టు వేయించుకునేది. కొందరు అకతాయిలు బెల్లించి, బెదిరించి బెడలు పట్టేసేవారు. మా ఊళ్లో బేడమ్మ చేతికింద చెయ్యి పెట్టని వాళ్లు లేరు. బేడలు పుచ్చుకొని వారు లేరు. 

ఆవిడ కష్టం కొద్దీ అక్షయంగా బేడలు కొంగు ముడికి జమకడుతూనే ఉండేవి. 

ఓసారి కరణం గారింటికి జమా బందీకి తహసీల్దారు  గారొస్తే బేడమ్మ కమ్మగా వంట చేసి పెట్టింది. వంటనీ... వడ్డననీ ఆయన మెచ్చుకోగా చూసి, చొరవ చేసి బేడమ్మ తన సమస్యని చెప్పి 

“నాయనా హోదాగలవాడివి. వస్తే నువ్వే చూసుకోవాలి. ఆ బాధ నేను భరించలేను నాయనా!” అని కన్నీళ్ళొత్తుకుంటూ తాంబూలంలో బేడ కాసు పెట్టి ఇచ్చింది. తాసీల్దారు బేడ లంచానికి అదిరిపడ్డారు.

బేడమ్మ అమాయకత్వాన్ని అర్థం చేసుకొని ఆ బేడని కళ్లకి అద్దుకున్నాడు. ఆ విధంగా బేడమ్మ పేరు అనాదిగా స్థిరపడిపోయింది.

రోజూ,  చివరి బిందెకి - గడకర్రతో మారేడు దళాలు రాల్చి, వాటి మీద దేవుడి వాటా పూలు ముఖద్వారపు రాతిపద్మం మీద కుప్ప పోసేది. ఆ పూలరెక్కల కింద బేడకాసు కప్పెట్టే సంగతి పెట్టినమ్మకి తెలుసు. పూజారికి తెలుసు. లోపలున్న మూడోకంటి వాడికి తెలుసు.

కృష్ణా పుష్కరాలకి బళ్లు కట్టుకుని ఊరు ఊరంతా కదిలినట్టు కదిలింది శ్రీకాకుళం రేవుకి. బేడమ్మ సంబరం అంతా యింతా కాదు. మజిలీ మజిలీకి బండి మారుతూ మధ్య మధ్య గుట్టు చప్పుడుగా బేడలు పంచుతూ బతిమాలుతూ బామాలుతూ ఊరికీ రేవుకీ దూరాన్ని తగ్గించింది.

పుష్కరాల రేవు మహా పర్వడిగా ఉంది. రేవులో దిగి కొంగుముడి విప్పి బేడకాసు కృష్ణమ్మ ఒడిలోకి విసిరి "నాయనా నీదే పూచీ... ఆ బాధ తట్టుకోలేను. నాయనా” అని దణ్ణం పెట్టుకుంది. 

ముక్కు మూసుకు మూడుసార్లు మునిగి లేచింది కానీ నాలుగోసారి బేడమ్మ లేవలేదు. ఊరి వారు, రేవు వారు గాలించారు. బేడమ్మ జాడలేదు.

" నాయనా నన్ను... నొప్పి భరించలేను..” అని బేడమ్మ పంచిన ప్రతి బేడా ఎలుగెత్తి ఘోషించినట్టనిపించింది మా ఊరి జనానికి. కృష్ణమ్మ ఒడిలో బేడమ్మ విసిరిందే ఆఖరిబేడ. తర్వాత “నయాపైసలు” చలామణీలోకి వచ్చాయి. బేడమ్మ లేని పుష్కరాల బళ్లు ఊరు చేరాయి. 

ఊరికీ శివాలయానికి ఉన్న తడిముడి ఆనాటితో తెగిపోయింది.


‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)






This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations